మన నిత్య జీవితంలో టీవీ ప్రోగ్రాములు ,రేడియో ప్రోగ్రాములు మరియు బయట బహిరంగ సభలలో, ఇంట్లో చిన్న చిన్నసమావేశాలన్నింటిలో మనం పాల్గొంటూ వుంటాం . కొందరు మాట్లాడితే చాలా అద్భుతంగా వుండి ఇంకా వినాలి వినాలి అనిపిస్తే మరికొందరు మాట్లాడుతుంటే ఎప్పుడు వెళ్ళిపోదామా ఇంత పేలవంగా ఉందేమిటి వీరు మాట్లాడే విధానం అని అనుకుంటూ వుంటాం . మనం నలుగుర్నీ ఆకట్టుకునేలా మాట్లాడాలంటే,మనం మాట్లాడేది వినాలని అందరూ కుతూహల పడాలంటే మనం సంభాషించే విధానం లో కొన్ని చెడు అలవాట్లను మానుకుని మంచి అలవాట్లని పెంపొందించు కోవాలి . ముందుగా మానుకోవాల్సిన చెడు అలవాట్లు ఏంటంటే “చాడీలు చెప్పటం”. ఇది చాలా ఎక్కువ మందికి వున్న చెడ్డలవాటు . మూడవవ్యక్తి లేనప్పుడు వాళ్ల మీద చాడీలు చెప్పడం దుష్ప్రచారాలు చెయ్యడం చాలామంది చేస్తూ వుంటారు . ఇది ఎప్పుడైతే అలవాటుగా మారిపోతుందో క్రమేపీ ఆ వ్యక్తి అంటే దగ్గర వున్న వాళ్ళుకూడా భయపడతారు ,ఎందుకంటె ఆ వ్యక్తి ఎలాగైతే ఎదుటివారు లేనప్పుడు వాళ్ళ మీద చాడీలు చెప్తున్నాడో తాము లేనప్పుడు తమగురించి కూడా చాడీలు చెప్పే అవకాశం ఉంటుంది కనుక ,మొదట్లో కొంత ఆసక్తితో అతని మాటలు విన్నా రాను రాను అతడ్ని దూరం పెడతారు . కాబట్టి జీవితం లో మొదట మానుకోవలసిన లక్షణం ఏమిటంటే ఎదుట లేని వ్యక్తుల మీద చాడీలు చెప్పడం . మంచి వక్తలందరూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు ఎదుట లేని వాళ్ళ గురించి చాడీలు చెప్పడం అనేది ఉండదు . ఒకవేళ మూడో వ్యక్తి గురించి మాట్లాడాల్సి వస్తే వారి గురించి మంచి తప్ప మరొక విషయం మాట్లాడనే మాట్లాడరు.ఇక రెండో విషయానికి
వస్తే చాలా మందికి వ్యక్తిత్వ నిర్ధారణ చేసే అలవాటు ఉంటుంది ,మూడో వ్యక్తి లేనప్పుడే ఏదో ఒక విషయం పట్టుకుని అతను సంజాయిషీ ఇవ్వడానికి లేనప్పుడు ఆ విషయం ఆధారంగా ఇతను ఇలాగ ,అతను అలాగ అని తమ దృష్టి కోణంలోనే చూసి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్దారించి తీర్పు ఇస్తూ ఉంటారు. దీనివల్ల అక్కడ వున్నవాళ్ళు తాము లేనప్పుడు తమ వ్యక్తిత్వాన్ని ఇలాగే నిర్ధారిస్తాడేమో అనే భయం ఉంటుంది . కాబట్టి ఇటువంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు అక్కడినించి మెల్లిగా తప్పుకోవడం మొదలుపెడతారు . మనం ప్రకృతికి ఏదైతే ఇస్తామో అదే మనకి మళ్లీ తిరిగి వస్తుంది . ఎదుటివారిని గురించి చెడుగా మాట్లాడితే , వారిని తప్పుగా అంచనా వేసి తీర్పులిస్తే తిరిగి మనమూ అదే నిందల్ని భరించాల్సి వుంటుంది .మూడవ లక్షణం అతిశయోక్తులు . మనకి ఇష్టమైన ,నచ్చిన వ్యక్తులగురించి ఎదుటి వారికి చెప్పినప్పుడు వారికి వున్న దానికన్నా ఎక్కువ మంచి లక్షణాల్ని ఆపాదించి వారి గురించి గొప్పగా చెప్తూ వుంటాం . ముఖ్యంగా మనం ఎవరినైనా ఆధ్యాత్మిక గురువులుగా భావించినప్పుడు వారికి లేని గొప్పతనాన్ని ,మహిమల్ని మనమే కల్పించి చెప్తూ వుంటాం . అలాగే మనం చూసివచ్చిన ఏదైనా ప్రదేశాన్ని వర్ణించవలసి వచ్చినప్పుడు , తెలిసిన ఏదైనా విషయం వివరించ వలసి వచ్చినప్పుడు అతిశయోక్తులు చెప్పడం చాలా మామూలై పోయింది ఈ సమాజంలో . ఇటివంటి వ్యక్తులు మాట్లాడే మాటలలో నిజాయితీ లేదని తెల్సినప్పుడు వారి మాటలని తేలికగా తీసుకుంటాం ,అటువంటి వారి ప్రసంగాలకి,మాటలకి ఎటువంటి విలువని ఇవ్వం . పైగా వారి వెనక జనం నవ్వుకుంటూ ఉంటారు . కొంతమంది వక్తలు మాట్లాడే మాటల్లోవారికే విశ్వాసం లేనట్టుగా గొంతు కూడా పేలవంగా ఉంటుంది .ప్రసంగం మధ్యలో చాలా మార్లు దగ్గడం ,తల గోక్కోవడం మరియు విచిత్రమైన శరీర కదలికలు వారి ఆత్మవిశ్వాస లోపాన్ని చూపిస్తాయి . మనం మాట్లాడే ప్రతి విషయంలో ధాటిగా ,సూటిగా ఆ విషయం మీద మనకున్న పట్టుని,నమ్మకాన్ని వ్యక్తం చేసేలా మన స్వరాన్ని మార్చుకుంటూ (వాయిస్ మోడ్యులేషన్ ) మన హావ భావాలు చాలా సున్నితంగా వుండేటట్టు చూసుకుంటూ మనం మాట్లాడితే ,మన మాటల్లో వుండే ఆత్మవిశ్వాసం అనే శక్తి వినేవాళ్ళనందరిని కదిలించి వేస్తుంది . అందరూ ఎంతో ఆసక్తిగా వింటూ వుంటారు . మన శరీర కదలికల్లో ,చెప్పే స్వరంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉండాలి . విషయ పరిజ్ఞానం ,అవగాహన కూడా మనం మాట్లడేవిధానంలో తేడాని చూపిస్తాయి . మనం ఏ విషయం గురించయితే మాట్లాడబోతున్నామో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలిసుండాలి . విషయ పరిజ్ఞానం వున్నప్పుడు మనం మాట్లాడే మాటల్లో ఆత్మవిశ్వాసం ,శక్తి తొణికిసలాడతాయి . అది లేనప్పుడు మనం మన ప్రస౦గం మధ్యలో తడబాటుకి గురవుతాము . వినేవాళ్ళ దృష్టి లో చులకనవుతాము .
సెన్స్ ఆఫ్ హ్యుమర్ -చమత్కారంగా మాట్లాడటం
నలుగురి ముందు మాట్లాడేటప్పుడు మనం మరీ బిగుసుకు పోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువ సేపు మాట్లాడుతున్నప్పుడు శ్రోతల్లో తప్పకుండా అనాసక్తి కలుగుతుంది. వాళ్ళు కొంచెం అటు ఇటు కదలటం,లేచి నిలబడటం ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు ప్రసంగం వినటం కష్టంగా వుందని ఒక సంకేతాన్ని మీకు సంకేతాన్ని పంపుతున్నారు . అటువంటప్పుడు మీరు ప్రసంగాన్ని ఒకే విధంగా కొనసాగించకుండా ఆ సందర్భానుసారంగా చమత్కారం తో కూడిన చిన్న కథలు చెప్పటం ,హాస్యం పుట్టించే విధంగా ఏదైనా మాట్లాడటం చేస్తే ప్రజల్లో తప్పకుండా మళ్లీ వినాలనే ఆసక్తి తప్పకుండా కలుగుతుంది . అదేపనిగా ప్రసంగం పాఠం లా కాకుండా మధ్య మధ్య లో చిన్న చిన్న కథల రూపంలో చెబితే అది వినేవాళ్ళని ఆకట్టుకుంటుంది . ప్రపంచంలో మంచి వక్తలుగా ప్రఖ్యాతి గాంచిన వారందరికీ ఈ అలవాటు ఉంది . వారు చాలా అద్భుతమైన విషయాలు , గొప్ప గొప్ప సంగతులు చిన్న చిన్న కథల రూపంలో చమత్కారంగా చెప్తూ సభికుల్ని ఆకట్టుకుంటూ వుంటారు . ఈవిధంగా మాట్లాడటం మనం కూడా అభ్యాసం చేస్తే మన చిన్న చిన్న లోపాల్ని కనపడకుండా చేసి ,ప్రేక్షకులలో ఆసక్తిని పెంచి వారిని ఆకట్టుకోగలుగుతా౦ . చిన్న చిన్న విషయాలే మన జీవితాల్లో పెద్ద పెద్ద మార్పుల్ని తెస్తూవుంటాయి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు . దీనికి వారియొక్క జీవితాలే మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు .ఏదైనా ప్రసగించే ముందు అందులో ముఖ్యమైన పాయింట్లని కాయితం మీద రాసుకుని రెండు రోజులముందే హావభావాలని పరిశీలించుకుంటూ సాధన చెయ్యాలి . ప్రసంగం మధ్యలో ఏదైనా మర్చిపోతే ఆ కాగితం చూసి మీరు అనుకున్న క్రమంలో మాట్లాడేటట్టు చూసుకోవాలి . వినేవారి హావభావాలు పరిశీలించుకుంటూ మాట్లాడే విషయం సాగతీస్తున్నట్టు అనిపిస్తే కుదించుకుంటూ సందర్బానుసారంగా మార్పులు చేసుకోవాలి .మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ ఉండేలా చూసుకోవాలి . సందర్భోచితమైన వేషధారణ కూడా ముఖ్యమైనదే . అలాగే కలం కాగితం అందుబాటులో ఉంచుకోవాలి . మాట్లాడే ముందు కొంత ప్రాణాయామం చేసుకోవడం ,నిర్ణీత సమయానికన్నా ముందే స్టేజి పైన వుండి పరిసరాలకి అలవాటవడం ,ఒకవేళ ప్రసగం మొదలుపెట్టాకా గాభరాగా అనిపిస్తే స్టేజి మీద అటు ఇటు నడుస్తూ దాన్ని కప్పిపుచ్చు కోవచ్చు. తర్వాత స్థిరంగా నిలబడి మాట్లాడవచ్చు . తొందరలేకుండా మెల్లగా మాట్లాడటం వల్ల మీ ఆలోచనాలు సాఫీ గా వస్తాయి .