నవీన యుగ నిర్మాణ శక్తి -6
శ్రీ దత్తాత్రేయతత్వ కధలు
మమకారము మానవ చైతన్య వ్యాప్తికి ఒక పెద్ద ఆటంకం.
మనం చేసే చాలా రకాల ధ్యాన పద్దతులలో కేవలం ఒకే ఒక లక్ష్యం ఉంటుంది, అదే మన చైతన్య స్థాయిని పెంచుకోవటం అనమాట. చైతన్య స్థాయి అంటే ఏమిటి అంటే, ఏమీ లేదు - మన ఆలోచనా స్థాయిని పెంచుకోవటం అనమాట. మన ఆలోచనలకి ఎటువంటి పరిధులు లేకుండా మన చైతన్య స్థాయిని పెంపొందించుకోవడం. ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే మనలో చాలా మందికి మన చైతన్య స్థాయిలో కేవలం మన కుటుంబాన్ని మాత్రమే ఉంచుకొంటాం. తల్లీ, తండ్రీ - తల్లితండ్రుల్ని కూడా ఈమధ్య ఉంచుకోవటం లేదు. కేవలం భార్య, భర్త, పిల్లలు; ఎంతసేపూ మన ఆలోచనా పరిధులు వీరి చుట్టూ తిరుగుతూ ఉంటాయికానీ వీరిని దాటి పైస్థాయిని వెళ్లవు. ఇటువంటి వారిలో మమకారం ఎక్కువ ఉంటుంది. స్వార్ధ చింతన ఎక్కువగా ఉంటుంది. ఇతర వ్యక్తులతో, ఇరుగుపొరుగు వాళ్లతో పంచుకోవటం అనేది ఉండనేవుండదు. మనకి ఎక్కువగా ఉన్న వస్తువులు పంచుకోవటం కావచ్చు, ధనాన్ని పంచుకోవటం కావొచ్చు, జ్ఞానాన్ని పంచుకోవటం కావొచ్చు, ప్రేమని పంచుకోవటం కావొచ్చు. ఏ లక్షణాలు అయితే మన కుటుంబం చుట్టూ తిరుగుతూ వుంటాయో పై స్థాయి వాళ్ళకి మాత్రం ఈ లక్షణాలు వర్తించకుండా ఉంటాయి.
చాలామంది తమ కుటుంబమే కాకుండా, ఇరుగుపొరుగు వాళ్లే కాకుండా, సమాజము, గ్రామములోని ప్రజలతో పాటు కష్టాలు సుఖాలు పంచుకోవటం, సమాజ సేవ చెయ్యటం ఉంటుంది. అంటే వీరి చైతన్య స్థాయిలో ఆ గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇంకా కాస్తా పైస్థాయికి వెళితే ఆ జిల్లా మొత్తం ఉండవచ్చు, ఇంకా కాస్త పైస్థాయికి వెళితే భారత దేశం, ఇంకా మొత్తం ప్రపంచం ఇలా ఉండవచ్చు. దీనినే ఇంగ్లీష్ లో ‘Expansion of human consciousness’ అని అంటాము. మనం ముచ్చటగా తెలుగులో చెప్పుకోవాలి అంటే ‘మన మానవ చైతన్య వ్యాప్తి ’ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అయితే మనం మన చైతన్య స్థాయిని పెంచుకుంటామో అప్పడు ఈ ప్రపంచంలోని ప్రజలు అందరూ కూడా మన సొంత కుటుంబ సభ్యుల్లాగానే మనం భావిస్తాం. అలాగే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం కూడా దుఃఖపడతాం, వాళ్ళకోసం ప్రార్దిస్తాం. అలాగే వాళ్ళు సుఖంగా ఉంటే మనంకూడా చాలా సంతోషిస్తాం. ఇటువంటి స్థాయిలో ఉన్న ఒక మహా యోగిని గూర్చి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
వివేకానంద స్వామిగారి గురించి తెలియనివాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే వారి జీవితంలోని కొన్ని ఘట్టాలు చాలామందికి తెలియదు. అందులోని ఒక ప్రధాన ఘట్టాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వివేకానంద చాలా చిన్న వయస్సులోనే అనగా 39 ఏళ్ల వయస్సులోనే దేహత్యాగం చేశారు. ఆయన తన సహచరునితో ఒకసారి ఈవిధంగా చెప్పారు ‘నాకు ఈమధ్య ఈ భారత దేశం అంతా నాలోనే ఉంది, నేను అంతా నేను భారతదేశమంతటా నిండి వున్నాను అని అనిపిస్తున్నది. అది మెల్లమెల్లగా మొత్తం ప్రపంచం అంతా కూడా నాలోనే ఉన్నట్టు, నేను ప్రపంచమంతా ఉన్నట్టుగా, ప్రజలందరిలోనూ, ఇక్కడ భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, చెట్లు, కొండలూ, గుట్టలు, మనుషులు, నదులు, అన్నిటిలో నేనే వున్నాను అనే భావం నాలో చాలా తొందరగా వ్యాపిస్తుంది. ఈ సృష్టించబడిన అన్ని జీవులపై అపారమైన కరుణా ప్రేమా, పొంగి పొరలుతున్నాయి. కనుక నా ఈ దేహం ఈ విధంగా విస్తరిస్తున్నటువంటి చైతన్య స్థాయిని ఇముడ్చుకోలేక పోతున్నది. ఇది దేహం వదిలి విశ్వమంతా తొందరలో వ్యాపిస్తుంది. కనుక నేను ఇంక ఎంతోకాలం బ్రతకను. ఎందుకంటే ఈ దేహం నా చైతన్య స్థాయిని పూర్తిగా నింపుకోలేకపోతుంది. కాబట్టి నేను దేహత్యాగం చెయ్యక తప్పదు’ అని చెప్పారట. దీనిలో చాలా అర్ధం వుంది. దీనికి ముందు పైన అర్ధం కావటానికి నేను కొంచం వివరించి చెప్పాను. అంటే స్వామి వివేకానంద సాక్షాత్తుపరబ్రహ్మ జ్ఞానాన్ని పొందిన పరమాత్ముడు. అందుకే ఈ సృష్టిలో వున్న ప్రతి జీవిలో తనను తానే చూసుకోవటం, ఆ జీవి తనలోనే వున్నది అని తలుచుకోవడం దానికి తార్కాణం.
సాక్షాతూ శ్రీ దత్తుడి తత్వాన్ని అర్ధం చేసుకోవటమే కాకుండా దాన్ని సాక్షాత్తు అనుభవించినటువంటి ఒక మహా యోగి అని చెప్పక తప్పదు.
నండూరి శ్రీసాయిరాం