నవీన యుగ నిర్మాణ శక్తి -3
శ్రీ దత్తాత్రేయతత్వ కధలు
మమకార౦ ఆత్మ సాధనకు ఆటంక౦
శ్రీ దత్తాత్రేయుడు చాలా అద్భుతంగా అలర్కుడు అనే మహారాజుకి తన తత్వాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు. వారిద్దరికీ జరిగిన సంభాషణ అలర్కగీత గా చాలా ప్రసిద్దికెక్కినది. దాన్ని మనం చాలా క్లుప్తంగా చెప్పుకుందాం.
పూర్వము కువలయాసుడు అనే చక్రవర్తికి మదాలస అనే జ్ఞానమూర్తి అయిన భార్య ఉండేది. వీరిద్దరికి శత్రుమర్దనుడు, సుబాహువు, విక్రాంతుడు అని వరుసగా ముగ్గురు కుమారులు కలిగారు. వారిని చిన్నతనంలోనే జ్ఞానమూర్తి అయిన మదాలస తన స్తన్యాన్ని ఇస్తూ తత్వాన్ని ఉపదేశించింది. ఆ తత్వాన్ని గ్రహించిన ఆ శిశువులు చాలా చిన్న వయస్సులోనే గోచీ కట్టుకుని తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్లిపోయారు. నాల్గవ కుమారుడు అయిన అలర్కునికి కూడా తత్వబోధన చేస్తున్నపుడు కువలయాసుడు ఆమెను వారించాడు. అలర్కుడు యవన దశకు వచ్చాక అతనికి వివాహాన్ని చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా వానప్రస్థానానికి బయలుదేరారు. తల్లి అయిన మదాలస తన కుమారునికి చాలా నీతి బోధలు చేసింది. “నాయనా ! చక్రవర్తి పదవి అంటేనే అహంకార౦తో నిండినటువంటి పదవి. చుట్టూ చేరిన ఆశ్రితులు ఆ అహంకారాన్ని పెంచుతూ తమ పబ్బాన్ని గడుపుకుంటూ వుంటారు. వారంతా శ్రేయోభిలాషులుగా నటిస్తుంటూవుంటారు కానీ వాళ్లకి వాళ్ళ స్వార్ధ చింతనలు ఎన్నో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వుండు.ఇదిగో నీకు నేను ఒక తాయత్తు ఇస్తున్నాను. దీనిలో ఒక సందేశ౦ ఉంది. నీకు ఎప్పుడైనా ఉపద్రవ౦వచ్చినప్పుడు, దిక్కు తోచని పరిస్థితి కలిగినప్పుడు అప్పుడు మాత్రమే దీనిని చదివి దాని ప్రకారంగా నడుచుకో !” అని చెప్పి భర్తతో పాటు తాను వానప్రస్థానము గడపటానికి వెళ్ళిపోయింది.
అలర్కుడు చాలా దుఃఖించాడు. తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకుని కొన్ని రోజులు బాధపడ్డాడు. కానీ ఐశ్వర్యాలతో, కీర్తిప్రతిష్ఠలతో, చుట్టూ చేరిన వంది-మాగధల స్తోత్ర పఠనములతో అలర్కుడు అనతి కాలంలోనే ఇవన్నీ కూడా మర్చిపోయాడు. భోగ లాలసుడై జీవించసాగాడు. కొన్నాళ్లకి అతని సోదరుడు అయిన సుబాహువు తమ్ముణ్ణి చూడటానికి వచ్చి, తమ్ముడి పరిస్థితి చూసి చాలా బాధ పడ్డాడు. ఆతను వెంటనే కాశీ రాజు దగ్గరికి వెళ్లి “మహారాజా ! నేను చాలా చిక్కుల్లో వున్నాను, ప్రాణ భీతితో వున్నాను, మీరు నాకు అభయం ఇవ్వాలి” అని తొందరపెట్టగా కాశీ మహారాజు ఎంతో దయాగుణం వున్నవాడు కాబట్టి ముందుగా అభయం ఇచ్చాడు, తరువాత నింపాదిగా సుబాహువు “అలర్కుడు నా తమ్ముడు. నా రాజ్యాన్ని చేజిక్కించుకుని తను పరిపాలిస్తున్నాడు. ఎలాగయినా నా రాజ్యాన్ని నాకు ఇప్పించండి” అని ప్రార్ధించాడు. మొదట కాశీ రాజు కించిత్తు ఆశ్చర్యపడ్డాడు. మీరు మీ సోదరుడిని అడిగితే రాజ్యాన్ని ఇస్తాడు కదా అంటే, దానికి సుబాహువు “మీకు మా సోదరిని గురించి తెలియదు, వాడు నన్ను సంహరించినా సంహరించవచ్చు, కాబట్టి ఎలాగయినా మీరు ఆ రాజ్యాన్ని ఇప్పించాలి” అని ప్రాధేయపడ్డాడు.
కాశీ మహారాజుకి, అలర్కునికి అంతక మునుపే కొంత వైరం వున్నది. తన వాగ్ధానాన్ని నెరవేర్చుకోవటానికి అతడు అలర్కునికి రాజ్య౦ మీదకి దండెత్తి వెళ్ళాడు. అప్పటికే అలర్కునికి అక్కడ అరణ్య వాసులతో యుద్ధం నడుస్తుండటం వల్ల అతడు ఆనతి కాలంలోనే యుద్ధంలో ఓడిపోయాడు. అయితే కోట తలుపులు అన్నీ వేసి అప్పుడు తన తల్లిని గుర్తు తెచ్చుకున్నాడు. తల్లి చేసిన నీతి బోధలు అప్పుడు గుర్తుకు వచ్చాయి. చాలా పశ్చాత్తాపం కలిగింది. అప్పుడు తల్లి ఇచ్చిన తాయత్తు తెరిచి, తల్లి సందేశ౦ అనుసారంగా రహస్య సొరంగ మార్గ౦ ద్వారా సహ్యాద్రి పర్వతాల్లో గల దత్త మహాప్రభువు దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అయితే సాక్షాత్తు జ్ఞాన మాత అయిన మదాలస పుత్రుడు కాబట్టి దత్తాత్రేయులవారు ఏమీ పరీక్షలు పెట్టలేదు. అలర్కుడు ఎంతో దుఃఖంతో “ప్రభూ ! నా రాజ్యాన్ని అంతా కోల్పోయాను. నేను చాలా బాధలో వున్నాను. మీరే నన్ను కాపాడాలి. శత్రు రాజులు నా రాజ్యాన్ని పొంచుకొని వున్నారు. నేను పారిపోయి మీ దగ్గరకు వచ్చాను. మీ శరణం కోసం వచ్చాను స్వామీ” అని విలపించాడు. దానికి చిరునవ్వు నవ్వుతూ దత్త స్వామీ “అలర్కా! నీవు కూడా ఎంతో వివేకవంతుడివి. నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు. నీకు దుఃఖం వచ్చింది అన్నావు కదా ఒక్కసారి ఆలోచించుకో, సమ్యవిచారణ చేసుకో” అని ఎంతో అనుగ్రహంతో అతన్ని తేరిపారా చూడసాగారు. ఆ చూపులో ఎదో సమ్మోహనా శక్తి ఉంది. అలర్కుడు అంతా మర్చిపోయినాడు. మనస్సులో ఈ విధంగా తర్కించుకున్నాడు. స్వామివారు ఎవరికి దుఃఖం వచ్చింది అని అడిగారు? నిజమే నాకు దుఃఖం దేనికి వచ్చింది? నేను ఎవరిని? ఈ అంగాలు - కళ్ళు, ముక్కు, చెవులు,కాళ్ళు, చేతులు, పైన వున్న ఈ చర్మము అంగి. నేను అంగిని కాదు. నేను అంగాలను కూడా కాదు. మరి నేను ఎవరిని? పంచతత్వాలతో తయారైనటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాన్ని కూడా నేను కాదు. నేను, నా భార్యా, పిల్లలు, మిత్రులు, ఈ అందరూ కూడా నేను కాదు. మరి నాలో దుఃఖం ఎవరికి కలిగింది? ఈ అంగి, అంగాలు నేను కాదు అన్నపుడు మరి దుఃఖం ఎవరికి కలిగింది? పోనీ నేను ఆత్మ స్వరూపుడుని అని అనుకుంటే మరి ఆత్మకు సుఖం కానీ దుఃఖం కానీ అంటదు కదా? హ!! నాకు ఇప్పుడు తెలిసింది నేను అంతటా వున్నాను. ఏ విధంగా అయితే సూర్యుడు చిన్న కుండలో, బావిలో, తటాకాల్లో, సముద్రాలలో, మహాసముద్రాలలో ఉంటాడో, అదే విధంగా నేను అంతటా వున్నాను. కాశీ రాజులో వున్నాను, ప్రజలలో వున్నాను, ఈ దేశం అంతా కూడా నేను వున్నాను. నాకు దుఃఖం కాని సుఖం కాని లేదు. ఈ విధంగా అతని ఆలోచనలు చాలా వేగంగా సాగిపోతున్నాయి. కేవలం స్వామి యొక్క కరుణా పూరితమైన దృష్టి పడటంతోటే అతనిలోని వివేకం బయటకు వచ్చింది. అతడు కళ్ళు తెరిచి “ప్రభూ! నా కళ్ళు తెరిపించారు. నాకు ఇప్పుడు అర్ధం అయ్యింది. నాకు ఇప్పుడు దుఃఖం లేదు స్వామీ. మీరు నా దుఃఖాన్ని ఒక్క క్షణం లోనే పోగొట్టారు. స్వామీ ! ఇప్పుడు నా తప్పు నాకు తెలిసింది. నేను ఒక కోడి పిట్టను పెంచుకున్నాను. ఒకసారి పిల్లి దాని మెడ కొరికి చంపేసింది. అప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. మరొక సారి ఆ పిల్లి ఒక ఎలకని చంపివేసింది. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. కానీ ప్రభూ! ఇప్పుడు నాకు తెలిసింది నా అవివేకం ఏమిటో. కోడిపెట్ట చనిపోయినప్పుడు దుఃఖం కలిగిన నాకు ఎలక చనిపోయినప్పుడు సంతోషం ఎందుకు కలిగింది?దుఃఖం ఎందుకు కలగా లేదు? మరి నాకు ఎందుకు దుఃఖం కలిగింది అన్నది నేను విమర్శించుకుంటే కోడిపెట్టమీద నేను మమకారాన్ని పెంచుకున్నాను కాబట్టి అది దుఃఖ హేతువు అయ్యింది. ఎలక మీద నాకు ఎటువంటి మమకారం లేదు కాబట్టి నాకు ఎటువంటి దుఃఖం కలగలేదు, పైగా సంతోషం కలిగింది. ప్రభూ! రెండిటిలో జీవం వున్నది. నిజానికి ఎక్కడ మమకారం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. ఎక్కడ దుఃఖం ఉంటుందో అది బంధ కారకం అవుతుంది. అది మోక్షానికి అడ్డం వస్తుంది అని తెలుసుకున్నాను” అని అన్నాడు. దత్తాత్రేయుడు ఎంతో సంతోషంతో “నాయనా అలర్కా ‘మమ’ అంటే దుఃఖం. ‘అమమ’ అంటే దుఃఖం లేనిది. చాలా చక్కగా సంయవిచారించి నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు. నాకు చాలా సంతోషం అని మరికొన్ని నీతి బోధలు చేసి అలర్కుడిని పంపించివేశాడు.
ఎంతో సంతోషంతో తన రాజ్యాన్ని చేరుకొని సరాసరి శత్రుసేనల మధ్య వున్న కాశీ మహారాజు దగ్గరికి వెళ్లి “కాశీ మహారాజా, నువ్వు నాకు శత్రువుడివి కావు, నీవు నాకు మిత్రుడివి. నీకు నా రాజ్యం కదా కావలిసింది, నువ్వు తీసేసుకో. నాకు రాజ్యం ఏమీ అక్కర్లేదు. నీవల్ల నాకు ఇంకా పెద్ద సామ్రాజ్యమే నాకు దొరికింది. ఆ సామ్రాజ్యాన్ని ఏలుకోవటానికి, దానిని ఆనందించుకోవటానికి నేను వెళ్తున్నాను. నాకు ఈ రాజ్యం ఏమి అక్కరలేదు” అని నిస్సంకోచంగా చెప్పేసరికి సుబాహువు వెంటనే వెళ్లి తమ్ముడిని ఆలింగనం చేసుకున్నాడు. “సోదరా! నీవు జ్ఞాన మాత అయిన మదాలస కుమారునివి. నేను వచ్చి చూసినప్పుడు నీవు విషయవాసనాలలో తగులుకుని ఉండటంవల్ల నేను చాలా బాధపడ్డాను. అందుకే నిన్ను సన్మార్గంలోకి తీసుకురావటానికి నేను ఈ ఉపాయ౦ పన్నాను. మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరూ ఎంతో సంతోషంగా వెళ్లిపోతుండగా కాశీ మహారాజు ఎంతో ధర్మాత్ముడు కాబట్టి ఆయన ఇద్దరు సోదరులను ఆపి “మీ సంగతి నాకేమీ అర్ధం కావటం లేదు. నీవు నాదగ్గర అభయం తీసుకుని నీ తమ్ముడి రాజ్యాన్ని జయించి, రాజ్యాన్ని నీకు అప్పగించమని అడిగావు. ఇప్పుడు మీరిద్దరూ ఏంటి ఇంత సంతోషంగా వున్నారు? మీరు ఏదో సామ్రాజ్యాన్ని పొందా౦ అని అంటున్నారు. అది ఏమిటో నాకు కూడా చెప్పండి. నేను కూడా మీ మిత్రుడినే కదా, నేను కూడా సంతోషిస్తాను అని చెప్పాడు. అంతే కాక ఈ రాజ్యం నాకు ఏమి అక్కరలేదు. మీ కుమారునికి పట్టాభిషేకం చేసి మీరు నిశ్చింతగా తపస్సుకి వెళ్ళవచ్చు” అని చెప్పి, అలర్కుని కుమారునికి ఎంతో వైభవంగా పట్టాభిషేకం చేసి వారు తపస్సుకోసం అడవుల్లోకి వెళ్లిపోయారు. ఈ విధంగా దత్తస్వామి చాలా చక్కగా అలర్కుడుకి మమకారం అనేది ఏ విధంగా ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తుందో, ఎప్పుడయితే ఆ బంధంలో మనిషి చిక్కుకుంటాడో, ఇంకా ఇంకా అనేక బంధాలలో అతను ఇరుక్కుపోతూనే ఉంటాడు. వలలో చిక్కుకున్న పావురం లాగా అతడు ఎంత ప్రయత్నించినా బయటకి రాలేడు. ఆ బంధం ఇంకా బిగుసుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే సమ్యగ్విచారణ చేసుకుని తమ లక్ష్యాన్ని మమకారాలు అనే బంధాన్ని తెంపుకుని ధృఢనిశ్చయంతో ఆత్మ సాధనకోసం, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటం కోసం వెళ్తారో వారు సంసారం నుంచి బంధ విముక్తులై శాశ్వత మోక్షాన్ని పొందుతారు అని మనం గ్రహించాలి.
నండూరి శ్రీసాయిరాం