ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం
ప్రతి భారతీయుడికి ఏదో ఒక
సమయంలోఎంతో కొంత ఆధ్యాత్మికంగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక
పరిణామక్రమంలో పురోగతిని సాధించాలంటే ఏది సాధన చేయాలి? ఏది పట్టుకుంటే మనం
ఆధ్యాత్మికంగా ఎదుగుతాం?అనే ఒక ప్రశ్న తప్పకుండా మొదలౌతుంది. సమస్తమైన
జ్ఞానము, విజ్ఞానము అనేక గ్రంథాల్లో కొంతకొంత చెప్పడం జరిగింది. ఎన్నో
విజ్ఞానకరమైనటువంటి విషయాలు భక్తి మార్గంలో భక్తి సూత్రాలలో ఉపనిషత్తులు, భగవద్గీత
వేదాంతపంచాదషిక ఇంకా ఎన్నో గ్రంథాల్లో ఎన్నో సాధనల గురించి చెప్పడం జరిగింది.
దురదృష్టవశాత్తు విజ్ఞానికి సంబంధించిన ఒక క్రమసోపానంగా చెప్పబడే సిలబస్ అంటూ ఏమీ
లేదు.
బజారునుంచి మనం ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలని తెచ్చుకుంటాం కాని ఎక్కడ్నుంచి
ప్రారంభించాలి? ఏది మొదలు? దాని తర్వాత ఏమిటీ? దాని తర్వాత ఏమిటీ? అన్నది మనకు
తెలియదు. ప్రతి గ్రంథంలో విజ్ఞానపరమైనటువంటి ఒక విషయం చర్చి౦పబడుతుంది. కాని అది
సంపూర్ణంగా ఉండదు. అందువల్ల సాధకులు ఏదో ఒక సాధన చేస్తూ ఉంటారు. కాలక్రమాన వారు
ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవడం అక్కడ ఇంకొక సాధన గురించి చర్చి౦పబడడం, మళ్ళీ
ఈ సాధన మాని ఆ సాధన చేసుకోవడం, ఇలా మనం జీవితాంతం సాధనాలు మారుస్తూ ఉంటాం కాని
మనలో మాత్రం మార్పు రాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుగా మనం తెలుసుకోవాల్సిన
విజ్ఞానపర విషయాలు ఏమిటీ? ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలి?అనే విషయం పాఠకులకి అర్థమవడం
కోసం నేను ఎంతో కొంత తాపత్రయపడుతూ ఉండేవాడిని.
మొట్టమొదలుగా
మనం ఈ సృష్టిరహస్యం గురించి తెలుసుకోవాలి. సృష్టికి నాంది బ్రహ్మ కదా! ఇక
మనం ఆరంభిద్దాం! వేదాంతపరంగా మనమంతా జీవితంలో ఎంతో కొంత సాధన చేసి ముక్తి
పొందేమార్గం అన్వేషిస్తూ ఉంటాం. అయితే అనేక విషయాలు గ్రంథరూపంలో కాని, మనుష్యుల
రూపంలో కాని, మన దగ్గరకి వచ్చినప్పుడు మనం వాటిని గుర్తించం. ఎదురుగా మీరడిగినటువంటి
విజ్ఞానకరమైన విషయాలు ఉన్నప్పటికీ కూడా, అవి మీ దగ్గర సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా,
ఈ కలియుగ మానవులమైన మనకి బద్ధకం ఎక్కువగా కాబట్టి మనం వాటి జోలికి వెళ్ళం. అలాంటి
పుస్తకాలు కావాలని మనం నిరంతరం తాపత్రయ పడుతూ ఉంటాం. దానికి సమాధానంగా అటువంటి
పుస్తకాలు మనదగ్గరకి వచ్చినప్పుడు వాటిమీద మనకి అంత శ్రద్ధ ఉండదు. చాలా మందికి
కూడా ఆధ్యాత్మికతకు మాత్రం సమమయం అసలు ఉండదు. కనుక మీరు ఆధ్యాత్మికపరంగా ఎదగాలని
అనుకుంటే తప్పనిసరిగా ప్రతి రోజూ ఎంతో కొంత అధ్యయనం లేక ఏదో ఒక సాధన చేస్తే
తప్ప మీరు క్రమక్రమంగా ఆధ్యాత్మికంగా సౌధానికి చేరడం చాలా కష్టం.