నవీన యుగ నిర్మాణ శక్తి -2
మహర్షుల కార్యాచరణ
అక్కడికి చేరినటువంటి అసంఖ్యాకులైన సాధువులు, యోగులు, సత్పురుషులు, తాపస్వులు,మునులు, సిద్ధపురుషులు, ఇంకా అనేకమైనటువంటి మహాత్ములు, మహా పురుషులు అంతా కూడా ఎంతో నిశ్శబ్దంగా ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి విశ్వామిత్రుడు సభను ఉద్దేశించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుండగా ఆసక్తిగా ఆయన్నే అందరూ గమనిస్తున్నారు. ముందుగా విశ్వామిత్రుడు సభను అంతా కలియచూసి అలాగే ఇతర నక్షత్ర మండలాల నుండి వచ్చినటువంటి అనేక నక్షత్ర మండల మరియు ఇతర గ్రహ వాసులని పరికిస్తూ, అయస్కాంత క్షేత్రాధిపతి అయిన ఇంద్రా ! మీకు మరొక్కసారి మా అభ్యర్ధనని మన్నించి ఈ భూగోళాన్ని ఏమీ చేయకుండా ఉండేందుకు అంగీకరించినందుకు, అదే విధంగా ఇతర నక్షత్ర మండలాల నుండి వచ్చిన మహాత్ములందరికీ కూడా నేను సవినయంగా నా హృదయపూర్వక వందనాలని అందచేసుకుంటున్నాను. మేమందరం కూడా ఈ భూగోళాన్ని రక్షించుకోవటానికి భావకాలుష్యాని తగ్గించేప్రణాళికలు ఏ విధంగా వేసుకోవాలో నిర్ణయించుకున్నాము. అవి మీకు క్లుప్తంగా వివరిస్తాం. ప్రస్తుతం సనాతధర్మానికి ఆలంభనగా వున్న భారతదేశం నాస్తిక ధూమం అనే భావకాలుష్య తరంగాలని రోదసీ మండలంలో అతి వేగంగా ప్రవేశపెడుతుంది. ఒకపుడు సనాతన ధర్మానికి ఆలంభనగా వున్న భారతదేశంలో అయస్కాంతక్షేత్రాన్ని సమంగా ఉంచే విధంగా గోమాతని, భూమాతని, సమాజానికి అవలంబముగా వుండే మాతృ మూర్తిని, వీరిని గౌరవించినంత కాలం, నిరంతరం భారతదేశమంతటా కూడా పవిత్ర యజ్ఞాలు నిర్వహింపబడినంత కాలం, ప్రకృతిని కాపాడుకున్నంత కాలం, ఈ అయస్కాంత క్షేత్రం సమతుల్యం పొందినందువల్ల, ఒక్క భారతదేశమే కాకుండా ఈ భారత దేశం నుండి బయలుదేరి వెళ్లినటువంటి ప్రేమపూర్వక భావ తరంగాలు ప్రపంచం మొత్తం శాంతి సౌభాగ్యాలని నిలపెట్టే ప్రయత్నం చేసింది. కానీ పవిత్రమైన ఈ భారత దేశం లో యజ్ఞ యాగాదులు లుప్తం అయినాయి. స్త్రీల మాన మర్యాదలకి ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. అలాగే సత్పురుషులు, సాధువులు హింసించపడుతున్నారు.
సనాతన ధర్మాన్ని, దాన్ని రక్షించే సజ్జనులందరిని, అంతే కాకుండా కాషాయ వస్త్రాన్ని అవహేళన చేసి భారత దేశంలో పుట్టిన భారతీయులే చాలా విపరీతమైన నాస్తిక భావాలతో ఈ అయస్కాంత క్షేత్రాన్ని మరియు దాని సమతుల్యాన్ని పూర్తిగా పోగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నందుకు మాకు చాలా బాధ కలుగుతున్నది. ఈ విపరీతమైన హింసా పూరితమైనటువంటి నాస్తిక ధూమం అనే భావ కాలుష్యాన్ని తగ్గించటానికి మాలో యాజ్ఞవల్క్య మహర్షి తన యజ్ఞ ప్రక్రియలతో, తద్వారా వచ్చే పవిత్ర భావతరంగాలని భారతదేశంలో ప్రవేశపెట్టి, యజ్ఞాలు చేసే సంస్కారం ఉన్నటువంటి ప్రజలలో ఈ యజ్ఞాలు చెయ్యాలనే ఒక సత్సంకల్పాన్ని బీజ రూపంలో నాటి, వాటిని పెంచి, పోషించే విధంగా నిరంతరం ఈ తపస్సుని సాగిస్తామని తెలియచేసి నందుకు వారికి కృతజ్ఞతలు. అదే విధంగా పిప్పలాయనుడు, ధన్వంతరి, చవనుడు వీరందరూకూడా తాము చేసే కార్య కలాపాలతో తద్వారా వచ్చే భావ తరంగాలని భూలోకంలో ప్రవేశపెడుతూ, అటువంటి సంస్కారాలన్నీ బీజ రూపంలో వున్న మానవులలో వాటిని చైతన్య పరిచి వారు కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యంలో వుండే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో వుంటారు. అలాగే జమదగ్ని గురుకుల విద్యని, ధన్వంతరి, పిప్పలాదుడు ప్రకృతి వైద్యాన్ని, నేను పవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని, నిష్ఠతో జపిస్తూ తద్వారా వచ్చే భావ తరంగాలని భారతదేశంలోని కొన్ని కోట్ల మందిలో ఈ గాయత్రీ మంత్రాన్ని చెయ్యాలనే సత్సంకల్పము కలిగించి తద్వారా అయస్కాంత క్షేత్రాన్ని సరి చేసే ప్రక్రియలో తోడ్పడతామని హామీ ఇస్తున్నాను. మేము అహర్నిశలు ఈ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ఉంటాము అని హామీ ఇస్తున్నాము.”
అని చెప్పగా ఇంద్రుడు ఎంతో సంతోషించి “మహాత్ములారా, నక్షత్ర, ఇతర గ్రహ వాసులారా ! నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతి 25 సంవత్సరాలకి ఈ భూమి మీదకి వచ్చి ఈ అయస్కాంత క్షేత్రాల యొక్క ధృవాలు సరిగా ఉన్నాయా లేదా అని గమనిస్తూ వుంటాను అని మీకు అందరికి తెలుసును. అయితే ఈసారి ఒక మహా ప్రళయాన్ని నివారించే ప్రయత్నంలో మీరందరూ ముందుకు వచ్చి మీ సహాయ సహకారాలని అందించి ఈ భూగోళాన్ని కాపాడుకుంటామనే ధృడ విశ్వాసాన్ని ప్రకటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లోగడ కూడా ఎప్పుడెప్పుడు భూమాతా, స్త్రీ మాత అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించినప్పుడు, మీరందరూ కూడా మీ సహాయ సహకారాలను అందించి భూగోళాన్ని కాపాడినట్టే ఈ సారి కూడా మీరు అలా కాపాడుకుంటారనే విశ్వాసం నాకు ఉన్నందువల్ల మీరు చేసిన అభ్యర్ధన మేరకు, నేను మరియు ఇతర గ్రహ నక్షత్ర మండల వాసులు ఈ భూమిని నాశనం చెయ్యకూడా వుండాలని నిశ్చయించుకున్నాం . నేను 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను. అప్పుడు మళ్ళీ ఒక్కసారి పరిస్థితిని సమీక్షించి మనం అందరం కూడా కలిసి ఏం చెయ్యాలి అని ఆలోచిద్దాం.” అని ఎంతో వినయంగా చెప్పి ఆ సభ నుంచి ఇంద్రుడు సెలవు తీసుకుంటూ నిష్క్రమించారు. మరొక్కసారి అక్కడికి చేరిన అందరు కూడా అహర్నిశలు భూమిని కాపాడుకొనే ప్రయత్నంలో ఉంటామని గట్టిగా చెప్పి విశ్వామిత్ర, వశిష్ట ఇతర మహర్షులకి నమస్కారం చేసి వారి వారి స్థానాలకు వారు వెళ్లిపోయారు.