బుద్ధ
భగవానులు ఒక సారి తన శిష్యులతో ఇలా అన్నారు "మహాత్ములకు (గొప్పవారికి) ఎంత ధనము,
సంపద ఉన్నా వారు భూతదయ మానరు" పిల్లలూ! భూతదయ అంటే ఇతర జీవాల పట్ల ప్రేమ. ఈ విషాయన్ని
తెలుపుతూ వారు ఈ కథ చెప్పారు.
స్వర్గానికి
రాజైన ఇంద్రుడిగా ఒకసారి ఒక గొప్ప వ్యక్తి పాలించాడు. ఇంద్రుడు
అంటె మనము ఎవరో ఒక దేవుడు అని అనుకుంటాము.
కాని నిజానికి అది కూడా ఒక పదవి లేదా అధికారం లాంటిదే. దానికి ఎంతో పుణ్యం చేస్తేనే
అర్హులౌతారు. ఈ
ఇంద్రుడికి ఎంతో ఐశ్వర్యం, అధికారం ఉన్నా కొంచెం కూడా గర్వం లేదు. ఎంతో మంచి వాడు.
ఒకసారి రాక్షసులు స్వర్గం పైకి
యుద్ధానికి వచ్చారు. అది చూసి దేవతలు భయపడ్డారు. కాని ఇంద్రుడు తన బంగారు రథముపై యుద్ధానికి
కావలసిన ఆయుధాలు, అస్త్రాలు(బాణాలు) పెట్టుకుని రాక్షసులకి ఎదురుగా వెళ్ళాడు. దేవతల
సైన్యం రాక్షసుల సైన్యం ఒక సముద్ర తీరమున యుద్ధము మొదలుపెట్టాయి. భయంకరంగా
యుధ్ధం జరిగింది. ఏనుగులు ఒకదానితో ఒకటి కొట్టుకున్నాయి.దేవతలు, రాక్షసులు ఒకరిపై ఒకరు
బాణాలు, కత్తులు వేసుకుని యుధ్ధం చేసుకున్నారు. కొంతసేపటికి దేవసేన రాక్షసుల ధాటికి
తట్టుకోలేక పారిపోవటం మొదలు పెట్టింది.
అక్కడ
ఇంద్రుడు ఒక్కడే ఉన్నాడు. ఇక అతని రథసారథి రథాన్ని వెనక్కి తీసుకువెళ్ళటమే మంచిదని
ఇంద్రుడిని అడగకుండా రథాన్ని వెనక్కి తిప్పాడు.
వారి
రథం వెళ్ళే దారిలో ఒక పెద్ద చెట్టు ఉంది. దాని మీద ఎన్నో పక్షులు గూడు కట్టుకుని ఉంటున్నాయి.
గబగబా వెళ్తున్న రథానికి ఉన్న జెండా, దాని కర్ర ఒక కొమ్మకి తగలబోయాయి. వెంటనే ఇంద్రుడు
సారథితో రథాన్ని ఆపమన్నాడు. రథం తగిలితే పక్షుల గూళ్ళు కిందపడి పిల్లలు చనిపోతాయి అని
చెప్పాడు. అప్పుడు సారథి "ఇంద్రా!ఇప్పుడు రథం ఆపితే రాక్షసులు మనల్ని బంధిస్తారు"
అని అన్నాడు. అయినా ఇంద్రుడు రథాన్ని ఆపమన్నాడు. సారథి ఎంత చెప్పినా వినలేదు."
పక్షి గూళ్ళను తప్పించు. వేరే దారి లేకపోతే వెనక్కి తీసుకువెళ్ళు. రాక్షసులు నన్ను
చంపినా సరే !ఈ
పక్షి పిల్లలకు ఏమీ కాకూడదు. నా ఒక్కడి కోసం ఇన్ని జీవులు
చావకూడదు !
ప్రాణాలు
ఎవరికైనా ఒకటే కదా! "అని గట్టిగా చెప్పటంతో సారథి రథాన్ని వెనక్కి తిప్పాడు.
అలా
రథం వెనక్కి తిరగటంతో రాక్షసులకు భయం వేసింది. ఇంద్రుడికి ఎవరో సహాయం చేయటానికి వచ్చారు.
అందుకనే అతను మళ్ళీ యుధ్ధం చేయటానికి వస్థున్నాడు అని అనుకుని భయపడి పరుగెత్తారు.ఇంద్రుడు
ఉత్సాహంతో వారిమీదకు బాణాలు వేసాడు. అవి తట్టుకోలేక రాక్షసులు ఓడిపోయారు. ఇంద్రుడి దయ అతనిని గెలిపించింది.
బుధ్ధుడు ఈ కథ చెప్పి "నీచుడు దయమాని పాపము చేయును. మధ్యముడు
ఆపదలో, కష్టసమయములో దయను వదులును. కాని ఉత్తముడు మాత్రము కష్టమైనా ప్రాణం పోతున్నా
దయను, ధర్మాన్ని వదలడు" అని నీతి చెప్పెను.