జమ్మూ కాశ్మీర్ అసలు చరిత్ర (Episode no - 2)
నేను పనిచేసిన ఈస్ట్ ఆఫ్రికా దేశస్థులందరికి కూడా భారతదేశం మీద ఒక పెద్ద అపోహ ఉంది. మనమే దురాక్రమణ చేశాం జమ్మూ కాశ్మీర్ మీద అని. అసలు ఏం జరిగింది? యధార్ధం ఏమిటి? అన్నది మనలో చాల మందికి తెలియదు. తెలుసుకోవలసిన అవసరం ప్రతీ భారతీయుడికి ఉన్నది. అప్పుడే మనం ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతాం. రండి! రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన ఉపన్యాసం చదవండి. వాస్తవాలని గ్రహించండి. మన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక జమ్ముకాశ్మీర్ ని హరి సింగ్ అనే ఒక హిందూ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజు హిందువు మెజారిటీ ప్రజలు ఇస్లాం మతస్థులు. బ్రిటీష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ హరి సింగ్ ని ప్రభావితం చేశారు స్వతంత్ర దేశంగా ఉంటె మంచిది అని నానా రకాలుగా చెప్పి వెళ్లారు. హరి సింగ్ కూడా అదే మాదిరిగా స్వతంత్ర దేశంగానే నేను ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా పదే పదే బ్రిటీష్ వాళ్ళు హరి సింగ్ బుర్రని పాడుచెయ్యడం మొదలుపెట్టారు. అదే సమయానికి పాకిస్తాన్ తన సైన్యంతో జమ్ముకాశ్మీర్ పై దురాక్రమణ చెయ్యడం జరిగింది. మహారాజా హరి సింగ్ దగ్గర పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కొనేటంత శక్తి లేదు. అతనికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఈలోగా పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్ లోని చాలా భాగానికి చొచ్చుకుని వస్తున్నది. స్వతంత్ర రాజ్యంగా ఉండాలి అని అనుకున్న అతని కలలన్ని నిరాశగా మిగిలిపోయాయి. స్వతంత్ర రాజ్యం కాదు కదా ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో భాగంగా ఏర్పడే ప్రమాదం ముంచుకువచ్చింది. అటువంటి దిక్కు తోచని పరిస్థితిలో మహారాజా హరిసింగ్ అతని ప్రధానిని సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి పంపించడం జరిగింది. పాకిస్తాన్ దేశం బారి నుంచి వారిని కాపాడవలసినదిగా హరిసింగ్ గారి ప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ ని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. దానికి నవ్వుతూ వల్లభాయ్ పటేల్ మీరు స్వతంత్ర రాజ్యంగా ఉండాలని అనుకున్నారు కదా! భారతదేశంలో కలవకూడదని అనుకున్నారు కదా! అటువంటప్పుడు స్వతంత్ర రాజ్యంగానే ఉండిపోండి. మాకు అభ్యంతరం లేదు. మీకు మా సైన్యాన్ని ఎందుకు పంపించాలి? మీకోసం మేమెందుకు పోరాడాలి? అని చెప్పగా ప్రధాని చాలా తెలివిగలవాడు కాబట్టి మీరడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే సమయం లేదు. అవన్నీ మనం తరువాత మాట్లాడుకుందాం. ముందు మీరు మా దేశాన్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి. అని మళ్ళా ప్రాధేయపడ్డాడు. మీ దేశాన్ని మా సైన్యాన్ని పంపించి రక్షించాలి అని అనుకుంటే మేము ఒక షరతు మీద అంగీకరిస్తాం అది ఏమిటంటే మీరు బేషరతుగా మీ జమ్మూ కాశ్మీర్ రాజ్యాన్నంతా కూడా మా భారతదేశంలో విలీనం చేస్తున్నామని మీరు ఎప్పుడైతే ప్రకటిస్తారో ఎప్పుడైతే ఆ దస్తావేజుల మీద సంతకాలు పెడతారో అప్పుడు మాత్రమే మేము ముందుకు వస్తాము ఎందుకంటే నిభందనల ప్రకారం మీరు స్వతంత్ర రాజ్యంగా ఉన్నప్పుడు మేము జోక్యం చేసుకోవడం సబబు కాదు. మా సైన్యాన్ని పంపించి మా సైనికుల ప్రాణాలు పోగొట్టడం న్యాయం కాదు అన్నారు. భారతదేశపు సైన్యం తన సరిహద్దులు రక్షించుకోవడానికే పోరాడతాయి తప్ప ఒక స్వతంత్ర దేశంగా ఉండాలనుకొనే మీ జమ్మూ కాశ్మీర్ కోసం వాళ్ళు పోరాడటం అనేది న్యాయసమ్మతం కాదు అని నచ్చజెప్పాడు. దిక్కుతోచని ప్రధాని ఆదరబాదరగా మళ్ళీ మహారాజా హరిసింగ్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన విషయాలన్నీ చెప్పాడు. ఆయన సైన్యాన్ని పంపదలచుకోలేదు జమ్మూ కాశ్మీర్ ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేస్తున్నామని ఒక సంధి పత్రం మీద సంతకం చేస్తే కానీ ఆయన మనకి సహాయం చేసేటట్టుగా లేడు అని చెప్పాడు. అప్పటికే పాకిస్తానీ సైన్యం శ్రీనగర్ దాకా వచ్చేసింది. ఇంకా ఎంతో దూరంలో లేరు వాళ్ళు. స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా పాకిస్తానీ సైన్యానికి మద్దతు పలకడం కూడా ఆయన్ని ఆలోచింపచేసింది. వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పినట్టుగానే జమ్మూ కాశ్మీర్ ని సంపూర్ణంగా భారతదేశంలో విలీనం చేస్తున్నట్టుగా సంతకం చేశాడు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యానికి ఆదేశాలిచ్చాడు. వెంటనే భారతదేశపు వైమానిక దళం అలాగే పదాతి దళం జమ్ముకాశ్మీర్ లో ప్రవేశించింది. చాలా ఆశ్చర్యంగా 24 గంటల లోనే మన భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించారు. భారతీయ సైన్యం చూపించినటువంటి అధ్భుతమైన ధైర్య సాహసాలు, పరాక్రమ పటిమ మొత్తం ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచింది. పాకిస్తానీ సైన్యం శ్రీనగర్ ని ఆక్రమించే దశలో ఉన్నప్పుడే భారత సైన్యం అక్కడికి చేరి వాళ్ళని తిప్పి కొట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా నరికివేయసాగారు. ఇక లాభం లేదనుకొని పాకిస్తానీ సైన్యం పలాయనం పటించారు. చివరికి భారత సైన్యం పాకిస్తాన్ సరిహద్దుల్ని కూడా దాటింది. అలాగ భారత సైన్యం పాకిస్తానీ సైన్యాన్ని తరుముతూ తరుముతూ చాలా భూభాగాన్ని ఆక్రమించేసింది. ఇంకా లాహోర్ ఎంతో దూరంలో లేదు. అప్పుడు వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఇంకా వల్లభాయి పటేల్ ని కొంచెం సమయం ఇవ్వండి పాకిస్తాన్ ని పూర్తిగా ఆక్రమించేస్తాం అని అడిగారు. పాకిస్తాన్ కి భారతదేశ సైన్యం ఒక మంచి గుణపాఠాన్ని చెప్తున్న సమయంలో పాకిస్తాన్ దిక్కుతోచని సమయంలో ఉన్నప్పుడు ఒక ఘోరమైన చారిత్రాత్మక తప్పిదం జరిగింది. అదేమిటంటే ప్రధాని జవహరలాల్ నెహ్రు సర్దార్ వల్లభాయి పటేల్ తో సంప్రదించకుండానే యుద్ధ విరమణ ప్రకటించారు. నిజానికి యుద్ధ విరమణ ఎప్పుడు ప్రకటిస్తారంటే క్యాబినెట్ సమావేశాలు జరిపి ఈ విషయాలని చర్చించి మెజారిటీ మంత్రులందరూ అంగీకారం తెలిపిన తరువాతనే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నియమాలు ఏమీ పాటించకుండా జవహరలాల్ నెహ్రు వెంటనే యుద్ధ విరమణ ప్రకటించారు. ఇది మన భారత ప్రధాని చేసినటువంటి ఘోరమైన తప్పు. దానికి ఇప్పటికీ కూడా మనమంతా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం. ఇంకొక ఘోరమైన తప్పిదం నెహ్రు వాల్ల జరిగింది దానిని ఏ భారతీయుడు కూడా క్షమించరానిది ఏమిటంటే అది ఆయన ప్రజల ముందు కాకుండా సరాసరి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఢిల్లీ కి వెళ్ళి యుద్ధ విరమణ ప్రకటించాడు. అంతేకాకుండా మూడవ తప్పిదం ఏమి చేశాడంటే జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ లో ఉండాలా భారత్ లో ఉండాలా అనే విషయాన్నీ మేము యునైటెడ్ నేషన్స్ ద్వారా పరిష్కారం చేసుకుంటాము అని ప్రకటించేశాడు.మహారాజా హరి సింగ్ తన స్వతంత్య్ర రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ దస్తావేజుల మీద సంతకం చేశాడు. మిగతా రాజ్యాల మాదిరిగానే కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగం అయినప్పుడు ప్రధాని జవహరలాల్ నెహ్రుకి యునైటెడ్ నేషన్స్ వారి దగ్గరకి వెళ్ళాల్సిన పనేముంది?జమ్మూ కాశ్మీర్ ని ఒక వివాదాస్పద రాజ్యంగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది?ఈ చారిత్రాత్మక సత్యం చాలామందికి తెలియదు. పండిట్ జవహరలాల్ నెహ్రు చేసినటువంటి ఈ తప్పిదం మూలంగా మన గొంతుకి మనమే ఉరి వేసుకున్న మాదిరిగా అయిపోయింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ పదేపదే సవాలు చేస్తూ ఉంటుంది. ఈ పరిణామాల మూలంగా సంయుక్త రాష్ట్రాలు అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మరి జమ్మూ కాశ్మీర్ లోకి రావడం భారతదేశ సైన్యాన్ని వెనక్కి పిలిపించడం అక్కడ ఇవాళ ఉండి ఈ సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే దిశగా ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు కానీ సాంకేతికపరంగా ఆలోచిస్తే అసలు యునైటెడ్ నేషన్స్ ఇక్కడకి రావాల్సిన అవసరమే లేదు. అనేక రాజుల మాదిరిగా, సంస్థానాధీశుల మాదిరిగానే మహారాజా హరి సింగ్ కూడా తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ దస్తావేజుల మీద సంతకం పెట్టేటప్పుడు అక్కడికి యునైటెడ్ నేషన్స్ రావాల్సిన అగత్యం లేదు కదా! ఈనాటికి కూడా మరి జమ్మూ కాశ్మీర్ వివాదాస్పద రాజ్యంగానే ఉంది. అది భారతదేశానికి లేదా పాకిస్తాన్ కి దేనికి చెందాలో యునైటెడ్ నేషన్స్ నిర్ణయించాలి. కాబట్టి వాళ్ళు కాశ్మీర్ లోనే ఉండి సూచనలు ఇస్తూ ఉంటారు. ఈవిధంగా నెహ్రు ఇచ్చిన ఒక ప్రకటన మూలంగా ఈరోజుకి కూడా జమ్మూ కాశ్మీర్ రగిలిన కుంపటి మాదిరిగానే ఉంది. ఎంతో హాయిగా, సంతోషంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఒకప్పటి జమ్మూ కాశ్మీర్ ఈనాడు రగిలిన కుంపటి మాదిరిగా ఉంది. వేలాదిమంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు ఇంకా పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఇంకా పరమ ఘోరంగా ఉన్నది. ఉగ్రవాదులు అందరూ కూడా పాకిస్తాన్ లో శిక్షణ పొంది రహస్యంగా కాశ్మీర్ లోకి చొరబడి ఎన్నో దురాగతాలు చేస్తున్నారు. ఈనాడు చాలామంది యువకులు కూడా పాకిస్తాన్ కే వారి సమర్ధతని తెలపడం చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇది అసలు జరిగినటువంటి వాస్తవిక గాధ.