మరునాడు పొద్దున్నే
రాజావారు చెప్పినట్టుగా, ఫూల్ బాఘ్ లోని శ్రీవెంకటేశ్వరస్వామి వారి
ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఎంతో బ్రహ్మాండంగా మళ్ళా
పున:ప్రతిష్ట జరగటం, ఆ సందర్భంలో రాజావారు మోహన్ చేతకూడా విలువైన
రత్నాలు ఆ శంకుస్థాపన జరుగుతున్నటువంటి ప్రదేశంలో అంటే ధ్వజస్తంభ ప్రతిష్ట
జరుగుతున్న ప్రాంతంలో కొన్ని వేయించి మోహన్ కి ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. ఈ
కార్యక్రమం దాదాపు మూడు రోజులు చాలా వైభవంగా జరిగింది. ఇవన్నీ పెద్దజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో జరిగాయి. ప్రస్తుతం ఉన్న జీయర్ స్వామివారు
అప్పుడు చాల చిన్న ప్రాయం, అంటే ఇది జరిగి దాదాపు 48, 49 సంవత్సరాలు అయ్యింది. అప్పుడే శిష్యరికం పొందుతూ ఉండేవారు. ఇలా మూడు రోజులు
ఘనంగా కార్యక్రమాలు జరిగాక మోహన్, రాజావారి దగ్గర
వీడుకోలు తీసుకున్నాడు. ఆయన అప్పుడప్పుడు వస్తూఉండు అని చెప్పి పంపించివేసారు. ఆ
తరువాత చాల కాలానికి మళ్ళి ఆయనని మోహన్ కలుసుకోవడం చాలా విచిత్రంగా జరిగింది.
అది 1966వ సంవత్సరం. అప్పుడు మోహన్ కి 15 ఏళ్ళు నిండి 16 వచ్చాయి. వారి నాన్నగారు వరంగల్ లో ప్రఖ్యాతమైన వైద్యుడిగా పేరు పొందారు. ముఖ్యంగా బీదబిక్కీ వారు, సరిగ్గా జీతాలు అందని పరిస్థితులలో ఉండే aided school లో పనిచేసే టీచర్లు, బీదరికంలో ఉండే ముసలి వారందరూ కూడా ఎక్కువగా మోహన్ వాళ్ళ నాన్నగారు అయినటువంటి డా. రంగారావు గారి దగ్గరికి వస్తూ ఉండేవారు. అంతేకాక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల నుంచి కూడా ఎంతో మంది వైద్యం కోసం వస్తుండేవారు. ఆ రోజుల్లో మరి కేవలం ఆయన ఒక రూపాయో లేక రెండు రూపాయలో ఫీజు మాత్రం తీసుకునేవారు. మరీ బీదవాళ్ళు అయితే ఉచితంగానే వైద్యం చేస్తూ మందులు కూడా ఉచితంగానే ఇచ్చి పంపిస్తుండేవారు. ఆయనకి తగ్గట్టుగానే వారి శ్రీమతి లలిత గారు ఎవరు మధ్యాహ్నాన్నికి వారింటికి వచ్చినా వారందరికీ కూడా భోజన వసతులు ఏర్పాటు చేస్తూండేవారు. ఎందుకంటే రంగారావు గారు తన క్లినిక్ కి వచ్చినటువంటి వారిని ముఖ్యంగా ఈ medical representatives ని మధ్యాహ్నం భోజనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉండేవారు. అందుకే మధ్యాహ్నమైనా, ఏవేళయినా, రాత్రివేళ కూడా వారింట్లో అన్నపూర్ణశాల ఎప్పుడూ ఆహారంతో సిద్ధంగా ఉండేది. లలితగారు తన కార్యక్రమాలన్నీ ముగించుకుని దాదాపు రెండుగంటలు పూజగాదిలోనే ఉండి, పూజ చేసుకుంటూ ఉండేవారు. అలాగే వారికి షిరిడి సంస్థానం నుంచి ప్రతినెలా ప్రసాదం, విభూతి పోస్టులో వస్తూ ఉండేవి. ఇలా కాలం గడుస్తూ ఉంది. సుఖసంతోషాలతో వాళ్ళ కుటుంబం అంతా బాగుంది.
కానీ జీవితం
ఎప్పుడూ ఒకటే మాదిరిగా ఉండదు కదా ! కొన్ని అనూహ్యమైనటువంటి పరిస్థితులు
వాళ్ళ ఇంట్లో జరగటం మొదలుపెట్టాయి. 1966వ సంవత్సరంలో ఒకసారి రంగారావుగారు తన క్లినిక్ ముగుంచుకుని ఇంటికి రావటం
జరిగింది. మరి ఎందుకో ఆరోజు ఆయన చాల నిస్త్రాణగా కనిపించారు. చాల నీరసంగా
కనిపించేసరికి ఇంట్లోని వారంతా చాలా ఆదుర్ధా పడిపోయారు. ఆయన తనకి ఎందుకో ఒంట్లో బాగా లేదని, ఆహరం కూడా ఎక్కువ తీసుకోకుండానే ఆరోజు పడుకున్నారు. ఆరోజు రాత్రంతా కూడా ఆయన నిద్రలేకుండానే చిన్నదగ్గుతో మొదలై అది బాగా పెరిగి పెద్దదయ్యి శరీరం అంతా
కదిలిపోయేటట్టుగా దగ్గటం మొదలుపెట్టారు. అయితే ఆయనకి ఏ విషయమూ అంతుబట్టలేదు. తన
ఆరోగ్యం చాలా బాగుండేది, ఉన్నది కూడా.
మరి ఎందుకు ఈ
విధంగా తనకి దగ్గు వచ్చిందో ఆయనకి అర్ధంకాలేదు. అలా 3,4 రోజులు చూశారు కాని ఏమి ఉపశమనం కలగలేదు. ఆ 3 రోజులు కూడా ఆయన క్లినిక్ కి వెళ్ళడం చాల కష్టం అయిపోయింది. ఎంతో ఓపిక చేసుకుని ఇంటికి వచ్చిన రోగుల్ని చూసి వెంటవెంటనే పంపించివేస్తూ
ఉండేవారు. నాలుగు రోజులు అయ్యేసరికి అది కూడా ఆయనకి సాధ్యం కాలేదు. పూర్తిగా
నీరసపడిపోయారు. తనకి తెలిసిన డాక్టర్లు అందరూ వచ్చి పరిక్ష చేసి, ఏమి లోపం లేదనీ, అంతా సరిగ్గానే ఉందనీ నిర్ధారణ చేశారు. కానీ ఆయనకి ప్రారంభం అయిన దగ్గుకు మాత్రం ఉపశమనం కలగలేదు. అయితే ఒకరోజు రాత్రంతా ఆయన
అలాగే దగ్గుతూ, అవస్థపడుతూ నిద్రపోయారు. పొద్దున్న లేవగానే మొట్టమొదటి
సారిగా వారు లలితగారి తోటి తనకు రాత్రంతా ఏవేవో కలలు వస్తున్నాయనీ, దానిలో మరి నాగుపాములు విపరీతంగా కనిపిస్తున్నాయని, అవి భయంకరంగా తనని చుట్టుముట్టి భయపెడుతున్నాయని చెప్పటం మొదలుపెట్టారు.
డా॥రంగారావుగారు స్వతహాగా ఇలాంటి విషయాలు నమ్మరు. అయితే ఇది ఒక రోజుతో
ముగియలేదు.పదే పదే ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించడం ప్రతీ రాత్రి కూడా ఇలా కలలు
వస్తున్నాయని చెప్పడం జరిగేది. రాను రానూ తీసుకునే భోజనం పరిమాణం కూడా
తగ్గిపోయింది. పూర్తిగా అస్వస్థులయిపోయినారు. అయితే ఇంట్లోనే ఉన్నా మోహన్ కి ఈ
పరిస్థితి అంతా చూశాక ఏమీ అర్థం కాలేదు,చాలా అయోమయ
పరిస్థితిలో ఉండిపోయాడు.
వచ్చేపోయే
డాక్టర్లందరూ కూడా అన్ని పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో అంతా సవ్యంగానే ఉంది, కానీ ఈ దగ్గు ఎందుకు వస్తున్నది అర్థం కావడం లేదని వాళ్ళు చెప్పటం జరిగింది.
ఎందుకిలా జరుగుతుంది? ఏదన్నా జబ్బు వచ్చేముందు కొన్ని లక్షణాలు
కనిపించాలి కదా! అంతేకాక తన తండ్రి గారు ఇలాంటి కలలు వస్తున్నాయని చెప్పటం ఇంకా
ఆశ్చర్యాన్ని కలిగించింది. మా అమ్మగారు ఎన్నో పూజలవీ చేస్తూ ఉంటారు కదా! అయినా
కూడా మా ఇంట్లో ఇలాంటి విపరీత పరిణామాలు జరగటం ఏమిటబ్బా? అని ఎంతో మధనపడ్డాడు. రానురానూ తన తండ్రి గారి ఆరోగ్యం మరీ
క్షీణించసాగింది. ఆయన క్లినిక్ కి వెళ్ళటం పూర్తిగా మానివేశారు. ఇంటికి వచ్చిన
రోగుల్ని కూడా చూడలేకపోతున్నారు. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు అకస్మాతుగా
మోహన్ కి రాజా ఆంజనేయ ప్రసాద్ గారు గుర్తుకు వచ్చారు. ఆయన వద్దకి వెళ్ళాలా? వద్దా ? అనే సందిగ్ధ అవస్థలో ఉండిపోయాడు. ఈలోగా ఆ ఊళ్ళో
ఉన్నవారు కొంతమంది ఇదేదో చేతబడి చేసిన వ్యవహారమని దీనికి ఆ ఊళ్ళో కొంతమంది చికిత్స
చెయ్యగలరని చెప్పారు. తరువాత మొట్టమొదటి సారిగా వాళ్ళ ఇంటికి ఒక ముస్లిం అతను
రావడం,అతను ఏవేవో ప్రక్రియలు చెయ్యడం జరిగింది. ఏదో మంత్రం
ఉచ్చరిస్తూ నోటిలోని గాలిని బయటికి ఊదుతూ ఉండేవాడు. అయినా మరి ఏమీ ప్రయోజనం
జరగలేదు.
(to be contd
............................)