ఉపనిషత్తు సారాంశం - రెండవ అధ్యాయం (Part-2)
(....... continuation )
ఈ విధంగా హైడ్రోజన్ , ఆక్సిజన్ రెండు కలిసినప్పుడు ఏర్పడిన నీటికి ఈ రెండిటి స్వభావాలు లేవు. అది ఆక్సిజన్ లాగా ఇతర పదార్థాన్ని మండించదు, అలాగే హైడ్రోజన్ లాగా తనంతట తాను మండదు వీటికి విరుద్ధంగా మంటని ఆర్పుతుంది. అది కళ్ళకి కనపడుతుంది. ఇదేవిధంగా మనం బ్రహ్మముకి, సృష్టికి ఆపాదించ వచ్చును. లోగడ మనం చెప్పుకున్న ఇన్ని లక్షణాలున్నటువంటి బ్రహ్మము నుంచి దానికి విరుద్ధంగా ఉన్నటువంటి సృష్టి, దానిలోనే ఇంద్రియాలు ఉండడం సంభవించింది. ఇంకొక లక్షణం ఏమిటంటే ఈ సృష్టి మాయతో కూడా తయారు కాబడింది. ఇక్కడ మనకి మరొక్క చిక్కు ప్రశ్న వస్తుంది. ఇంతకుమునుపు బ్రహ్మము తప్ప ఏమీ లేదు అని అనుకున్నాం. ఆ తర్వాత సృష్టి బ్రహ్మము నుంచే వచ్చింది అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ సృష్టి మాయతో తయారు కాబడింది అని చెప్పుకుంటున్నాం. ఇది కొంచెం గందరగోళంగా ఉంటుంది. కొద్దిగా లోతుగా పరిశీలిద్దాం. ఇంతకు ముందు బ్రహ్మ౦ని అద్వితీయం అని చెప్పుకున్నాం, అంటే రెండవ వస్తువు లేనిది అని. మరి దానికి భిన్నంగా సృష్టి కూడా ఉందని చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా దానిలో మాయ కూడా ఉంది అని ఇంకొక లక్షణాన్ని జోడించాం. ఏమిటీ ఈ గందరగోళం?బ్రహ్మయే సృష్టియా? బ్రహ్మయే మాయా? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ముందుగా మనం మాయ అంటే ఏమిటో తెలుసుకుందాం. దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం. కొంచెం నిదానంగా మనం విమర్శన చేసుకుందాం. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. పంచదారలో తియ్యదనం ఉంది. ఉప్పులో ఉప్పదనం ఉంది. అదేవిధంగా సూర్యుడిలో ప్రకాశం ఉంది. అదే విధంగా బ్రహ్మములో మాయ దాగి ఉన్నది. ఇక్కడ ఇంకొక పెద్ద సందేహం వస్తుంది అదేమిటంటే బ్రహ్మము అనంతం, అద్వితీయం అని చెప్పుకున్నాం కదా ! ఆది అంతం లేని ఈ బ్రహ్మములో మరి మాయ, సృష్టి ఎక్కడ్నుంచి వచ్చింది? ఒకవేళ మాయ, బ్రహ్మము ఒక్కటే అయితే మనం బ్రహ్మముని మాయ అని చెప్పుకోవచ్చును కదా! మాయ ఎక్కడ ఉంది? బ్రహ్మము లోపల ఉందా లేక బయట ఉందా? అనే ఇంకొక చిక్కు ప్రశ్నమన మనస్సులో వస్తుంది. ఈ బ్రహ్మము అనేది ఎక్కడో లేదు బ్రహ్మములోనే ఉంది. ఏవిధంగా తీపిదనం పంచదారలో ఉందో, ఉప్పుదనం ఉప్పులో ఉందో, తేజస్సు సూర్యునిలో ఉందో ఆ తియ్యదనాన్ని మనం పంచదారలో నుండి తీసివేసినప్పుడు అది ఇసుక లాగానే అనిపిస్తుంది కదా అదేవిధంగా ఉప్పుదనాన్ని ఉప్పులోనుంచి తీసివేస్తే అది కూడా ఇసుక మాదిరిగానే ఉంటుంది కదా! తేజస్సుని సూర్యుడి నుంచి తీసివేస్తే అక్కడ ఏమీ మిగలదు కదా ! ఈ మూడు లక్షణాలు ఈ మూడు పదార్థాల్లో ఎలా నిమిడి ఉన్నాయో అదేవిధంగా మాయ అనేది బ్రహ్మములో ఉన్నది. అలాగే ఈ మాయ అన్నది లేకపోతె బ్రహ్మము లేదు. ఈ బ్రహ్మము అనేది మాయలో ఏకదేశమై ఉన్నదని శాస్త్రాలు చెప్పుతున్నాయి. పంచదార యొక్క ఉనికి దానిలో ఉన్న తియ్యదనం మూలంగానే మనం తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా మాయ అనే దాని బట్టి మనం బ్రహ్మముని తెలుసుకోగలుగుతాం. ఇది కాస్త తికమకగా ఉంటుంది. ఈ మాయ అనేది బ్రహ్మము యొక్క శక్తిగా చెప్పుకుంటారు. ఏవిధంగా అయితే తియ్యదనం మూలంగా పంచదార ఉనికి ఎలా కలిగిందో, అలాగే ఏకదేశం అన్నప్పుడు ఎక్కడ బ్రహ్మము ఉందో అక్కడే మాయ ఉంటుంది. ఎక్కడ తియ్యదనం ఉంటుందో అక్కడ పంచదార ఉనికి ఉంటుంది, ఎక్కడ సూర్యుని తేజస్సు ఉంటుందో అక్కడ సూర్యుని ఉనికి ఉన్నట్టుగా ఈ బ్రహ్మమలోనే ఈ మాయ అనే శక్తి దాగి ఉంది అందుకనే దాన్ని ఏకదేశం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మేఘాలు ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో. ఒక వేళ ఆకాశమే లేకపోతే మేఘాలకి ఉనికి లేదు కదా ! అదేవిధంగా మాయకు ఉనికి బ్రహ్మము. బ్రహ్మము లేకపోతే మాయ లేదు. ఈ మాయ అనేది పంచదారలోని తియ్యదనం లాంటిది, ఉప్పులోని ఉప్పదనం లాంటిది, సూర్యునిలోని తేజస్సు లాంటిది. ఏవిధంగానయితే మనం పంచదారలో నుంచి తియ్యదనాన్ని, ఉప్పులోని ఉప్పదనాన్ని, సూర్యునిలోని తేజస్సును విడదీయ లేమో అదే విధంగా మాయను బ్రహ్మము నుండి విడిగా చెప్పుకోలెం. ఏవిధంగా అయితే ఒక బ్రహ్మాండమైన మర్రిచెట్టు యొక్క శక్తి ఏవిధంగా ఒక చిన్న విత్తనంలో దాగి ఉంటుందో , ఏవిధంగా అయితే స్త్రీ పురుషుల సుప్రశోణితాల సమ్మేళనం లో బ్రహ్మాండమైనటువంటి మానవ శరీరధారణ కలిగే శక్తి ఇమిడి ఉంటుందో, ఒక వ్యక్తి యొక్క శక్తి ఆ వ్యక్తిలో దాగి ఉన్న మాదిరిగా అవి కలిసే ఉంటాయి. అయితే ఈ శక్తి అంతర్గతంగా ఒక నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఆ శక్తి బహిర్గతమవుతుంది. అంటే మనకు అవసరమైనప్పుడు ఆ శక్తి బయటకి వస్తుంటుంది. అది మనకు కనిపించదు. నిగూఢ౦గా, నిక్షిప్తంగా అది దాక్కుని ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మములో సృష్టి చేయటానికి కావలసినంత శక్తి దాక్కుని ఉంటుంది. అది సృష్టి కార్యం అవసరమైనప్పుడు మాత్రమే ఆ బ్రహ్మములో నుంచి బహిర్గతమవుతుంది. ఈ బ్రహ్మము యొక్క సృష్టి చేసే శక్తినే మనం మాయగా చెప్పుకుంటున్నాం. అంటే బ్రహ్మము యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తి యే మాయ. కాబట్టి మాయ కూడా బ్రహ్మమే. ఒక వ్యక్తిగా చెప్పుకున్నప్పుడు నేను అనే ఇంకొక వ్యక్తిగా నన్ను నేను చెప్పుకున్నప్పుడు నేను, నాలోని శక్తి వేరు కాదు. రెండు కలిపి నేను అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బ్రహ్మము మాయ రెండూ ఒకటే.