మన జీవితాలని చక్కగా సరిదిద్ది మనలో ఉత్తమమైన సంస్కార
బీజాలని నాటి, మొత్తం విశ్వ సమాజం కోసమే మనమంతా అద్భుతంగా పనిచేయడానికి
విశ్వశాంతికి మంచి పనులు చేసే వ్యక్తుల్లాగ తీర్చిదిద్ది,మనలో వున్న
అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానమనే దీపాన్ని వెలిగించడానికి మనందరికి కూడా
తల్లితండ్రుల తరువాత ఒక మంచి మార్గ దర్శకుడైన గురువుయొక్క అవసరం ఎంతైనా
ఉంది.గురువులు చాలా రకాలుగా ఉంటారు,బోధక గురువులు,బాధక గురువులు,నిషిద్ధ గురువులు,పరమ
గురువులు.మనకి చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసి లౌకిక మైన విద్య నేర్పించే అక్షర
బ్రహ్మ రూపంలో వుండే
గురువు బోధక గురువు.దీనికి సరిగ్గా వ్యతిరేకంగా ఉండే గురువులు బాధక గురువులు.మనకు
మంచిని బోధిస్తున్నానన్న ఊహతో అనవసరమైన బోధ చేసి బాధపెట్టే గురువులు బాధక
గురువులు.వీరిని చూస్తూనే మనం భయంతో దూరంగా పారిపోతాం.ఇంకొకరకం నిషిద్ధ గురువులు,మనం ఏదైతే
చేయకూడదో, ఏదైతే ధర్మవిరుద్ధమో దాన్నే ఆచరిస్తూ మనల్ని కూడా ఆ వైపుకు నడవమని
ప్రోత్సహిస్తూ ఉంటారు.ఉదాహరణకి వారేమి సత్సంగాలూ చెయ్యరు.ఏ సద్బోధలూ
చెయ్యరు.
తమ చుట్టూ శిష్య గణాన్ని చేరదీసి,ఒకరులేనప్పుడు ఇంకొకరి మీద చాడీలు చెప్తూ
ఉంటారు.చాలా చాకచక్యంగా ధనాన్ని,బహుమానాలను సంగ్రహిస్తూ ఉంటారు. ఇంకొక్క అడుగుముందుకు వేసి ఇంకా కొందరు
వారిదగ్గరకు వచ్చే యుక్తవయసులో వున్న ఆడపిల్లల్ని,మానసికంగా బలహీనులైన అబలల్ని కూడా లోబర్చుకుంటారు.ప్రస్తుతం ఈ కపట
గురువులనే ఈ కలియుగంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఒకే ఒక గురువుని మనం ప్రశ్నించ
లేము,ప్రశ్నించ కూడదు,వారే బోధక
గురువులు.ఎవరైతే మనతో అక్షరాలు
దిద్దించి చదువు
నేర్పిస్తారో వారిని మనం ప్రశ్నించలేము,ప్రశ్నించకూడదు.మిగతా వారిని మనం క్షుణ్ణంగా
ప్రశ్నించాలి,పరిశీలించాలి,పరీక్షించాలి.అందులో
ఏమీ తప్పులేదు,ఏమి దోషమూ
లేదు.ఇదే త్రిపుర రహస్యంలో
స్వయంగా దత్త స్వామి పరశురాముడికి చెప్పిన వాక్యాలు.గురువుని కాకపోతే మనం మన సంశయాలని ఎవర్ని
అడుగుతాం ? వారు
కాకపోతే మన సందేహాలని ఎవరు నివృత్తి చేస్తారు ? కాబట్టి మనం గురువుని ధైర్యంగా అదే సమయంలో
వినయంగా ప్రశ్నించవచ్చు .
అందరికన్నా శ్రేష్టమైన గురువులు పరమగురువులు . వాళ్ళు తమ నిజజీవితంలో
నిర్మలంగా, నిష్కల్మషంగా వినయంగా ఉంటూ సమాజానికి పనికొచ్చే ఎన్నో
పనులుచేస్తూ తమ ప్రత్యక్ష
జీవన విధానం ద్వారానే శిష్యుల్ని మంచి మార్గంలో నడిచేలా ప్రభావితం చేస్తారు.
అలాంటి పరమ గురువులనే మనం ఆశ్రయించాలి.
అటువంటి పరమ గురువుల
గురించే ఈరోజు మనం తెలసుకుందాం.ఇది ఒక యదార్ధ గాధ.ఆది గురువుగా చెప్పబడే
శంకరాచార్యులవారి జీవితంలో జరిగినటువంటి అధ్బుతమైన గాధ.ప్రతి గురువు గారి వద్ద కూడా రకరకాల
శిష్యులు ఉంటారు . మంచివారితో పాటు మిశ్రమ లక్షణాలు కలిగిన వారు,ధూర్తులు యిలా అన్ని రకాలూ
ఉంటారు.గురువుగారు చేసే ప్రతి పనిలోనూ వారు తమకు నచ్చిన అంశాలని మాత్రమే
గ్రహించి గురువుగారు చేశారు కదా మనం కూడా అనుకరిద్దాం అనే ధోరణిలో పడి వాళ్ళు భ్రష్టులవుతూ
ఉంటారు.అటువంటి కథే ఇది .
ఒకసారి ఆదిశంకరాచార్యులవారు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు.అది
వైశాఖ మాసం,ఎర్రటి ఎండలు
ప్రయాణిస్తున్న మార్గంలో చెట్లనేవి లేవు కాబట్టి నీడ కూడా ఎక్కడా లేదు.కాళ్ళు
కాలిపోతున్నాయి,ఒళ్ళంతా వేడెక్కిపోతోంది ,దాహంగా వుంది,ఆకలి వేస్తోంది . వారికి ఏమి చెయ్యాలో దిక్కు
తోచటంలేదు.శిష్యుల అవస్థని గమనించిన ఆది శంకరాచార్యులవారు అక్కడ వున్న ఒక
గ్రామస్థుడిని పలకరించారు . ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయా మా
అందరికీ దాహంగా వుంది,దయచేసి నీళ్ళు దొరికే తావు గురించి చెప్పమని
అడుగగా ఆ గ్రామస్థుడు చేతులు జోడించి నమస్కరించి చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్ళు
దొరకడం కష్టం,వున్న చిన్న
తటాకాలన్నీ ఎండిపోయాయి.ఇక్కడ దాహం తీరడానికి తాటికల్లు తప్ప వేరే మార్గం లేదు
స్వామి అని చెప్పాడు.దానికి సమాధానంగా శంకరాచార్యులవారు ఫరవాలేదు,మా శిష్యులందరికీ
చాలా దాహంగా ఉంది ,అలసటగా ఉంది కనుక దయచేసి ఆ తాటికల్లు మాకు ఇప్పించండి
అన్నారు.శిష్యులందరూ కూడా సంభ్రమాచార్యాలకి లోనయ్యారు. ఇదేమిటి మన
గురువుగారు దాహం తీర్చుకోడానికి తాటికల్లు అడుగుతున్నారు అని కొందరు శిష్యులు
ఆశ్చర్య పోయారు,మంచి అవకాశం దొరికిందని కొందరు ఆనంద పడ్డారు.ఆ
గ్రామస్థుడు వారందరి దాహం తీరడానికి తాటికల్లు ఇచ్చాడు. ఐతే గురువుగారు కేవలం
ఒక గుక్కెడు తో సరిపుచ్చు కోగా శిష్యులందరూ కుండలు కుండలు ఖాళీ చేసి మంచి
మత్తు లో పడిపోయారు, ఇదంతా గమనించిన శంకరాచార్యులవారు చూస్తూ
ఊరుకున్నారు.కాసేపటికి వారంతా సేదతీరి నడుచుకుంటూ చీకటిపడే వేళకు దగ్గరలో వున్న
గ్రామం చేరుకున్నారు.శంకరాచార్యులవారు సన్యాస ధర్మంగా భిక్షాటన చేస్తూ కాలం
గడిపేవారు,ఎక్కడా
స్థిరనివాసం ఉండేవారు కాదు.ఆయన కంసాలి ఇంటికి భిక్షాటనం కోసం వెళ్ళటం
తటస్తించింది.అక్కడ ఆ కంసాలి వేడివేడి కొలిమిలో సీసాన్ని కరిగించి ఏదో ఆభరణాన్ని
చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కాబోలు పరిసరాలన్నీ వేడిగా వున్నాయి,బైట చూస్తే ఎండగా
ఉంది,తాపాన్ని
భరించలేక పోతున్నాడు అందులో ఉదయం నుంచి కొలిమి ముందు కూర్చున్నాడేమో ఒళ్ళంతా
అలిసిపోయి ఉంది,మనసంతా చికాకుగా ఉంది,అలాంటి సమయంలో
ఆదిశంకరాచార్యులవారు “భిక్షాందేహి” అనగానే అతనిలో ఉన్న కోపం
పెల్లుబికింది.పనిపాటా లేని మీరు ఇక్కడ ఇంత కష్ట పడుతున్న నన్ను భిక్ష కోసం
విసిగిస్తున్నారు,నేను పనిలో వున్నది మీరు గమనించ లేదు ,ఇప్పుడు మీకు
భిక్షగా ఇవ్వడానికి ఈ కరిగిన సీసం వుంది దాన్ని స్వీకరిస్తారా అని వెటకారంగా
అడిగాడు.దానికి స్వామివారు శాంతంగా సరే అదే ఇప్పించండి అన్నారు.ఆ స్వర్ణకారుడు
కొద్దిగా తలబిరుసువాడు,మొండివాడు.సరే ఈ స్వామి సంగతి తేల్చేద్దాం అని కరిగిన
సీసాన్ని తీసుకువచ్చాడు.శంకరాచార్యులవారు దోసిలి పట్టుకుని అలాగే నిలబడ్డారు,శిష్యులంతా
బిత్తరపోయి అలాగే చూస్తూ నిలబడి పోయారు.మన గురువుగారు ఈ వేడి వేడి సీసాన్ని
స్వీకరించ బోతున్నారా,ఈ కంసాలి కూడా నిజంగా తీసుకువస్తున్నాడు ఏం
జరగబోతోంది అని నోటమాట రాక చూస్తూ నిలబడి వుండగానే ఆ కంసాలి ఆ వేడి సీసాన్ని
దోసిట్లో పొయ్యడం దాన్ని శంకరాచార్యులవారు స్వీకరించడం జరిగిపోయాయ. తర్వాత స్వామి
“నాయనా ! నేను గురువుగార్ని ,నాకు శిష్యులు వున్నారు వారుకూడా ఆకలితో దాహంతో ఉన్నారు.వాళ్ళ
దాహాన్ని తీర్చవలసింది” అని పక్కకి జరిగిపోయారు.ఆ కంసాలి కూడా శిష్యులకి సీసం
పొయ్యడానికి సిద్ధంగా వున్నాడు,అతనికి కూడా లోపల ఆశ్చర్యంగా వుంది,స్వామి వారి
మొహంలో ఎక్కడా బాధపడినట్టు ఆనమాలు లేదు,ఎంతో సంతోషంగా తాగారు,వారి శిష్యులు కూడా అంత గొప్పవాళ్ళు కాబోలు
అనుకున్నాడు.ఆ శిష్యులందరికీ తలతిరిగి పోయింది.తమ గురువుగారి యొక్క శక్తిని వారు
తెలుసుకోలేక పోయారు.వారిలో పశ్చాత్తాపం పెల్లుబికి అందరూ వారి కాళ్ళ మీదపడి ప్రభూ!
మమ్మల్ని క్షమించండి.మేము అజ్ఞానుల౦,మూర్ఖుల౦.మీ శక్తి తెలియక తప్పుగా
ప్రవర్తించాము.మీరు కల్లు తాగుతున్నారని మేము కూడా అవకాశం దొరికిందని దాహానికి,అవసరానికి మించి
కుండలు ఖాళీ చేసాం.కాని మీలాంటి మహాత్ములకి సుఖ దుఃఖాలు,శీతోష్ణాలు
సమానమేనని,మీరు వీటన్నిటికి
అతీతులని దాహం తీరడానికి కల్లు అయినా,వేడి సీసం అయినా మీకొకటేనని ఇప్పుడే గ్రహించాము,మమ్మల్ని
క్షమించ౦డి” అని ప్రార్ధించారు.గురువుగారు
నేర్పిన పాఠంతో మళ్లీ సన్మార్గులయారు.ఇది మిగతా గురువులకి పరమ గురువులకి ఉన్న
తేడా.శంకరాచార్యుల వారు కూడా వారందరిని మనసులో ఏవిధమైన క్రోధ భావం లేకుండా
మన్నించారు.ఇటువంటి పరమగురువుల అంతఃకరణం పవిత్రంగా వుంటుంది కాబట్టి వారు
ప్రకృతితో మమేకం అయిపోతారు.సృష్టిలోని ఏవిషయం అయినా వాళ్ళకి అనుగుణం గానే నడుచుకుంటుంది.