జీవితంలో అనుకోని
మలుపు
ఇంతకు ముందు
చెప్పినట్లు ప్రతి మనిషి యొక్క జీవితం చిత్రమైన మలుపులతో కూడి ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది,ఎలా జరుగుతుంది, మనం ఎక్కడికెళ్తాం ,ఏం చెయ్యబోతాం ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే అవి అప్పటికప్పుడు భూతకాలంలో వున్నవి వర్తమానం, వర్తమానం నుంచి భవిష్యత్తు, భవిష్యత్తు నించి భూతకాలం ఇలా ఒక కాల చక్రం లాగ తిరుగుతూ ఉంటుంది. ఈ రోజు ఇక్కడ విమానంలో కూర్చుని నేను
వెడుతున్నానంటే కొంచెం నా గతం గురించి చెపితే , మన అందరికి పరిస్థితులు ఎంత చక్కగా చిత్రంగా మారిపోతుంటాయి అన్నది
తెలుస్తుంది. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ వృత్తిలో చేరాను.
అంచెలంచలుగా నేను పదోన్నతి
పొంది మేనేజర్ గా, జనరల్ మేనేజర్ గా, ట్రైనింగ్ మేనేజర్ గా ఉన్నత పదవులలో పనిచేసాను. నేను పనిచేసిన అన్ని కంపెనీ లలో కూడా ఆల్ ఇండియా ఫిఫ్త్, సౌత్ లో ఫస్ట్ రావటం జరిగింది. అలాగే నేను
పనిచేసిన గురువులు కూడా చాలా మేధావులు
దొరికారు. వాళ్ళందరి దగ్గరకూడా నేను ఎన్నో విషయాలు
నేర్చుకోవడం జరిగింది. ఆ అనుభవంతోటే నాకు తెలిసిన బంధువు ఒక చిన్న ఆయుర్వేదం కంపెనీ పెడుతున్నప్పుడు నన్ను
రమ్మని ఆహ్వానించాడు . నేను ఆ కంపెనీ లో వర్కింగ్ పార్టనర్ గా చేరాను. చేరేముందే
చెప్పాను మార్కెటింగ్ అంటే చాలా కష్టం అందులో కొత్త కంపెనీ పోటీ తట్టుకోవడం చాలా
కష్టం. కనీసం ఒక మూడేళ్లు మనకి నష్టాన్ని
భరించగలిగే శక్తి ఉంటేనే మొదలు పెడదాం. దీనిలో చాలా ఓర్పు,సహనం అవసరం అవుతాయి. వీటికి సిద్ధం
అయితేనే ముందుకి వెళదాం లేకుంటే మానుకోవటం మంచిది అని సలహా ఇచ్చాను. ఆ కంపెనీ లో చేరాను, అక్కడే నాకు ఆయుర్వేదం గురించిన జ్ఞానం కలిగింది, అక్కడ ఉండగానే కంపెనీకి సంబంధించిన అన్ని విభాగాల గురించి ఎంతో కొంత నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయుర్వేదంలో మెటి రియా మెడికా - నడ్కర్ని గారు రాసిన 2 వాల్యూంస్ చదువుతూ, ముఖ్యంగా ఫస్ట్ వాల్యూం ఎక్కువగా రిఫర్ చేస్తూ రక రకాల మందుల కాంబినేషన్స్ అన్ని తయారు చేస్తూ ఉండేవాడిని .
అయితే కొంతకాలం గడిచాకా మాలో మాకు అభిప్రాయ భేదాలు వచ్చాయి . వాళ్లకి నేను డబ్బు విషయం లో
గందరగోళం చేస్తున్నానని అనుమానం వచ్చి, ఒక రోజు వాళ్ళు నన్ను పిల్చి పొద్దున్న తొమ్మిది గంటల దగ్గిరనించి రాత్రి ఆరు ఏడింటి వరకు అకౌంట్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. నా అదృష్టం బాగుండి
చెక్కుమీద నా సంతకాలు ఎప్పుడూ ఉండేవి కావు, ఎందుకంటే ట్రైనింగ్ , మార్కెటింగ్ నా డిపార్ట్మెంట్ వేరు కాబట్టి అకౌంట్స్
ఇంకొకావిడ చూస్తూండేవారు . ఆవిడ మెయిన్ పార్ట్నర్, ఆవిడ సంతకాలే ఎక్కువగా వుంటూ ఉండేవి . రాత్రి వరకు కూర్చుని చూసారు కానీ
ఎక్కడా నేను నా సొంతానికి డబ్బులు వాడుకున్నట్టు గా గాని, దుర్వినియోగం చేసినట్టుగా తేలలేదు. అయితే మార్కెట్లో కొద్ది బాకీలు ఉన్నమాట వాస్తవమే .
అది సర్వసాధారణంగా
అన్ని కంపెనీలలో ఉంటాయి . ఈ అభిప్రాయ భేదాల వలన ఒకరోజు అకస్మాత్తుగా ఆయన నన్ను పిలిచి నువ్వు ఇక్కడ పనిచేయడం మానేస్తే
బాగుంటుంది, రేపటినించి మీరు రావక్కర్లేదు అని నిష్కర్షగా
నిర్మొహమాటంగా చెప్పారు. అది విన్న నేను
మామూలుగానే బయటికి వచ్చాను. కానీ మనసంతా గందరగోళంగా అయింది. ఏ కంపెనీ లో అయినా మనం
ఉద్యోగం మానేసినా, వాళ్ళు మనని తీసేసినా నోటీసు పిరియడ్ అని ఒకటి
ఉంటుంది, ఆ సమయానికి జీతం ఇవ్వాలి. కానీ ఇక్కడ అవేవి లేకుండా వున్న ఫళాన్న నన్ను రేపట్నుంచి ఆఫీసుకి రావడానికి
వీల్లేదు అని చెప్పడం నన్ను అయోమయంలో పడేసింది . ఇప్పటికిప్పుడు నేను ఉద్యోగం ఎలా
వెతుక్కోగలను ? నాకు టైం కావాలి. వీళ్లా నాకు జీతం ఇవ్వలేదు,నోటీస్ ఏమీ పీరియడ్లో నాకు ఇవ్వవలసినవి ఇవ్వరు,అలా ఆలోచించుకుంటూ స్కూటరు నడుపుకుంటూ ట్యాంకుబండు మీదుగా ఇంటికి వెళ్తున్నా మనసంతా ఎక్కడో ఉంది. నా మీద ఆధారపడి భార్యా ,ఇద్దరు పిల్లలూ ఉన్నారు.
ఇంటికి వచ్చాక నా జీవితంలోమొట్ట మొదటి సారిగా అదో రకమైన అధైర్యం
కలిగింది. అనేకరకాల ఆలోచనలు కలిగి ఇదేమిటిరా భగవంతుడా ఏదో మంచి ఉద్యోగంలో ఉన్నవాడిని అక్కడే ఉండకుండా ఇక్కడ
ఎందుకు చేరాను, ఇప్పుడు ఇల్లు గడవటం ఎలా ? పిల్లల చదువులవీ నడవటం ఎలా? ఇప్పటికిప్పుడు
ఉద్యోగం ఎలా సంపాదించు కోవాలి అన్న బెంగ
మొదలైంది.
మనుషులలో ఇది ఒక
వింత మనస్తత్వం, ఒకప్పుడు మనలో యెంత ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటాయో అదే మనిషి ఒకొక్కసారి డీలా పడిపోతూ ఉంటాడు.నిస్సహాయంగా
ఉండిపోతాడు . అతనివెనక ఎన్ని విజయ పరంపరలు ఉన్నా అవేవి కూడా మనిషిని ప్రభావితం చెయ్యలేవు. ఇలాంటి మానసిక పరిస్థితి కలగడం సహజం
కానీ అది ఎక్కువ కాలం ఉండకుండా బయటపడాలి. నేను ఒకటి రెండు రోజులలోనే ఆ
దిగులులోనించి బయటపడిపోయాను, నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ ఉన్నాను. అప్పుడే నాలో ఆర్తి అన్నది చాలా
ఎక్కువైపోయింది . మనం ఎప్పుడైతే విపరీతమైన కష్ట కాలంలో ఉంటామో అప్పుడు భగవంతుడి పట్ల ఆర్తి భక్తి, శ్రద్ధ అన్నవి పెరుగుతూ ఉంటాయి. అప్పుడే చాలా విచిత్రంగా నా
జీవితంలో ఒక అద్భుత సంఘటన జరిగింది.
అదేమిటంటే .......
(...... contd........)