శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి తపన
శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి ఆవేదన, ఆయన ఆలోచనలు, భావాలు నాగానాథునికి తెలుస్తున్నాయి. సంస్థానం వారు వాళ్లకి ఇష్టం లేని భాగాలు తీసివేసి ప్రచురించడం, ఆ తర్వాత పీఠాధిపతి ఆ సంస్థానం లోని సాక్షాత్తు దేవతామూర్తుల విగ్రహాలముందే పాద పూజ చేయించుకోవడం, ఆ నీళ్ళు అక్కడే ఉన్న శ్రీపాదశ్రీవల్లభ, నృసింహ సరస్వతి విగ్రహాల మీద పడడం మల్లాది గోవింద దీక్షితులు గారు చూసి బాధ పడి , ఆ సంస్థానం వారితో ఆ విషయం మీద గొడవ పడడం, ఆ తర్వాత ఆయన ఆ సంస్థానానికే వెళ్ళడం మానేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసినటువంటి అసలైన గ్రంథరాజాన్ని తీసుకుని పలువురి దగ్గరకు వెళ్లి యథాతథంగా ప్రచురించమని ప్రాధేయపడ్డారు. ఈ క్రమ౦లో ఆయన దగ్గరకి చాలామంది వ్యక్తులు రావడం, ఆ పుస్తకాన్ని తీసుకోవడం, ఆయనకి తెలియకుండానే ఒక చలనచిత్రం నిర్మించాలని తలపోవడం, ఇంకొక వ్యక్తి కూడా తప్పకుండా ప్రచురిస్తానని తీసుకుని వాళ్ళు ఎవరూ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ప్రచురించక పోవడంతో దీక్షితులు గారి ఆర్తి, ఆవేదన పెరుగుతూ ఉన్నాయి.
ఈ క్రమంలోనే దీక్షితులు గారు విశాఖపట్టణంలో ఒక సాధు మహాత్ముణ్ణి కలవడం, ఆయన కూడా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తానని వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో దీక్షితులు గారు ఆ సాధు మహాత్మునికి “దయ చేసి మీరు ఈ పుస్తకాన్ని సంస్థానం వారు ప్రచురించాకనే ప్రచురించాలని ప్రార్థించడం జరిగింది. సంస్థానం వారు ప్రచురించిన పుస్తకం క్రీ.శ.2000 లో జరగడం, తదుపరి దత్తుని పేరు పెట్టుకున్న సంస్థ వాళ్ళు కూడా ఆ పుస్తకం మీద హక్కులు గ్రహించి యథాతథంగా ప్రచురించడం నాగనాథుని దృష్టికి గోచరించింది. ఆయన దగ్గరకి వచ్చిన వ్యక్తులందరి ఆరాలలో నాగనాథునికి నిజాయితీ చాలా తక్కువగా కనిపించింది. కేవలం వారు స్వార్థపరంగా ఆ అద్భుత గ్రంథరాజాన్నిప్రచురించి, భక్తులని ఆకర్షించి ధనాన్ని పోగు చేయడమే పరమ లక్ష్యంగా కనిపించింది. నిర్మల హృదయం కల మల్లాది గోవింద దీక్షితులు గారు అందరిలో మంచిని మాత్రమే చూడడం జరిగింది. హరబాబా గారు కూడా హిందీ భాషలో, మరాఠి భాషలోకూడా ప్రచురించడానికి హక్కులు సంపాదించుకుని అతనికి తెలిసిన మరాఠి భక్తులకి ఆ గ్రంథ రాజాన్ని ఇవ్వడం, కాని వారందరూ ఏమాత్రం శ్రద్ధ లేకుండా శ్రీ గోవింద దీక్షితులు గారిని తిప్పడం, దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు ఇలా గడిచిపోవడంతో శ్రీ దీక్షితులు గారి ఆవేదన పెరగడం నాగనాథుడు గమనించాడు. నాగానాథునికి కించిత్తు విచారం కలిగింది. “ ఆహా ! ఏమి కలి మహిమ ! భక్తులుగా నటిస్తూ సాక్షాత్తు శ్రీపాదుల వారి 33 వ తరమైన వ్యక్తికి కూడా ఏమాత్రం గౌరవం ఇవ్వ లేరే ! వారి స్వార్థ ప్రయోజనాల కోసమే ఆయన్ని వాడుకోవడం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి త్వరలోనే ఒక తార్కాణం దొరికింది.
వీరవాసరంలో చెప్పులు లేకుండానే నడుస్తున్న శ్రీ గోవింద దీక్షితులు గారి పాదంలో ఒక మేకు గుచ్చుకుని, ఆయన తీవ్రంగా జబ్బు పడడం కనిపించ సాగింది. అప్పటికే ఆయన హృద్రోగంతో బాధపడడం కనిపించింది. సంస్థానం వారు కాని దత్తుని పేరు పెట్టుకున్న సంస్థానం వారు కాని ఆయన సంగతి తెలిసినాక పొరబాటున కూడా ఆయన దగ్గరకి రావడం మానివేశారు. ఆయన ఎంతో బాధ పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఆయన కూడా ఉన్నటువంటి శిష్యుడు రవి బాబు, పిఠాపురంలో కంప్యూటర్ ఆఫీస్ నడుపుతున్న ఒక యువకుడు వీరిద్దరూ కూడా శ్రీ దీక్షితులు గారి కోసం ఆవేదన పడడం జరిగింది. వారంతా గాభరా పడి అంబులన్సు కోసం ఫోన్ చేయడం, అది రాక పోవడంతో ప్రైవేటు కారు మాట్లాడుకుని కాకినాడ వైపు ప్రయాణం కావడం ఈ దృశ్యాలన్నీ నాగనాథునికి కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా చూస్తున్నటువంటి నాగనాథునికి చాలా బాధ వేసింది. పుస్తకం ద్వారా లక్షలు లక్షలు సంపాదించుకున్న ఏ సంస్థ కూడా ఈయన్నిగురించి పట్టించుకోక పోవడం, పుస్తకం ప్రచురిస్తామని ఆయన్ని తిప్పించుకోవడం, ఆయనకి తెలియకుండా ఒక చలనచిత్రం నిర్మించాలని అనుకోవడం ఇవన్నీ గమనిస్తున్నారు.
నాగానాథునికి ఇంకొక అద్భుతమైన దృశ్యం కనిపించింది. శ్రీ గోవింద దీక్షితులు గారి ప్రక్కన సుమతీ మహారాణి గారు రావడం, అప్పటికే ఆయన హృదయచలనం (హార్ట్ బీట్స్) దాదాపు ఆగిపోయినట్టుగానే కనిపించడం, దీక్షితులు గారి తల ఆవిడ తన ఒడిలో పెట్టుకుని ఆయన్ని మందలించడం, “నాయనా ! ఎందుకు ధూమ్రపానం చేస్తున్నావు? ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఎందుకు మనస్సులో కలత చెందుతున్నావు? అంటూ ఎంతో ప్రేమగా శ్రీ గోవింద దీక్షితులు గారి నుదురు రాస్తున్నట్టుగా, మళ్ళీ ఆయనకి పునర్జన్మ ప్రసాదించడం, ఆయన హృదయచలనం మళ్ళీ మామూలుగా అయిపోవడం నాగనాథునికి కనిపించింది.
(to be continued .... )