నేను ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఇంక ఆ స్టేషన్ మాస్టర్ గారిని పదేపదే ప్రాధేయ పడడం తోటి ఆయన “సరే ! నీకు మరి అంత సరదాగా ఉంటే నేనేమీ చెయ్యలేను కానీ నీకు రేపెమైనా ప్రాణాపాయం వస్తే మళ్లీ నీ తల్లితండ్రులు అందరూ నా వెంట బడతారు. బాబూ ! నువ్వు చిన్నపిల్లవాడివి ఆఖరిసారిగా చెపుతున్నాను ఈ ప్రయత్నం మానుకో” అనగా
“ఏం పర్వాలేదు ! నేనంత పిరికివాణ్ణి కాదని” ఆయన్నినమ్మించాను .
“సరే ! వచ్చే అమావాస్య నాడు నేను ప్రత్యేకమైన పూజలు చేస్తాను. నేను విధి లేక ఒప్పుకుంటున్నాను, రా !” అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు.
ఆయన చెప్పిన అమావాస్య ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తుండగా ఆ అమావాస్య రానే వచ్చింది. నేను ఎంతో ధైర్యంగా రాత్రి పది గంటలకి స్టేషన్ మాస్టర్ గారి క్వార్టర్స్ కి చేరుకున్నాను. చేతిలో ఒక టార్చ్ లైట్ తప్ప ఇంక ఏమీ లేదు. చిమ్మ చీకటిగా ఉంది. స్టేషన్ మాస్టర్ గారింట్లో ఒక లాంతరు మాత్రమే ఉంది. ఆయన అప్పటికే ఎన్నో రొట్టెలు సిద్ధంగా ఉంచుకున్నారు. మరమరాలు కూడా సిద్ధం చేసుకున్నారు. నేల మీద విచిత్రమైన రాక్షసుడిలాంటి బొమ్మగీసి ఉండగా అది చూసి నేను “మాస్టారు గారూ ! ఏమిటిది? ఏ బొమ్మ ?” అని ప్రశ్నించాను.
“ఇది భేతాళుడు. నేను నేర్చుకున్న విద్యలన్నీఈ బేతాళుని క్షుద్ర విద్యలే. నేను నీకు మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటికైనా సమయం మించి పోలేదు. నేను కూడా నీలాగే ఒకతని వెంటపడి నేర్చుకున్నాను. దీనివల్ల నా జీవితమంతా వ్యర్ధమై పోయింది. పెళ్లి పెటాకులు లేకుండా, ఎటువంటి శక్తులు రాకుండా నేను ఇక్కడే ఆగిపోయాను. ఇప్పటికైనా నీవు వెళ్ళిపో !” అని ప్రాధేయ పడగా నేను ఏమాత్రం ఒప్పుకోలేదు. సరే ! అని ఆయన మంత్రాలు చదువుతూ కూర్చున్నారు.
నేను నేల మీద ఉన్న ఆ పెద్ద బొమ్మని చూస్తూ ఉండి పోయాను. చుట్టు ప్రక్కల జన సంచారం లేదు. ఆ బొమ్మ ముగ్గుతో చేసి ఉంది. భయంకరమైన ఆకృతి. పె.....ద్ద నాలుక బయటకి తెరిచి ఉంది. కోరలు ఉన్నాయి. కళ్ళు పె...ద్ద...గా ఉన్నాయి. ఆయన భక్తిగా కూర్చుని ఉన్నారు. సమయం గడుస్తూ ఉంది. పదకొండు...... పదకొండున్నర .....ప ..ద..కొం..డు ...నలభై... ఇలా సమయం గడుస్తున్న కొద్ది నాలో ఒకలాంటి భయం మొదలయింది. పన్నెండు గంటలవుతుండగా నాలో నాకే తెలియనటువంటి భయం వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది . ఏదో జరగబోతుంది, ఏదో నాకు తెలియని శక్తి అక్కడికి వచ్చినట్టుగా నాకు అనిపించింది. మధ్య రాత్రి అవుతుండగా స్టేషన్ మాస్టర్ గారు గబగబా దీపపు వత్తిని పెంచారు. సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి ఆ బేతాళుడి బొమ్మలో మార్పు వచ్చి సజీవ రూపం ధరించాడు. నాలుక పె..ద్ద....గా చాచి ఉన్నాడు. ఆ స్టేషన్ మాస్టర్ గారు మంత్రాలు ఆపకుండా చదువుతూ ఆ రొట్టెలు ఒకటొకటిగా ఆ బేతాళుని మీద వేస్తుంటే అవి బేతాలుని నోటిలో పడి వెంటనే మాయమైపోతూ ఉన్నాయి.అవన్నీ అయిపోయాక ఆయన ఆ మరమరాలన్నీ కూడా సమర్పించారు. దాని తర్వాత సంతలో కొనుక్కొచ్చిన కోడిని కూడా ఆ బేతాళునికి అర్పిస్తుండగా ఏం... జరిగిందో ..... తెలియదు కాని నేను చాలా భయపడి గజగజా వణికిపోయాను. ఒక్క క్షణం నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను రా దేవుడా !” అని భయపడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మాత్రం స్పృహ తప్పి పడిపోయాను.
(.... contd.....)