నవీన యుగ నిర్మాణ శక్తి -7
శ్రీ దత్తాత్రేయతత్వ కధలు
నిజమైన అవదూత తత్వ నిరూపణ.
సాక్షాత్తు దత్త స్వామిని మించిన రెండవ అవదూత లేనే లేడు.
ఈ మహా వాక్యం గురించి మనం పరిశీలన చేద్దాం. వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఎప్పుడో రాబోయే భవిష్యత్తు గురించిన కాలజ్ఞానం చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే ఈ కలియుగం గడుస్తున్న కొద్దీ వీదికొక్క స్వామి, ఊరినిండా దేశమంతా కూడా ఆషాడభూతిని కూడా మరిపించేటటువంటి దొంగ స్వాములు ఎంతో మంది వస్తారని,ఎంతో మంది అవదూతలు వస్తారని ప్రజలందరూ కూడా వారి వాక్చాతుర్యానికి వాళ్ళు చేసే చిన్న చిన్న మహిమలకి పడిపోయి భ్రష్టులు అవుతారని చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఎంతో మంది అవదూతలని చెప్పబడే వారిని చూస్తున్నాము. అలాగే చిన్నా పెద్ద గురువులు ఎక్కడబడితే అక్కడ తాము చేసే చిన్న చిన్న మహిమలతో మరియు వారి వాక్చాతుర్యంతో ఎంతో ప్రఖ్యాతి గాంచిన పండితులని కూడా బురిడీలు కొట్టిస్తున్నారు. దీనివల్ల మొత్తం మన హిందూ మతానికే ఎంతో అప్రతిష్ట వస్తుంది. పాశ్చాత్య దేశం లో ఉన్న అందరూ ముఖ్యంగా మన మహిళలు బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు పడుతున్నారు. ఎందుకంటే వారికి మన హిందూ మతం యొక్క ప్రాథమిక విజ్ఞానం అసలు లేనే లేదు. గురువులు గా చెప్పబడే ఈ స్వాములు, చిల్లర దేవుళ్ళు తమ భక్తులకు ఈ కనీస జ్ఞానాన్ని కలిగించే ప్రయత్నాలు ఏమి చేయడం లేదు. పురాణ ప్రవచనాలను చెప్పేవారు కూడా ఈ దిశగా కృషి చేయడం లేదు. ఎంతసేపు ఎప్పుడో పూర్వికులు చెప్పినటువంటి రామాయణ, మహాభారత, మహాభాగవత కథలే చెప్పుకుంటూ వెళ్తున్నారు తప్ప అసలు మన జీవిత లక్ష్యమేంటి ? మనకు ప్రామాణికముగా ఉన్న వేదాలు ఏం చెప్తున్నాయి, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అనే మౌలిక విజ్ఞానాన్ని అసలు అందించటం లేదు. కాబట్టే మన హిందూ మతం లో ఉన్నంత గందరగోళం క్రైస్తవ మతంలో గాని , ఇస్లాంలో గాని అసలు లేనే లేదు. దత్త భక్తులుగా చెప్పబడే ఎంతోమంది శాస్త్రాలు చదివిన పండితులు కూడా శ్రీ పాద శ్రీ వల్లభ భక్తులు గాని , మాణిక్య ప్రభు భక్తులు గాని, షిరిడి సాయి భక్తులు గాని, అక్కల కోట మహరాజ్ భక్తులు గాని, నృసింహా సరస్వతి స్వామి భక్తులు గాని అసలు దత్త తత్వాన్నే తెలుసుకోలేక పోతున్నారు. విచిత్రమేమిటంటే పామరులకున్నటువంటి భక్తి,శ్రద్ద మరియు విశ్వాసం అనేవి ఈ పండితులుగా చెప్పబడే వాళ్లకు అసలు లేవు. అందుకనే మనం దత్త పురాణం ,శ్రీపాద శ్రీ వల్లభ చరితం లో స్వామి స్వయంగా చెప్పిన అవదూత లక్షణాలను గురించి నిష్పక్షపాతంగా పరిశీలిద్దాం.
ఆ తరువాత దత్త భక్తులుగా చెప్పబడే మనమందరం కూడా విశ్లేషిచుకుందాం. ఇందులో ఎవరిని ఆక్షేపించే ఉద్దేశ్యం లేదు . కేవలం వాస్తవాలను ముందుకు పెట్టే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. శ్రీ పాద శ్రీ వల్లభ చరితం లో సుమతి మహారాణి గారు, అప్పలరాజు శర్మ గారు వారి పితృ శ్రాద్ధ కర్మ చేస్తున్నపుడు ఇంటి బయట ఒక అవదూత బిక్షాం దేహి అని రావటం మనం చదువుకున్నాం. అయితే భోక్తలు భుజించిన తర్వాత గాని వేరే వారికి లేక ఇంటివారు గాని భోజనం చేయకూడదు అనే నియమం ఉంది. అయినా కూడా ఆ సుమతి మహారాణి గారు ఇంటి ముందుకు వచ్చిన ఆ బిక్షగాడికి బిక్ష ఇచ్చింది. దానికి ఆ అవదూత సంతోషించి తల్లి ఏం వరం కావాలో కోరుకోమని చెప్పాడు. కుశాగ్ర బుద్ది అయిన సుమతి మహారాణి నన్ను తల్లిగా పిలిచావు కాబట్టి అది నువ్వు సార్థకం చేసుకో అని చెప్పింది. ఆమె సమయస్ఫూర్తికి దత్త స్వామి ఎంతో సంతోషించాడు. తల్లి అలాగే వరం ఇస్తున్నాను. అయితే నా వంటి అవదూత ఈ విశ్వం లో ఇంకొకడు లేడు కాబట్టి నేనేె నీకు పుత్రునిగా జన్మిస్తాను అని అభయం ఇచ్చాడు. దీనివల్ల మనకు ఏం తెలుస్తుంది. ఒకవేళ నిజంగా దత్తాత్రేయిని మించిన అవదూతలు నిజంగా ఉంటే మరి వాళ్లే సుమతి మహారాణి కడుపున జన్మించే అవకాశం ఉన్నది కదా. అలా వరం ఇచ్చాడు కాబట్టి తనను మించిన రెండో వ్యక్తి అవదూత అనేవాడు లేడు కాబట్టి ఆయన సాక్షాత్తు సుమతి మహారాణి కి శ్రీ పాద శ్రీ వల్లభుడుగా జన్మించాడు. ఇంతకన్నా మీకు ఇంకా ఏం నిరూపణ కావాలి. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం లో కూడా ఆయన ఎవరినైతే ఆశీర్వదించారో ఉదాహరణకు ఆయన వెంకయ్య అవదూతని ఆశీర్వదించి అవదూతగా నువ్వు జన్మించి భక్తుల కోరికలు తీరుస్తూ, వారి రోగాలు నయం చేస్తావని ఆజ్ఞాపించాడు కాబట్టి చాలా కొద్దిఅంశ మాత్రమే గ్రహించి వెంకయ్య అవదూతగా ప్రసిద్ది గాంచాడు. ఈ పుస్తకంలో ఇంకొక చోట ఎవరినైనా నాలో కలుపుకున్నప్పటికీ అవసరమైనప్పుడు తిరిగి జన్మించమని ఆజ్ఞాపిస్తే వాళ్ళు తప్పకుండా మరల జన్మకు రావాల్సిందే అని చెప్పాడు. తన అంశగా వచ్చిన వ్యక్తులలో తన మహాత్తుకు, మహిమలకు తానే కారణం అని ఏ మాత్రం అహంకారం, గర్వం కలిగినప్పుడు ఆ గర్వం అణచివేస్తానని కూడా స్వామి చెప్పాడు. అంతేకాకుండా దత్త పురాణంలో పింగళ నాగుడుకి సాక్షాత్తూ దత్తస్వామి ఏమి చెప్పాడు ? తాను ఒక చేత్తో సూర్యుణ్ణి ముట్టుకుంటానని,మరో చేత్తో అశుద్ధాన్ని ముట్టుకుంటానని చెప్పాడు. నాలాగే ఎవరైతే చేస్తారో వారికి ఒక పని చేయటం వల్ల పుణ్యం ఒక పని చేసినందువల్ల పాపం అంటదని అభయం ఇచ్చాడు. మరి ప్రస్తుతం ఉన్న అవదూతలు ఎలా ఉన్నారో మీరే ఆలోచించుకోండి.