నవీన యుగ నిర్మాణ శక్తి -3
శ్రీ దత్తాత్రేయతత్వ కధలు
మమకారమే దుఃఖ హేతువు మరియు ఆత్మ జ్ఞానానికి నిరోధకం.
లోగడ మనం శ్రీ దత్తాత్రేయస్వామి వారికి సంబంధించిన రెండు కథలు, ఆయన తత్వము, అవధూత తత్వము, ఆయన ఇచ్చిన సందేశం విన్నాము. ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ పరిశీలిద్దాం. దీనిని నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఇది సాక్షాత్తు రామకృష్ణ పరమహంస గారికి సంబందించిన జీవిత గాధ. శ్రీ రామకృష్ణుడు పరమ కాళీ భక్తుడు. ఆయన ఎప్పుడు తలచుకుంటే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షము అయ్యి ఆనందం కలిగిస్తూ ఉండేది. అమ్మవారు ప్రత్యక్షము అయినప్పుడు కూడా ఆయన ఎంతో తన్మయత్వములో నృత్యం చేస్తూ పారవశ్యం తో మునిగి పోయేవాడు. దేహ భ్రాంతిని పూర్తిగా విస్మరించేవాడు.
ఇలా ఉంటుండగా, తాతపురి అనే మహా యోగి శ్రీ రామకృష్ణుని దర్శించి ‘అరే ఏంటి ఈయన కాళికా మాత మమకారములో చిక్కిపోయాడేయ్ ఆత్మ జ్ఞానానికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడేంటి అబ్బా!’ అని ఆలోచించాడు. ఆయన ఒక మహా యోగి. అందుకని శ్రీ రామకృష్ణుని దర్శించి ఆయనతో “నాయనా రామకృష్ణ! నువ్వు అన్నీ తెలిసిన వాడివి. ఆత్మజ్ఞానికి అడ్డంగా ఉన్న మమకారం అనే బంధాన్ని ఈ కాళికా మాతతో పెట్టుకున్నావు. నువ్వు ఈ మమకారం అనే బంధంతో నువ్వు పైకి వెళ్ళలేవు. పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవటమే కదా నీలాంటి వాళ్ళ లక్ష్యం. అలాంటప్పుడు నువ్వు ఈ మమకారం అనే బంధం తెంచుకోవాలి అంటే ఒకటే ఒక ఉపాయం చెప్తాను. ఈసారి అమ్మవారి దర్శనం అయినప్పుడు నువ్వు ఒక అద్దంతో ఆమెను ఖండ ఖండాలుగా నరికివేయి. అప్పుడుగాని ఈ మమకారం అనే బంధం తెగదు. అది తెగితే గాని పై పై మార్గంలో వెళ్లి పరబ్రహ్మ మార్గాన్ని తెలుసుకోలేవు” అని చెప్పారు. రామకృష్ణ గారికి కూడా ఈ విషయం తెలుసు కాబట్టి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు.
ఈసారి కాళికా మాత ప్రత్యక్షము కాగానే అన్నీ మర్చిపోయి ఎంతో తన్మయత్వంతో ఆయన నృత్యం చేయ్యసాగాడు. ఇది గమనించిన ఆ మహా యోగి తాతపూరి మరల ఒక సారి చెప్పారు. ఈవిధంగా మూడు సార్లు జరిగాక నాల్గవ సారి గట్టిగా చెప్పారు. ఈసారి కాళికా మాత రాగానే ముందు ఒడలు మర్చి నృత్యము చేయబోయిన రామకృష్ణకు తాతపురి చెప్పిన వాక్యాలు గుర్తుకువచ్చాయి. ఆయన ఒక అద్దంతో కాళికా మాతను ముక్కలు ముక్కలు చేసివేసాడు. అప్పుడు గానీ ఆయనకు ఈ మమకారము అనే బంధం తెగలేదు. అప్పుడు మహా యోగి తాతపురి వచ్చి ఎంతో సంతోషించాడు. “ఇంకా నాయనా నీకు పరబ్రహ్మ స్వరూపము లేక ఆత్మ జ్ఞానము తప్పకుండా సిద్ధిస్తుంది సాధన చేస్తూ ఉండు” అని దీవించి వెళ్లిపోయారు. అప్పుడే రామకృష్ణ పరమ హంసగా మారారు. ఇక్కడ అద్దంతో నరికి వేయటం అంటే భౌతికంగా నరికి వెయ్యటం కాదు. అంటే మానసికంగా ఆ మమకారాన్ని ముక్కలు ముక్కలు చెయ్యటం అన మాట. దీని తర్వాతనే రామకృష పరమహంసగా మారి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. దీన్ని బట్టి తెలుసుకునేదేంటి అంటే మహానుబావులు, మహా యోగులు అంతా ఒకటే. ఈ మమకారము అనేది ఉన్నంత కాలం ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళటం చాలా కష్టం.
అయితే ఇక్కడ ఒక ప్రశ్న మన అందరికీ వస్తుంది. సాక్షాత్తు కాళికా మాతనే ఆయన పట్టుకున్నారు కదా మరి ఆవిడ మోక్షాన్ని ఇవ్వలేదా? ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వలేదా? అనే ప్రశ్నలు మనకి వస్తాయి. అయితే దీనికి సమాధానం కూడా మహాయోగుల జీవిత చరిత్రలలోనే దొరుకుతుంది. నిజాంగా కాళికా మాత గాని, ఏ దేవత కానీ మోక్షం ఇవ్వగల వారు అయితే మరి తాతాపురి ఎందుకు చెప్పవలిసి వచ్చింది అంటే - దీని రహస్యం మనకి త్రిపురా రహస్యంలో దత్తస్వామి వారు సాక్షాతూ పరుశురామునితో చెప్తారు, అది మళ్ళా మనం ఇంకోక సందర్భంలో పరిశీలిద్దాము. కాబట్టి మనం ఏ దేవతనో పట్టుకొని మనం అక్కడ ఆగి పోవటం కాదు. ఆ దేవతా సాధన వల్ల మనకి ఎంతో కొంత కొన్ని మహిమలో లేక కొంత పుణ్యమో వస్తుంది. కానీ ఆత్మ జ్ఞానము లేక పరబ్రహ్మ స్వరూపం మనకి తెలియదు. ఎవరి సాధన వాళ్లదే. అయితే ఈ సాధన మనం నిరంతరం చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో ఎన్నో శక్తులు వస్తూ ఉంటాయి, ఎంతో మంది దేవతలు దర్శనం ఇస్తూ ఉంటారు, అక్కడితో మనం ఆగకూడదు. మనం ఇంకా ఇంకా పైకి వెళ్తూ ఉండాలి. ఊర్ధ్వ ముఖంగా ప్రయాణం చెయ్యటమే యోగి యొక్క సాధన. అలాచేసి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటమే మన లక్ష్యం.
నండూరి శ్రీసాయిరాం.