ఉపనిషత్తులు
ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం - 1
సృష్టి అనే పదంలో సృష్టించబడింది అనే అర్థం ఉంది. అంటే ఈ సృష్టి అంతా ఒకప్పుడు సృష్టించబడింది. అనే కదా అర్థం! దానిలో ఇంకొక అర్థం కూడా ఉంది. ఏమిటంటే ఈ సృష్టి సృష్టించబడినప్పుడు అది ఎక్కడ ఉంది? సృష్టి అంటే 14 లోకాలు, ఖగోళం, నక్షత్ర మండలం, మనకు కనిపించేదంతా సృష్టి అనుకోవాలి కదా! ఒకప్పుడు అంటే ఇవి లేనప్పుడు మరి ఉన్నవి ఏమిటీ? అంటే శూన్యం అని చాలామంది చెప్పుతూ ఉంటారు. వేదాంత పంచదశలో మహర్షులు ఏం చెప్పారంటే ఈ సృష్టికి పూర్వం పరబ్రహ్మతత్వం ఉండేది. మనకు మన కంటికి కనిపించేంత మేర శూన్యమంతా పరబ్రహ్మతత్వం తో నిండి ఉండేది. అక్కడ ఉన్నది ఒక పరబ్రహ్మతత్వం తప్ప ఇంకొక వస్తువు లేనేలేదు అని చెప్పడం జరిగింది. అయితే బ్రహ్మతత్వం లక్షణాలు ఏమిటీ? మొదటిలక్షణం ఏమిటంటే బ్రహ్మకు రంగు, రుచి, వాసన లేవు. దానికి ఆకారం అనేది కూడా లేదు. అది ఒక మహా చైతన్యం కలిగినటువంటి శక్తి స్వరూపం. అటువంటి ఈ మహాచైతన్య శక్తి ఈ సృష్టికి పూర్వం ఉండేది అన్నమాట. ఈ బ్రహ్మము ఇంద్రియగోచరం కాదు, అంటే కళ్ళకి కనిపించని శక్తి. అది శబ్దం చేత కాని, స్పర్శ చేత కాని, వాసనచేత కాని , కంటిద్వారా కాని ఈ కర్మపంచేంద్రియాల ద్వారా కాని ఈ బ్రహ్మాన్ని చూడలేం. దాన్ని అనుభవంలోకి తీసుకుని రాలేం. అంటే మన ఈ పంచకర్మేంద్రియాలకి ఈ బ్రహ్మతత్వం అగోచరం అని అర్థం. శబ్ద, రస, రూప, స్పర్శ, గంధ ఈ అయిదు పంచేంద్రియాలకి అనుభవంలోనికి రాలేదన్నమాట. ఏ వస్తువునైనా మనం అనుభవంలోనికి తీసుకుని రావాలంటే ఈ అయిదు గుణాలు ఉంటేనే మనం చూడగలుగుతాం. ఈ అయిదు గుణాలు లేనటువంటి ఈ బ్రాహ్మని మనం ఈ పంచకర్మేంద్రియాల ద్వారా అనుభవించ లేము. అందుకే ఇది ఇంద్రియ గోచరం కాదు.
ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువుని మనం చూడాలంటే , అనుభవించాలంటే ఆ వస్తువుకి ఒక రూపం ఉండాలి, దానికి రసగుణం, స్పర్శగుణం, శబ్దగుణం ఉండాలి లేకపోతే మంచి వాసన ఉండాలి. ఇవన్నీ ఉండడమే కాకుండా చూసేవాడికి కూడా ఈ పంచకర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు కూడా పని చేస్తూ ఉండాలి. ఉదాహరణకి ఎదురుగుండా ఒక భౌతికవస్తువు ఉన్నప్పటికీ కంటి చూపు లేనివాడు ఆ వస్తువు జ్ఞానాన్ని పొంద లేదు. అలాగే చెవిటివానికి గ్రహణ శక్తి ద్వారా ఆ విషయం యొక్క భౌతిక జ్ఞానం లభించదు. అలాగే స్పర్శ జ్ఞానం లేనివాడు ఆ వస్తువు యొక్క జ్ఞానం ఉండడం కష్టం. అందుకనే ఎదురుగుండా ఒక వస్తువుకి ఈ అయిదు గుణాలు ఉన్నప్పటికీ చూసేవానికి ఈ పంచ జ్ఞానేంద్రియాలు పని చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ వస్తువు యొక్క సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అందుకనే ఈ అయిదింటినీ జ్ఞానేంద్రియాలు అని చెప్పుకోవడం జరిగింది. ఇంద్రియ గోచరం కాని వస్తువు మనస్సు చేత గ్రహించబడదు. ఎందుకంటే ఈ కర్మేంద్రియాలు ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు ఉదాహరణకి., ఒక మామిడిపండు రుచి చూసినప్పుడు అది తియ్యగా ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఆ వస్తువుకి రసగుణం ఉంది. ఇది మనస్సు చేత గ్రహించబడుతుంది. ఫలానా వస్తువు తియ్యగా ఉన్నది అని మనకి అనిపించినప్పుడు ఈ రుచిని మనస్సు ఇదివరకే అనుభవించింది కాబట్టి మనస్సుకి ఆ తియ్యదనం గురించి తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మిగతా లక్షణాలన్నీ కూడా మన జ్ఞానేంద్రియాలు అనుభవించి నప్పుడు వాటి యొక్క లక్షణాలు మనస్సు గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వస్తువు యొక్క లక్షణం తర్వాత ప్రస్తావనకి వచ్చినప్పుడు మనస్సు తెలుసుకుంటుంది. కాని ఇక్కడ ఈ బ్రహ్మ పదార్థానికి ఈ లక్షణాలన్నీ లేవు కాబట్టి మనస్సుకి కూడా ఇది అగోచరమే. మనస్సు చేత కూడా అనుభవింప చేయ లేనట్టి పదార్థమే. అది మనస్సు చేత ఊహింప బడదు కాబట్టి వాక్కు ద్వారా మనం దాన్ని వర్ణించ లేము. దీన్నే అవమానసగోచరం అని అంటారు. మనస్సు చేత కాని, వాక్కు చేత కాని వర్ణింపబడ లేని పదార్థాన్ని అలా మనం పిలుస్తూ ఉంటాం.
మరి ఈ ఇంద్రియాల చేత కాని, వాక్కు ద్వారా కాని, మనస్సు ద్వారా కానీ గ్రహించ లేని ఈ పదార్థాన్ని మనం ఎలా తెలుసుకోవాలి ? ఎందుకంటే ఈ మూడు తత్వాలు లేని దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అది ఎలా సాధ్యం? అనే ప్రశ్న మనందరికి వస్తూ ఉంటుంది. ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలి? ఎలా తెలుసుకోవాలి? అంటే ఈ బ్రహ్మ తత్వాన్ని అనుభవించినట్టి, గ్రహించినటువంటి మహాత్ములు, మహర్షుల యొక్క అనుభవం, సాధనల ద్వారా వాళ్ళు తెలుసుకున్నటువంటి ఈ బ్రహ్మ పదార్థాన్ని మనమంతా శాస్త్రంలో చెప్పబడ్డట్టుగా ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి చాలా మంది మా అనుభవం లో లేనిది మేము ఎలా నమ్ముతాం? అని ప్రశ్న వేస్తూ ఉంటారు. ఎవరికో వచ్చిన అనుభవం మా అనుభవం కాదు కదా ! మరి మేము ఆ అనుభవాన్ని ఎలా తెలుసుకోవాలి? అని అడుగుతూ ఉంటాం. ఇది సర్వ సాధారణమే. ఉదాహరణకి మీరు post graduation డిగ్రీ చేశారు అని అనుకోండి. మరి కాలేజి నుంచి ఉత్తీర్ణత సంపాదించినాక శాస్త్ర పరిజ్ఞానం ఉంది కాని అనుభవం లేదు కదా ! మరి ప్రతీ వాళ్ళు మీకు అనుభవం ఉంటేనే మేము మీకు ఉద్యోగం ఇస్తాం అని అంటే మీకు మరి ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉండవు కదా! అప్పుడు మీరేం చేస్తారు? అనుభవం కోసం ఏదో చిన్న కంపెనీలో మీరు నేర్చుకున్న శాస్త్రీయ పరిజ్ఞానం అనుభవంలోనికి రావాలని చేరుతారు. అక్కడ మీకన్నా ఎంతో అనుభవం ఉన్నవారి క్రింద మీరు శిక్షణ పొందుతూ ఉంటారు. వారు చెప్పిన పద్ధతులను అనుసరించి మీరు మెల్ల మెల్లగా అనుభవాన్ని సంపాదించుకుంటారు. ఏవిధంగా అయితే మీరు ఈ లౌకిక ప్రపంచంలో మరి ఉత్తీర్ణత సంపాదించి, శాస్త్రీయ పరిజ్ఞానం ఉండి కూడా, అనుభవాన్ని పెద్దవాళ్ళ దగ్గర ఏవిధంగా నేర్చుకున్నారో అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఇటువంటి మహాత్ములు, మహర్షులు, వాళ్ళు అనుభవించినట్టి అనుభవాలు, సాధనాలు ఇవన్నీ గ్రంథస్థం చేసినప్పుడు మనం ఆ గ్రంథాలన్నీ చదివి వాళ్ళు చెప్పిన మార్గంలో మెల్లమెల్లగా వెళ్ళడం మొదలుపెడతాం. అంతే కాని ఏ విషయానికి కూడా సాధన లేకుండా ఫలానా వారికి అనుభవం లోనికి వచ్చింది మాకు అనుభవం లోనికి రాలేదంటే అది తర్కానికి అందని విషయం. మీరు కూడా క్రమక్రమంగా ఏదో మీకు నచ్చిన సాధన మీరు చేస్తూ ఉంటే, మహాత్ములు అనుభవంలోనికి తెచ్చుకున్న విషయాలన్నీ కూడా మీకు తప్పకుండా అనుభవంలోని వస్తాయి.
(సశేషం)