బ్రహ్మజ్ఞానం – 2
బ్రహ్మమునకు ఉన్న ఇంకొక లక్షణాన్ని పరిశీలిద్దాం. బ్రహ్మమునకు దిక్కులు లేవు. బ్రహ్మమునకు పైన కాని, క్రింద కాని, కుడివైపు కాని, ఎడమవైపు కాని దిక్కులు ఉన్నాయని చెప్పుకోడానికి వీల్లేదు. సృష్టిలోని ప్రతి వస్తువుకి కూడా దిక్కులున్నాయి. ఈ దిక్కులన్నీ సూర్యుని యొక్క గమనాన్ని బట్టి మానవులు ఏర్పరచుకున్నట్టివి. మనింటి ప్రక్కనే ఉంది, కుడివైపునే ఉంది, ఎడమవైపునే ఉంది, చెట్టు పైనే ఉంది, చెట్టు క్రిందనే ఉంది ఇవన్నీ మనకు ఉన్నవి. కాని అనంతంగా సాగుతున్నట్టి ఈ మహాశక్తి , చైతన్య శక్తి అయినటువంటి బ్రహ్మమునకు ఏ దిక్కులు లేవు. అది అనంతంగా ముందుకు సాగుతూఉంటూనే ఉంది. ఎంత దూరం వెళ్ళినా కొన్ని కోట్ల మైళ్ళు , యోజనాలు వెళ్ళినా కూడా అక్కడ బ్రహ్మం ఉంటుంది. అలాగే ఎటు ప్రక్క వెళ్ళినా, అన్ని దిక్కుల్లో వెళ్ళినా కూడా అనంతంగా సాగుతున్నటువంటి ఈ బ్రహ్మమునకు ఎటువంటి దిక్కులు లేనే లేవు. ఇది మరి యొక ముఖ్యమైనటువంటి లక్షణం. బ్రహ్మము అవిభాజ్యం. అంటే దానిని మనం ముక్కలుగా మనం చేయలేము. ఇది అఖండమైన స్వరూపం. ఉపనిషత్తులు దీన్ని ఏవిధంగా చెప్పాయంటే అది ఏకరసాన్నికలిగి ఉంటుంది. అంటే ఈ బ్రహ్మము కొద్ది చోట్ల పల్చగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా, దళసరిగా ఉంటుందా అనే లక్షణాలు ఈ బ్రహ్మమునకు లేనే లేవు. ఇది అఖండమైనటువంటి, అనంతంగా సాగేటటువంటి ఒక మహా చైతన్య స్వరూప శక్తి. బ్రహ్మమునకు స్థలపరిచ్చేదం కాని వస్తుపరిచ్చేదం కాని లేనే లేవు. ఇక్కడ దేశ ప్రచ్చేదమన్నా, స్థల ప్రచ్చేదమన్నా అంటే ఉదాహరణకి ఒక జిల్లా ఒక ప్రదేశంనుంచి మొదలై ఇంకొక ప్రదేశంతో అంతమై దాని తర్వాత ఇంకొక జిల్లా మొదలవుతుంది. ఈ విధమైన లక్షణాలు మన సృష్టిలో ఉన్నాయి కాని బ్రహ్మామునకు ఇటువంటి స్థల ప్రచ్చేదం అనే లక్షణాలేవీ లేవు. ఎందుకంటే లోగడ మనం చెప్పుకున్నట్టె బ్రహ్మానికి సరిహద్దులంటూ ఏవీ లేవు కదా ! పరిమితులు లేవు కదా ! కాబట్టి బ్రహ్మానికి స్థలప్రచ్చేదం లేదు. అదేవిధంగా బ్రహ్మానికి కాల ప్రచ్చేదం లేదు. కాలం అనేది అనంతమైన చైతన్య శక్తి , ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. కాని సృష్టిలో ఉన్నటువంటి కాలానికి పరిమితి ఉంటుంది. ఉదాహరణకి ఒక బ్రహ్మకల్పం మొదలవుతుంది దానికి అంతం ఉంటుంది. ఈ మొదలు, అంతం మధ్యలో ఉన్నదాన్ని మనం ఒక కల్పం అంటాము. దాన్ని ఇంకా విభజించుకుంటే మహా యుగాలు అంటాం. దాంట్లో మనకి యుగాలుంటాయి. యుగాలనుంచి సంవత్సరాలుంటాయి. సంవత్సరాలనుంచి నెలలు, పక్షాలు, వారాలు, దినాలు ఉంటాయి. ఇలా కాలాన్ని మనం ముక్కలు ముక్కలుగా చేసుకుంటాము. ఎందుకంటే దానికి మొదలు ఉంది, అంతం ఉంది కాబట్టి. కాని బ్రహ్మమునకు కాలపరిమితి లేదు ఎందుకంటే బ్రహ్మానికి ఆది లేదు, అంతం లేదు కాబట్టి అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. దీన్నే మనం ఇంగ్లీష్ భాషలో “Time and Space Concept” అని చెప్పుకుంటాం. అలాగే బహ్మానికి వస్తు పరిచ్చేదం కూడా లేదు. వస్తు పరిచ్చేదం అంటే మనం ఒక వస్తువుని రకరకాలుగా విభజించుకోవచ్చును. ఉదాహరణకి ఒక గృహం ఉందనుకోండి ఇంటి ముందుని వసారా అని అంటాం లేక వీధి అరుగు అని అంటాం. దీనికి ప్రవేశద్వారం ఉంటుంది. ముందు గదిలో కూర్చున్నప్పుడు ముందుగది అంటాం , ఇంకొక గదిని సగం భాగం వంటగది అని అంటాం, మిగతా భాగాన్ని పూజగది అని అంటాం , ఇంకొక భాగాన్ని నిద్ర పోయే స్థలంగా అనుకుంటాం ఈ విధంగా ఒక వస్తువుని మనం రకరకాలుగా విభజించుకుంటాం. కాని ఇటువంటి వస్తు పరిచ్చేదం బ్రహ్మమునకు లేదు. ఎందుకంటే లోగడ మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మం అనంతం, అఖండం , అద్వితీయం, కాలాతీతం అని కూడా మనం చెప్పుకొనవచ్చును.
(.... to be continued......)