నవీన యుగ నిర్మాణ శక్తి -1
అష్టగ్రహ కూటమి: 1962వ సంవత్సరం
అది 1962 వ సంవత్సరం. భారత దేశంలో ఎక్కడ చూసినా, ఏ నగరానికి వెళ్లినా ప్రజలంతా భయకంపితులు గా కనిపించారు. భారత దేశం లో చిన్నా పెద్దా జ్యోతిష్యులు లెక్కలు కట్టి 8 గ్రహాలు వాటి యొక్క కూటమి ఒకే రాశిలో రావటం ఒక పెద్ద ప్రళయాన్ని సృష్టిస్తుంది అని, ప్రపంచం అంతా అంతం అవుతుంది అని ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం విన్న భారత ప్రజలు అందరూ గడగడా వణికిపోయారు. ఎవరికీ దిక్కు తోచని పరిస్థితి. గ్రహాల శాంతి కోసం అనేక హోమాలు భారత దేశం అంతా చేస్తూ వున్నారు. ఈ పెద్ద వాళ్లు చేస్తున్న హడావిడికి చిన్నవాళ్లు కూడా భయపడిపోయారు. కారణం ఎందుకో వాళ్లకి తెలియదు. మరి నిజంగా అంతటి భయంకర పరిస్థితి ఉందా? ఎందుకంటే ప్రఖ్యాత IAS ఆఫీసర్, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు అయిన ఎక్కిరాల వేదవ్యాస్ గారు కూడా ఒక విధమైన ఆందోళనకి గురి అయ్యారు. ఆయన లెక్కకట్టి ఈ 1962 వ సంవత్సరం ఒక గొప్ప విపత్కర పరిస్థితులకి దారి తీస్తుందని, ప్రపంచం అంతం అవుతుంది అని లెక్కలు వేశారు.
అసలు 1962 లో ఏం జరిగింది?
అవి ఎంతో పవిత్రమైనటువంటి హిమాలయ ప్రాంతాలు. ఇక్కడే దేవతలు, మహర్షులు, సిద్దులు, సాధువులు అందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు అని జగమంతా విఖ్యాతి. హిమాలయా ప్రాంతాలలో శంభాలా అనే ప్రాంతము ఎంతో పవిత్రమైనది. అక్కడ ఒక పెద్ద ఆధ్యాత్మిక సమావేశం జరుగుతుంది. అక్కడ సప్తర్షులు, ఎంతో మంది సిద్ధులు, సాధువులు, సత్పురుషులు సమావేశానికి విచ్చేసారు. విశ్వామిత్రుడు, జమదగ్ని, పరశురాముడు, అశ్వినీ దేవతలు, చరకుడు, అంగీరసుడు, వశిష్ఠుడు, యాజ్ఞవల్క్యుడు, ఇంకా ఎంతో మంది ప్రశస్తి గాంచిన మహర్షులు అందరు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా గంభీరంగా వున్నారు. అక్కడ అష్టదిక్పాలకులకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు కూడా సమావేశానికి విచ్చేశాడు. ఇంద్రుడు ఎంతో గంభీరమైనటువంటి స్వరంతో “ఇక్కడికి విచ్చేసినటువంటి మహర్షులారా, సాధువులారా, సిద్ధపురుషులారా అంతే కాకుండా నక్షత్ర మండలాలనుంచి వచ్చిన అనేక మంది మహాత్ములందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మొత్తం భూగోళమంతా ఒక విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంది. ముఖ్యంగా భారతదేశం చాలా విషమ పరిస్థితులని ఎదుర్కొంటున్నది . మీ అందరికీ తెలుసు నేను భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి అధిపతినని. ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలి అంటే రెండు అయస్కాంత ధ్రువాలు, అంటే ధన విధ్యుత్తు , ఋణ విధ్యుత్తు, తటస్థ విధ్యుత్తు, ఇవన్నీ సమానంగా ఉన్నప్పుడే ప్రజలందరూ సుఖ శాంతులతో వుంటారు. కానీ ప్రస్తుతం భారత దేశంలో ఈ ఋణ విధ్యుత్తు సమతుల్యాన్ని పోగొట్టే విధంగా పెరిగిపోయింది. భావ కాలుష్యం, ధ్వని కాలుష్యం, రసాయన కాలుష్యం, ఇంకా అనేక రకాలయిన కాలుష్యాలు మొత్తం ప్రపంచాన్ని గడ గడ వణికిస్తున్నాయి. అంతే కాకుండా ఇతర గ్రహవాసులు కలవర పరిచే విధంగా వారి గ్రహాలని తాకుతున్నాయి. ముఖ్యంగా భావ కాలుష్యం, హింసాధోరణి ఎక్కువగా వున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మరి నా విధి నేను నిర్వర్తించక తప్పదు. ఇతర గ్రహవాసులు కూడా పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగుతుంటే వారి గ్రహాల ఉనికికి కూడా ప్రమాదం సంభవిస్తుంది అని భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇట్టి పరిస్థితులలో ఈ భూమిని నేను మరి నాశనం చెయ్యక తప్పదు. కానీ మీ అందరి విజ్ఞప్తిని విని నేను ఈ సమావేశానికి రావటం జరిగింది. మరి ప్రమాదకరమైనటువంటి ఈ ప్రస్తుత పరిస్థితిని మీరు ఏ విధంగా చక్కపెడతారు?” అని కుతూహలంగా మరియు ఆందోళనగా ప్రశ్నించారు.
అందుకు సిద్ధులు, సాధువులు, సత్పురుషులు అందరూ కూడా మౌనంగా ఆ సభకి అధ్యక్షత వహించినటువంటి విశ్వామిత్రా,వశిష్ఠ మహర్షుల వైపు సాలోచనగా చూడటం జరిగింది. అందుకు సమాధానంగా తన గంభీరమైన మౌనాన్ని విడిచి పెట్టి విశ్వామిత్రుడు “ముందుగా మా విన్నపాన్ని అంగీకరించి మీరు ఈ సభకి వచ్చినందుకు మా సభ తరఫున మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మాకు కూడా మీకన్నా ఎక్కువగా ఈ భూమి యొక్క ప్రస్తుత పరిస్థితిలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి, ముఖ్యంగా సనాతన ధర్మానికి ఆలవాలు అయినటువంటి, వేద భూమి అయినటువంటి ఇటువంటి పవిత్ర భారతదేశం ఎంతో గడ్డు పరిస్థితుల్లో ఇరుక్కుని ఉంది. దీన్ని ఏవిధంగా రక్షించుకోవాలని అనేక తర్జనభర్జనలు చేసి, మేమందరం ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని అంగీకరించాం అదే మీకు విన్నపిస్తాం. మేమంతా కూడా మా తపశ్శక్తిని ఇంకా ఎన్నో విధాలుగా పెంచి ఈ విశ్వానికి, ముఖ్యంగా ఈ భారత దేశానికి ధార పోయదలిచాం. మొత్తం ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి ఈ శంబళ అనే ఈ పవిత్రమైన, ద్రోణగిరి ప్రాంతమైన హిమాలయా పర్వతాలనుంచి మేము ఈ విన్నపాన్ని చేరవేస్తున్నాం. ఇక్కడకి విచ్చేసినటువంటి సప్తర్షులు, అంతే కాక ఇతర గ్రహాల నుంచి వచ్చిన ఎంతో మంది మహాత్ములు కూడా జాలితో భూమిపట్ల వారికున్న వాత్సల్యంతో తమ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. ఈ భూమిని నాశనం చెయ్యకుండా కొంతకాలం వారు మామీద విశ్వాసంతో వేచి చూస్తామని హామీ ఇస్తున్నారు” అని చెప్పగా, అక్కడ Aries అను నక్షత్రమండలాని నుండి వచ్చిన ఒక ప్రతినిధి సభకి సాదరంగా నమస్కరించి “మహాత్మా, అయస్కాంత క్షేత్రానికి అధిపతి అయిన ఇంద్రా, మీకు సాదరంగా ప్రణామాలు. ఈ భూమి మీద నుండి వచ్చే భావ కాలుష్యమే మమ్మల్ని ఎక్కువగా కలవర పెడుతున్నది. ఈ తీవ్రమైనటువంటి భావ తరంగాలు మా నక్షత్ర మండలాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అందుకనే మాలో చాలామంది కూడా ఈ భూమిని నాశనం చెయ్యాలని సంకల్పించారు అని, ఇక్కడ చేరిన మహర్షుల యొక్క విన్నపాన్ని పునస్కరించుకొని వారి మీద విశ్వాసంతో, వారి శక్తి మీద నమ్మకంతో మేము మా ప్రయత్నాన్ని ప్రస్తుతానికి విరమించుకున్నాము. మేముకూడా శాయశక్తులా ఈ భూమిని రక్షించటానికి అవసరమైన సహాయం తప్పకుండా చేస్తాం. ” అని విన్నవించుకున్నాడు. అప్పుడు వారి అభ్యర్ధనని విని ఇంద్రుడు సరే అన్నారు.