చేదు నిజాలు (ఎపిసోడ్-1)
మన భారతీయులు ముఖ్యంగా హిందువులు ఒక విధమైన ఆత్మన్యూనతా భావం అంటే inferiority complex తో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం చాలా ఏళ్ల వరకూ తురుష్కుల పాలనలో, ఆ తరువాత ఆంగ్లేయుల పాలనలో అనేక విదేశీ దురాక్రమణలతో భారతదేశం అంతా అతలాకుతలమైపోయింది. ఈ భారతదేశం పైన పోర్చుగీసు వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, స్పానిష్ వాళ్ళు, తురుష్కులు, ఆంగ్లేయులు అందరూ దాడి చేసి అనేక రకాలుగా భారతదేశ సంస్కృతిని, సంస్కరాలన్నింటిని కూడా చాలామటుకు నాశనం చేశారు. కులాల పేరున, మతాల పేరున మత మార్పిడులు అనేక రకాలుగా భయపెట్టి, భ్రమపెట్టి , ఆశపెట్టి భారతదేశపు ప్రజలని అనేక వర్గాలుగా చీల్చివేశారు. మొదట నుంచి కూడా విదేశీ దురాక్రమణదారులకి మన వైదిక మతం పైన ప్రబలమైన విరోధభావం ఉండేది. మొత్తం ప్రపంచంలో కెల్లా అతి ప్రాచీనమైనటువంటి, ఎంతో గొప్పదైనటువంటి వైదిక భూమి, కర్మ భూమి అయిన భారతదేశం దాని సమగ్రతని అనేక రకాలుగా వాళ్ళు చాలామటుకు నాశనం చెయ్యగలిగారు. అయితే తురుష్కుల పరిపాలనలో ఆ తరువాత ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నప్పుడు ఎన్నో దుష్క్రుత్యాలు చేశారు దానిలో మొట్టమొదటిది మన భారతదేశ చరిత్రనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మార్చివేశారు. మన పురాణాలకి, వేదాలకి వక్ర భాష్యాలు చెప్పారు. ఎంతో సంపన్నులైనటువంటి బ్రిటీష్ వాళ్ళు, అమెరికన్లు విదేశీ ప్రొఫెసర్ లకి బోలెడంత డబ్బు ఆశ చూపి మన వేదాలకి వక్ర భాష్యాలు చెప్పడం సర్వసాధారణమైపోయింది. మనలోని మేధావులకి కూడా డబ్బు ఆశ చూపి మన దేశ చరిత్రని మార్చివేశారు. చివరికి ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేనేటటువంటి ఒక భ్రమలోకి భారతదేశీయులని దిగజార్చారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి కూడా చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నది. మన హిందూ జాతికి, మన సంస్కృతికి, మన నాగరికతకి పెద్ద ప్రమాదం పొంచుకుని ఉన్నది. అనేక మంది భారతీయులు విదేశీ గూఢచారులుగా పనిచేస్తూ రకరకాలుగా సమాజంలో అన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రధానులు కూడా మరి విదేశీ రాజనీతికి అనుగుణంగానే శాసనాలన్నీ మారుస్తూ భారతదేశాన్ని చాలా భ్రష్టు పట్టించారు. కానీ మేకతోలు కప్పుకున్న పెద్దపులులే మన భారతీయులే మన మధ్య మెలుగుతూ మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు. అతి దౌర్భాగ్యమైన స్థితి ఏమిటంటే మన పురాణాలు, మన వేదాలన్నింటిని కూడా విదేశీయులు మార్చి వ్రాశారు. మనం వాటిని చదివి అవే నిజమనుకుని ఒక మూఢ విశ్వాసంతో చాలా మంది యువతీయువకులు ప్రస్తుతం ఉన్నారు. మన భారతీయ భాష చాలా విశిష్టమైనది ఒకే పదానికి నానా అర్ధాలు ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి మన సహస్రార చక్రాన్ని మన యోగ భాషలో వర్ణిస్తూ ఉంటాము అది ఇంగ్లీష్ లో తర్జుమా చేసినప్పుడు crown chakra అంటారు. క్రౌన్ చక్రాలో చాల చిన్న పరిధిలోనే అర్ధం ఉంటుంది కానీ సహస్రార చక్రం అంటే దానిలో ఎంతో అర్ధం ఉంది. అలాగే ఆజ్ఞ చక్రం, అనాహత చక్రం, స్వదిష్టాన చక్రం, మూలాధార చక్రం ఇలా మన యోగ భాషలో చెప్పుకున్నప్పుడు దానిలో ఎంతో గూఢమైన శాస్త్రీయపరమైన అర్ధాలు ఉంటాయి. వీటిని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసినప్పుడు విశుద్ధి చక్రాన్ని throat chakra అంటారు, అనాహత చక్రాన్ని heart chakra అంటారు మణిపూరక చక్రం ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని వెదజల్లే ఈ మణిపూరక చక్రాన్ని solar plexus chakra అంటారు. ఇలా వాళ్ళు వాళ్లకి ఇష్టం వచ్చినట్లు మన భాషలో ఉన్నటువంటి యోగపరమైన పదాలని మార్చినప్పుడు దానిలో ఉన్న ఎంతో విశిష్టమైన విజ్ఞానం అంతా కొట్టుకుపోతుంది కదా! ఈ విధంగానే Max Muller అనే జర్మనీ దేశస్థుడు భారతదేశాన్ని సందర్శించకుండానే, సంస్కృత భాషని నేర్చుకోకుండానే డబ్బుకి ఆశపడి మన వేదాలని జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడు. ఈ తర్జుమా చేసే ప్రక్రియలో సంస్కృత పదాల అర్ధం అంతా కూడా మారిపోయింది. అయితే మరి చాలా మంది భారతదేశీయులు, విదేశీయులు కూడా Max Muller వ్రాసినటువంటి ఆ వేదాలని ప్రామాణికంగా చూడటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. స్వాతంత్య్రం రాగానే కాశ్మీర్ గురించిన సమాచారం అనేక విధాలుగా వక్రీకరించబడింది. ఇంకొక విశిష్టమైన విషయం ఏమిటంటే మొత్తం ప్రపంచంలో కెల్లా భారతీయ సంస్కృతిలోనే ప్రతీ రాజుల యొక్క వంశ చరిత్ర ఉంటుంది. మహాభారత యుద్ధం ముగిశాక మన దేశాన్ని ఏఏ రాజులూ పరిపాలించారు, ఎంతవరకూ పరిపాలించారు ఆ తరువాత వచ్చిన రాజు యొక్క చరిత్ర ఏమిటి ఇవన్నీ కూడా మన దగ్గర ప్రామాణికంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కాశ్మీరు రాజవంశ చరిత్ర అంతా కూడా బిల్హణుడు వ్రాసినటువంటి రాజతరంగిణిలో చాలా సమగ్రంగా ఉంది. అలాగే నేపాల్ దేశ చరిత్ర కూడా అన్ని ఆధారాలతో లిఖింపబడి ఉన్నది. వీటినే మన విశ్వనాధ సత్యనారాయణ గారు రాజతరంగిణి ని అంటే కాశ్మీరు రాజచారిత్రని తెలుగులోకి అనువాదం చేశారు అలాగే నేపాల్ దేశ చరిత్రని కూడా తెలుగులో అనువాదం చెయ్యడం జరిగింది. నేను ఆఫ్రికా దేశంలో ఉన్నప్పుడు కెన్యా వశస్థులు, ఉగాండాలో ఉండే ఆఫ్రికన్లు మరియు టాంజానియా లో ఉన్నవాళ్ళందరూ కూడా భారతదేశాన్ని చాలా అపార్ధం చేసుకున్నారు. మీరెందుకు అనవసరంగా పాకిస్తాన్ కి సంబంధించిన కాశ్మీరు ని లాక్కున్నారు? ఎందుకు దురాక్రమణ చేశారు? అని వాళ్ళెప్పుడు అడుగుతూ ఉండేవారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తూండేది ఏ ఒక్క భారతీయుడు కూడా గొప్పగా, భయం లేకుండా అంటే నిర్భయంగా కాశ్మీరు మా భారతదేశానికి సంబంధించినది అని చెప్పలేడు. ఈమధ్య కాలంలోనే కాంగ్రెస్ పరిపాలన చాలా రాష్ట్రాలలో అంతరించిన తరువాతనే మనం కొంచెం ధైర్యంగా తలెత్తుకుని మాట్లాడగలుగుతున్నాం. ఇప్పటికి కూడా మనకు స్వాతంత్య్రం వచ్చిందన్న మాటేగాని మహాత్మా గాంధీ యొక్క వాక్యాలలోను, పరమాచార్య చంద్రశేఖర సరస్వతి గారి వ్యాఖ్యానంలో కూడా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న విషయాన్నీ వారెప్పుడు నమ్మలేదు. కేవలం తెల్ల చర్మం ఉన్నవారి దగ్గరి నుంచి నల్ల చర్మం ఉన్నవారి దగ్గరకి అధికారం బదలాయింపు మాత్రమే జరిగింది.