ఉపనిషత్తులు-9
ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం
ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం
మాయ లేక ప్రకృతి ఎక్కడ ఉంది? లోగడ మనం మాయ లేక ప్రకృతి ఏకదేశమై ఉందని చెప్పుకున్నాం. అంటే ఎక్కడ బ్రహ్మము ఉందో అక్కడే మాయ ఉందని దాని అర్థం. అయితే బ్రహ్మము అనంతమని మనము దాదాపు ఇరవై లక్షణాలు చెప్పుకున్నాం. అనంతమైనటువంటి ఈ బ్రహ్మములో మాయ కూడా బ్రహ్మము మొత్తం ఆవరించుకుని ఉందా? ఒకవేళ ఈ మాయ పూర్తిగా బ్రహ్మముని ఆవరించుకుని ఉంటే ఈ సృష్టిలో మోక్షానికి అర్హత పొందినవాళ్ళు పరబ్రహ్మములో కలుస్తారని మనం చెప్పుకున్నాం కదా ! అలాంటప్పుడు ఒకవేళ ఈ మాయ అన్నది అనంతమైన బ్రహ్మముని ఆవరించుకుని ఉంటే మోక్షానికి అర్హత పొందినవాళ్ళు పరబ్రహ్మములో ఎక్కడ కలుస్తారనే ప్రశ్న మనకి కలుగుతుంది. దీనికి శృతి ప్రమాణంగా ఉపనిషత్తులు మరియూ భగవద్గీత పంచదర్శక శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ మాయ లేక ప్రకృతి అన్నది అనంతమైన పరబ్రహ్మము మొత్తంలో లేదు కొంత భాగంలోనే ఉన్నదని చెప్తున్నాయి. ఎంత భాగంలో ఉన్నాయి అన్న ప్రశ్నకు మనం బ్రహ్మమునే నాలుగు భాగాలుగా విభజించుకుంటే దానిలో ఈ మాయ లేక ప్రకృతి, ఈ సమస్త విశ్వం, నక్షత్రాలు, రోదసీమండలము, 14 భువనాలు ఇవన్నీ కూడా కేవలం ఒకే ఒక భాగంలోనే అవి ఉన్నాయని చెప్తున్నాయి వేదాంత పంచ దశ కూడా అదే చెప్తుంది.
బ్రహ్మము అవిభాజ్యం అని చెప్పుకున్నాం కదా అది ఇప్పుడు నాలుగు ముక్కలు చేశామేమిటీ? మరి తక్కువ స్థాయిలో ఉన్న మానవులకి అర్థం అయ్యేలా చెప్పాలంటే ఈ విధంగానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి బ్రహ్మము అవిభాజ్యం, నిర్వికారము, నిర్గుణము, ఇలా ఎన్నో లక్షణాలు చెప్పుకున్నాం. కాకపోతే మనందరకీ అర్థం కావాలంటే ఈవిధంగానే చెప్తే కాని అర్థం కాదు కాబట్టి మన అర్థం కోసం ఈ అనంత బ్రహ్మముని నాలుగు భాగాలుగా విభజించుకున్నాం. దానికి ఒక పెద్ద మహాసముద్రం ఉందనుకోండి. దాన్ని ఒక దేశంలో ఒక పేరుతొ ఇంకొక దేశంలో ఇంకొక పేరుతొ పిలుస్తాం కదా ! కాని నిజానికి ఆ మహాసముద్రం అంతా కూడా ఒకటే ఒక భాగం కదా ! అలాగే ఇక్కడ మన అవగాహన కోసం దాన్నినాలుగు భాగాలుగా విభజించాల్సి వచ్చింది. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు స్వయంగా అర్జునుడితోటి ఇదే చెప్పాడు.
“అర్జునా ! నేనంటే ఏమనుకుంటున్నావు ? ఎవరనుకుంటున్నావు? నేను నీకు ఈ పరబ్రహ్మములో కొంత భాగంలోనే కనిపిస్తున్నాను. మిగతా భాగం అంతా నేను ఇంద్రియగోచరం కాను. అంటే నా తత్వం ఇంద్రియగోచరం అని చెప్పటం జరిగింది. అంటే అనంతమైనటువంటి ఈ పరబ్రహ్మములో మూడువంతులు మాయ అన్నది లేనే లేదు. అక్కడ ఉన్నది పరబ్రహ్మ చైతన్యం. కేవలం కొంత భాగంలో మాత్రమే ఈ మాయ లేక ప్రకృతి ఆవరించుకుని ఉన్నది. నీవు చూస్తున్నటువంటి నా ఈ విరాట స్వరూపం కేవలం కొద్ది భాగం లోనే నీకు గోచరమవుతుంది, అర్జునా ! అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది.
ఏ విధంగా అయితే కుండల్ని తయారు చేయాలంటే కేవలం మట్టి మెత్తగా ఉన్న ప్రదేశంలో నుంచే ఆ మట్టిని తీసి కుమ్మరివాడు మట్టిని తీసి కుండల్ని చేయగలుగుతాడు. దానికి భిన్నంగా ఉన్న ఇసక ఉన్నప్రాంతం నుంచి కుండల్ని తయారు చేయడం అసాధ్యం కదా ! అదేవిధంగా ఈ మాయ లేక ప్రకృతికి ఆధారంగా ఉండాలంటే ఈ అనంత పరబ్రహ్మములో కేవలం కొంత మేర మాత్రమే ఆ సృష్టి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కేవలం అక్కడ మాత్రమే మాయ లేక ప్రకృతియొక్క సృష్టించే శక్తి ఉంటుంది. మిగతాదంతా కూడా అనంతమైన పరబ్రహ్మ చైతన్యమే. ఈ మాయ లేక ప్రకృతి పూర్తిగా లయమయినప్పుడు అది నిరాకారరూపంలో ఉంటుంది. అక్కడే ఈ సమస్త ప్రాణుల యొక్క, జీవుల యొక్క కర్మఫలాలు, వాసనలు అన్నీ కూడా అదే ప్రదేశంలో ఆ మాయలో నిండి ఉంటాయి.
మాయ యొక్క మరియొక లక్షణాన్ని పరిశీలిద్దాం. ఈ మాయ త్రిగుణాలతో కలిసి ఉంటుంది. అంటే మాయ త్రిగుణాత్మకంగా ఉంటుంది. ఈ మూడు గుణాలు ఏమిటీ? సత్వగుణం, రజో గుణం, తమో గుణం. మన అవగాహన కోసం ఎక్కడైతే మాయ ఉన్నదని మనం చెప్పుకున్నామో ఆ మాయని మనం మూడు భాగాలుగా చేస్తే ఒక భాగంలో రజో గుణం, ఒక భాగంలో సత్వగుణం , ఇంకొక భాగంలో తమోగుణం ఉంది అని అనుకుందాం. కాని నిజానికి అవి ఈవిధంగా విభజింపబడి లేవు. కేవలం మన అవగాహన కోసం మాత్రమే ఇలా మనం ఊహించుకుంటున్నాం. ఈ అనంత పరబ్రహ్మములో కొంత మేరకు మాత్రమే మాయ ఉందని మనం చెప్పుకున్నాం. అయితే ఈమాయ సృష్టి గా మారక మునుపు బ్రహ్మము యొక్క చైతన్యం కేవలం సత్వగుణం లోనే ప్రవేశిస్తుంది. అక్కడే ఉంటుంది. అప్పటికి ఇంకా సృష్టి అనేది జరగలేదు. దీన్నే మాయ అని పిలుస్తా౦. ఇక్కడ జాగ్రత్తగా చదవండి. ఈ అనంతబ్రహ్మములో కొంత మేర వరకే మాయ ఉందని చెప్పుకున్నాం. ఈ మాయ అనే పదాన్ని ఎప్పుడు చెప్పుకుంటామంటే బ్రహ్మము యొక్క చైతన్యం కేవలం మాయ లోనే సత్వగుణం లో ఉన్నప్పుడు, ఇంకా సృష్టి జరగక మునుపు దాన్ని మాయ అని పెర్కొనబడుతుంది. ఎప్పుడైతే బ్రహ్మము యొక్క చైతన్యం సత్వగుణం లోనే కాకుండా రజోగుణం లో,తమోగుణం లో వ్యాపిస్తుందో అప్పుడు దీన్నే అవిద్య అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. బ్రహ్మచైతన్యం కేవలం మాయలోనే సత్వగుణం లో ప్రవేశించినప్పుడు, సృష్టి ఇంకా జరగక మునుపు దాన్ని మాయగా పేర్కొన్నాం. ఎప్పుడైతే బ్రహ్మము యొక్క చైతన్యం రజో,తమోగుణం లో ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే సృష్టి జరగడం మొదలుపెట్టిందో అప్పుడు దాన్ని అవిద్యగా చెప్పుకున్నాం. అంటే మాయ రెండు రకాలుగా ఉంటుంది. దాని మూల ప్రకృతిని మనం మాయ అని పిలుస్తాం. ఎప్పుడైతే ఈ మూలప్రకృతి లో బ్రహ్మచైతన్యం రజోగుణం,తమోగుణంలో వ్యాప్తి చెందుతుందో దాన్ని అవిద్య అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఇక్కడ మాయ రెండు రకాలన్నమాట. ఒకటి మూలప్రకృతి కి సంబంధించినటువంటి మాయ, రెండవది అవిద్య. అంటే సృష్టి ఏర్పడనప్పుడు, ప్రకృతి ఏర్పడనప్పుడు ఈ బ్రహ్మచైతన్యం కేవలం మాయ లోని సత్వగుణం లో మాత్రమే వ్యాపించి ఉంది. మిగతా రెండు గుణాలు రజో గుణం, తమోగుణం ఇంకా నిద్రాణ స్థితిలో ఉంటాయి. ఇంకా వాటిలో చైతన్యం వ్యాప్తి చెందలేదు. అయితే ఈ పరిస్థితి సృష్టి జరగకమునుపు స్థితి అన్నమాట.
.......... to be continued…..)