ఉపనిషత్తులు
( continuation...)
మరి మాయ కూడా బ్రహ్మమే అని అన్నప్పుడు బ్రహ్మము మాదిరిగానే మాయ కూడా అనంతంగా ఉండవల్సివస్తుంది కదా! బ్రహ్మము మాదిరిగానే నాశనం లేనిదిగా ఉండాలి కదా! అంటే బ్రహ్మము ఉన్నంత కాలం కూడా మాయ కూడా ఉండక తప్పదు కదా! అనే ఒక ప్రశ్న మనందరికీ కలుగుతుంది. బ్రహ్మము సచ్చిదానంద స్వరూపంగా మనం చెప్పుకున్నప్పుడు మధ్య లోని పదం చిత్తు అంటే చైతన్యము. ఈ బ్రహ్మము యొక్క చైతన్యశక్తినే మనం సృష్టి, మాయ అని మనం చెప్పుకుంటున్నాం. మరి అది కూడా బ్రహ్మము వలె శాశ్వతంగానే ఉండాలి కదా !మరి బ్రహ్మజ్ఞానుల యొక్క దృష్టిలో మాయ అనేది లేదు అని చెప్పుతున్నారు కదా ! బ్రహ్మము మాదిరిగానే శాశ్వత వస్తువు లేక అశాశ్వత వస్తువు అని నిర్ణయించడానికి వీలు లేదు.శాశ్వతము, ఆశాశ్వతము అనే పదాలకి సత్యము, అసత్యము అంటే నాశనం లేనిది, నశించేది అని మనం చెప్పుకున్నాం. ఈ రెండు కూడా ఉన్నాయా లేవా అని నిర్ణయించడానికి వీలు లేనిది ఈ మాయ.
మరి ఈ మాయకి అవయవాలు ఉన్నాయా అంటే ముందు మంచుపదార్థంగా ఉన్నప్పుడు దానికి ఆకారం ఉంది అవయవం అంటే ఇక్కడ కనిపించే భాగం అని చెప్పుకొనవచ్చును. ఈ కనిపించే మంచుముక్క ఉష్ణోగ్రత ప్రభావానికి లోనైనప్పుడు అది కనిపించకుండా ఆకాశతత్వంలో ఉన్నది కదా ! కాబట్టి ఇది కనిపించని స్థితిలో ఉన్నప్పుడు దీనికి అవయవాలు లేవని చెప్పక తప్పదు. ఈ కనిపించని పదార్ధం, కనిపించే అవయవాలుగా అంటే జలరూపం, మంచు రూపం ధరించినప్పుడు అవి మనకి ఇంద్రియగోచరం అవుతున్నాయి. ఇదే విధంగా ఈ మాయ అనే సృష్టి ఒకప్పుడు అవయవాలు లేకుండా కనిపించని స్థితిలో ఇంద్రియాలకి అగోచరంగా ఉండి అది మళ్ళీ రూపాంతరం చెంది సృష్టిగా మారినప్పుడు అందులో ఈ సమస్త సృష్టికి చెందిన పదార్థాలు కొండలు, నదులు, చెట్లు చేమలు, మనుష్యులు, జంతువులూ, పక్షులు, ఖగోళాలు, నక్షత్రాలు ఇలా అవయవాలను ప్రకటించే విధంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మాయే జగత్తుగా రూపాంతరం చెందినప్పుడు దానికి అవయవాలు ఉన్నాయి. ఇదే మాయ లయమైనప్పుడు అవి రూపాంతరం చెంది నిరాకార రూపంలో బ్రహ్మములో కలిసినప్పుడు దానికి ఉనికి లేదు, ఎటువంటి అవయవాలు ఉండవు. మనం గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు మరి ఈ మాయ, సృష్టి అవయవాలు లేకుండానే ఉంటుంది కదా! కాని మనం ఎప్పుడైతే జాగ్రతావస్థ లోకి వస్తామో ఈ జగత్తంతా మనకి ఉంటుంది. అంటే అది మళ్ళీ అవయవాలను కలిగి ఉంటుంది. అంటే ఒకప్పుడు అవయవాలు లేకుండా, మరొకప్పుడు అవయవాలు ఉన్నట్లుగా ఈ మాయ మనకి గోచరిస్తూ ఉంటుంది. మరి ఈ మాయ ఉన్నట్టు చెప్పుకోవాలా లేక లేనట్టుగా చెప్పుకోవాలా? ఒక స్థితిలో అది లేకుండా ఉంటుంది, ఇంకొక స్థితిలో అది ఉన్నట్లుగా ఉంటుంది.
ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక మనిషి ఉన్నాడు. చాలా సజ్జనుడు. అన్ని విధాలుగా ఎంతో మంచివాడు. సాధుగుణం కలిగి ఉంటాడు.అటువంటి మనిషిని మనం చాలా మంచివాడని చెప్పుకుంటాం. కాని అదే మనిషి ఒక్కొక్కసారి దుష్టస్వభావాల్ని కూడా కలిగి ఉంటాడు. కోపంగా ఉంటాడు. విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ మనిషిని గురించి మనం ఏమని చెప్పాలి? అతను చాలా మంచివాడని చెప్పాలా? లేక చాలా చెడ్డవాడని చెప్పాలా? ఈ రెండు విధాలుగా మనం చెప్పలేము ఎందుకంటే అవి నిజాలు కావు. అప్పుడు ఏమని చెప్పవలసి వస్తుంది? ఇతను చాలా మంచివాడు కాని అప్పుడప్పుడు మాత్రం కొంత కోపస్వభావాన్ని కలిగి ఉంటాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ మాయ కూడా సత్య వస్తువా, అసత్యవస్తువా, శాశ్వతమా, అశాశ్వతమా అని నిర్ణయించే అవగాహన శక్తి మనకి కాని మహర్షులకి కాని లేదని చెప్పడం కాదు, ఈ లక్షణాలన్నీ ఉన్నాయని కాని లేవని కాని చెప్పలేనటువంటి స్వరూపమే అని నిర్ధారించుకోవలసి వస్తుంది. అవయవాలు ఉన్నవని కాని లేవని కాని బ్రహ్మము వలె ఉంటుందని కాని కాదని కాని చెప్పలేనటువంటి స్థితిలో ఉండే లక్షణాలే ఈ మాయకి ఉన్నాయి. దాని స్వరూపమే అంత.
ఒకవేళ మాయే బ్రహ్మము అని అనుకుంటే బ్రహ్మము అవమానస గోచరము కదా ! కాని దానికి విరుద్ధంగా మాయ ఇంద్రియగోచరం కదా !అంటే మాయ ఇంద్రియముల చేత జగత్తుగా అనుభవింప బడుతుంది కదా ! కనుక మాయ బ్రహ్మమునకు విరుద్ధంగానే ఉంటుంది అని చెప్పుకోవాలి. బ్రహ్మము అఖండము మరి మాయ ఖండము. అది అనంతము, ఇది పరిమితులు కలిగినటువంటిది. అది సర్వవ్యాపకము, ఇది సర్వవ్యాపకము కాదు. ఈవిధంగా మాయ బ్రహ్మమునకు పూర్తిగా విరుద్ధ లక్షణాలతో మనకు కనిపిస్తూ ఉన్నది. మరి మనం బ్రహ్మము అద్వితీయమని, ఇంకొక వస్తువు లేదని చెప్పుకున్నాం కదా ! అన్నింటిలో బ్రహ్మమే ఉన్నదని చెప్పుకున్నప్పుడు ఇక్కడ మాయ మనకి వేరేలాగా కనిపిస్తున్నది కదా ! ఇలా అనుకుంటే మరి బ్రహ్మమునకు ఉన్న లక్షణాలు బ్రహ్మములోని భాగమైన మాయకి కూడా ఉండాలి కదా! అనే ఇంకొక ప్రశ్న మళ్ళీ మనకి ఇక్కడ కలుగుతుంది. అలా అనుకుంటే బ్రహ్మము యొక్క నిర్వచనము తప్పు అవుతుంది కదా ! కాబట్టి మరి ఏమనుకోవాలి? మాయ బ్రహ్మము కంటే వేరు గాను లేక బ్రహ్మముగానే మనం చెప్పుకోవడానికి వీల్లేదు. ఈ రెండు లక్షణాలు ఉన్నాయని మనం చెప్పుకోక తప్పదు. మరి మాయకి నిర్వచనం ఏమిటీ?ఇటు బ్రహ్మము అని చెప్పలేము, కాదని చెప్పలేని స్థితి. ఎప్పుడైతే ఈ మాయ త్రిగుణాలతో సంబంధం ఏర్పరచుకుంటుందో అప్పుడు దాన్ని మాయ అని చెప్పుకోవాల్సి వస్తుంది అని మన పూర్వీకులు, శాస్త్రాలు చెప్పుతున్నాయి.
లోగడ మనం ఈ బ్రహ్మము త్రిగుణరహితం అని చెప్పుకున్నాం. అయితే బ్రహ్మమునకు మాయకు కల తేడా ఏమిటీ? ఎప్పుడైతే బ్రహ్మము త్రిగుణాలతో సంబంధం ఏర్పరచుకుంటుందో అప్పుడు అది బ్రహ్మమునకు విరుద్ధంగా మాయ లేక సృష్టి అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ త్రిగుణాలు అంటే ఏమిటీ? సత్వ, రజ, తామస గుణాలు అన్నమాట. ఈ త్రిగుణాలకి మాయకి ఉన్న సంబంధం మరి కొంత విశదీకరంగా చూద్దాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. నీటిబిందువులు ఎలా ఏర్పడినాయి? ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, హైడ్రోజన్ ఈ కనిపించని రెండింటి సమ్మేళనమే ఈ నీటిబిందువులు కదా ! ఇప్పుడు మనం ఈ నీళ్ళలో పంచదార కలిపినప్పుడు తియ్యగానూ, ఉప్పు కలిపినప్పుడు ఉప్పగానూ, మట్టితో కలిపినప్పుడు మాలిన్య జలంగా మనం చెప్పుకుంటాం. కాని ఇక్కడ ఇప్పుడు ఈ నీటిలోనుంచి తియ్యదనాన్ని కాని, ఉప్పదనాన్ని కాని, దానిలో కలిసిన మట్టి మాలిన్యాన్ని కాని తొలగించినప్పుడు నీరు మాత్రం అలాగే ఉంటుంది. అంటే తొలగించబడినట్టి ఈ మూడు పదార్థాలు నీటి యొక్క అంశ కానే కావు. అందుకనే అవి తొలగించబడినప్పటికినీ నీరు యథాప్రకారంగానే ఉంది. కాని వేటి మూలంగా నీరు ఏర్పడిందో ఆ రెండు పదార్థాలు అంటే ఆక్సిజన్, హైడ్రోజన్ ఈ రెండు పదార్థాల్ని మనం నీటినుంచి తొలగించినప్పుడు అక్కడ నీటి యొక్క ఉనికి ఉండదు. ఎందుకంటే ఈ నీరు అనే పదార్ధం హైడ్రోజన్, ఆక్సిజన్ అనే రెండు అంశలతో తయారు చేయబడింది. ఆ అంశాలనే తీసివేసినప్పుడు నీటి యొక్క ఉనికే ఉండదు. అదేవిధంగా ఈ మాయలో ఈ త్రిగుణాలు అంశగా చేరి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ త్రిగుణాలని తీసివేస్తామో అప్పుడు అది మాయగా మనం చెప్పుకోలేము. ఈ త్రిగుణములు అంటే సత్,రజో,తమ గుణములచేత ఉనికిని పొందినది మాయగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదే మాయకి త్రిగుణాలకి ఉన్న అవినాభావ సంబంధం.