దైవిక శక్తులు అసుర శక్తులు - 9
మర్నాడు నేను కళ్ళు తెరిచేసరికి నాకు చుట్టుప్రక్కలనుంచి పక్షుల అరుపులు వినిపించాయి. మెల్లగా నిద్ర లేచేసరికి నాకంతా అయోమయంగా ఉండాలి. అసలు నేనెక్కడ ఉన్నానో నాకే అర్థం కాలేదు. కళ్ళు నులుపుకొని చుట్టూ చూస్తే స్టేషన్ మాస్టర్ గారి గదిలో ఉన్నట్టుగా నాకర్థమయింది. గది అంతా శుభ్రంగా ఉంది. రాత్రి చూసిందంతా కలో నిజమో అర్థం కాలేదు. స్టేషన్ మాస్టర్ గారు “బాబూ ! వెంటనే ఇంటికి వెళ్ళిపో ! నీ తల్లిదండ్రులు కంగారు పడిపోతుంటారు. అనవసరంగా గొడవలొస్తాయి. మనం మళ్ళీ తర్వాతెప్పుడైనా కలుద్దాం” అని చెప్పి నన్ను గబగబా పంపించి వేశారు. నేను కూడా ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నమో, సాయంత్రమో ఆ స్టేషన్ మాస్టర్ గారిని కలుసుకోడానికి వెళ్లినప్పుడు ఆయన చాలా తీరిగ్గా కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో వచ్చి పోయే ట్రైన్స్ కూడా ఏవీ లేవు. నన్ను చూసి ఆయన “నాయనా ! ఇప్పుడు అర్థం అయింది కదా !” అని అన్నారు.
“మాస్టారు గారూ ! రాత్రి నేను చూసిందంతా నిజమేనా?” అని నేను ఆయన్ని అడిగాను.
“అవును ! నీవు చూసిందంతా నిజమే . తెల్లవారేసరికి నేను ఆ గదంతా తుడిచి పెట్టి శుభ్ర౦ చేశాను. అందుకే నీకేం తెలియలేదు” అని అన్నారు.