దైవిక శక్తులు అసుర శక్తులు - 9
మర్నాడు నేను కళ్ళు తెరిచేసరికి నాకు చుట్టుప్రక్కలనుంచి పక్షుల అరుపులు వినిపించాయి. మెల్లగా నిద్ర లేచేసరికి నాకంతా అయోమయంగా ఉండాలి. అసలు నేనెక్కడ ఉన్నానో నాకే అర్థం కాలేదు. కళ్ళు నులుపుకొని చుట్టూ చూస్తే స్టేషన్ మాస్టర్ గారి గదిలో ఉన్నట్టుగా నాకర్థమయింది. గది అంతా శుభ్రంగా ఉంది. రాత్రి చూసిందంతా కలో నిజమో అర్థం కాలేదు. స్టేషన్ మాస్టర్ గారు “బాబూ ! వెంటనే ఇంటికి వెళ్ళిపో ! నీ తల్లిదండ్రులు కంగారు పడిపోతుంటారు. అనవసరంగా గొడవలొస్తాయి. మనం మళ్ళీ తర్వాతెప్పుడైనా కలుద్దాం” అని చెప్పి నన్ను గబగబా పంపించి వేశారు. నేను కూడా ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నమో, సాయంత్రమో ఆ స్టేషన్ మాస్టర్ గారిని కలుసుకోడానికి వెళ్లినప్పుడు ఆయన చాలా తీరిగ్గా కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో వచ్చి పోయే ట్రైన్స్ కూడా ఏవీ లేవు. నన్ను చూసి ఆయన “నాయనా ! ఇప్పుడు అర్థం అయింది కదా !” అని అన్నారు.
“మాస్టారు గారూ ! రాత్రి నేను చూసిందంతా నిజమేనా?” అని నేను ఆయన్ని అడిగాను.
“అవును ! నీవు చూసిందంతా నిజమే . తెల్లవారేసరికి నేను ఆ గదంతా తుడిచి పెట్టి శుభ్ర౦ చేశాను. అందుకే నీకేం తెలియలేదు” అని అన్నారు.
“మాస్టర్ గారూ ! ఆ బేతాళుడికి మీరు ఆ రొట్టెలు వేస్తుంటే అవన్నీ అదృశ్యమై పోయాయి కదా !” అని అన్నాను. “అవును ఆ రొట్టేలన్నీ ఆ బేతాళుడు స్వీకరించాడు” అని చెప్పారు. “ మరి మీరు ఇన్ని రోజుల్నించి ఈ పూజలు చేస్తున్నారు. మరి మీకు ఏమైనా శక్తులు వచ్చాయా? మీరు అవన్నీ నా దగ్గర దాచుతున్నారా? మీరు ఏ ఏ అద్భుతాలు చేయగలరు ?”అని అడగ్గా
“బాబూ ! నేను కూడా నీలాగే భ్రమ పడి ఆ సాధువు వెంట పడ్డాను. ఆయన నాకు నయాన భయాన ఎంతో చెప్పి చూశాడు. నేను కూడా అనవసరంగా ఈ తాంత్రిక శక్తుల్లో ఇరుక్కున్నాను. దీనినుండి బయట పడడం చాలా కష్టంగా ఉంది. మళ్ళీ ఈ తాంత్రిక శక్తులన్నీ నీకు ఉపదేశిస్తే దానివల్ల నీకు ప్రయోజనమేమీ ఉండదు, నా మాట విను ” అని చెప్పాడు. నేను చాలా మొండిగా ఆయన్నీ నిర్బంధించి నేను ఈ విద్య నేర్చుకున్నాను. దీని వల్ల నాకు ఎటువంటి శక్తులు రాలేదు. నా జీతమంతా వీటి ఆహారం కోసమే సరిపోతుంది. ఎప్పుడైనా నేను వీటికి ఆహారం ఇవ్వకపోతే ఆ రోజు నన్ను వేధించుకు తింటాయి. ఇటువంటి చక్రంలో ఇరుక్కుపోయి ఉన్నాను. బయటకి రాలేను. ఎవ్వరితో కలవలేను. సాంఘికంగా నేను ఎంతో దూరం ఉండవలసి వస్తుంది. ఇంత ఘోరమైన బ్రతుకు బ్రతుకుతున్నాను, నాయనా ! కాబట్టి నీ మంచి కోసమే చెప్తున్నాను. నీవు ఇంక ఇటువైపు రావద్దు నన్ను కలవద్దు. ఈ సంగతి పూటిగా మర్చిపోయి నీ తల్లిదండ్రులు చెప్తున్నట్టుగా నడుచుకో” అని చెప్పాడు.
ఈ క్షుద్ర శక్తులు నేర్చుకుని ఏం లాభం ఉండదని నాకప్పుడు అర్థమయింది. తెలివి తెచ్చుకుని నేను వాటి జోలికి వెళ్ళడం మానేశాను. కాని చూచాయగా నేను చేస్తున్న ప్రయత్నాలు ఊళ్లోవాళ్ళు గమనించారు. నా తల్లిదండ్రులకి కూడా తెలిసిపోయింది. వారు “నాయనా ! నీకు కనుక నిజంగా ఈ తాంత్రిక శక్తులు, అవీ నేర్చుకోవాలని కనుక ఉంటే దానికి సరి అయిన గురువు మీ పెద్దనాన్నేఉన్నారు. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా నిజమైన భక్తిశ్రద్ధలతో కాళీ మాతను ఉపాసిస్తుంటారు. కావాలంటే నీవు అక్కడకి వెళ్లి ఆయన దగ్గర నేర్చుకో. మాకెటువంటి అభ్యంతరం లేదు. ఊరికే నీవు ఇటువంటి చిల్లర చిల్లర క్షుద్రశక్తుల్నినేర్చుకుని జీవితం పాడు చేసుకోవడం మాకిష్టం లేదు. ఆలోచించుకో” అని చెప్పారు. నేను మా పెద్ద నాన్నగారున్న ఊరికి వెళ్ళడం, నా తల్లిదండ్రుల ద్వారా ఆయన నా విషయాలన్నీ గ్రహించి , నా ముఖ కవళికలు అన్నీ గమనించి నా తల్లిదండ్రులతో, “మీరు మీ కుమారున్ని కనక నాకు దత్తతగా ఇస్తే నేను అతనికి అన్నీ విద్యాబుద్ధులు నేర్పిస్తాను. సమాజానికి మంచి చేసే విధంగా అతని జీవితాన్నే నేను మార్చి వేస్తాను” అని చెప్పారు. నా తల్లిదండ్రులు అంగీకారం తెలపడంతో నేను మా పెద్ద నాన్నగారి దగ్గర్నుంచి ఈ కాళీ మాత ఉపాసన నేర్చుకున్నాను. దీనివల్ల ఇప్పటికే చాలా వందలమందిని క్షుద్ర బాధలనుంచి, క్షుద్ర శక్తుల బారినుంచి రక్షించడం జరిగింది. నేను మాత్రం సుఖంగానే ఉన్నాను. చూస్తున్నావు కదా !” అని అన్నారు. ఇంకా మోహన్ కి వచ్చిన చిన్న చిన్న ప్రశ్నలకి, సందేహాలను ఆయన తీర్చారు. మనస్సంతా నిష్కల్మషంగా, నిర్మలంగా పెట్టుకుని, సాత్విక ఆలోచనలతో, సాత్విక ఆహారంతో ఎప్పుడైతే మనుష్యులు జీవితం గడుపుతారో, పరోపకార బుద్ధులతో ప్రవర్తిస్తారో అప్పుడు వాళ్ళలో దైవిక శక్తి అభివృద్ధి చెందుతుంది. వారిమీద ఎటువంటి దుష్ట ప్రయోగాలు చేసినా కూడా వారిలో ఉన్నటువంటి ఆ దివ్యమైన ప్రకాశానికి ఈ చీకటి శక్తులు దూరంగానే ఉండి నశించిపోతాయి. కాని అటువంటి మహాత్ములు, మహానుభావులు ఒకప్పుడు చాలా మంది ఉండేవారు కాని ఇప్పుడు లేరు. అందరు డబ్బుల కోసమే ఈ చిల్లర చిల్లర శక్తులని సంపాదించి ప్రజలదగ్గర్నుంచి డబ్బులు లాక్కుంటారు తప్ప నిజమైన శక్తులు వాళ్ళ దగ్గర ఉండవు.”అని చెప్పారు.
అంతా విని మోహన్ ఆయనకి నమస్కరించి పాదాభివందనం చేసి, స్వామి వారు అతనికిచ్చిన మంత్రబద్ధమైన ఎనిమిది పొట్లాలు తీసుకుని అక్కడనుంచి బయల్దేరి, వాళ్ళ ఇంటికి చేరి ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా, రహస్యంగా ఇంట్లో ఎనిమిది దిక్కుల్లో ఆయన ఇచ్చిన పొట్లాలని దాచి పెట్టాడు. అటు అమ్మకి తెలిసినా, నాన్నగారికి తెలిసినా మోహన్ ని కోప్పడతారని ఆ విషయాన్ని అతను దాచిపెట్టాడు. అయితే అద్భుతంగా డాక్టర్ రంగారావు గారు మాత్రం రెండు వారాల్లో పూర్తిగా తేరుకున్నారు. ఎప్పుడైతే ఆ రాజా సాహెబ్ గారు ఆ తాంత్రిక పదార్థాలన్నీ బయటకి తీసివేశారో అదే సమయంలో డాక్టర్ రంగారావు గారు ఆయన భార్య లలితతో “ఇన్నాళ్ళకి నాకు గుండెల్లో కత్తులు తీసివేసినట్టుగా, హాయిగా ఉందని చెప్పారని” వినగానే మోహన్ కి చాలా సంతోషం వేసింది. తండ్రి పడుతున్న బాధనుంచి విముక్తి పొందారని సంతోష పడ్డాడు. డాక్టర్ రంగారావుగారికి జబ్బు పూర్తిగా తగ్గి పోయింది. సరిగ్గా మూడు వారాలకి పూర్తిగా కోలుకుని ఆయన తన క్లినిక్ కి వెళ్ళడం ప్రారంభించారు. క్రమక్రమంగా మోహన్ వాళ్ళ ఇంట్లోని పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. అయితే మోహన్ కి తన తల్లిపట్ల భక్తి శ్రద్ధలెంతో పెరిగాయి. తన తల్లి మూలంగానే తన తండ్రి ప్రాణాపాయ స్థితినుండి బయట పడ్డారని దానికి ఆ దైవిక శక్తులే ప్రేరణని ఇచ్చాయని అతను గాఢ౦గా విశ్వసించాడు. మళ్ళీ ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు. కొన్ని సార్లు సమాధానాలు సంతృప్తికరంగా లేక మరి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. నిత్య పూజలు, మంత్రాలు, జపాలు చేస్తున్నప్పుడు క్షుద్రశక్తుల్ని వారించే పరిస్థితిలో ఉండాలి కదా ! అయినా ఎందుకిలా జరుగుతున్నాయి? అనే ప్రశ్నలకి సమాధానం కొంతవరకు తెలిసినా మోహన్ కి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కాని ఒకటి మాత్రం తెలుసుకున్నాడు. చుట్టు ప్రక్కల ఉండే సాధువులు, సన్యాసులు, చిన్న చిన్న మంత్రగాళ్ళు వీళ్ళందరూ కూడా స్వంత చింతన తప్ప సంఘం మీద కాని దేవుడిమీద కాని ఏమాత్రం భక్తిశ్రద్ధలు ఉండవు. ప్రజల దగ్గర్నుంచి డబ్బులు లాక్కోవడం తప్ప వారికి ఏ ఆలోచన ఉండదు అని అతను తెలుసుకున్నాడు. ఆపైన జరిగిన దాదాపు ఐదేళ్ళ తర్వాత మోహన్ తన తల్లికి జరిగిందంతా పూస గుచ్చినట్టుగా వివరించాడు. లలితమ్మ గారు చాలా సంతోషించారు. ఆవిడకి కూడా ఒక విశ్వాసం ఏర్పడిపోయింది. తాను చేస్తున్న పూజలు కాని, పునస్కారాలు కాని వృధా కాలేదని గ్రహించాక ఆవిడ చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత డాక్టర్ రంగారావుగారికి పదేళ్ళ తర్వాత కాని మోహన్ ధైర్యంగా తానూ చేసిన పనిని వివరించి చెప్పలేదు. తర్వాత ఆయన కూడా ఈ విషయాన్ని నమ్మక తప్పలేదు. కాబట్టి మనం చేస్తున్న జపాలు గాని, మంత్రాలు గాని, పూజలు గాని బాహ్యపరంగా కాకుండా అంతర్ముఖంగా ఉంటే ఫలితాలు తొందరగా వస్తాయి. దానితోపాటు సాత్వికమైనటువంటి ఆహారం, సాత్వికమైనటువంటి ఆలోచనలు, సాత్వికమైన పనులు చేస్తూ ఉంటే దానికి దైవిక శక్తి ఎంతో తోడ్పడుతుందని మోహన్ గ్రహించాడు. శ్రీ రాజా ఆంజనేయ ప్రసాద్ గారు ఆ తర్వాత ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అప్పట్లో మంత్రులందరూ కూడా నాదెండ్ల భాస్కర్ రావు గారు, ఎన్. టి. రామారావు గారు, ఇంకా చాలా మంది మంత్రులు ఆయాన్ని కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాతా చాలా ఏళ్ళకి ఒక సారి మోహన్ ఆయన్ని కలుద్దామని అక్కడికి వెళ్ళగా శాలిబండలో వారింటి రూపురేఖలన్నీ మారిపోయాయి. అక్కడే మౌంట్ సెట్టింగ్ సెంటర్ ప్రక్కన సందు అదంతా పూర్తిగా మారిపోయింది. పాతబడినట్టుగా ఉండే మౌంట్ సెంటర్ ఒక పెద్ద క్లినిక్ సెంటర్ గా మారిపోయింది. అక్కడ వాకబు చేయగా రాజా ఆంజనేయులు గారు స్వర్గస్తులైనారని, వారబ్బాయి ఇటువంటి విద్యలేవీ నేర్చుకోలేదని, అక్కడ ఉన్న వారి స్వంత ఇల్లు కూడా అమ్మేసి మల్లిపల్లివైపు వెళ్లిపోయారని తెలుసుకున్నాడు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటనయే. కాని పేర్లు మాత్రం మార్చడం జరిగింది.