ఉపనిషత్తు సారాంశం - రెండవ అధ్యాయం (Part-1)
ఇంతవరకు మనం సృష్టికి ముందు ఉండే బ్రహ్మము గురించి చెప్పుకున్నాం. మరి సృష్టి అన్నది బ్రహ్మము లోనిదే కదా! అక్కడ సృష్టికి పూర్వం ఉన్న బ్రహ్మములో మనం చాలా లక్షణాలు చెప్పుకున్నాం. బ్రహ్మమొక్కటే, రెండవ వస్తువు లేదని, షడ్వికారం లేదని, ఎటువంటి గుణముల చేత మలినం కాని వస్తువని ఇలాగ ఎన్నో చెప్పుకున్నాం. కాని మరి అదే బ్రహ్మములోని సృష్టిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కదా అనే సందేహం మనందరికి తప్పకుండా వస్తూ ఉంటుంది. ఒకవైపు బ్రహ్మము ఒక్కటే అని చెప్తున్నాం, వేరే పదార్ధం లేదంటున్నాం. మళ్ళీ బ్రహ్మములోనే సృష్టి ఉందని రెండో పదార్ధం గురించి చెప్పుకుంటున్నాం. ఇది కొంచెం తికమకగా ఉంటుంది. శ్రీ రమణ మహర్షిగారు “త్రిపురా రహస్యం” ప్రతి ఒక్కళ్ళు చదవవలసిన గ్రంథరాజమని చెప్పారు. “త్రిపురా రహస్యంలో” శ్రీ దత్త మహా ప్రభువు పరశురామునికి కలిగిన అనేక సందేహాలను తీరుస్తూ ఉంటారు. అక్కడ కూడా ఇలా అద్వితీయాన్నే బోధించారు. ఆది శంకరాచార్యులు కూడా అద్వైతాన్నే బోధించారు. ఎదురుగుండా కనిపిస్తున్న సృష్టిని అది మాయ అని చెప్తూ ఉంటారు. అది మిధ్య అని చెప్తుంటారు. మిధ్యా అనే వస్తువు మన కళ్ళకి కనపడకూడదు కదా ! కాని అది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకోవడం చాలా కష్టం. సరే ! ఇక్కడ మనం కొంచెం ప్రయత్నం చేద్దాం ఈ సృష్టి రహస్యం ఏమిటో అర్థం చేసుకోవడానికి.
ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఊరిలో భవనాలాన్నీ, మార్గాలన్నీ, చెట్లన్నీ, కొండలన్నీ, మనుష్యులంతా, సమస్త వసువులన్నీ కూడా మట్టితోటే తయారు చేయబడి ఉన్నాయని అనుకుందాం. అక్కడ ఆకారాలన్నీ వేరు కాని అవన్నీ మట్టితోటే చేయబడి ఉన్నాయి, నిర్మించబడ్డాయి. అలాంటప్పుడు మనం ఏ కొండలోని పదార్థాన్ని తీసుకున్నా, చెట్టులోని పదార్థాన్ని తీసుకున్నా అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ పరీక్షించినప్పుడు దానిలో మనకి మట్టి రేణువులే తప్ప వేరే ఏ పదార్ధం కనపడదు కదా ! అంటే దీని అర్థం ఏమిటీ? వస్తువులన్నీ ఏ పదార్ధం తో చేయబడతాయో ఆ వస్తువుని మనం ఛేదనం చేసి చూసినప్పుడు మనకి అదే పదార్ధం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ విషయం మనం బ్రహ్మ పదార్థానికి కూడా అన్వయించుకోవచ్చును. అంటే దీని అర్థం ఏమిటీ? ఈ సృష్టిలోని అన్ని వస్తువులు కూడా ఈ భూమండలం, 14 లోకాలు, నక్షత్రమండలం, ఆకాశం, చెట్లు-చేమలు మొదలైన సమస్త వస్తువులు కూడా మరి బ్రహ్మముతోటే తయారు చేయబడి ఉన్నాయి. దానిలో మనం ఏ పదార్థాన్ని పరీక్షించినా ఆ బ్రహ్మ౦ యొక్క పదార్ధం తప్ప ఇంకొకటి మనకు కనిపించదు. ఇక్కడ మనకు ఒక పెద్ద సందేహం వస్తుంది. మనం బ్రహ్మము గురించి దాదాపు 20 లక్షణాలు చెప్పుకున్నాం. షడ్భావవికారాలు లేవని, పరిచ్చేదం కానిదని, అఖండమైనదని, నిరాకారమైనదని, త్రిగుణముల చేతను మలినం కాబడదని ఏ ఒక వస్తువు లేనిది నిరాకార, నిర్గుణ రూపమని ఇలా మనం ఎన్నో లక్షణాలు చెప్పుకున్నాం. ఇంద్రియగోచరం కాదని కూడా చెప్పుకున్నాం. మరి అటువంటి బ్రహ్మములోనుంచి మనకు బ్రహ్మానికి విరుద్ధమైన లక్షణాలతో కనిపించే సృష్టి ఎలా వచ్చింది? మనకి కనిపించే సృష్టి సాకారం, షడ్భావవికారాలు ఉన్నవి, ఇంద్రియగోచర౦, త్రిగుణముల చేత మలినం కాబడినది అని మనం బ్రహ్మమునకు విరుద్ధంగా ఉన్న లక్షణాలతో కూడి ఉన్న సృష్టినే కదా మనం చూస్తున్నాం . ఇది ఎలా సాధ్యం? అనే ఒక పెద్ద ప్రశ్న మనకు రావడం అతి సహజం. మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం. నీరు ఎలా ఏర్పడింది? కళ్ళకి కనిపించని ఆక్సిజన్ వాయువు, అలాగే కంటికి కనపడని హైడ్రోజన్ వాయువు యొక్క సమ్మేళనమే కదా నీరు !
(...... continued ......)