ఆత్మజ్ఞానం లేక బ్రహ్మజ్ఞానం (continued....)
బ్రహ్మము అద్వితీయం, అవిభాజ్యం. బ్రహ్మము అద్వితీయం ఎందుకంటే అది నిరంతరం సాగుతుండే ఒక మహా చైతన్య శక్తిగా మనం చెప్పుకున్నాం కదా ! ఇక్కడ ప్రతి పరమాణువులో, సృష్టిలో ప్రతి చోట ఈ బ్రహ్మము వ్యాపించి ఉన్నది. దీనికి ఆది లేదు , అంతం లేదు కాబట్టి అక్కడ మూడవ వస్తువు అనే మాటకి అసలు అర్థమే లేదు. బ్రహ్మము సర్వత్రా వ్యాపించి ఉన్నట్టి మహాచైతన్యం కనుక , రెండవ వస్తువు లేదు కనుక శాస్త్రంలో ఇది అద్వితీయమని చెప్పడం జరిగింది. బ్రహ్మము అంటే మనకి ఈ సృష్టిలో జాగరణావస్థ, నిద్రావస్థ, సుషుప్తావస్థ అని మూడు అవస్థలు ఉన్నాయి. అంటే మెలకువగా గాని, నిద్రలో గాని, నిద్రలో స్వప్నంలో కాని చూడడం అని ఈ మూడు అవస్థలు ఉన్నాయి. ఈ మూడు అవస్థలకి భిన్నంగా ఉన్నదే తురీయవస్థ. అంటే ఈ బ్రహ్మకి జాగరణావస్థ కాని, కలలు కనే అవస్థ కాని నిద్ర పోయే అవస్థ కాని ఈ మూడు అవస్థలు లేవు. వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక మహా చైతన్య శక్తి కనుక అది ఎప్పుడూ కూడా స్పృహలో ఉంటుంది. తెలివిగా తురీయ అవస్తలోనే ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మము తురీయముగా పెద్దలు చెప్పుతూ ఉంటారు. బ్రహ్మమునకు శరీరము కాని మనస్సు కాని లేవు. అది నిరాకారము. మనస్సు లేనందువల్ల ఎటువంటి సంకల్పం ఉండే ఆస్కారం లేదు. అంతే కాకుండా బ్రహ్మము సర్వస్వతంత్రము, అఖండమైన, అనంతమైన మహా చైతన్య శక్తి గా ఉండే ఈ బ్రహ్మమునకు ఎవ్వరినీ శాసించే శక్తి లేనే లేదు. ఎందుకంటే బ్రహ్మము అద్వితీయం, రెండవది లేదు కనుక. సర్వ వ్యాపకత్వం, సర్వ శక్తిత్వం, సర్వ స్వతంత్రం అనే లక్షణాలు కలిగినటువంటి ఈ మహా చైతన్య శక్తి స్వరూపమే ఈ బ్రహ్మము అని చెప్పుకొనవచ్చును.
బ్రహ్మమునకు ఉన్న ఇంకొక లక్షణం అది ఏమిటంటే స్వయంప్రకాశం. ఇక్కడ ప్రకాశం అనే అర్థానికి మనం వెలుగుగా తీసుకుందాం. బ్రహ్మం అద్వితీయం కనుక ఈ బ్రహ్మమును ప్రకాశింపజేసే ఏ ఒక్క వస్తువైనా లేనే లేదు, ఇది స్వయం ప్రకాశం. ఇంకొక లక్షణం బ్రహ్మమునకు అది ఏమిటంటే అది అనిర్వచనీయం. ఇది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని మనం నిర్వచించ లేము కనుక బ్రహ్మము అనిర్వచనీయముగా మనం చెప్పుకొనవచ్చును. ఈ బ్రహ్మము ఇలా ఉంటుంది అని చెప్పిమనం ఎటువంటి వర్ణనలు చేయలేము అందుకని బ్రహ్మము అనిర్వచనీయమని శాస్త్రాలు చెప్పుతూ ఉన్నాయి. ఇంకొక ముఖ్య లక్షణమేమిటంటే బ్రహ్మమునకు త్రిపుటి లేనేలేదు. త్రిపుటి అంటే ఏమిటీ? ఈ లోకంలో మనం ఏదైనా ఒక వస్తువుని పొందడానికి సాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనం ఆ వస్తువుని సాధిస్తామో అప్పుడు దాన్ని సాధ్యం అని అంటాం. మనం చేసే ప్రయత్నాన్ని సాధన అని అంటాం. ఎవరైతే ఈ సాధనని చేస్తూ ఉంటారో వారిని మనం సాధకుడు అని అంటాం. అంటే ఇక్కడ మూడు వస్తువులు ఉన్నాయి. సాధకుడు, సాధన సాధ్యం. ఈ మూడింటినీ కలిపి మనం త్రిపుటిగా పేర్కొనవచ్చును. అయితే ఈ బ్రహ్మమునకు ఈ మూడు కూడా లేవు. ఇది ముఖ్యమైన లక్షణం. అంటే బ్రహ్మంలో సాధన, సాధకుడు, సాధ్యం అనే ఈ మూడూ లేనే లేవు. ఈ బ్రహ్మమునకు మరి యొక లక్షణమేమంటే సాధ్యము. మరి సాధ్యము, అసాధ్యం అని చెప్పుతున్నప్పుడు మరి ఎందుకు మనం ప్రయత్నం చేయడం అనే ప్రశ్న మీకు వెంటనే స్పురిస్తుంది. ఇక్కడ అసాధ్యం అంటే దాని లోపల ఒక పరార్థం, గూడార్థం ఉంది. లోగడ మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మంలో త్రిపుటి లేదు. సాధన, సాధకుడు, సాధ్యం ఈ మూడూ లేనే లేవు దీని అర్థం మరి ఏమిటీ ? అని అంటే ఎప్పుడైతే సాధకుడు తన నిరంతర సాధన ప్రయత్నంలో తాను వేరు, తన సాధన వేరు , తాను పొందవలసిన వస్తువు వేరు అనే భ్రమలో లేకుండా నేనే ఆ బ్రహ్మం అనే ఏక భావన వచ్చినప్పుడు ఆ సాధకుడు బ్రహ్మ౦ని అనుభవిస్తాడు, కాని సాధించడు. మన లౌకిక వ్యవహారంలో ఏదన్నా ఒక వస్తువును పొందడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. డబ్బు సంపాదించే మార్గం కోసం మనం ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తాం. వ్యాపారం చేయవచ్చును, ఉద్యోగాలు చేయవచ్చును ఇంకా ఇతరేతర ప్రయత్నాలు చేస్తాం. ఎప్పుడైతే మనం ధనాన్ని సంపాదిస్తామో , సాధిస్తామో అది సాధించిన తర్వాత కూడా ఆ సాధకుడు మిగిలే ఉంటాడు. కాని ఇక్కడ ఎప్పుడైతే సాధకుడు త్రిపుటిని దాటి తానె బ్రహ్మం అని అనుభూతి చెందుతాడో అప్పుడు ఆ సాధకుడు బ్రహ్మములో ఐక్యమైపోతాడు. అప్పుడు సాధకుడు మిగిలి ఉండడు. అంటే దీని అర్థం ఏమిటీ? బ్రహ్మం సాధించబడేది కాదు. కనుక అది అనుభవించాలే తప్ప సాధించవలసినది ఏమీ లేదు అని దీనిలో సూక్ష్మార్థం. బ్రహ్మం ఉండడానికి మూలకారణం అంటూ ఏమీ లేదు. ఏ కారణం చేత బ్రహ్మం ఉంది అని చెప్పడానికి రెండో వస్తువు లేదు కనుక ఈ బ్రహ్మమునకు , బ్రహ్మం యొక్క ఉనికికి ఏదీ కూడా కారణభూతం కానే కాదు. కేనోపనిషత్తులో ఒక చోట ఎవరైతే నాకు బ్రహ్మం గురించి తెలుసు అని చెప్తారో , నిజానికి వాళ్లకి బ్రహ్మం గురించి ఏమీ తెలియదని చెప్పవలసి వస్తుంది. ఇంతవరకు బ్రహ్మము యొక్క లక్షణాల గురించి చెప్పుకున్నాం. ఈ లక్షణాలన్నీ ఉపనిషత్తు లోని వాక్యాలే. కేనోపనిషత్తు, కఠినోపనిషత్తు, భగవద్గీత , ఉపనిషత్తు, వేదాంత పంచదశ ఈ విధంగా ఉపనిషత్తులు బ్రహ్మం గురించి, వాటి లక్షణాల గురించి చెప్పడం జరిగింది. (మొదటి అధ్యాయం సంపూర్ణం.)
“ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమత్స్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వాది సాక్షీభూతం, భావాతీతం, త్రిగుణ రహితం సద్గురుం త్వం నమామి” అహం బ్రహ్మోస్మి ఓం శాంతి, శాంతి , శాంతి .
(The end of 1st Chapter )