Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

14 January 2017

ఆఫ్రికా అద్భుత అనుభవాలు (Amazing African Experiences) - 05

ఆఫ్రికా  అద్భుత అనుభవాలు – 5

మరునాడు యధాప్రకారంగా రావు గారితూ ఆపీసుకి వెళ్ళటం జరిగింది . కిరణ్ షా మొదట్లో చిన్నగా ఒక గదిలో తన వ్యాపారాన్ని మొదలు పెట్టి క్రమక్రమంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుని  మొత్తం భవనాన్నే కొనేసాడు. అంతే కాకుండా అనేకరకాల వ్యాపారాలు కూడా తను చేస్తున్న వ్యాపారానికి అనుసంధానంగా చేస్తూ ఉండేవాడు . ఆ పక్కనే ఒక పెద్ద గోడవును తీసుకుని ఫర్నిచర్  వ్యాపారం చేస్తూ ఉండే వాడు . అంటే అక్కడే వున్న ఒక గుజరాతీ ఇస్మాయిలి వ్యాపారస్తునికి ,(ఇస్మాయిలి అంటే ఆగాఖాన్ ఫాలోయర్స్ అన్నమాట)  కిరణ్ షా ఆర్డర్లు ఇచ్చి  అక్కడనించి ఫర్నిచర్ ఆఫీసులకి, ఇంటికి  సంబంధించిన ఫర్నిచర్  నిలవ పెట్టి మీద వాటి వందశాతం లాభం వేసుకుని అమ్ముతూ ఉండేవాడు. నైరోబీ లో  నేను గమనించింది ఏమిటంటే సెక్యూరిటీ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందిఎందుకంటె దొంగతనాలు చిన్న స్థాయిలో, పెద్ద స్థాయిలో సాధారణంగా  జరిగిపోతూ వుంటాయి. బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో చాలా సెక్యూరిటీ కంపెనీ లు ఉన్నాయి. వాటిలో పెద్ద  సెక్యూరిటీ కంపెనీ పేరు “సెక్యూరీకర్”.  వాళ్లు చాలా అప్ డేటెడ్, ఆధునిక (మోడరన్)  సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. 


ఆ సెక్యూరిటీ కిరణ్ షా బిల్డింగ్ కి వుంది. ఆ షాపులో చిన్న ఎలక అటు ఇటు తిరిగినా అలారం సిస్టం మోగుతుంది. అది మోగిన కొద్ది నిముషాలలో సెక్యూరిటీ వాళ్ళు  జీప్ లో వచ్చేస్తారు. వాళ్ళు వెంటనే రావు గారికి ఫోన్  చెయ్యటం అర్ధ రాత్రి అయినా, తెల్లవారు ఝామున అయినా రావు గారు, నేను వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాకా మళ్ళి తాళం వేసి వస్తూండే వాళ్ళం.  చాలా సార్లు అది ఫాల్స్ అలారం కిందే వస్తూ వుండేది. ఇలా ఒక్కొక్క విషయం ఆయన పరిచయం చేశారు, అవి అనుభవం లోకి కూడా వస్తుండేవి . అంతే కాకుండా జర్మన్ షెపర్డ్,  డాబర్ మెన్ లాంటి కుక్కల్ని కూడా ప్రత్యేకంగా పెంచి ఈ సెక్యూరిటీ కంపెనీ వాళ్ళు వాటికి శిక్షణ ఇచ్చి ఈ ధనవంతుల ఇళ్లల్లో రాత్రి పదింటికి వాటిని స్వేఛ్ఛగా వదిలేస్తారు, అంటే పది తర్వాత మనం ఆ ఇళ్ళకి వెళ్ళామో మన పని అయిపోయినట్టే లెఖ్ఖ అన్నమాట. ఆ కుక్కలు ఇంటికి కాపలాగా తిరుగుతూ  ఏ దొంగయినా ఆ దాపుల్లోకి వెళ్తే మీద పడి ముక్కలు చేసి చంపేస్తాయి. అందుకే వాటిని మనుషులకి అలవాటు చెయ్యకుండా పెంచుతూ ఉంటారు. మళ్ళీ తెల్లవారు ఝామున ఐదు గంటలకి వచ్చి తీసుకుపోతూ  వుంటారు. అక్కడ ఏ వ్యాపారం పెట్టాలన్నా సెక్యూరిటీ కే ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది . అయినా కూడా ఒక్కొక్కసారి దొంగతనాలు జరుగుతూ ఉంటాయి . అందుకే అన్ని కంపెనీలు ఇన్సూరెన్సు తప్పకుండా తీసుకుంటూ వుంటారు.
        పెద్ద హాలు దానిలో ఒకపక్కన సేల్స్ గర్ల్స్ ,సేల్స్ బాయ్స్ ,ఆ కంపెనీ ఇంఛార్జ్ ,కిరణ్ షా బంధువు గుజరాత్ నించి మామూలు చదువు చదువుకున్న వాళ్లనే పిలిపించి పెడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చిన కొద్ది రోజులకే ఆఫ్రికా భాష "స్వాహిలి "నేర్చేసుకుంటూ ఉంటారు. వాళ్లకి రాగానే గుజరాతి  వాళ్ళు ,ఇక్కడ నల్ల వాళ్ళు అంటే కెన్యన్స్ మంచి వాళ్ళు కాదు, దొంగలు. ఎప్పుడూ వారి మీద ఒక కన్ను వేసి ఉంచాలి , వాళ్ళని ఎప్పుడు అరుస్తూ, కసురు కుంటూ ఉండాలి అని చెప్పడం వల్ల సర్వ సాధారణంగా గుజరాతీ పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసే యజమాని బంధువులు ఈ ఆఫ్రికన్స్ మీద చాలా దారుణంగా  అధికారం చలాయిస్తూ ఉంటారు . ఉన్నదానికి లేనిదానికి  మర్యాద కూడా లేకుండా  తిట్టి పోస్తూ ఉంటారు. కొంతమంది యజమానులు ఎంత దారుణంగా ఉంటారంటే పనిష్మెంట్ గా జీతాలు కట్ చేస్తూ వుంటారు. ఇక్కడ నల్ల జాతి వారు నెలలో సగం రోజులు ఆకలితోనే పని చేస్తూ వుంటారు ఎందుకంటే వారి జీతం పదిహేను రోజులకే అయిపోతుంది ఈ పనిష్మెంట్ మూలంగా. మళ్ళీ వీళ్ళే వారికి జీతం అడ్వాన్స్ గా ఇచ్చి వాళ్ళని చెప్పు చేతలలో పెట్టుకుంటారు. అక్కడే  పెద్ద ప్లాటుఫారం మీద నా కేబిన్ ఉంది. అక్కడనుంచి నేను అందరిని గమనించవచ్చును. అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది,అందులో రావు గారికి  ప్రత్యేకమైన కేబిన్ ఉంది. ఆ ఆఫీస్ పక్కనే కిరణ్ షా ఆఫీస్ ఉంది. రెండో రోజు యథా ప్రకారం గా సింబా రానే వచ్చాడు. అందరూ  ఏదో పని చేస్తున్నట్టు  నటించారు, అలా నటించకపోతే కిరణ్ షా కి బాధవచ్చి అందరిని తిట్టి పోస్తాడు. ఆ వింత మనస్తత్వం నాకు మొదట్లో అర్ధం అయ్యేది కాదు. అక్కడ మురాగే అన్నతను ట్రాన్స్పోర్టు  ఎరేంజ్మెంట్  చేస్తూ ఉంటాడు. మొత్తం  నైరోబిని నాలుగైదు భాగాలుగా విభజించి వాటికి ఇంచార్జి గా సేల్స్ రిప్రేజెంటేటివ్స్ ని పెడుతూ ఉంటారు. అందరికి  తలో కారు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుని  ఎక్కడకు వెళ్తున్నారు ఏమిటి అని ముందే కొన్ని ఫార్మాట్స్ ప్రకారం వెళ్లడం కిరణ్ షా అద్భుతంగా ప్లాన్ చేసాడు. 
అవి డైలీ ప్లాన్, వీక్లీ ప్లాన్, పొటెన్షియల్  ఆర్డర్స్ అని రకరకాల ఫార్మట్స్. బోలెడంత  ఆఫీస్ వర్క్ చేయిస్తూ ఉండేవాడు.
వీళ్లంతా కూడా ఒక దిశగా వెళ్ళినప్పుడు నలుగురు ఐదుగురు సేల్స్ గర్ల్స్ వెళ్ళిపోయి మళ్ళీ ఒంటిగంటకు వచ్చే వాళ్ళు. మళ్ళీ వాన్ వచ్చి ఒక్కొక్కళ్ళని పికప్ చేసి ఆఫీస్ కి తీసుకువచ్చి దింపేవాళ్ళు ఎందుకంటే , సాయంత్రం లోపల వాళ్ళు డైలీ రిపోర్ట్ ఆఫీస్ లో సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది. ప్రతి శనివారం ఒక సమీక్ష జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కిరణ్ షా తన మేధస్సు ఉపయోగించి వీళ్ళని అన్ని రకాలుగా తన స్వాధీనం  లో పెట్టుకున్నాడు. అతడు ఆఫీసు లోనే ఉండి  వివిధ శాఖలకు ఫోన్ చేసి వ్యాపారం ఎలా నడుస్తోందో కనుక్కుంటూ సూపర్  వైస్ చేస్తూ ఉండేవాడు. అందుకే అతనంటే సేల్స్ పీపుల్ అందరికీ చాలా భయం  మరియు గౌరవం. అలాగే అతనిపై చాలా విమర్శలు కూడా చేస్తూ ఉండేవారు. నాకు కూడా పెద్ద ఓపెన్ హాల్ లోనే టేబుల్ ,కుర్చీ వేశారు ,ఆ కుర్చీ లో కిరణ్ షా అన్నగారు రాజు షా వుండేవాడట. కానీ అన్నదమ్ములకి అభిప్రాయ భేదాలు వచ్చి అతను వెళ్ళిపోయాడు. అతను కూడా రెడీమేడ్ షర్ట్స్ కుట్టించి యూ. కే కు ఎక్సపోర్ట్ చెయ్యడం వ్యాపారం పెట్టుకుని బాగానే డబ్బు సంపాదించాడు. చాలా మంది గుజరాతీ వాళ్లకి యూ. కె లో బంధువులుండటం ,అక్కడ వారితో వ్యాపార సంబంధాలు ఉండటం పరిపాటి . 

నా టేబుల్ దగ్గిర ఎదురుగా ఒక  మానిటర్ ఉంది ,దానిలో దృశ్యాలు మారిపోతూ ఉంటాయి,ముందుగా  ఎంట్రన్స్ కనిపిస్తూ ఉంటుంది ఎవరు వస్తున్నారో, వెళ్తున్నారో  తెలుస్తూ ఉంటుంది, అక్కడ నించి స్టోర్ రూంలో ఎవరు వున్నారు,వెళ్తున్నారో వస్తున్నారో తెలుస్తుంది,అన్ని డైరెక్షన్స్  లో కూడా ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో నేను కనిపెట్టుకుని ఉండాలన్నమాట. ఇది చూసి నాకు నవ్వాలా ఏంచెయ్యాలో అర్ధం కాలేదు, నా పని ఒక ఆల్సేషియన్ కుక్క లాంటిది అన్నమాట. అక్కడ ఉండి వెయ్యి కళ్ళు పెట్టుకుని అన్నీ గమనిస్తూ ఉండాలన్నమాట. నేను అక్కడ కూర్చున్నప్పుడు నా వైపు అందరూ కుతూహలంగా  చూస్తూ ఉండేవారు . ఒకరోజు రావు గారు వీళ్ళందరికీ నన్ను పరిచయం చేశారు. సేల్స్ లో కిరణ్ షా కి కుడి భుజంగా వున్న ఆఫ్రికన్ లేడీ జెన్నిఫర్ ఆ టీమ్ కి లీడరుగా ఉండేది, సీనియర్స్ లో సుసాన్, ఫెయిత్, సెరపీనా, ఎలిజబెత్ , లిలియన్ ,బ్రిండా, సేల్స్ బాయ్స్ లో  టియాంగో, గొమొటాఛి, గిఫ్ర్డ్ అనే వాళ్ళు ఉండేవారు. ట్రాన్స్పోర్ట్ మేనేజర్ మురాగే, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ ఆంటోనీఅసిస్టెంట్  ఆఫీస్ ఇంఛార్జి జుబేదె అనే అరబ్ దేశస్థుడు, ఫర్నిచర్ స్టేషనరీ ఇంచార్జి మితేష్ షా అనే కుర్రాడు, సురేష్ అని కిరణ్ షా బంధువు మొదలగు వాళ్లు చెప్పుకునే పొజిషన్ లో ఉండేవారు. మొత్తం ఒక  80 మంది ఆ కంపెనీ లో పని చేస్తూ ఉండేవారు. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది, ఒక సామాన్యమైన మనిషి కృషి, పట్టుదల, తెలివితేటలతో ఒక చిన్న కంపెనీ ని ప్రారంభించి అనతి కాలం లోనే ఇంత పెద్ద సామ్రాజ్యంగా విస్తరింపజేసి ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చాడంటే కిరణ్ షా ని అభినందించక తప్పదు. నాకు వీసా మాత్రం వుంది గానీ పర్మిట్ రాలేదు. అది కంపెనీ వాళ్ళు అప్లై చేసారు. అప్పుడప్పుడు అకస్మాత్తు గా ఇమ్మెగ్రేషన్ వాళ్ళు తనిఖీ చేస్తూ వుంటారు కాబట్టి  ఒక్కొక్కసారి నన్ను వంటింటిలో వెళ్లి దాక్కోమని చెప్తూ ఉండేవారు. ఇలా అప్పుడప్పుడు మానిటర్ వేపు చూడటం, ఒక్కొక్క సారి గబుక్కున పారిపోయి కిచెన్ లో దాక్కోవటం మళ్ళీ  నాకు ఇంకా వర్క్ పర్మిట్ లేదు అది అప్లై చేశారని వేరేవారికి తెలీకూడదు, తెలిస్తే మళ్ళీ కంప్లైంట్ చేస్తారు కాబట్టి గుంభనంగా అన్ని పనులూ జరిగిపోతూ ఉండాలన్నమాట. అప్పట్లో నాకు 750 డాలర్లు జీతం, కారు, ఇల్లు ఇచ్చేలా మాట్లాడు కున్నాం . నేను కిరణ్ షా తో మాట్లాడ తానన్న ప్రతి సారి రావు గారు మీ ఇంటి సంగతి, మిగతా విషయాలు నేను చూసుకుంటానని చెప్తూ నన్ను కిరణ్ షా తో మాట్లాడనిచ్చే వాడు కాదు. ఇలా కొంచెం కొంచెం పరిస్థితులు అర్ధం చేసుకుంటూ వున్నాను. పూర్తిగా పని చెయ్యడానికి వర్క్ పర్మిట్ వస్తే గాని వీలులేదు కాబట్టి ఇలా అందరిని అబ్సర్వ్ చెయ్యటం ,సేల్స్ స్ట్రాటజీస్ తయారు చెయ్యటం,కిరణ్ షా ప్రవేశ పెట్టిన ఫార్మట్స్ అన్ని చూడటం  అలా గడుస్తూ ఉండేది. అక్కడ పని చేస్తున్న వాళ్ళ ముఖంలో  ఎప్పుడూ కూడా చిరునవ్వు కానీ ప్రశాంతత కానీ కిరణ్  షా ఆఫీస్ లో ఉన్నంత సేపు ఉండేది కాదు. 

అందరూ ఏదో ఒక టెన్షన్ తో అటుఇటు పరిగెత్తుతూ ఉండేవారు. కిరణ్ షా వెళ్లిపోగానే  అందరి ముఖాలలో ఒక విధమైన రిలీఫ్ కనిపిస్తూ ఉండేది. ఆఫ్రికన్స్ లో ఒక విలక్షణమైన తత్త్వం గమనించాను అది ఏమిటంటే వాళ్ళు ఎంత ఆకలితో వున్నా,ఎన్ని బాధలు వున్నా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు . అప్పుడప్పుడూ నాకు అనిపిస్తూ ఉండేది ఇటువంటి స్థితి మన భారత దేశం లో యోగులకు మాత్రమే సాధ్యం, ఎందుకంటే మనకి ఆకలి వేసినప్పుడు, చేతిలో ఏమి డబ్బులు లేనప్పుడు  మనకి ఆత్మ స్థైర్యం అనేది ఉండనే ఉండదు, మొహాన చిరునవ్వు రావడమే చాలా కష్టం కానీ ఇక్కడ వాళ్ళు చిన్న పిల్లల మాదిరిగా ఉంటూ ఉంటారు ఇది ఎలా సాధ్యం? అనుకుంటూ వుండే వాడిని. ఇలా మెల్లగా రోజులు గడుస్తూ వున్నాయి .