Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

30 June 2017

ఉపనిషత్తులు-10:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం,

ఉపనిషత్తులు-10
ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం,


           సత్వగుణం చైతన్యంలో ఉంది. మిగతా రెండు గుణాలు రజోగుణం, తమోగుణం నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఇది సృష్టి ఏర్పడనప్పటి ముందు పరిస్థితి. అసలు సృష్టి ఎలా జరిగింది? ఈ అనంతమైనటువంటి ఈ బ్రహ్మము లోకాలను సృష్టించాలని అనుకుని సంకల్పం చేసుకున్నారని ఐత్రేయ ఉపనిషత్తులో పేర్కొనబడింది. అయితే మరి నిరాకర, నిర్గుణ స్వరూపమైనటువంటి అనంతంగా ఉండే ఈ బ్రహ్మము, శరీరం లేకుండా ఉండే ఈ బ్రహ్మము, మనస్సు లేకుండా ఉన్న బ్రహ్మము సంకల్పం చేసుకోవడం ఏమిటీ?అన్న ప్రశ్న మనకి ఉదయిస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఏవిధంగా అయితే మనం స్విచ్ ని ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్ లో  విద్యుత్తు ప్రవేశించి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ విద్యుత్తు వెళ్ళగానే నీవు వెలగాలని ఆగ్రహించడం జరగలేదు కదా ! ఇక్కడ సంకల్పం అంటే ఆయన ఏదో అలా అనుకున్నాడు కోరుకున్నాడు అని కాదు.  ఎప్పుడైతే బ్రహ్మము యొక్క చైతన్య శక్తి ఈ మాయ ఆవరించుకున్న ప్రదేశంలో ప్రవేశించిందో అప్పుడే సృష్టి కార్యక్రమానికి నాంది పలికింది అని మనం చెప్పుకోవాలి. అక్కడ బ్రహ్మ అనుకున్నాడు , సంకల్పించుకున్నాడు అంటే అది ఈవిధంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. పై స్థాయిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలని చెప్పాలంటే కొద్దిగా క్రింది స్థాయిలోకి వచ్చి ఈ విధమైన ఉదాహరణతో మాత్రమే మనం చెప్పగలం. ఈ అనంతమైనటువంటి పరబ్రహ్మజ్ఞానానికి తగినంత భాష కాని పదాలు కాని మనకి లేవు. ఈవిధంగానే మనం ఉదాహరణలతో చెప్పుకోవాలసి వస్తుంది. మరి అనంతంగా పరబ్రహ్మముగా ఉన్నటువంటి ఈ బ్రహ్మములోని ఏ భాగము సంకల్పించుకున్నది అనే మరొక ప్రశ్న కలుగుతుంది. ఏ పరబ్రహ్మ చైతన్య శక్తి సృష్టికి ముందు మాయ లోని సత్వ గుణం లో మాత్రమే ప్రవేశించి దాన్నిమాత్రమే  చైతన్యం చేసిందో అప్పుడు మిగతా రెండు భాగాలు గా ఉన్న రజోగుణం, తమోగుణం నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు కేవలం అటువంటి బ్రహ్మచైతన్యానికి మాత్రమే ఈ సృష్టి చేసే శక్తి వచ్చింది అని చెప్పి ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఎందుకంటే అక్కడ  సత్వగుణం లో ప్రవేశించినటువంటి బ్రహ్మము మాయని  ఉపాధిగా గ్రహించింది కాబట్టి కేవలం ఆ బ్రహ్మచైతన్యానికి మాత్రమే సృష్టి చేసే సామర్థ్యం  కలిగింది. మిగతా పరబ్రహ్మములో ఎటువంటి సంకల్పాలు కాని ఆకారాలు, వికారాలు కాని ఉండనే ఉండవు అని ఈవిధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి శక్తిని ఈశ్వరుడుగా భావిస్తూ ఉంటారు. అంటే అనంతచైతన్యంలోని పరబ్రహ్మ మాయలోని కేవలం సత్వగుణలో ప్రవేశించి అక్కడ మాయరూపాలుగా గ్రహించి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి రజోగుణం, తమోగుణం కూడా చైతన్యమైనప్పుడు సృష్టి చేసేటటువంటి ఆ శక్తిని ఈశ్వరుడని పేర్కొనడం జరిగింది. కాని మరి ఇక్కడ ఈశ్వరుడంటే బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల లోని మహేశ్వరుడా అని సందేహం వస్తుంది కాని ఆ ఈశ్వరుడు కాదు. అటువంటప్పుడు మనం ఈశ్వరుడు అని చెప్పకుండా బ్రహ్మము అని చెప్పవచ్చును కదా అనే మరొక సందేహం వస్తుంది. దానికి సమాధానం ఏమిటంటే అనంత పరబ్రహ్మ ఎటువంటి సంకల్పం లేకుండా నిర్వికారంగా ఉన్నాడో అటువంటి బ్రహ్మకి సృష్టి చేసే శక్తి లేదు. ఎందుకంటే అక్కడ మాయ అనేది లేదు కాబట్టి . అయితే ఇక్కడ బ్రహ్మచైతన్యం ఎప్పుడైతే మాయలోని సత్వ, రజో, తమోగుణం లో వ్యాపించినప్పుడు అక్కడ మాయని ఉపాధిగా గ్రహించింది కాబట్టి అక్కడ ఈశ్వరుడు అనే శక్తికి ఈ సృష్టి చేసే సామర్థ్యం కలిగింది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది ఇంకొక విధంగా చెప్పాలని అనుకుంటే బ్రహ్మచైతన్యం ఎప్పుడైతే సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి మాయలో వ్యాపించిందో ఆ శక్తి రజోగుణం, తమోగుణం లో ఎప్పుడైతే చైతన్యంగా వ్యాపించిందో అటువంటి శక్తిని బ్రహ్మము యొక్క శక్తి ప్రతిఫలించింది అని చెప్పుకొనవచ్చును. ఏవిధంగా అయితే  విద్యుత్తు ఒక ఫ్యాన్ లో ప్రవేశించింనప్పుడు దానికి చైతన్యం కలిగి అది తిరగడం మొదలు పెడ్తుందో దాన్ని మనం అక్కడ విద్యుత్తు ప్రతిఫలించింది అని చెప్పుకోవచ్చును. ఇక్కడ బ్రహ్మము అని మనం ఎందుకు చెప్పుకోకూడదంటే లోగడ చెప్పినట్టుగా అనంతపరబ్రహ్మము మిగతా మూడు దిక్కులా వ్యాపించినటువంటి అనంత పరబ్రహ్మానికి మాయ అనే ఉపాధి లేదు కాబట్టి అక్కడ దానికి సృష్టి చేసే శక్తి లేనే లేదు అని దీని అర్థం.


సృష్టికి నాంది.
ఎప్పుడైతే అనంత పరబ్రహ్మలోని శక్తి ఎప్పుడైతే మాయలోని సత్వగుణం లో వ్యాపిస్తుందో , మిగతా రజోగుణం, తమోగుణం నిద్రాణ స్థితిలో ఉన్నాయో ఆ సమయంలో ఈ సత్వగుణం లో ఉన్నటువంటి ఈ బ్రహ్మచైతన్యం ఇప్పుడే దాన్ని ఈశ్వరుడని చెప్పుకున్నాం. ఆ చైతన్యం ఎప్పుడైతే రజో,తమోగుణాలలో  ప్రవేశించి ఆ రెండింటినీ చైతన్యం చేస్తుందో అంటే ఎప్పుడైతే సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ మూడు కూడా చైతన్యవంతం  అయినాయో అప్పుడే అవిద్య ఏర్పడుతుందని ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అవిద్య ఉద్భవించిందో అప్పుడే ఈశ్వరుడికి ఈ సృష్టి కార్యక్రమానికి కావలసినటువంటి ఈ మూడు మూలపదార్థాలు కలిసి అవిద్య అనే శక్తి లభించి దానీతో ఈ సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. సృష్టిలో ఈవిధంగా ఎప్పుడైతే త్రిగుణాలు చైతన్యవంతమై అవిద్యగా  ఏర్పడ్డాయో, అవిద్యనుండి  మొట్టమొదట  పంచభూతాలు ఉద్భవించాయి. ఈ పంచభూతాల్లో మొట్టమొదటిది ఆకాశం. దీనియొక్క గుణం సత్వం. ఆకాశం సత్వగుణ ప్రధానంగా పుట్టింది అని చెప్పుకొనవచ్చును. మన మహర్షులందరూ కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని ఎంతో తపస్సు చేసి, ఏకాగ్రతతో వారు ఈ బ్రహ్మజ్ఞానాన్ని వినడం, దానిని చూడడం, దానిని వారు తమ గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. ఒక మహర్షి ఓంకారం మొదలు పుట్టిందని చెప్పడం, ఇంకొక మహర్షి మొట్టమొదట శబ్దమే పుట్టిందని చెప్పడం, ఇంకొక చోట ఆకాశం ముందుగా పుట్టిందని చెప్పడం జరిగింది. అయితే ఈ మూడు కూడా సరి అయినవే. ఆకాశం పుట్టిందంటే అది సత్వగుణం ప్రధానం కాబట్టి దానితో పాటు శబ్దం కూడా వచ్చిందని చెప్పుకోవాలి కదా ! ఆ శబ్దాన్నే ఇంకొక మహర్షి ఏకాగ్రతతో విన్నప్పుడు అది ఓంకారంగా ఆయనకి వినపడింది , దర్శనం కలిగింది కాబట్టి వారు అలా చెప్పారు. ఏవిధంగా మొట్టమొదటిసారిగా ఈ పంచభూతాలు ఉద్భవించడం, దానిలో ఈ ఆకాశం సత్వగుణ ప్రధానంగా ఉద్భవించడం జరిగింది. ఈవిధంగా ఆకాశం ముందు పుట్టింది అని చెప్పుకున్నాం. మొట్టమొదట ఆకాశం జడంగా ఉండింది. ఎప్పుడైతే బ్రహ్మచైతన్యం ఇందులో  ప్రవేశించిందో అప్పుడు ఈ ఆకాశం నుండి  వాయువు పుట్టింది. పుట్టిన వాయువు ముందు జడంగా ఉండి దానిలో ఎప్పుడైతే బ్రహ్మచైతన్యం ప్రవేశించిందో, దానిలో ఎప్పుడైతే చైతన్యం కలిగిందో అప్పుడు ఈ వాయువు నుండి అగ్ని పుట్టింది. ఈ పుట్టిన అగ్ని ముందు జడంగా ఉండి దానిలో ఎప్పుడైతే బ్రహ్మచైతన్యం ప్రవేశించిందో, అప్పుడు మళ్ళీసృష్టి జరిగి దాని నుండి జలం పుట్టింది. ఈ జలం ముందు జడంగా ఉండి దానిలో ఎప్పుడైతే బ్రహ్మచైతన్యం ప్రవేశించిందో, ఎప్పుడైతే సృష్టి జరిగిందో అప్పుడు దాని నుండి భూమి పుట్టింది. పుట్టిన భూమి మొదట జడంగా ఉండి దానిలో ఎప్పుడైతే బ్రహ్మచైతన్యం ప్రవేశించిందో అప్పుడు మళ్ళీ ప్రకృక్తి మొదలయింది, సృష్టి మళ్ళా మొదలయింది. భూమి చైతన్యవంతం అవడం సంభవించింది. ఈవిధంగా  ఒక దాని నుండి ఒకటి ఈ పంచభూతాల ఆవిర్భావం కలిగింది. అగ్నికి రూపగుణం, జలానికి రసగుణం మరియూ భూమికి గంధగుణం ఉన్నాయి.ఈ విధంగా శబ్ద,స్పర్శ,రూప,రస, గంధ తత్వాలు  ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణంగా ఉన్నాయి. వీటినే సప్త భూతములు  లేక శన్మాత్రాలు అని కూడా వ్యవహరిస్తారు.  ఈ ఐదు సూక్ష్మ భూతాల నుండి ఐదు సూక్ష్మ తత్వాలు పుట్టాయి.   

27 June 2017




Swaminarayana Telugu Audio chapters 10, 11 & 12 are available now. Please click here.

ఉపనిషత్తులు-9:ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం


ఉపనిషత్తులు-9
ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం


                 మాయ లేక ప్రకృతి ఎక్కడ ఉంది? లోగడ మనం మాయ లేక ప్రకృతి ఏకదేశమై ఉందని చెప్పుకున్నాం. అంటే ఎక్కడ బ్రహ్మము ఉందో అక్కడే మాయ ఉందని దాని అర్థం. అయితే బ్రహ్మము అనంతమని మనము దాదాపు ఇరవై లక్షణాలు చెప్పుకున్నాం. అనంతమైనటువంటి ఈ బ్రహ్మములో  మాయ కూడా బ్రహ్మము మొత్తం ఆవరించుకుని ఉందా? ఒకవేళ ఈ మాయ పూర్తిగా బ్రహ్మముని ఆవరించుకుని ఉంటే ఈ సృష్టిలో మోక్షానికి అర్హత పొందినవాళ్ళు పరబ్రహ్మములో కలుస్తారని మనం చెప్పుకున్నాం కదా ! అలాంటప్పుడు ఒకవేళ ఈ మాయ అన్నది అనంతమైన బ్రహ్మముని ఆవరించుకుని ఉంటే మోక్షానికి అర్హత పొందినవాళ్ళు పరబ్రహ్మములో ఎక్కడ కలుస్తారనే ప్రశ్న మనకి కలుగుతుంది. దీనికి శృతి ప్రమాణంగా ఉపనిషత్తులు మరియూ భగవద్గీత పంచదర్శక శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ మాయ లేక ప్రకృతి అన్నది అనంతమైన పరబ్రహ్మము మొత్తంలో లేదు కొంత భాగంలోనే ఉన్నదని చెప్తున్నాయి. ఎంత భాగంలో ఉన్నాయి అన్న ప్రశ్నకు మనం బ్రహ్మమునే నాలుగు భాగాలుగా విభజించుకుంటే దానిలో ఈ మాయ లేక ప్రకృతి, ఈ సమస్త విశ్వం, నక్షత్రాలు, రోదసీమండలము, 14 భువనాలు ఇవన్నీ కూడా కేవలం ఒకే ఒక భాగంలోనే అవి ఉన్నాయని చెప్తున్నాయి వేదాంత పంచ దశ కూడా అదే చెప్తుంది.
బ్రహ్మము అవిభాజ్యం అని చెప్పుకున్నాం కదా అది ఇప్పుడు నాలుగు ముక్కలు చేశామేమిటీ? మరి తక్కువ స్థాయిలో ఉన్న మానవులకి అర్థం అయ్యేలా చెప్పాలంటే ఈ విధంగానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి బ్రహ్మము అవిభాజ్యం, నిర్వికారము, నిర్గుణము, ఇలా ఎన్నో లక్షణాలు చెప్పుకున్నాం. కాకపోతే మనందరకీ అర్థం కావాలంటే ఈవిధంగానే చెప్తే కాని అర్థం కాదు కాబట్టి మన అర్థం కోసం ఈ అనంత బ్రహ్మముని నాలుగు భాగాలుగా విభజించుకున్నాం. దానికి ఒక పెద్ద మహాసముద్రం  ఉందనుకోండి. దాన్ని ఒక దేశంలో ఒక పేరుతొ ఇంకొక దేశంలో ఇంకొక పేరుతొ పిలుస్తాం కదా ! కాని నిజానికి ఆ మహాసముద్రం అంతా కూడా  ఒకటే ఒక భాగం కదా ! అలాగే ఇక్కడ మన అవగాహన కోసం దాన్నినాలుగు భాగాలుగా  విభజించాల్సి వచ్చింది. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు స్వయంగా అర్జునుడితోటి ఇదే చెప్పాడు.


      “అర్జునా ! నేనంటే ఏమనుకుంటున్నావు ? ఎవరనుకుంటున్నావు? నేను నీకు ఈ పరబ్రహ్మములో కొంత భాగంలోనే కనిపిస్తున్నాను. మిగతా భాగం అంతా నేను ఇంద్రియగోచరం కాను. అంటే నా తత్వం ఇంద్రియగోచరం అని చెప్పటం జరిగింది. అంటే అనంతమైనటువంటి ఈ పరబ్రహ్మములో మూడువంతులు మాయ అన్నది లేనే లేదు. అక్కడ ఉన్నది పరబ్రహ్మ చైతన్యం. కేవలం కొంత భాగంలో మాత్రమే ఈ మాయ లేక ప్రకృతి ఆవరించుకుని ఉన్నది. నీవు చూస్తున్నటువంటి నా ఈ విరాట స్వరూపం కేవలం కొద్ది భాగం లోనే నీకు గోచరమవుతుంది, అర్జునా ! అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది.
ఏ విధంగా అయితే కుండల్ని తయారు చేయాలంటే కేవలం మట్టి మెత్తగా ఉన్న ప్రదేశంలో నుంచే ఆ మట్టిని తీసి కుమ్మరివాడు మట్టిని తీసి కుండల్ని చేయగలుగుతాడు. దానికి భిన్నంగా ఉన్న ఇసక ఉన్నప్రాంతం నుంచి కుండల్ని తయారు చేయడం అసాధ్యం కదా ! అదేవిధంగా ఈ మాయ లేక ప్రకృతికి ఆధారంగా ఉండాలంటే ఈ అనంత పరబ్రహ్మములో కేవలం కొంత మేర మాత్రమే  ఆ సృష్టి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కేవలం అక్కడ మాత్రమే మాయ లేక ప్రకృతియొక్క  సృష్టించే శక్తి ఉంటుంది. మిగతాదంతా కూడా అనంతమైన పరబ్రహ్మ చైతన్యమే. ఈ మాయ లేక ప్రకృతి పూర్తిగా లయమయినప్పుడు అది నిరాకారరూపంలో ఉంటుంది. అక్కడే ఈ సమస్త ప్రాణుల యొక్క, జీవుల యొక్క కర్మఫలాలు, వాసనలు అన్నీ కూడా అదే ప్రదేశంలో ఆ మాయలో నిండి ఉంటాయి.


              మాయ యొక్క మరియొక లక్షణాన్ని పరిశీలిద్దాం. ఈ మాయ త్రిగుణాలతో కలిసి ఉంటుంది. అంటే మాయ త్రిగుణాత్మకంగా ఉంటుంది. ఈ మూడు గుణాలు ఏమిటీ? సత్వగుణం, రజో గుణం, తమో గుణం. మన అవగాహన కోసం ఎక్కడైతే  మాయ ఉన్నదని మనం  చెప్పుకున్నామో ఆ మాయని మనం మూడు భాగాలుగా చేస్తే ఒక భాగంలో రజో గుణం, ఒక భాగంలో సత్వగుణం , ఇంకొక భాగంలో తమోగుణం ఉంది అని అనుకుందాం. కాని నిజానికి అవి ఈవిధంగా విభజింపబడి లేవు. కేవలం మన అవగాహన కోసం మాత్రమే  ఇలా మనం ఊహించుకుంటున్నాం. ఈ అనంత పరబ్రహ్మములో కొంత మేరకు మాత్రమే మాయ ఉందని మనం చెప్పుకున్నాం. అయితే ఈమాయ సృష్టి గా మారక మునుపు బ్రహ్మము యొక్క చైతన్యం కేవలం సత్వగుణం లోనే ప్రవేశిస్తుంది. అక్కడే ఉంటుంది. అప్పటికి ఇంకా సృష్టి అనేది జరగలేదు. దీన్నే మాయ అని పిలుస్తా. ఇక్కడ జాగ్రత్తగా చదవండి. ఈ అనంతబ్రహ్మములో కొంత మేర వరకే మాయ ఉందని చెప్పుకున్నాం. ఈ మాయ అనే పదాన్ని ఎప్పుడు చెప్పుకుంటామంటే బ్రహ్మము యొక్క చైతన్యం కేవలం మాయ లోనే సత్వగుణం లో ఉన్నప్పుడు, ఇంకా సృష్టి జరగక మునుపు దాన్ని మాయ అని పెర్కొనబడుతుంది. ఎప్పుడైతే బ్రహ్మము యొక్క చైతన్యం సత్వగుణం లోనే కాకుండా రజోగుణం లో,తమోగుణం లో వ్యాపిస్తుందో అప్పుడు దీన్నే అవిద్య అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. బ్రహ్మచైతన్యం కేవలం మాయలోనే  సత్వగుణం లో ప్రవేశించినప్పుడు, సృష్టి ఇంకా జరగక మునుపు దాన్ని మాయగా పేర్కొన్నాం. ఎప్పుడైతే బ్రహ్మము యొక్క చైతన్యం రజో,తమోగుణం లో ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే సృష్టి  జరగడం మొదలుపెట్టిందో అప్పుడు దాన్ని అవిద్యగా చెప్పుకున్నాం. అంటే మాయ రెండు రకాలుగా ఉంటుంది. దాని మూల ప్రకృతిని మనం మాయ అని పిలుస్తాం. ఎప్పుడైతే ఈ మూలప్రకృతి లో బ్రహ్మచైతన్యం రజోగుణం,తమోగుణంలో వ్యాప్తి చెందుతుందో దాన్ని అవిద్య అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఇక్కడ  మాయ రెండు రకాలన్నమాట. ఒకటి మూలప్రకృతి కి సంబంధించినటువంటి మాయ, రెండవది అవిద్య. అంటే సృష్టి ఏర్పడనప్పుడు, ప్రకృతి ఏర్పడనప్పుడు ఈ బ్రహ్మచైతన్యం కేవలం మాయ లోని సత్వగుణం లో మాత్రమే వ్యాపించి ఉంది. మిగతా రెండు గుణాలు రజో గుణం, తమోగుణం ఇంకా నిద్రాణ స్థితిలో ఉంటాయి. ఇంకా వాటిలో చైతన్యం వ్యాప్తి చెందలేదు. అయితే ఈ పరిస్థితి సృష్టి జరగకమునుపు  స్థితి అన్నమాట.
.......... to be continued…..)

21 June 2017

నవీన యుగ నిర్మాణ శక్తి -9

నవీన యుగ నిర్మాణ శక్తి -9

దత్తాత్రేయ తత్వ విచారణ


చాలా మంది యువకులు , పిల్లలు మన పురాణాలలో ఉన్నటువంటి చాలా విషయాలను తెలుసుకోవాలనే కుతూహలంతో చాలా  ధైర్యంగా, చాలా ఆతృతగా అడుగుతుంటారు. వాళ్ళు పురాణాల్లో విన్నటువంటి ఈ దేవతలకి అరిషడ్వర్గాలు ఉండటం ఒకల మీద ఒకలకి ఈర్ష్య అసూయలు ఉండటం,ముఖ్యంగా ఇంద్రుణ్ణి ఎందుకు పనికిరాని వానిగా చిత్రీకరించడం, వెశ్యాలోలునిగా చెప్పటం, వాడు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అనే నలుగురు అప్సరసల తో గడుపుతుంటాడు.అతని భార్య శచీ దేవి మహా పతివ్రత. ఎవరు తపస్సు చేసినా గజ గజా వనికిపోతూ వాళ్ల తపస్సు భంగం చేయటానికి రక రకాలుగా  ప్రయత్నిస్తుంటాడు.ఇటువంటి వాడు దేవుడు ఎందుకు అయ్యాడు అని ప్రశ్నిస్తుంటారు. మాములు మనుషుల లాగా మహత్ములలో అరిషడ్వర్గాలు లేవు కదా. మరి ఏ రకంగా ఇందుడు ఇంద్ర పదవి పొందాడు అని అడుగుతుంటారు. మరి దేవతలలో కూడా పార్వతి గాని వీళ్లందరిలో కూడా అసూయ ఎందుకు ఉంది అని అడుగుతుంటారు. ఈ రకంగా మన పురాణాలలో అర్థం పర్థం లేని పొంతనలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి మన పిల్లలు  ఆసక్తితో అడుగుతుంటారు. మరి మనం ఏం సమాధానం చేబుతాం. ఇవన్నీ మనం ఆలోచించవల్సిందే కదా .

ఈ పెద్ద వాళ్ళు ఏం చేస్తారు ఎదో ఒక రకంగా అటుతిప్పి ఇటుతిప్పి  గందరగోళం చేసి ఆ ప్రశ్నలకు సమాధానాలు చేప్పటానికి ప్రయతిస్తారు. దానివల్ల వాళ్ళ సందేహాలు మటుమాయం కాకపోగా ఇంకా కొత్త అనుమానాలు వస్తుంటాయి. పిల్లలు ఇటువంటి ప్రశ్నలు ఆడిగినప్పుడు మనకి సమాదానం గనక తెలిస్తే ఒక తార్కిక కోణం లో వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలి లేకపోతే నాకు తెలియదు అని చెప్పాలి. మనకు ఉన్న అహం మనతో అలా చెప్పిస్తూ ఉంటుంది. ఎంతో మంది పురాణ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఈ చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలకు తార్కికంగా సమాదానాలు అసలు చెప్పనే చెప్పారు. మీకు అర్థం కాదు మీరు ఊరుకోండి అని చెప్తారు. వాళ్ళ కింద స్థాయికి వచ్చి వాళ్లకు అర్థం అయ్యేటట్టు చెప్పరు. ఈ రోజు మన పిల్లలకు మన హిందూమతం గురించి వాళ్లకు ఏమీ తెలియదు. జకీర్ నాయక్ అనేవాడు హిందూ మతం నుంచి ఇస్లాం మతానికి మారి ఒకమాట చెప్పాడు. క్రైస్తవులను ఇస్లాం లోకి మార్చటం చాలా కష్టం. కానీ హిందువులను మతం మార్చటం చాలా తేలిక.ఎందుకంటే చాలా మంది హిందువులకు వాళ్ళ మతం యొక్క గొప్పతనం గురించి వారికి తెలియనే తెలియదు కాబట్టి వారందరిని ఇస్లాం లోకి గాని వేరే మతంలోకి  గాని మార్చటం చాలా సులువు అని చెప్పాడు. ఇది నిజమే కదా మరి. నూతన యుగ నిర్మాణంలో మన రాబోయే పిల్లలు ఇటువంటి తర్కానికి అందని విషయాలను కొట్టి పారేస్తారు. ఆధ్యాత్మిక త అంటే ఏమిటి ? దానివల్ల వచ్చే లాభం ఏమిటి ? మొత్తం ప్రపంచంలోని ప్రజలందరినీ ప్రేమించే తత్వాన్ని కలిగి ఉండాలి. తోటివారికి సహాయపడే దృక్పథం కలిగి ఉండాలి.


ఆధ్యాత్మిక త అనేది మన మనస్సులో ప్రశాంత భావాన్ని కలిగించేతట్టు ఉండాలి. విశ్వ మానవ చైతన్యానికి తోడుగా ఉండే విధంగా ఈ ఆధ్యాత్మికత ఉండాలి. అంతేగాని ఆధ్యాత్మికత లో మూఢ విశ్వాసాలకు అందవిశ్వాసాలకు ఎటువంటి తావు ఉండకూడదు. అవి ఉన్నప్పుడు మన చైతన్యం విశ్వ మానవ చైతన్యానికి ఏ విధముగాను సహాయపడదు. ఈ రాబోయే కాలంలో ప్రజ్ఞావంతులుగా చెప్పబడే ఇండిగో పిల్లలు,రెయిన్బో పిల్లలు మరియు క్రిస్టల్ పిల్లలు వీళ్లందరు కూడా ప్రపంచాన్ని అద్భుతంగా మార్చే పనిలో ఉన్నారు. పెద్దలందరు ఏం చెప్తున్నారు. 2017 కల్లా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తాము అని చెప్తుంటారు. ఇంతవరకు వస్తున్నటువంటి పాత విశ్వాసాలు, మూఢ నమ్మకాలు ఇవన్నీ కూడా వాటి ఉనికిని కోల్పోతాయి. శైవులు వైష్ణవులని తిట్టటం , వైష్ణవులు శివున్ని తిట్టటం ఇద్దరూ కలిసి హిందూమతం లోని ఇంకొక వర్గాన్ని తిట్టటం వల్ల మన భారతదేశానికి ఎంతో అనర్థం జరిగింది. అటువంటి వాటికి చోటు ఇవ్వకుండా రెయిన్బో పిల్లలు మరియు క్రిస్టల్ పిల్లలు ఈ సమాజాన్ని చాలా అద్భుతంగా మార్చివేస్తారు. ఇది తథ్యం తథ్యం తథ్యం.

14 June 2017

నవీన యుగ నిర్మాణ శక్తి -8

నవీన యుగ నిర్మాణ శక్తి -8

దత్తాత్రేయ తత్వ విచారణ

స్వామివారియొక్క అవదూత తత్వం

శ్రీ దత్తాత్రేయుల వారిని బాలోన్మత్త పిశాచ వేశాయ అని చెబుతూ ఉంటారు. అంటే శ్రీ దత్తాత్రేయుల వారు బాలుడు గాను, ఉన్మత్తుడు గాను,పిశాచ రూపంలో  రకరకాల వేశాల్లో ఉంటాడని దీని తాత్పర్యం. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి ?

ఈ దత్తాత్రేయ భక్తులుగా చెప్పబడే వారు ఏం చేస్తున్నారు. సాక్షాత్తు దత్తుని అవతారమైన శిరిడి సాయిబాబా వారు చిలుము తాగేవారు అలాగే అవదూతలంతా చిలుము తాగేవాళ్లు కాబట్టి  వాళ్ళు చిలుము తాగుతున్నారు. బీడీలు సిగరెట్లు కాలుస్తున్నారు. మూర్ఖమైన భక్తులు వారికి ఇంపోర్టెడ్ సిగరెట్లు సప్లై చేస్తున్నారు. దత్తస్వామి, సాయి బాబా భక్తులను తిడుతూ ఉండేవారువారు అని వీరు వినడం వల్ల ఈ తిట్టే కార్యక్రమం, ధూమపాన కార్యక్రమం పసందుగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా వచ్చే జనాల్ని తిట్టటం మొదలు పెడుతున్నారు. అంతేకాకుండా కొంత మంది అవదూతలుగా చెప్పబడేవాళ్ళు దెబ్బలు కూడా కొడుతుంటారు. మూర్ఖమైన ప్రజలు ఆ  దెబ్బలు తగిలినప్పుడల్లా అయ్యో స్వామి నా ప్రారబ్ద కర్మలు తీస్తున్నారని ఎంతో సంతోషపడిపోతారు. అయితే మనం చూసే ఈ కపట అవదూతలు సిగరెట్లు తాగుతూ ఉంటారు. బూతులు తిడుతూ ఉంటారు. పిచ్చి పిచ్చి గా అంటే బాలుడుగా  ప్రవర్తిస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుంటారు. దగ్గరకి వచ్చిన వాళ్ళను రాళ్ళు పెట్టి కొడుతుంటారు.
కానీ శిరిడి సాయి బాబా గారు భక్తురాలైన కమ్మరి వనిత పనిలో ఉన్నప్పుడు ఒడిలో ఉన్న పిల్లవాడు మంటల్లో పడే సమయానికి ఎక్కడో ఉన్న ఆవిడ బిడ్డని మంటల్లో నుంచి లాగేసినప్పుడు దానికి చిహ్నంగా ఆయన చేయి కాలిపోయింది. మరి ఈ అవదూతలు నిజంగా అలాంటి పని చేయగలుగుతున్నారా మీరే ఆలోచించండి. ఒక చేత్తో సూర్యుణ్ణి ముట్టుకొనవసరం లేదు ఒక గుప్పెడు వేడి వేడిగా ఉన్న బొగ్గు కనికలను వారి చేతిలో వేయండి వారు ఎటువంటి బాద లేకుండా నిర్లిప్తంగా ఉండగలుగుతారా ? ఆశుద్ధంలో చేయి పెట్టి కెలికి ఏ మాత్రం చలించకుండా ఉండడగలుగుతారా ?

దీని అర్ధం ఏమిటంటే శిరిడీ సాయిబాబా గారు ఏవేవైతే  కోన్ని పనులు సులభంగా చేశారో అవి వీళ్ళు చేస్తారు. కష్టసాధ్యమైన పనులు వీళ్ళు చేయలేరు. సాక్షాత్తు దత్త స్వామీ చేస్తున్న ఎన్నో గొప్ప పనులు వీళ్ళు చేయలేరు. కానీ ఆయన చేస్తున్న సులభమైన పనులను అనుకరించటం అవదూతలని వాళ్ళ శిష్యుల చేత చెప్పించుకోవటం, ప్రారబ్ద కర్మలను మేము తీసివేస్తామని చెప్పటం ఇదంతా చాలా అసందర్భంగా ఉంది కదా. ఇవన్నీ కూడా ఈ నూతన యుగ నిర్మాణంలో ఇటువంటి అంధ విశ్వాసాలు నాశనం కాక తప్పదు.


భవిష్యత్తు గురించి  చేప్పినప్పుడు శ్రీ రాం శర్మ ఆచార్య గారు , స్వామి దయానంద సరస్వతి గారు గాని, వీర  బ్రహ్మంగారు గారు గాని వీరందరు  వీటిని ఖండించారు. మనం ఇటువంటి విషయాలు అడిగినపప్పుడు మన పెద్ద వాళ్లు గాని , గురువులుగా చెప్పే వాళ్ళు గాని మనల్ని చాలా కోప్పడతారు. నీకు ఈ విషయాలు తెలియవు నోరు మూసుకో అని చెప్తారు. కాని మన పిల్లలు మనల్ని ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఈ విధంగా మనం కేకలు వేయగలమా ? ఒకవేళ తాత్కాలికంగా మనం  కోప్పడినప్పటికి   వాళ్ళ మనసులో ఉన్న ఇటువంటి సందేహాలు పెను వృక్షాలుగా మారి  వాళ్లు హిందూ మతానికి దూరంగా తొలగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి.

11 June 2017

నవీన యుగ నిర్మాణ శక్తి -7

 నవీన యుగ నిర్మాణ శక్తి -7

శ్రీ దత్తాత్రేయతత్వ కధలు


నిజమైన అవదూత  తత్వ నిరూపణ.
సాక్షాత్తు దత్త స్వామిని మించిన రెండవ అవదూత లేనే లేడు.

ఈ మహా వాక్యం గురించి మనం పరిశీలన చేద్దాం. వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఎప్పుడో రాబోయే భవిష్యత్తు గురించిన కాలజ్ఞానం చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే ఈ కలియుగం గడుస్తున్న కొద్దీ వీదికొక్క స్వామి, ఊరినిండా దేశమంతా కూడా ఆషాడభూతిని కూడా మరిపించేటటువంటి  దొంగ స్వాములు ఎంతో మంది వస్తారని,ఎంతో మంది అవదూతలు వస్తారని ప్రజలందరూ కూడా వారి వాక్చాతుర్యానికి వాళ్ళు చేసే చిన్న చిన్న మహిమలకి పడిపోయి భ్రష్టులు అవుతారని చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఎంతో మంది అవదూతలని చెప్పబడే వారిని చూస్తున్నాము. అలాగే చిన్నా పెద్ద గురువులు ఎక్కడబడితే అక్కడ తాము చేసే చిన్న చిన్న మహిమలతో మరియు వారి వాక్చాతుర్యంతో ఎంతో ప్రఖ్యాతి గాంచిన పండితులని కూడా బురిడీలు కొట్టిస్తున్నారు. దీనివల్ల మొత్తం మన  హిందూ మతానికే ఎంతో అప్రతిష్ట వస్తుంది. పాశ్చాత్య  దేశం లో ఉన్న అందరూ ముఖ్యంగా మన మహిళలు బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు పడుతున్నారు. ఎందుకంటే వారికి మన హిందూ మతం యొక్క ప్రాథమిక విజ్ఞానం అసలు లేనే లేదు. గురువులు గా చెప్పబడే ఈ స్వాములు, చిల్లర దేవుళ్ళు తమ భక్తులకు ఈ కనీస జ్ఞానాన్ని కలిగించే ప్రయత్నాలు ఏమి చేయడం లేదు. పురాణ ప్రవచనాలను చెప్పేవారు కూడా ఈ దిశగా కృషి చేయడం లేదు. ఎంతసేపు  ఎప్పుడో పూర్వికులు చెప్పినటువంటి రామాయణ, మహాభారత, మహాభాగవత కథలే చెప్పుకుంటూ వెళ్తున్నారు తప్ప అసలు మన జీవిత లక్ష్యమేంటి ? మనకు ప్రామాణికముగా ఉన్న వేదాలు ఏం చెప్తున్నాయి, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అనే మౌలిక విజ్ఞానాన్ని అసలు అందించటం లేదు. కాబట్టే మన హిందూ మతం లో ఉన్నంత గందరగోళం క్రైస్తవ మతంలో గాని , ఇస్లాంలో గాని అసలు లేనే లేదు. దత్త భక్తులుగా చెప్పబడే ఎంతోమంది శాస్త్రాలు చదివిన పండితులు కూడా శ్రీ పాద శ్రీ వల్లభ భక్తులు గాని ,  మాణిక్య ప్రభు భక్తులు గాని, షిరిడి సాయి భక్తులు గాని, అక్కల కోట మహరాజ్ భక్తులు గాని, నృసింహా సరస్వతి స్వామి భక్తులు గాని అసలు దత్త తత్వాన్నే తెలుసుకోలేక పోతున్నారు. విచిత్రమేమిటంటే  పామరులకున్నటువంటి భక్తి,శ్రద్ద మరియు విశ్వాసం అనేవి ఈ పండితులుగా చెప్పబడే వాళ్లకు అసలు లేవు. అందుకనే మనం దత్త పురాణం ,శ్రీపాద శ్రీ వల్లభ చరితం లో స్వామి స్వయంగా చెప్పిన అవదూత లక్షణాలను గురించి నిష్పక్షపాతంగా పరిశీలిద్దాం.

ఆ తరువాత దత్త భక్తులుగా చెప్పబడే మనమందరం కూడా  విశ్లేషిచుకుందాం. ఇందులో ఎవరిని ఆక్షేపించే ఉద్దేశ్యం లేదు . కేవలం వాస్తవాలను ముందుకు పెట్టే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. శ్రీ పాద  శ్రీ వల్లభ చరితం లో సుమతి మహారాణి గారు, అప్పలరాజు శర్మ గారు వారి పితృ శ్రాద్ధ కర్మ చేస్తున్నపుడు ఇంటి బయట ఒక అవదూత బిక్షాం దేహి అని రావటం మనం చదువుకున్నాం. అయితే భోక్తలు భుజించిన తర్వాత గాని వేరే వారికి లేక ఇంటివారు గాని భోజనం చేయకూడదు అనే నియమం ఉంది. అయినా కూడా ఆ సుమతి మహారాణి గారు ఇంటి ముందుకు వచ్చిన ఆ బిక్షగాడికి బిక్ష ఇచ్చింది. దానికి ఆ అవదూత సంతోషించి తల్లి ఏం వరం కావాలో కోరుకోమని చెప్పాడు. కుశాగ్ర బుద్ది అయిన సుమతి మహారాణి నన్ను తల్లిగా పిలిచావు కాబట్టి అది నువ్వు సార్థకం  చేసుకో అని చెప్పింది. ఆమె సమయస్ఫూర్తికి దత్త స్వామి ఎంతో సంతోషించాడు. తల్లి అలాగే వరం ఇస్తున్నాను.  అయితే నా వంటి అవదూత ఈ విశ్వం లో ఇంకొకడు లేడు కాబట్టి నేనేె నీకు పుత్రునిగా జన్మిస్తాను అని అభయం ఇచ్చాడు. దీనివల్ల మనకు ఏం తెలుస్తుంది. ఒకవేళ నిజంగా దత్తాత్రేయిని మించిన అవదూతలు నిజంగా ఉంటే మరి వాళ్లే సుమతి మహారాణి కడుపున జన్మించే అవకాశం ఉన్నది కదా. అలా వరం ఇచ్చాడు కాబట్టి తనను మించిన రెండో వ్యక్తి అవదూత అనేవాడు లేడు కాబట్టి ఆయన సాక్షాత్తు సుమతి మహారాణి కి శ్రీ పాద శ్రీ వల్లభుడుగా జన్మించాడు. ఇంతకన్నా మీకు ఇంకా ఏం నిరూపణ కావాలి. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం లో కూడా ఆయన ఎవరినైతే ఆశీర్వదించారో ఉదాహరణకు ఆయన వెంకయ్య అవదూతని ఆశీర్వదించి అవదూతగా నువ్వు  జన్మించి భక్తుల కోరికలు తీరుస్తూ, వారి రోగాలు నయం చేస్తావని ఆజ్ఞాపించాడు కాబట్టి చాలా కొద్దిఅంశ మాత్రమే గ్రహించి వెంకయ్య అవదూతగా ప్రసిద్ది గాంచాడు. ఈ పుస్తకంలో ఇంకొక చోట ఎవరినైనా నాలో కలుపుకున్నప్పటికీ అవసరమైనప్పుడు తిరిగి జన్మించమని ఆజ్ఞాపిస్తే వాళ్ళు తప్పకుండా మరల జన్మకు రావాల్సిందే అని చెప్పాడు. తన అంశగా వచ్చిన వ్యక్తులలో తన మహాత్తుకు, మహిమలకు తానే కారణం అని ఏ మాత్రం అహంకారం, గర్వం కలిగినప్పుడు ఆ గర్వం అణచివేస్తానని కూడా స్వామి చెప్పాడు. అంతేకాకుండా దత్త పురాణంలో పింగళ నాగుడుకి సాక్షాత్తూ దత్తస్వామి ఏమి చెప్పాడు ? తాను ఒక చేత్తో సూర్యుణ్ణి ముట్టుకుంటానని,మరో చేత్తో అశుద్ధాన్ని ముట్టుకుంటానని చెప్పాడు. నాలాగే ఎవరైతే చేస్తారో వారికి ఒక పని చేయటం వల్ల పుణ్యం ఒక పని  చేసినందువల్ల పాపం అంటదని అభయం ఇచ్చాడు. మరి ప్రస్తుతం ఉన్న అవదూతలు ఎలా ఉన్నారో మీరే  ఆలోచించుకోండి.



8 June 2017

నవీన యుగ నిర్మాణ శక్తి -6


నవీన యుగ నిర్మాణ శక్తి -6

శ్రీ దత్తాత్రేయతత్వ కధలు



మమకారము  మానవ చైతన్య వ్యాప్తికి ఒక పెద్ద ఆటంకం.

మనం చేసే చాలా రకాల ధ్యాన పద్దతులలో కేవలం ఒకే ఒక లక్ష్యం ఉంటుంది, అదే మన చైతన్య స్థాయిని పెంచుకోవటం అనమాట. చైతన్య స్థాయి అంటే ఏమిటి అంటే, ఏమీ లేదు - మన ఆలోచనా స్థాయిని పెంచుకోవటం అనమాట. మన ఆలోచనలకి ఎటువంటి పరిధులు లేకుండా మన చైతన్య స్థాయిని పెంపొందించుకోవడం. ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే మనలో చాలా మందికి మన చైతన్య స్థాయిలో కేవలం మన కుటుంబాన్ని మాత్రమే ఉంచుకొంటాం. తల్లీ, తండ్రీ - తల్లితండ్రుల్ని కూడా ఈమధ్య ఉంచుకోవటం లేదు. కేవలం భార్య, భర్త, పిల్లలు; ఎంతసేపూ మన ఆలోచనా పరిధులు వీరి చుట్టూ తిరుగుతూ ఉంటాయికానీ  వీరిని దాటి పైస్థాయిని వెళ్లవు. ఇటువంటి వారిలో మమకారం ఎక్కువ ఉంటుంది.  స్వార్ధ చింతన ఎక్కువగా ఉంటుంది. ఇతర వ్యక్తులతో, ఇరుగుపొరుగు వాళ్లతో పంచుకోవటం అనేది ఉండనేవుండదు. మనకి ఎక్కువగా ఉన్న వస్తువులు పంచుకోవటం కావచ్చు, ధనాన్ని పంచుకోవటం కావొచ్చు, జ్ఞానాన్ని పంచుకోవటం కావొచ్చు, ప్రేమని పంచుకోవటం కావొచ్చు. ఏ లక్షణాలు అయితే మన కుటుంబం చుట్టూ తిరుగుతూ వుంటాయో పై స్థాయి వాళ్ళకి మాత్రం ఈ లక్షణాలు వర్తించకుండా ఉంటాయి.

చాలామంది తమ కుటుంబమే కాకుండా, ఇరుగుపొరుగు వాళ్లే కాకుండా, సమాజము, గ్రామములోని ప్రజలతో పాటు కష్టాలు సుఖాలు పంచుకోవటం, సమాజ సేవ చెయ్యటం ఉంటుంది. అంటే వీరి చైతన్య స్థాయిలో ఆ గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇంకా కాస్తా పైస్థాయికి వెళితే ఆ జిల్లా మొత్తం ఉండవచ్చు, ఇంకా కాస్త పైస్థాయికి వెళితే భారత దేశం, ఇంకా మొత్తం ప్రపంచం ఇలా ఉండవచ్చు. దీనినే ఇంగ్లీష్ లో ‘Expansion of human consciousness’ అని అంటాము. మనం ముచ్చటగా తెలుగులో చెప్పుకోవాలి అంటే ‘మన మానవ చైతన్య వ్యాప్తి ’ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అయితే మనం మన చైతన్య స్థాయిని పెంచుకుంటామో అప్పడు ఈ ప్రపంచంలోని ప్రజలు అందరూ కూడా మన సొంత కుటుంబ సభ్యుల్లాగానే మనం భావిస్తాం. అలాగే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం కూడా దుఃఖపడతాం, వాళ్ళకోసం ప్రార్దిస్తాం. అలాగే వాళ్ళు సుఖంగా ఉంటే మనంకూడా చాలా సంతోషిస్తాం. ఇటువంటి స్థాయిలో ఉన్న ఒక మహా యోగిని గూర్చి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.

వివేకానంద స్వామిగారి గురించి తెలియనివాళ్ళు ఎవ్వరూ ఉండరు.   అయితే వారి జీవితంలోని కొన్ని ఘట్టాలు చాలామందికి తెలియదు. అందులోని ఒక ప్రధాన ఘట్టాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వివేకానంద చాలా చిన్న వయస్సులోనే అనగా 39 ఏళ్ల వయస్సులోనే దేహత్యాగం చేశారు. ఆయన తన సహచరునితో ఒకసారి ఈవిధంగా చెప్పారు ‘నాకు ఈమధ్య ఈ భారత దేశం అంతా నాలోనే ఉంది, నేను అంతా నేను భారతదేశమంతటా నిండి వున్నాను అని అనిపిస్తున్నది. అది మెల్లమెల్లగా మొత్తం ప్రపంచం అంతా కూడా నాలోనే ఉన్నట్టు, నేను ప్రపంచమంతా ఉన్నట్టుగా, ప్రజలందరిలోనూ, ఇక్కడ భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, చెట్లు, కొండలూ, గుట్టలు, మనుషులు, నదులు, అన్నిటిలో నేనే వున్నాను అనే భావం నాలో చాలా తొందరగా వ్యాపిస్తుంది. ఈ సృష్టించబడిన అన్ని జీవులపై  అపారమైన కరుణా ప్రేమా, పొంగి పొరలుతున్నాయి. కనుక నా ఈ దేహం ఈ విధంగా విస్తరిస్తున్నటువంటి చైతన్య స్థాయిని ఇముడ్చుకోలేక పోతున్నది. ఇది దేహం వదిలి విశ్వమంతా తొందరలో వ్యాపిస్తుంది. కనుక నేను ఇంక ఎంతోకాలం బ్రతకను. ఎందుకంటే ఈ దేహం నా చైతన్య స్థాయిని పూర్తిగా నింపుకోలేకపోతుంది. కాబట్టి నేను దేహత్యాగం చెయ్యక తప్పదు’ అని చెప్పారట. దీనిలో చాలా అర్ధం వుంది. దీనికి ముందు పైన అర్ధం కావటానికి నేను కొంచం వివరించి చెప్పాను. అంటే స్వామి వివేకానంద సాక్షాత్తుపరబ్రహ్మ జ్ఞానాన్ని పొందిన పరమాత్ముడు. అందుకే ఈ సృష్టిలో వున్న ప్రతి జీవిలో తనను తానే చూసుకోవటం, ఆ జీవి తనలోనే వున్నది అని తలుచుకోవడం దానికి తార్కాణం.

సాక్షాతూ శ్రీ దత్తుడి తత్వాన్ని అర్ధం చేసుకోవటమే కాకుండా దాన్ని సాక్షాత్తు అనుభవించినటువంటి ఒక మహా యోగి అని చెప్పక తప్పదు.

నండూరి శ్రీసాయిరాం  


4 June 2017

నవీన యుగ నిర్మాణ శక్తి -5

నవీన యుగ నిర్మాణ శక్తి -5

శ్రీ దత్తాత్రేయతత్వ కధలు



మమకారము దుఖ హేతువు - మోక్ష సాధనకి ఆటంకం.

స్వామీ వివేకానంద జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం.

స్వామీ వివేకానంద ఎల్లప్పుడూ కూడా శ్రీ రామకృష్ణ పరమహంసని అంటిపెట్టుకుని ఉండేయివారు. ఎక్కువ సమయం ఆయనతోనే గడుపుతూ ఉండేయివారు. శ్రీ రామకృష్ణ పరమహంస గారు ఎప్పుడూ తన్మయత్వంలో ఉండి నృత్యం చేస్తూ ఎవరు కనపడితే వారిని ఆలింగనము చేసుకుంటూ ఉండేవారు. అందరూ ఆయనని పిచ్చి వాడు అని ఒక ముద్ర వేశారు. కానీ స్వామీ వివేకానంద ఎప్పుడూ వారిని పిచ్చివాడు అని అనుకునే వారు కాదు, వారిలో ఆయనకి ఒక దైవత్వం కనిపించేది. సామాన్య మానవులు అయిన మనందరికీ ఇటువంటి వారిని చూసినప్పుడు వారిని పిచ్చివారి వాలే వారిని అనుకుంటాం. కానీ మనకన్నా కొంచం పై స్థాయి లో వున్నవారికి వారు ఒక మంచి సాధకులుగా, భగవత్ దర్శనం అయితే  ఎంత ఆనందం వస్తుందో అటువంటి ఆనందాన్ని వాళ్లు ఎల్లపుడూ పొందుతూ నృత్యం చేస్తూ ఆనందంగా ఉంటారని తెలుస్తుంది. సాక్షాతూ శ్రీ షిర్డీ సాయిబాబా గారి జీవితంలో కూడా అంతే, ఆయన దేహదారిగా ఉన్నంత కాలం చాలామంది ‘ఆ ఫకీరు పిచ్చి వాడు’ అని అంటూ ఉండేయివాళ్ళు. ఎప్పుడూ కూడా  సమకాలిన పరిస్థితులలో తమ పక్కనే వున్న మహాత్ములని గమనించటం అరుదు. శ్రీ కృష్ణుని జీవిత చరిత్రలో కూడా అంతే కదా, సాక్షాతూ ఆయన భగవంతుడు అయినా కూడా ఆయన తత్వాన్ని గమనించలేని కంసుడు కానీ, జరాసంధుడు కానీ మిగతా ఎంతో మంది కూడా ఆయన్ని ఎంతో అవమానించారు, దూషించారు, సరిగా అర్ధం కూడా చేసుకోలేకపోయారు. ఎప్పుడయితే దేశము, కాలములలో కొంత ఖాళీ ఏర్పడుతుందో అప్పుడు రాబోయే తరాల వాళ్ళు పిచ్చి వాడిగా ముద్రవేసుకున్న వారిని ఆ తరువాత ‘భగవంతుడు’ అని ముద్ర వేస్తూ వుంటారు.

    ఈ విధంగా రోజులు గుడుస్తుంటే వివేకానందుడి ఇంట్లో ఆయన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆవిడ జబ్బు పడి తీవ్ర అస్వస్థతకి గురి అయ్యారు. వివేకానందుడు ఇంటికి వెళ్ళాడు కానీ అతనికి ఏమి చెయ్యాలో తెలియలేదు. మందులు కూడా కొనటానికి అతని దగ్గర పైకం లేదు. కొంతమంది ‘నీ గురువుగారు చాలా మహిమాన్వితుడు కదా, ఆయన తలుచుకుంటే నీ తల్లికి తొందరగానే స్వస్థత చేకూర్చకలరు, ఆయనని అడుగు’ అని ప్రోత్సహించారు. సరే అని చెప్పి వివేకానందుడు సరాసరి గురువు గారి దగ్గరకి వెళ్లి ‘గురువు గారు! మీరు కాళీ మాత సాక్షాత్కారము పొందారు, మరి దేవతలు వుండి ఏమి లాభము? నా తల్లికి అసలు ఏమీ బాగోలేదు. ఆమెకు వెంటనే స్వస్థత కలగాలి, ఆరోగ్యం కుదరాలి, మరి మీరే సహాయం చెయ్యాలి ’ అని అనగా, అప్పుడు రామకృష్ణుడు ‘నాయనా, నేను ఎందుకు మధ్యవర్తిత్వం? నువ్వు గర్భగుడిలోకి వెళ్లి ఆమెను ధ్యానించు. ఆమెనే నువ్వు అడుగు’ అని చెప్పి పంపించారు.’ వెంటనే వివేకానందుడు గర్భగుడిలోకి వెళ్లి పద్మాసనంలో ధ్యానం చేసాడు. ఒక గంట అయినాక ఆయన బయటకి వచ్చాక రామకృష్ణుడు ‘నాయనా అడిగావా?’ అని అడగ్గా ‘లేదు గురువుగారు, నేను మర్చిపోయాను అని చేప్పాడు.’ రెండవ సారికూడా అలాగే ప్రోత్సహించి పంపారు. మళ్ళి రెండు గంటల తరువాత అదే సమాధానం వచ్చింది. ఈసారి మూడవసారి ఎనిమిది గంటలు ధ్యానము చేసి బయటకి రాగానే గురువు గారు ‘ఏమినాయన! తల్లిని అడిగావా?’ అని అడగ్గా ‘గురువుగారు! నేను అడగదల్చుకోలేదు’ అని జవాబు ఇచ్చాడు. దానికి రామకృష్ణుడు దానికి ఎంతో సంతోషించి ‘నాయనా! నువ్వు గనుక కాళికా తల్లిని ఈ వరం అడిగితే నీకు, నాకు ఇదే ఆఖరి కలయిక అయ్యేది’ అని ఆశీర్వదించారు.

ఈ కధ వల్ల తెలిసింది ఏమిటంటే - వివేకానందుకు ఆ కాళికా మాత అనుగ్రహం వుంది కాబట్టి, వివేకానందుడు అడిగితే కాళికా మాత తప్పకుండా ఆయన తల్లికి స్వస్థత చేకూర్చేది. కానీ వివేకానందుడికి ఏమి అర్ధం అయింది అంటే -  పుట్టుకా, చావూ ఎవరికి అయినా తప్పదు. ఎంతో గొప్పవాళ్ళు అయినా, ఆఖరికి భగవంతుడు అయినా భూమి మీదకి వచ్చినప్పుడు అవతారం చాలించి మల్లి వెనక్కి వెళ్ళటం తప్పదు. ఇది సహజంగా ఉండేటటువంటి భగవంతుని యొక్క సృష్టి రచన. అటువంటప్పుడు కాళికా మాత స్వస్థత చేకూర్చినా మళ్ళీ తల్లి గారు వెళ్లిపోయే సమయం వస్తుంది. కాబట్టి మమకారం వదిలినప్పుడే ఆయనకి పైకి వెళ్ళగలను అనే ఒక నమ్మకం కుదిరింది, కాబట్టి స్వామీ వివేకానంద కాళికా మాతని ఏమీ కోరనేలేదు. ఈ విధంగా దత్తాత్రేయుడు చెప్పిన విధానికి ఇటువంటి మహాయోగులు యొక్క అనుభవాలు అయన చెప్పినదాన్ని రుజువు చేస్తూ ఉంటాయి కదా!



నండూరి శ్రీసాయిరాం.