అతీంద్రియ శక్తులు
Chapter -6
ముందు చెప్పిన పాల్ బ్రంటన్ (Paul Brunton) కథ లాంటిదే జరిగిన ఒక సంఘటన “ఒక యోగి ఆత్మ కథ” (An autobiography of a yogi) పరమహంస యోగానంద గారు వ్రాసిన పుస్తకంలో ఉంది. పరమ హంస యోగానంద గారి గురువుగారైన శ్రీ యుక్తేశ్వరగిరి స్వామి గారు ఆయనకి కలిగిన అనుభవాన్ని శ్రీ పరమహంస యోగానంద గారికి చెప్పారు.
ఒకప్పుడు ఎండాకాలం అనుకుంటాను ఒక వృద్ధ సాధువు బెంగాల్ లో ఒక గ్రామంలో వెళ్ళుతూ ఉండగా ఆయనకి చాలా దప్పిక కలిగింది. ప్రక్కనే ఒక బావి కనిపిస్తే అక్కడకి వెళ్ళాడు. అక్కడే ఒక చిన్న కుర్రాడు కనిపిస్తే ఆ పిల్లవాడిని కాసిని మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు, “మహాత్మా ! నేను ముస్లింని మీరేమో హిందువు, నేను నీళ్ళు తోడితే మీరు త్రాగలేరు కదా ! త్రాగకూడదు కదా” అని చెప్పాడు. ఆ పిల్లవాడు తెచ్చిన నీళ్ళు త్రాగి, ఆ పిల్లవాని నిజాయితీని ఆయన ఎంతో మెచ్చుకుని అతనికి ఒక మంత్రం ఉపదేశించాడు. “నాయనా ! నీ నిజాయితీని మెచ్చుకుని నేను నీకీమంత్రం ఉపదేశిస్తున్నాను. దీనిమూలంగా నీకు కొన్ని శక్తులు వస్తాయి. వాటిని మాత్రం ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే నీవు చేయాలి. వేరువిధంగా చేయకూడదు అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయాడు.