విశ్వ కుండలినీ జాగరణ అంటే మొత్తం విశ్వంలోని మానవుల యొక్క సామూహిక చైతన్యం సమతుల్యంగా ఉండటం. ఈ విశ్వంలోని ప్రకృతిలోని చరాచర ప్రాణులన్నీ కూడా తన స్వంత కుటుంబ సభ్యులుగా భావించే అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోవడం. ఒక సంకుచిత దృక్పథం నుంచి లేదా మానవ చైతన్యం నుంచి ఒక విశాలమైన దృక్పథంలోకి మానవ చైతన్యం విస్తరించడం. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే నేను నా కుటుంబం అనే సంకుచిత చైతన్యం నుంచి ఈ విశ్వంలోని, ఈ సృష్టిలోని చరాచర ప్రాణులన్నింటిని కూడా తన కుటుంబంలాగా భావించే విశ్వమానవ చైతన్య స్థాయిని పొందిన వసుదైక కుటుంబం అంటే ఆది మానవుడు దైవ మానవుడుగా మారడం.ఈ సృష్టి పట్ల ఎంతో గౌరవం, ప్రేమని చూపించే తత్త్వం వసుదైక కుటుంబం.
ప్రకృతి పురుషుడు, అనఘ అనఘుడు, లేదా స్త్రీ పురుషులు అంటే శివ పార్వతులు లేదా లింగపరంగా కాక శక్తి పరంగా కూడా ఆలోచించాలి. ఈ రెండు స్థాయిలు సమతుల్యంగా ఉండటం ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే సూర్య నాడి, చంద్ర నాడి వీటినే ఇడా, పింగళ అని కూడా అంటారు. ఈ రెండు శక్తులు ఒక వ్యక్తిలో సమస్థాయికి చేరుకున్నప్పుడు మూలాధారం నుంచి ఊర్ధ్వ ముఖంగా ప్రయాణించి మూల, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి , ఆజ్ఞ చివరగా సహస్రార చక్రాలను చేరి ఈ రెండు శక్తులు భూతత్వం నుంచి క్రమంగా జల, వాయు, ఆకాశ తత్వానికి వ్యాపించటం అన్నమాట. ఇలా జరగాలంటే మనుషుల యొక్క జఠరాగ్ని శాంతింపచేయవలసి ఉంటుంది. ఈ మణిపూరక చక్రం మనుషుల యొక్క చైతన్య స్థాయి అంటే వారి ఆలోచనలు, భావోద్రేకాలు అన్నీ కూడా ఇక్కడే నిక్షేపించబడి ఉంటాయి. మానవుని యొక్క కుండలినీ జాగరణ జరిగినప్పుడు మణిపూరక చక్రంలో ఉండే జఠరాగ్ని అమితంగా ప్రజ్వలిస్తుంది. ఒక మనిషికి దీని పర్యవసానం ఏమిటంటే అతనికి విపరీతమైన ఆకలి వేస్తుంది, ఆకలి వేసిన మానవుడు తన మానసిక సంయమనాన్ని కోల్పోతాడు. విచక్షణా జ్ఞానం నశిస్తుంది. అతడు చేసే ఆలోచనారహితమైన పనులకి సమాజానికి బాధాకర పరిణామాలు కలుగుతాయి. కడుపునిండా తిన్నవాడి మనస్సు స్థిమితంగా, ప్రశాంతంగా ఉంటుంది. శాంతచిత్తుడై ఉంటాడు కాబట్టి సమాజానికి శ్రేయస్సునే చేస్తాడు. అతడు కానీ ఆమెలో కానీ స్త్రీ పురుష ప్రకృతులు సమస్థాయిలో ఉంటాయి. మానవుల జఠరాగ్నిని చల్లార్చడానికి అన్నదానం నిత్యం జరగవలసిందే. మనం తినే ఆహారంలోని సుక్ష్మాతిసుక్ష్మమైన దైవికమైన ప్రాణశక్తి ఈ జఠరాగ్నిని చల్లార్చి భౌతికంగా,ఆధ్యాత్మికంగా, మానసికం గా శాంతిని చేకూరుస్తుంది. మానవుల యొక్క సామూహిక జఠరాగ్ని మరియు విశ్వంలోని అదృశ్యంగా ఉండే జఠరాగ్నికి సంబంధం ఉంది. ఎప్పుడైతే విశ్వ మానవ చైతన్యం సమస్థాయికి చేరుకుంటుందో ఇది కుండలినీ జాగరణకి దోహదమవుతుంది. ఒక పుణ్య ప్రదేశమైన పంచదేవ్ పహాడ్, కురువపుర ప్రాంతంలో సాక్షాత్తు శ్రీ దత్తుని అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభులు పదునాలుగేండ్లు ఇక్కడ తపస్సు చేసి నిత్యం పంచభూత యజ్ఞాలు, అన్నదానాలు, పితృ హోమాలు, గోపూజ, అనఘాష్టమి వ్రతాలు ఇవన్నీ నిర్వహిస్తూ తద్వారా ఆయన చుట్టుప్రక్కల గ్రామాలే కాక విశ్వ వ్యాప్తంగా జఠరాగ్నిని నియంత్రిస్తూ విశ్వ కుండలినీ జాగరణకి బీజాలు వేశారు. అదే ప్రక్రియని కేవలం ఈ యొక్క దివ్య క్షేత్రంలో మాత్రమే గత 9 సంవత్సరాలుగా పంచదేవ్ పహాడ్ ప్రాంతంలో జరుగుతున్నది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ప్రేరణ వల్లనే విశ్వ కుండలినీ జాగరణ కొరకు అన్నదాన కార్యక్రమాన్ని ఒక మహా యజ్ఞంగా భావించి నిర్వహిస్తున్నారు. పై కార్యక్రమాల వల్ల ఆకాశంలో సుక్ష్మాతిసుక్ష్మ భూమికలలో విశ్వ కుండలినీ జాగరణ జరుగుతున్నది. అది క్రమక్రమంగా విశ్వమంతా వ్యాపిస్తున్నది. సుక్ష్మ భూమిక నుండి స్థూల భూమికకు రావడానికి అంటే పృధ్విపై స్వర్గావతరణ జరగడానికి కొంత సమయం పడుతుంది. ఇటువంటి విశేషమైన కార్యక్రమంలో మీరూ భాగస్థులు కావడానికి ఇది చాలా గొప్ప అవకాశం. విశ్వమానవ శ్రేయస్సు కోసం ముందుకు రండి. మనమంతా కలసి స్వర్గాన్ని భూమికి తెద్దాం. మన భావితరాలకు ఉత్తమమైన భవిష్యత్తును అందిద్దాం. సర్వేజనా సుఖినోభవంతు...