వినాయక చవితి:
మా రెండో బావగారు, మా చెల్లెలు
వినాయక చవితికి మా ఇంటికి వచ్చారు. మేమంతా పూజలో మునిగిపోయాం. అప్పట్లో మా ఇంట్లో
టెలిఫోన్ ఉండేది కాదు. మేమంతా పూజలో ఉండగా నాకోసం టెలిఫోన్ వచ్చింది అని మా పిన్ని
గారింటి నుండి పిలుపు వచ్చింది. సాయంత్రం వాళ్ళు చెప్పిన టైం కి వెళ్ళాను. ఆ
ఫోన్లో వాళ్ళు "ఈస్ట్ ఆఫ్రికా నైరోబీ నుండి చేస్తున్నాం. మేము ఇక్కడ ఒక
ఫార్మా కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. మీ గురించి విన్నాము, మీ బయోడేటా వెంటనే పంపించండి"
అని అడ్రస్ చెప్పారు. నేను ఆశ్చర్యంతో ఇదేంటి గమ్మత్తుగా ఇలా వచ్చింది పిలుపు
అనుకుని, వెంటనే వాళ్ళకి
నా బయోడేటా కొరియర్ ద్వారా పంపించాను.
వాళ్ళు వెంటనే దాన్ని ఆమోదించారు. తర్వాత 18అక్టోబర్ కి నేను
నైరోబీకి ఎయిర్ టికెట్ తీసుకొని పంపించటం. ఇవన్నీ కలలో జరుగుతున్నట్టుగా
క్షణాల్లో టక టక జరిగిపోయాయి. విపరీతమైన బాధలు,కష్టాలు
వున్నప్పుడు భగవంతుణ్ణి మనం శ్రద్ధగా నమ్ముకుంటాము. అందుకే నేను ముందర
చెప్పినట్లుగా మన౦ ఎప్పుడైతే భగవంతునికి పూర్తిగా సర్వస్య
శరణాగతిలా వెళ్తామో, మన ప్రార్ధనలు మరి అటువంటి దైవిక శక్తికి చేరి
అక్కడినుంచి ఆయనే మన జీవితానికి ఒక దశ,దిశ నిర్ధేశిస్తాడని అనిపించింది. నాకు
పాసుపోర్టు లేదు.నేను జీవితంలో
ఎప్పుడూ ఊహించలేదు ఇట్లా బయట ప్రదేశాలకి వెళ్తాను అని. ఇంకొక భయం ఏమంటే
ఆఫ్రికా అనేటప్పటికి అందరూ భయపెట్టారు. మేము చాలా భయపడిపోయాం.
అప్పటికే మా తల్లితండ్రులు కాలం చేసారు. మరి నేను వెళ్తే ఇంట్లో
చూసుకోవటానికి ఎవరు వుంటారబ్బా అని అలోచించి, ముందుగా నేను మా అత్తగారిని కలిసి నాకు ఇలా అవకాశం వచ్చింది,మీరు మా ఇంట్లో
ఉండి నా కుటుంబాన్ని చూసుకుంటాను అంటే వెళ్తాను లేకపోతే వెళ్లను అని చెప్పాను.
ఆవిడ ఎంతో అనుభవజ్ఞురాలు, లౌక్యం తెలిసిన ఆవిడ. “నీకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు
నేను చూసుకుంటాను’’ అని హామీ ఇచ్చారు.
అక్కడినుంచి ఇక
పాసుపోర్టు కోసం ఒక పదిహేను రోజులు అటు తిరగటం,ఇటు తిరగటం, డాక్యుమెంటేషన్ అంటూ చేసుకుంటూ కూర్చున్నాను. ఈలోగా
నాకు ఒక ఆలోచన వచ్చింది. పాత కంపెనీ నుండి నాకు రావాల్సిన డబ్బులు
రాబట్టుకుందామని, నేను నా శ్రీమతి
గారితో వెళ్ళాను. కానీ ఆవిడకి అడగటం ఇష్టం లేదు. మనం అడగకపోతే, అతను అడగలేదు
మేము ఇవ్వలేదు అంటారు. మనం అడిగి లేదని అనిపించుకుందామని వెళ్లి, ఏవండీ నేను ఇలా
బయటకు వెళ్తున్నాను డబ్బులు అవసరం వుంది ఇస్తారా అని అడిగితె,అతను
నిర్మొహమాటంగా నా దగ్గర డబ్బులు ఎక్కడ వున్నాయి, డబ్బులేం లేవు అని చెప్పటం మేము
బయటకు రావటం జరిగింది. కేవలం ఓ అయిదువందల డాలర్లతోనే నేను నా ప్రయాణానికి
సిద్ధమయిపోయాను.
అయితే అక్కడ
రంగారావు గారు అని నైరోబిలో ఒక పెద్ద స్టేషనరీ సూపర్ మార్కెట్లో పనిచేసేవారు.
అతనికి నా గురించి చెప్పటం జరిగింది. అప్పట్లో కెన్యాకు 20 కేజీలు బ్యాగేజ్ మాత్రమే
అనుమతించే వాళ్ళు. 7.5 కేజీలు కేబిన్
బ్యాగేజ్ అనుమతించేవాళ్ళు. దానిలో రంగారావు గారు చెప్పిన లిస్ట్ ప్రకారం అన్నీ
కొంటే చీరలు,వీడియో
క్యాసెట్ట్లు,ఆడియో
క్యాసెట్ట్లు ఇంకా ఎదో పెద్ద లిస్టే ఇచ్చారు. దాని ప్రకారం అన్ని కొంటే దాదాపు 12 కేజీలు అయిపోయింది.ఇంకా నాకు 8 కేజీలు మాత్రమే మిగిలింది. ఇంకా
ఆయన నాకు చెప్పినవి కొనేసరికి కేబిన్ బ్యాగ్
కూడా 3కిలోలు అయిపోయాయి.ఇంకా
అవన్నీ కొని మెల్లగా బయల్దేరాం. ఇది చాల చిత్రమైన,అద్భుతమైన,అనుకోని ఒక అకస్మాత్ గా వచ్చిన అవకాశం. ఇవన్నీ ఒకదాని
తర్వాత ఒకదాని గురించి ఆలోచిస్తే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇలా ఆలోచనలో
జారుకుంటూ నేను నెమ్మదిగా నిద్రపోయాను. ఈలోపల జోమో కెన్యా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు
నైరోబి వచ్చేసామని అనౌన్స్మెంట్ రావటం మేమంతా ఫ్లైట్ దిగి ఎయిర్పోర్టుకి వెళ్ళటం
జరిగింది. దిగేటప్పటికీ చాలా చలి వుంది. స్వెట్టర్ వేసుకున్నప్పటికీ కూడా నేను
తట్టుకోలేకపోయాను. పైగా లోపల ఒకరకమైన భయం. ఎందుకంటే అక్కడ చూసిన మనుషులందరూ బాగా
ఒడ్డు,పొడుగు,పెద్ద పెద్ద
పొట్టలతో రాక్షసుల మాదిరిగానే కనిపించారు. అలా అనుకోకూడదేమో, వాళ్ళని
చూసేసరికే నేను బిక్క చచ్చిపోయాను. నువ్వు ఎన్ని డాలర్లు తెచ్చావు అని
అడుగుతున్నారు.
చెప్పాలోవద్దో తెలియదు.అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి నా ఫోటో
పట్టుకుని తిరుగుతూ ఉండగా చూసి ,మీరెందుకు నా ఫోటో పట్టుకుని తిరుగుతున్నారని
అడిగాను. ఓహ్! మీరు ఫలానా కమల్ కదా, మీ కోసమే తిరుగుతున్నాను. మీరేం కంగారు పడకండి, మీరు ఎన్ని డాలర్లు తెచ్చారో చెప్పండి పర్వాలేదు అని
చెప్పాడు.అతను మంచి ఇన్ఫ్లుయెన్స్ వుంది నన్ను చక చక బయటకి తీసుకెళ్లటం జరిగింది.
ఎదురుగుండా రావు గారు అని,అతన్ని నేనెప్పుడూ చూడలేదు మొదటిసారిగా చూసాను. పక్కన
అతని బాస్ కిరణ్ షా గారు వున్నారు. పరిచయం అయ్యాక అతను నా పాసుపోర్టు తీసి వీసా
ఎంతకాలం ఇచ్చారని చూసి బాగానే ఉందని చెప్పారు. ఆ తర్వాత మేమంతే కలిసి, నేను రావు
గారింటికి వెళ్ళిపోయాను. మా బాస్ కిరణ్ షా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా నేను
కెన్యాలో 19 అక్టోబర్ 1991 లో అడుగుపెట్టటం
జరిగింది.ఇవన్నీ నెమరు వేసుకుంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా,చిత్రంగా, విచిత్రంగా
వుంది.
రావు గారి ఇల్లు:
కారులో కుర్చున్నానో లేదో నాకు గాఢంగా నిద్ర
పట్టేసింది. కొంత దూరం వెళ్ళాక రావు గారు ఇల్లు వచ్చేసింది లేవండి అనటంతో నిద్ర
మత్తులోనే నా సూటుకేసు, బ్యాగ్ చేతిలో పట్టుకుని వాళ్ళింట్లో
అడుగుపెట్టాను. బహుశా అప్పుడు తెల్లవారుజామున మూడు గంటలు అయివుంటుంది. నాకు కళ్ళు
తెరవటం కష్టం అనిపిస్తోంది. అలసటతో ఎప్పుడు నిద్రపోదామా అని అనుకుంటున్న నాకు
రావు గారి శ్రీమతి, వారి
ఇద్దరుపిల్లలు ముందు గది లోనే ఆపేసారు. సరే ముందు కాళ్ళు, చేతులు, ముఖము
కడుక్కుని వస్తాను అని చెప్పగా వాళ్ళు “అదేం పర్వాలేదు ! ముందుగా మీరు మీ పెట్టె
తెరవండి” అని రావు గారి శ్రీమతి,వారి పిల్లలు నా చుట్టూ మూగారు.
నేను మొహమాటంగా ఉండటం
వల్ల ఏమి మాట్లాడలేదు. కానీ మనసులో అనిపించింది "అరె ఇతను ఇంత అలసిపోయి
వచ్చాడు అది కూడా తెల్లవారుఝామున మూడు గంటలకు కాళ్ళు,చేతులు
కడుక్కోనివ్వకుండా, కాఫీ టీ ఏమి ఇవ్వకుండా అక్కడే అటకాయించి వాళ్ళకి
కావాల్సిన వస్తువులు ఇవ్వమనటం వింతగా అనిపించింది". ఈలోపల వాళ్ళ పిల్లవాడే
చొరవ తీసుకుని నా సూటుకేసు మొత్తం తెరిచాడుక్షణాల్లో వాళ్లకు కావాల్సిన వస్తువులు
నా సూట్కేసు లోంచి మాయమైఅపోయాయి. ఆవిడ చెప్పిన లిస్టు ప్రకారం తెచ్చిన చీరలు, జాకెట్లు,కందిపొడి,ఆవకాయ వంటివి
అన్నీ తీసుకున్నారు. రావు గారేమో వీడియో క్యాసెట్లు తీసుకున్నారు. పిల్లలు వాళ్ళకి
కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు. ఇంకా లిస్టులో మిగిలినవి వున్నాయి కదా అని నా
హ్యాండ్ బ్యాగ్ కూడా తీసి వాళ్లకు కావాల్సినవి తీసుకున్నారు. అదేంటి ఇంకా ఇది
రాలేదు, అది రాలేదు అని
ఆరా తీయటంతో అవి దొరకలేదని నేను చాలా మర్యాదగా చెప్పాను.ఆ తర్వాత నేను కాసేపు పడుకుంటాను,అలసిపోయాను అని
చెప్పాను.అప్పుడు ఒక గదిలోకి తీసుకెళ్లి నా లగేజీ అంతా పెట్టుకుని పడుకున్నాను
అంతే గాఢంగా నిద్ర పట్టేసింది.