స్టేషనరీ సూపర్ మార్కెట్:
నా ఉద్యొగం:
మరుసటిరోజు కాలకృత్యాలన్నీ తీర్చుకుని రావు గారితో
కలిసి నేను ఆఫీసుకి బయల్దేరాను. రావు గారు నగారా అనే ప్రాంతంలో ఎనిమిదవ అంతస్తులో
వుంటారు. రెండు బెడ్రూముల ఫ్లాట్. దాని ఓనర్ ఒక గుజరాతీ ఆయన. ఆఫీస్ కి
వెళ్ళేటప్పటికి స్టాఫ్ అంతా వచ్చి వున్నారు. అప్పుడు రావు గారు ఆయనే స్వయంగా గేటు
తెరచి రావటం,ఎక్కడివాళ్ళు
అక్కడ యాంత్రికంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోవటం జరుగుతున్నాయి. రావు గారు ఆ కంపెనీలో నం.2 పొజిషన్ లో
వున్నారు కాబట్టి అతనికి ప్రత్యేక కేబిన్ వుంది. ఆయన ఆ కంపెనీకి ఫైనాన్స్ మేనేజర్
గా పనిచేస్తున్నారు. ఓనర్ కిరణ్ షా తర్వాత రావు గారికి అంతటి గౌరవం వుంది.
ఎందుకంటే అతని చేతిలో అధికారం వుంది కాబట్టి. రావు గారు ఇండియా లో బీకామ్ చదివి
నిరుద్యోగిగా వున్నప్పుడు వాళ్ల అన్నగారు నైరోబీకి రావటం, తమ్ముణ్ణి
పిలిపించుకోవటం జరిగింది. అక్కడే ఆయన ముందు చిన్న ఉద్యోగంలో
చేరాడు. కొన్ని నెలలు
పనిచేసాక వాళ్ల అన్నగారి స్నేహితుడు ఒకరు, నైరోబీలో తెలుగువాళ్ళలో ఒక ప్రముఖుడు.
అందరూ ఆయన్ని గంటిగారు అంటారు. ఆయన కిరణ్ షాకి రికమెండ్ చేయగా, రావుగారు ముందుగా
అక్కడ అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్ గా చేరి, చాలా కష్టపడి ఆయన నమ్మకాన్ని పొంది ఇప్పుడు ఫైనాన్స్
మేనేజర్ గా చలామణీ అవుతున్నారు. కంపెనీ వాళ్లే అతనికి ట్రైనింగ్ ఇప్పించారు. ఇటాలీ
అని అకౌంటింగ్ ప్యాకేజీ కూడా నేర్పించారు. మెల్లమెల్లగా ఆఫీస్ తాళం
చెవులు కూడా రావుగారి దగ్గరే వుంటుండేవి.
ఆఫీసు తెరవటం, మూయటం, అందరికీ
భాద్యతలు అప్పగించటం అన్నింట్లో మంచిగా అధికారం లో ఉండేవాడు. కెన్యాలో చిన్న, పెద్ద
కంపెనీలు అన్నీ కూడా గుజరాతీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. అక్కడ వ్యవహారశైలి చాలా విచిత్రంగా
ఉంటుంది. ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎక్సపట్రియాట్స్ మధ్య చిన్న చిన్న
తగాదాలు పెడుతూవుంటారు. వీళ్ళ మధ్య ఐకమత్యం ఉండకుండా చూస్తూవుంటారు. అక్కడ పని
చేస్తున్నటువంటి ఎక్సపట్రియాట్స్ ముఖ్యంగా ఇండియన్లు ఒకరి మీద ఒకరు బాస్ కి చాడీలు
చెప్పటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాడికి ప్రత్యేకంగా నిఘా వేయాల్సిన
అవసరం ఉండేది కాదు. ఒకరి జీతాలు కూడా ఇంకొకరికి తెలియకుండా చాలా గుట్టుగా వాళ్ల
బిజినెస్ లు చేస్తుంటారు. చాలామంది గుజరాతీ వాళ్ళు ఇతర గుజరాతీ వాళ్ళని వాళ్ళ
కంపెనీలో తీసుకోరు. ఎందుకంటే గుజరాతి వాళ్ళ రక్తంలోనే వ్యాపారం చేసే దృక్పధం బాగా
ఉంటుంది కాబట్టి. తూటి గుజరాతీ వాడు వ్యాపారంలో కిటుకులన్నీ తెలుసుకొని వాడికి ఎదురుగానే
ఇంకొక పెద్ద షాప్ పెట్టేస్తాడు. అందుకే చాలామంది ఉద్యోగులు గుజరాతీ కాని వాళ్ళనే
తెచ్చుకుంటారు. స్టేషనరీ సూపర్ మార్కెట్లో దాదాపు 4000 నుంచి 5000 ప్రొడక్ట్స్
ఉంటాయి. కంప్యూటర్ కి సంబంధించిన వస్తువులు, స్టేషనరీ, రకరకాల పేపర్లు, అంతే కాకుండా జపాన్ వారి అల్మరాలు ఇంపోర్ట్
చేస్తూవుంటారు. దాన్లో ప్రముఖమైనది చేజ్ కంపెనీ వాళ్ళది. జపాన్ నుంచి తెప్పిస్తూవుంటాడు.
అయితే గుజరాతీ వాళ్లలో వ్యాపార పరంగా ఎంత పోటీ వున్నా, అవసరం
వచ్చినప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ వుంటారు. అంటే ఉదాహరణకి కిరణ్ షాకి
వాళ్ళు ఒక్కొక్కరూ 90 రోజులు క్రెడిట్ ఆలా ఇస్తూవుంటారు. చాలా మంది గుజరాతీ
వాళ్లు కెన్యా వాళ్ళని చాల సులభంగా మోసం చేసేస్తువుంటారు. అది నేను చేరిన
కొద్దిరోజుల్లోనే నాకు తెలిసొచ్చింది. దాదాపు 80 మంది స్టాఫ్ వుంటారు. డెలివరీ
వ్యాన్లు చాలా పెద్దగా ఉంటాయి.
అవి మొత్తం కెన్యా అంత తిరిగి సప్లై చేస్తూ ఉంటాయి. ఈవిధంగా ఈ కిరణ్ షా అనే
వ్యక్తి తన జీవితాన్ని చిన్న చిన్న చిల్లర పనులతూ మొదలుపెట్టి కొంత పెట్టుబడిని
సంపాదించి,ఒక చిన్న షాప్
ఓపెన్ చేసాడు. పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉండేవాడు.
అతను
మరి కొద్దికాలంలోనే ఈ గవర్నమెంట్ ఆఫీసులో పలుకుబడి సంపాదించి, గవర్మెంట్
టెండర్లు సంపాదించి, లంచాలిచ్చి, అతనికి ఆఖరి నిముషంలో ఫోన్ చేసి చెప్తారు ఆఖరి
టెండర్లో వాళ్ళు ఎంత పలికారో.వెంటనే కిరణ్ షా ముందే నింపిన ఫారంలో తన
రిప్రెసెంటేటివ్ ని అక్కడేవుంచి ఆ టెండర్లో కొటేషన్ నింపి ఇస్తాడు. ఈ విధంగా
నూటికి 90 శాతం వరకు కిరణ్
షానే గవర్నమెంట్ టెండర్లు సంపాదిస్తూ కొన్ని మిలియన్ డాలర్లు సంపాదించగలిగాడు. ఆ
చిన్న దుకాణం నుంచి ఒక పెద్ద విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు. మొదట్లో ఈ
ఆఫ్రికన్లతూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళటం,వాళ్లతూ పడుకోవటం, వాళ్ళ తూటే కలిసి తినటం ఇవన్నీ చేసి వాళ్ళ
బలహీనతల్నికనుక్కునే వాడు. అంటే చాల మంది కెన్యావాళ్ళకి ఇక్కడ జీతాలు తక్కువగా
ఉంటాయి. రకరకాల స్థాయిలో వున్న వాళ్లతూ పరిచయాలు పెంచుకొని అనతికాలంలోనే ఒక పెద్ద
ధనవంతుడు అయ్యాడు. ఇదే చరిత్ర అక్కడ దాదాపు గుజరాతీ వాళ్లందరూ కూడా ముందు
పొట్ట చేత పట్టుకుని చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా కేవలం అక్కడ మనుషుల
బలహీనతల్ని ఆసరాగా చేసుకొని, చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి, కొద్ది
కాలంలోనే మొత్తం కెన్యా దేశం యొక్క ఆర్ధిక వ్యవస్థని మొత్తం వాళ్ళ ఆధీనంలోకి
తీసుకున్నారు. అక్కడ వున్న పెద్ద పెద్ద 5స్టార్ హోటళ్లు కానీ, రిసోర్ట్లు కానీ , సబ్బుల
తయారీ, పెన్సిళ్ల
తయారీ, పేపర్ల
తయారీ అన్ని రంగాల్లో కూడా వాళ్ళు పరిశ్రమలన్నీ స్థాపించి పైకి వచ్చారు. అక్కడ
వాళ్ళ ఇల్లు చూస్తే నిజంగా మనకి కళ్ళు తిరిగిపోతాయి. కాంపౌండ్ గేటు నుంచి వాళ్ళ
ఇంటికి వెళ్లాలంటే కారులో 5 నిముషాలు పడుతుంది. అంత విశాలమైన మైదానం, పెద్ద
పెద్ద భవనాలు, మనం కాళ్ళు కింద పెట్టగానే ఒక ఆరు
అంగుళాలు మన పాదాలు లోపలి వెళ్లిపోతాయి. అంత ఒత్తుగా ఉంటాయి కార్పెట్లు. ఖరీదైన
ఫర్నిచర్. ఎక్కువగా వీళ్లు UK నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు. వూహించలేనత ధనాన్ని
వాళ్లు అనతికాలంలోనే సంపాదించటం జరిగింది.
కిరణ్ షాతో భేటీ:
ఇలా రావుగారు ఆఫీస్ అంతా తిప్పుతూ అన్నీ వివరంగా
చెప్పుతూ ఉండగా సింబా రానే వచ్చాడు. అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. అందరు
గుసగుసలుగా సింబా సింబా అంటుంటే నేను రావుగారిని అడిగాను ఏమిటి అని, వెంటనే ఆయన
సింబా అంటే సింహం అని, సింహం వస్తున్నాడంటే మన బాస్ వస్తున్నట్టు
లెక్క.అప్పటిదాకా మాములుగా వున్నా వాళ్ళు ఏవో పనులు చేస్తున్నట్టుగా హడావిడిగా అటు
ఇటూ తిరుగుతూ కన్పిస్తూవుండాలి. కిరణ్ షా తన కేబిన్ కి వెళ్ళగానే నన్ను,రావుగారిని
పిలిచాడు. పరిచయాలన్నీ అయిపోయాక నా బయోడేటా చూసాడు. దాదాపు నేను పనిచేసిన MNC నుంచి యాభై, అరవై
అప్ప్రీసియేషన్ లెటర్లు చూసాడు. మీ రికార్డు చాల బాగా వుంది. ఇంత రెపుటేడ్ MNC లో పనిచేసారు.
ఇండియాలో చాలా ఇంప్రెస్సివ్ గా వుంది మీ
రికార్డు. తర్వాత మీ ఫోటోలు కూడా చుసాను క్లినికల్ మీటింగులు జరుపుతున్నవి. అలాగే
మా కంపెనీని కూడా మీరు వృద్ధిలోకి తెస్తారని ఆశిస్తున్నాను. ఇవాళ మధ్యాహ్నం కొంచెం
తొందరగానే బయటకి వెళదాము. మీకు కంపెనీ వాళ్ళ గురించి కొద్దిగా పరిచయం చేయాల్సి
వుంది అని చెప్పాడు. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం అయినా తర్వాత 3 గంటల ప్రాంతంలో
నేను రావుగారితూ కలిసి కిరణ్ షా ఇంటికి వెళ్ళటం జరిగింది. అతని ఇల్లు చాలా
అద్భుతంగా ఉంది. హాలీవుడ్ సినిమాలో చూపించినట్లుగా వుంది. బయట అంతా పెద్ద లాన్, చాలా మంది
పనివాళ్లు అక్కడ పనులు చేస్తూవున్నారు. లోపలకి తీసుకెళ్లాక ఇంకా వివరించటం మొదలు
పెట్టాడు. దాదాపు అతనికి కెన్యా దేశం అంతా కూడా కస్టమర్లు వున్నారు. అన్ని కౌంటీల్లో కూడా
పెద్దా,చిన్నా, మధ్యరకం
కస్టమర్లు వున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ టెండర్లు లో మాటేరియళ్ళు సరఫరా
చేస్తూవుంటాడు. అలా సేల్స్ పెర్సన్ల గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి చెప్పుకుంటూ
వెళ్ళాడు. సేల్స్ టీంలో చాలా ప్రధమంగా చాలా సీనియర్ పేరు జెన్నిఫర్. ఆవిడ మేనేజర్.
కిరణ్ షాకి కుడిభుజంగా పనిచేస్తూవుంటుంది.
ఆ తర్వాత ఫైథ్,లిలియన్, సూజన్, బ్రెండా, ఎలిజబెత్, సరపైనా, థియాంగో, ఒబుటాఛి ఈ
సేల్స్ పెర్సన్ల గురించి చెప్తూ వచ్చాడు. మొత్తం నైరోబి అంతా వీళ్ళ మధ్య పంచాడు.
పెద్ద పెద్ద కస్టమర్లని జెన్నిఫర్ లాంటి సీనియర్ డీల్ చేస్తుంది. ముఱజ్ అనే అతను ఈ
ట్రాన్స్పోర్ట్ అంత చూసుకుంటాడు. ఒక్కొక్క సేల్స్ రెప్రెసెంటేటివ్ కి ఒక్కొక్క
కార్ ఇవ్వటం కష్టం కాబట్టి వాళ్ళు ఒక్కటే మార్గాన వెళ్తున్నపుడు ఒక్కటే కారులో
నలుగురు, ఐదుగురు
సేల్స్ రెప్రెసెంటేటివ్ లు వెళ్లి అక్కడ కొంతమంది దిగిపోయి అవన్నీ పనులు చేసుకొని
లంచ్ సమయానికి తిరిగి వస్తూ ముందు అనుకున్న చోట వాళ్ళని కలుసుకుని
తీసుకొస్తూవుంటుంది. ఇలా దాదాపు ఎనిమిది కారులు సేల్స్ పీపుల్ కోసమే వున్నాయి.
అలాగే కెన్యాలో చాల కంపెనీల్లో కూడా ఈ మేనేజర్ ఇంటి నుండి బయల్దేరేటప్పుడు మధ్యలో
మధ్యదారిలో ఉన్నవాళ్ళని ఎక్కించుకుని ఆఫీసుకి తీసుకొస్తూవుంటారు. అలాగే
వెళ్ళేటప్పుడు కూడా ఆఫీస్ స్టాఫ్ ని ఒక్కొక్కరిని దారిలో దింపుకుంటూ ఇంటికి రావటం
సాధారణంగా జరుగుతూ ఉంటుంది. లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడితే ఎవరు
కూడా ఆఫీస్ కి టైం కి రాలేరు కాబట్టి ఇలా చేస్తూ వుంటారు. నాకు చాలా సేపు అన్నీ వివరించాడు. కానీ
అన్ని విషయాలు ఒక్కసారే అర్ధం చేసుకోవటం కష్టం కదా, అయినా నేను అతను చెప్తుంటే కొన్ని నోట్ లో రాసుకోవటం
జరిగింది. ఈ విధంగా మొదటిరోజు గడచిపోయింది. మళ్లీ రావుగారు, నేను
ఇంటికి వచ్చేయటం జరిగింది.