ఉపనిషత్తులు- రెండవ అధ్యాయం ( Part-3)
మహర్షుల యొక్క అభిప్రాయ౦
ఈ మాయను గురించి అనేకమంది మహర్షులు విచారణ చేసినప్పుడు వారు ఈ మాయ బ్రహ్మము కంటె వేరుగా ఉన్నదా లేదా అనే విషయనిర్ధారణ చేయడం అనవసరమని అభిప్రాయ పడ్డారు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా నా మాయ బ్రహ్మాదులకు కూడా అర్థం కాని విషయమని చెప్పాడు. ఇక్కడ మాయ అనేది బ్రహ్మము కన్నా వేరా ? కాదా ? అనే విషయ నిర్ధారణ చేయలేము. అది చేయలేనటువంటి ఒక శక్తి. ఇక్కడ మహర్షులకి ఈ విషయం అర్థం కాక వాళ్ళు చెప్పలేదు. మాయ అనేది బ్రహ్మము కంటే వేరా? కాదా ? అనేది నిర్ధారణ చేయలేనటువంటి మాయ కాబట్టి వాళ్ళు అలా అభిప్రాయ పడ్డారు.
ఇక్కడ మాయ అనే శక్తి బ్రహ్మములోని సృజనాత్మక శక్తి బహిర్గతం అయినప్పుడే సృష్టి జరుగుతుంది అని లోగడ చెప్పుకున్నాం. మాయ తానే సృష్టిగా మారుతుంది. ఉదాహరణకి ఒక కుమ్మరివాడు మట్టితో కుండలని చేశాడు. అయితే ఈ కుండ అనేది మట్టితో తయారు చేసే పదార్థంలో కేవలం మట్టి మాత్రమే ఉన్నది. అది తయారు చేసిన కుమ్మరి మాత్రం వేరుగా ఉన్నాడు. అతను మట్టితో కుండను సృష్టించినప్పటికీ తాను సృష్టించిన పదార్థాని కన్నా వేరుగా ఉన్నాడు. కుండ యొక్క ఆకారం లేనప్పుడు అది మట్టిగా మాత్రమే ఉన్నది. అది కుమ్మరి చేతిలో ఆకారం మారినప్పుడు కుండగా మారింది. కాని కుమ్మరి వాడు మాత్రం మారలేదు. కాని సృష్టి విషయంలో,మాయ విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది.
ఉదాహరణకి ఒక మంచు ముక్కను తీసుకున్నప్పుడు దాని ఆకారం మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఉష్ణోగ్రత ప్రభావానికి గురి అయినప్పుడు అదే మంచు ముక్క జలంగా మారుతుంది. అయితే మంచుముక్క ఏమయింది? అది జలంగా మారింది. ఇంకా ఉష్ణోగ్రత తీవ్రత పెరిగినప్పుడు అది ఆవిరిగా మారింది. ఇప్పుడు ఆ మంచుముక్క ఎక్కడ ఉన్నది? అది ఆవిరి రూపంలో ఉన్నది. ఇంకా ఉష్ణోగ్రత పెంచినప్పుడు అది ఆకాశతత్వంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మంచుముక్క ఎక్కడ ఉన్నది?అది అదృశ్యమైపోయింది. కనిపించడం లేదు. కాని ఒకటే పదార్ధం అనేక రూపాల్లో రూపాంతరం చెందింది. అదేవిధంగా ఈ మాయ కూడా సృష్టిలో అనేక రూపాలను ధరిస్తుంది. మనుష్యులుగా, కొండలుగా, చెట్లుగా, జంతువులుగా, నక్షత్రాలుగా ఇలా సృష్టిలో అనేక రూపాలుగా రూపాంతరం చెంది ఉంటుంది. ఇలా ఒకటే వస్తువు రకరకాలుగా రూపాంతరం చెందినప్పుడు దాన్ని మనం రకరకాలుగా పిలవడం జరిగింది. అదే ఈ మాయని కూడా సృష్టికార్యం అని మనం చెప్పవచ్చును. అంటే ఈ మాయను కూడా సృష్టికారిణిగా అని మనం పిలవవచ్చును. అనుకోవచ్చును. ఈ జగతిని కూడా నడిపించేది మాయే. అందుకని దీన్ని స్థితి కారిణి అని కూడా పిలవవచ్చును. అలాగే ఈ మాయ తన రూపాలన్నింటినీ లయ చేసి లయకారిణిగా పిలవబడుతున్నది. కాబట్టి మాయని మనం సృష్టికారిణి, స్థితికారిణి మరియు లయకారిణిగా చెప్పవచ్చును.
ఇప్పుడు మరొక్క ప్రశ్న ఉదయిస్తుంది. మరి బ్రహ్మము ఏం చేస్తుంది? అంటే దానికి ఉదాహరణగా ఆకాశంలో మబ్బు ఉన్నది. ఈ మబ్బుకి ఉనికి ఆకాశం. ఈ మబ్బు కాని మేఘం కాని నశించినప్పుడు నీటి బిందువులు వర్షరూపంలో బయటకి వస్తాయి. కాని మనమేమనుకుంటాం ? ఈ వర్షానికి కారణం ఆకాశం అని అనుకుంటాము. కాని నిజానికి అది ఆకాశం కాదు కదా! అదేవిధంగా ఇక్కడ ఆకాశం బ్రహ్మము అని అనుకుంటే ,మేఘాన్ని మనం సృష్టి లాగా భావిస్తే, ఇక్కడ ఈ మాయలో నుంచి సృష్టి వచ్చింది కాని అది బ్రహ్మములోనుంచి వచ్చినది కాదు అని మనం ఈ ఉదాహరణతో తేలికగా అర్థం చేసుకొనవచ్చును. కాబట్టి ఈ బ్రహ్మమే సృష్టికి కారణం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అని మనం ఈ ఉదాహరణతో గమనించ వచ్చును.
బ్రహ్మమునకు లోగడ మనం చెప్పుకున్నట్టుగానే అరిషడ్వికార భావనలు లేవు. అందుకని సృష్టికర్త కేవలం మాయనే. అదే సృష్టికి కారణమని మనం తెలుసుకుంటాం. ఇంకొక్క విషయం. మేఘం ఎన్నిసార్లు ఆకాశంలో ఉండి ఎన్నిసార్లు ద్రవరూపంలోనికి మారినప్పటికీ ఆకాశం మాత్రం నిర్వికారంగానే, నిశ్చలంగానే ఉంటుంది. దానిలో ఏమాత్రం మార్పు అనేది సంభవించదు. ఇంకా వివరించి చెప్పాలంటే ఎన్నో సార్లు ద్రవాలు మేఘ రూపం దాల్చడం, ఆ మేఘాలు ద్రవరూపంలోనికి మారి వర్షించడం, మళ్ళీ అది మేఘరూపం దాల్చడం ఇలా ఎన్ని వందలసార్లు జరిగినా కూడా ఏవిధంగా అయితే ఆకాశానికి ఏమాత్రం సంబంధం లేదో అదేవిధంగా బ్రహ్మములో ఉన్నటువంటి ఈ మాయ యొక్క సృష్టి అది ఎన్ని సార్లు సృష్టించబడి, మరి పెంచబడి, లయ చెంది మళ్ళీ సృష్టిగా మారి, పెంచబడి, లయ చెంది మళ్ళీ సృష్టిగా మార్పులు చెందుతూ ఇలా ఎన్నిసార్లు జరిగినా బ్రహ్మము మాత్రము ఎప్పుడు కూడా నిర్వికారంగానే, నిశ్చలంగానే ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. అయితే బ్రహ్మము, మాయ ఈ రెండూ ఒకటే చోట ఉన్నాయి కాని మాయకి సృష్టి, స్థితి, లయ అనే మూడు స్థితులు ఉన్నాయి. అది పుడ్తుంది, పెరుగుతుంది, నశిస్తూ ఉంటుంది.. చివరకి అది నశించినప్పుడు నిర్వికారంగా బ్రహ్మములో కలిసిపోతుంది. బ్రహ్మ జ్ఞానుల దృష్టిలో మాయ బ్రహ్మము ఒక్కటే. కాని ఇది అన్యులకి వేరుగా కనిపిస్తూ ఉంటుంది. పైన మనం చెప్పుకున్న ఉదాహరణల మూలంగా అది మనకు కలిగే భ్రమ అని గుర్తించవచ్చును. ఈ మాయ అనేది సత్యవస్తువు కాదు. ఆధ్యాత్మిక భాషలో సత్యవస్తువు అంటే నాశనం లేనిది. కాని ఇక్కడ ఈ మాయ అనే సృష్టి పుడ్తుంది, పెరుగుతుంది, నశిస్తుంది కనుక మాయని మనం సత్యవస్తువు అని చెప్పుకోడానికి వీలు లేదు.
(...... conte......... )