Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

22 March 2017

దేవదత్తుని వృత్తాంతం - 3

                    దేవదత్తుని వృత్తాంతం – మూడవ భాగం


             ఈ విధంగా దేవదత్తుడు, నాగనాథుడు కొంచెంసేపు ఆ ప్రాంగణమంతా కలియతిరుగుతూ అక్కడ ఉన్న ఔదుంబర వృక్షం క్రింద కూర్చున్నారు. దేవదత్తుని ముఖం చాలా గంభీరంగా ఉండిపోయింది. బహుశా ఆయనకి పాత స్మృతులన్నీ ఎన్నో ఆయన మనోవీధిలో తిరుగాడుతున్నట్టుగా నాగనాథుడు గమనించాడు. చివరకి ఆయన “నాగనాథా! నీలో ఎంతో ఆర్తి, ఆవేదన ఉంది. శ్రీ దత్తాత్రేయులవారి తత్వం గురించి చెప్పమని నీవు నను అడిగావు. నేను నీకు తప్పకుండా చెప్తాను. కాని ఆయన తత్వం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే నీవు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి లోకపుతీరుని  గమనించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ మానవనైజాలు, వారి మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క ఆధ్యాత్మిక పరిణామక్రమాలు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరుగుతున్నది అన్నది నీవు ఒక సాక్షిగా గమనిస్తూ ఉండు. నీకు ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆధ్యాత్మిక జగత్తులో ముందు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకి ఇలా ఎన్నో సందేహాలు, ప్రశ్నలు కలుగుతూ ఉండడం సహజమే. ఎవర్ని అడిగి ఈ సందేహాలు తీర్చుకోవాలో తెలియని అయోమయ  పరిస్థితి ఉంటుంది. కనుక నీ మనస్సుకి తోచినట్టుగా నీ అంతరాత్మ చెప్పిన విధంగా నీవు కొద్ది రోజులు పరిస్థితులను గమనించు. నీవు ఎంతో కొంత సాధన చేశావు కనుక నీ మనో నేత్రానికి నీవు చూస్తున్నదేమిటీ? అసలు వాస్తవమేమిటీ? అన్న విషయాలన్నీ కూడా, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ కూడా కనిపించే విధంగా నీకు నేను దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను. ఈ మూడు కాలాలు ఏకకాలంలో సందర్శించడం అన్నది ఒక అసాధారణమైనటువంటి ప్రక్రియ. అది పై భూమికలో ఉన్నవారికే గోచరమవుతుంది, అర్థమవుతుంది. నీకు కలుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు వాటంతట అవే దొరికే విధంగా పరిస్థితులు వాటికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. మళ్ళీ మనం ఎప్పుడు ఎక్కడ కలవాలి అన్న విషయాలు నీకు తెలుస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా నీవు నడుచుకో” అని చెప్పి ఆయన ఎంతో ప్రేమగా నాగనాథుని శిరస్సు మీద తన దక్షిణ హస్తాన్ని ఉంచి ఆశీర్వదించి ఆ తర్వాత ఆయన అదృశ్యమై పోయారు.

          నాగనాథుడు ఎంతో కొంత సాధన చేసినవాడే కనుక ఎక్కువగా ఆశ్చర్య పడలేదు. అక్కడే కూర్చుని కొంచెం సేపు ధ్యానం చేసుకుని చుట్టుప్రక్కల పరిస్థితులని గమనించడానికి ఉద్యుక్తుడైనాడు. అయితే శ్రీ దేవదత్తుల వారి హస్త స్పర్శతో అతనికి ఏదో తెలియని ఒక అలౌకిక ఆనందం కలిగింది. నూతన ఉత్సాహం అతని అణువణువులో నిండి పోయింది. ఆకలిదప్పులు అనేవి ఆ క్షణం నుంచి మాయమైపోయినాయి. శరీరమంతా ఎంతో శక్తివంతంగా తయారయింది. ఆయనకి తాను ప్రాణమయ జగత్తులో అంటే మామూలు మనుష్యుల కన్నా పై భూమికలో ఉన్నట్టుగా గ్రహించాడు. ముందుగా శ్రీ పీఠికాపురాన్ని పరిశీలించడానికి అతను బయల్దేరాడు. అంతకు ముందు నాగనాథుడు ఒక ధ్యాన స్థితిలోను అందులో ఒక మహాత్ముని చేరువ ఉండడం, అటువంటి ఆధ్యాన స్థితిలో నుంచి వర్తమాన కాలంలోనికి అతను వీక్షించినప్పుడు తామసిక పరమైనటువంటి ఎన్నో భావస్పందనలు అతన్నితుడిచి  తాకాయి. నిశ్చలమైన నది లో ఒక రాయి వేసినప్పుడు ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో, ఎంత అనిశ్చితంగా ఉంటుందో అలాంటి అనుభూతి అతని మనస్సుకి కలిగింది. ఆ ఊరంతా చాలా గందరగోలంగా ఉంది. రణగొణధ్వనులు, అరుపులు, కేకలు, ఊరంతా ఎంత అసహ్యంగా, అపరిశుభ్రంగా ఉందో, అంతకన్నా దారుణమైనటువంటి మనుష్యుల యొక్క మానవ ప్రకృతి అంత కన్నా ఎన్నో రెట్లు వికృతంగా అతని కళ్ళకి కనిపించింది. తీవ్రమైన పదజాలంతోటి వాదోపవాదాలు, పనికిరాని విషయాలు, రాగద్వేషాలు, కోపతాపాలు వీటితోటి ఆ  పిఠాపురం పైన ఉన్న గగనతలం అంతా కూడా ఈ భయంకరమైన స్పందనలతో వ్యాపించడం ఆయనకి స్పష్టంగా కనిపించింది. అలా ఆయన నడుస్తూ శ్రీ బాపనార్యులు గారి ధాన్యాగార౦ ఉన్నప్రదేశానికి  వచ్చినప్పుడు ఆయనకి శ్రీ దత్తాత్రేయులవారి పేరిట ఒక సంస్థ నెలకొల్పబడినట్టుగా గమనించారు. ఈ ప్రదేశాన్ని లోగడ ఆయన దేవదత్తునితో పాటు దర్శించడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంగణమంతా గోలగోలగా ఉంది. కార్యదర్శి కాబోలు అక్కడ ఒక కుర్చీపై ఆసీనుడై, ఏవో దక్షిణలు తీసుకుంటూ, రసీదులు ఇస్తున్నట్టుగా ఆయన చూశాడు. ఆక్కడి వాతావరణం కూడా అంత పరిశుద్ధంగా లేనట్టుగా ఆయనకి గోచరం అయ్యింది. అక్కడ దత్తాత్రేయుల వారి నామస్మరణ కాని, ఆ స్వామివారికి సంబంధించిన ఆధ్యాత్మిక గోష్టి కాని ఏమీ జరగడం లేదు. వాళ్ళలోవాళ్ళు వారి యొక్క  ఆర్ధిక పరిస్థితిని గురించి చింతిస్తున్నట్టుగా తెలిసింది. కొన్ని కొన్ని మంచి ప్రణాళికలు కూడా చేస్తున్నందుకు నాగనాథునికి సంతోషం కలిగింది. అక్కడ ఆయనకి వంగ దేశస్థుడైన ఒక సాధు పురుషుడు కనిపించాడు. ఆయనే ఆ సంస్థకి వ్యవస్థాపకుడని గమనించాడు. ప్రజల్లో ఎంతో కొంత ప్రేరణని శ్రీపాదుని పట్ల కలిగించాడు. అది విని నాగనాథునికి కొంత ఊరట కలిగింది. ఆయన మనోనేత్రానికి  భీమవరం అనే ఒక పట్టణం ద్రుగ్గోచరమయింది. అక్కడ ఒక సాధు పురుషుడు మావూళ్ళమ్మ గుడి ప్రక్కనుంచి నింపాదిగా నడుచుకుంటూ వెళ్ళుతున్నాడు. ఆయన్ని చూడగానే నాగనాథునికి మల్లాది బాపనార్యులు గారి వంశానికి 33వ తరానికి చెందిన వ్యక్తి శ్రీ గోవింద దీక్షితులు గారు అని గ్రహించారు. ఆయనకి ఎదురుగుండా ఇంకొక వ్యక్తి వచ్చి శ్రీ దీక్షితులు గారిని దక్షిణ అడగడం, ఆయన మారుమాట్లాడకుండా జేబులోనుంచి కొంత పైకం ఇవ్వడం,  ఆయన దక్షిణ తీసుకున్నటువంటి వ్యక్తి దత్తస్వామి గా గుర్తించిన నాగనాథుడు వారిద్దరికి ఎంతో గౌరవంగా నమస్కరించుకున్నాడు. కించిత్తు ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగాయి. ఆ సాధుపురుషుడు ఏం తెలియకుండా తన దారిన తాను వెళ్ళడం జరిగింది. తర్వాత దీక్షితులు గారికి శ్రీ దత్త స్వాముల వారే ప్రత్యేకంగా గంధర్వపురం (గాణగాపురం) నుంచి ప్రసాదాన్ని , 11 రూపాయలు అందినట్టుగా రసీదుని ఇచ్చినట్లుగా గమనించారు.


         అయితే లోగడ శ్రీపాద శ్రీవల్లభుల వారు చెప్పిన విధంగా శంకర భట్టు అనే కన్నడ భక్తుడు కురుపురంలో వ్రాసినట్టి అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలని నాగనాథుడు దర్శించాడు. ఎంతో నిగూఢమైనటువంటి యోగ రహస్యాల తోటి నిండినటువంటి శ్రీపాద శ్రీవల్లభావతారానికి చెందిన ఆరు పుస్తకాలు, శ్రీ నృసింహ సరస్వతికి చెందిన ఆరు పవిత్ర గ్రంథాలు , మరి యొక ఆరు పవిత్రమైన గ్రంథాలు శ్రీ సమర్థ గారి గురించినవి కూడా ఆయన దర్శించారు. అయితే ఇవన్నీ కూడా తాడపత్రాలలోఆ ముగ్గురి గురించి వారి జీవితం గురించి, ఎన్నో యోగ రహస్యాలు 18 భాగాలుగా ఆయనకి కనిపించాయి. శ్రీపాదులవారి సూచనమేరకు ఆ గ్రంథాలన్నీ ఆయన మాతామహులైన బాపనార్యులు గారి హస్తస్పర్శతో ఒక శ్రీపాదశ్రీవల్లభ చరితామృతం మొదటిభాగం తప్ప అన్నీ సంధ్యా భాషలోకి అదృశ్యమైపోయాయి. ఆ మొదటి భాగం గ్రంథాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో  బాపనార్యులు గారు ఆంధ్ర భాషలో అనువాదం చేసి వ్రాయడం ఆ గ్రంథాన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో దాన్ని పూజాగదిలో పెట్టి నిత్యం ధూప,దీప నైవేద్యాలు పెట్టడం, ఆ తర్వాత శ్రీపాద స్వామి వారి ఆజ్ఞప్రకారం ఆ పుస్తకం మల్లాది వారి కుటుంబం లో ఒక తరం  తర్వాత ఇంకొక తరానికి వెళ్ళడం, సాక్షాత్తు శ్రీపాద స్వామి వారే ఆ గ్రంథంలో ఉన్నట్టుగా వాళ్ళు ఎంతో పవిత్ర భావంతో దానికి పూజా పునస్కారాలు చేయడం , ఆ తర్వాత శిథిలమవుతున్న వాటిని మిగతా తరాల వారు కాగితపు పరిశ్రమ వచ్చినప్పుడు కాగితాల మీద  తిరిగి వ్రాయడం, అది మెల్లగా 33వ తరానికి చెందిన శ్రీ గోవింద దీక్షితులు గారికి చేరడం, మళ్ళీ అది ఆయన ద్వారా  తిరిగి వ్రాయబడినట్లుగా ఆయనకి అర్థం అయిపోయింది.


           మల్లాది గోవింద దీక్షితులు గారికి శ్రీపాదులవారి దివ్య వాణి వినిపించడం, అతను ఎంతో శ్రద్ధాభక్తులతో అటక మీద ఉన్నటువంటి ఆ గ్రంథరాజాన్ని ఎంతో శ్రద్ధగా మళ్ళీ తిరిగి వ్రాయడం జరిగింది. ఈ పవిత్ర గ్రంథాన్ని ఒక దేవతాసర్పం ఎల్లప్పుడూ భక్తిశ్రద్ధలతో కాపాడుతూ ఉండడం కూడా కనిపించింది. భీమవరంలో  ఆ గ్రంథరాజాన్నిఆయన తిరిగి వ్రాస్తున్న సందర్భంలో తన మకాం శ్రీ పీఠికాపురానికి మార్చడం జరిగింది. ఒక ప్రత్యేకమైన గదిలో కూర్చుని పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఆ గ్రంథాన్నినాలుగేళ్ళు  కష్ట పడి చేతివ్రాతతో వ్రాయడం కూడా నాగనాథుడు గారు  గమనించారు. అప్పుడే ఇద్దరుముగ్గురు యుక్తవయస్కులు, శ్రీపాద శ్రీవల్లభ భక్తులు శ్రీ బాపనార్యులు గారి ధాన్యాగారంలో దత్త స్వామి పేరిట స్థాపించబడిన సంస్థలో పని చేస్తున్నట్టుగా గమనించారు. వారు ఎంతో గౌరవంగా శ్రీ మల్లాది దీక్షితులు గారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి టీ, ధూమ్రపానం చేయడానికి కావలసిన వస్తువులు ఇస్తూ ఉండడం కూడా ఆయన మనోనేత్రానికి అవగతమయింది. శ్రీ పాద శ్రీవల్లభుల వారి ఆదేశం ప్రకారంగా, శ్రీ మల్లాది దీక్షితులు గారికి వినిపించిన ఆయన దివ్యవాణి ప్రకారంగా పాత ప్రతిని చూసుకుంటూ తిరిగి  తాను తయారు చేసిన వ్రాత ప్రతి అయిపోయినాక, పాత ప్రతిని  ఆయన కృష్ణా నదిలో నిమజ్జనం చేసి (అంటే పాత గ్రంథాన్ని) తాను చేతివ్రాతతో వ్రాసిన పుస్తకాన్నంతా కూడా ఆధునిక యంత్రాలతో వాటిని ఆయన చక్కగా ఒక ప్రతి (One Copy of DTP)  ముద్రింప చేసి, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి జన్మస్థలంలో చిన్నగా ఉన్న ఆయన సంస్థానానికి వెళ్ళడం, అక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులతో జరిగింది చెప్పడం, వాళ్ళు ఆశ్చర్యం, ఆనందపడడం తదుపరి ఒక మంచిరోజు వాళ్ళు నిర్ణయించుకుని, ఆ రోజున ఆ ఊరి ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతోఅక్కడ చేరడం,  శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు ఆ గ్రంథాన్ని అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సప్తాహపారాయణం చేసి  చదివారు. ఆ తర్వాత ఆ గ్రంథరాజాన్ని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి వారి విగ్రహాల ముందు ఉంచి, పూజ చేసి, దానిని ఆ సంస్థానానికి అప్పగించారు. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. అక్కడ చేరిన ఆ భక్తులందరి హృదయాలు ఎంతో ఆధ్యాత్మిక ఆనందంతో నిండి పోయాయి. అక్కడి వాతావరణం అంతా ప్రశాంతంగా పవిత్రమైన ఆధ్యాత్మిక స్పందనలతో మునిగిపోయినట్టుగా కనిపించింది. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు అక్కడి కార్యదర్శకులతో ఈ గ్రంథరాజంలోని ఒక్క అక్షరం కూడా మీరు మార్చవద్దు, మీరు ప్రతులు చేయిస్తున్నప్పుడు స్వామి వారు స్వయంగా తన ప్రియ శిష్యుడైన  శంకర భట్టుకి ఏవిధంగా అయితే చెప్పారో అదేవిధంగా నేను ఒక్క అక్షరం కూడా మార్చకుండా దీన్ని తిరిగి రచించాను. కాబట్టి మీరు ఏమాత్రం మార్పు చేయకుండా ప్రతులను ముద్రించండి. సంస్థానానికి మాత్రమే  ఇవ్వమని శ్రీపాదులవారి ఆజ్ఞ కనుక ఆజ్ఞప్రకారం నేను దీన్ని మీకు అందజేస్తున్నాను. మీరు ఎంతో పవిత్రంగా ఆయన ఇచ్చినటువంటి సూచనలని తప్పనిసరిగా పాటించాలని నేను కోరుకుంటున్నానని ఆనందాశ్రువులతో ఆ గ్రంథరాజాన్ని వాళ్లకి సమర్పించినట్టుగా నాగనాథునికి గోచరమయింది.