మరునాడు ఆ రాజావారు చెప్పిన
విధంగానే పొద్దున్నే లేచి తయారయ్యి, ఎవ్వరికీ ఏమి అనుమానం రాకుండానే తాను ఎక్కడికి వెళ్తున్నాడో ఎవ్వరికీ
చెప్పకుండానే యధా ప్రకారంగా సైకిల్ అద్దెకి తీసుకొని వారింటి వైపు తన ప్రయాణాన్ని
సాగించాడు. అనుకున్న దానికంటే ఒక అరగంట ముందుగానే చేరుకొని మెల్లగా రాజావారి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే అప్పటికే
రాజావారు పూజాసామాగ్రి అంతా సిద్ధం చేసుకొని ఉన్నారు. సరిగ్గా పూజామందిరం అంటే
అమ్మవారి ఎదురుగుండా, ఆ పసుపు, కుంకుమతో తడిసిన దళసరి వస్త్రం,దాని మీద విచిత్రమైన ముగ్గులు, దానిలో కొయ్య బొమ్మలు,తరువాత అడ్డంగా కోసినటువంటి నిమ్మకాయలు అవన్నీ
కనిపించాయి. రాజావారి పూజామందిరం పక్కనే ఇంకొక గది కూడా ఉంది.
ఆ గది లోనికి ఎవ్వరు ఎప్పుడూ ప్రవేశించరు కానీ ఆ గది తలుపులు ఎప్పుడూ
తెరిచే ఉంటాయి. ఆ గదిలో నాగుపాముది సుమారు 4 అడుగుల ఎత్తున్న పుట్ట ఒకటి ఉన్నది. దాన్ని గురించి మరి రాజావారు ఎప్పుడూ ప్రస్తావన చెయ్యలేదు కానీ వారింట్లో ఒక నాగుపాము తిరుగుతూ
ఉంటుందని జనం చెప్పుకుంటూ ఉండేవారు. ఒక అరగంట కార్యక్రమం జరిగాక రాజావారు మోహన్ ని
పిలిచి, అతను తెచ్చినటువంటి అరటిపండ్లని అమ్మవారికి నైవేద్యం పెట్టి, ఆయన చెప్పినట్టుగా అమ్మవారి విగ్రహానికి
ఎదురుగా కాకుండా ఒక పక్కగా కూర్చున్నాడు. ఎందుకో మరి మోహన్ కి ఎటువంటి భయం అన్నది
కలగలేదు. నిలువెత్తున కుంకుమరాశి మధ్యలో అమ్మవారి విగ్రహం ఉన్నది. రాజావారు
అమ్మవారి విగ్రహానికి ఎదురుగా గడప ఇవతలిగా కూర్చున్నారు. తన ఎదురుగా ఒక
రాగిరేకు మీద ఒక యంత్రం, కొన్ని గీతలు గీయబడి ఉన్నాయి. మంత్రాలని క్రమం తప్పకుండా చదువుతూ, మోహన్ కి
అందరూ చక్కగా ఉండాలని, సరోజగారు,ఆవిడ భర్త, వాళ్ళ కుటుంబం అంతా సుఖంగా ఉండాలని ఆ
అమ్మవారిని కోరుకుంటూ మనస్సులో అదే పదేపదే అనుకుంటూ ఉండమని ఆదేశం ఇచ్చారు. ఈలోగా
రాజావారు గోధుమపిండిని తీసుకువచ్చి, దాన్ని ఒక ముద్దగా చేసి ఆ యంత్రం పైన
నిలబెట్టారు. మంత్రాలు ఉచ్ఛ స్వరంలో చదువుతూ ఆయన పక్కనే ఉన్న ఒక కొబ్బరికాయని
కొట్టి, ఆ నీళ్ళని ఆ గోధుమపిండి ముద్ద మీద ధారగా పడేటట్టుగా చేసారు. కొబ్బరి నీళ్ళు ఆ
గోధుమ పిండి ముద్ద పైన పడగానే ఆ పిండి బుస బుస పొంగుతూ ఒక పక్కకి ఒరిగిపోయింది.
ఇదంతా చాలా కుతూహలం గానే చూస్తూ ఉన్నాడు మోహన్ కానీ అతనికి మనస్సులో ఎటువంటి
భయం అన్నది కలుగలేదు. మంత్రాల్ని ఆపకుండా ఆ పక్కనే ఉన్న కత్తిని తీసి ఆయన
గోధుమ పిండిని ముద్దని రెండు భాగాలుగా కోసాడు. ఆశ్చర్యం లో ఆశ్చర్యం ఏమిటంటే ఆ గోధుమపిండి ముద్దలో
కొద్దిగా ఉడికినటువంటి అన్నం దానిలో ఏవో చిన్నచిన్న మూలికలు, తరువాత ఒక నల్లటి గుండ్రటి వస్తువు, దాని మీద కొన్ని వెంట్రుకలు ఇవన్ని కనిపించాయి. అయితే
రాజావారు వాటిని పరీక్షగా చూసి మంత్రాలూ చదవటం ఆపి తననే ప్రశ్నార్ధకం చూస్తున్న
మోహన్ తో " నాయనా! నీవు అడగబోయే ప్రశ్న నాకు తెలుసు. నీవు చిన్నపిల్లవాడివి . దీనిలో
ఉన్నట్టువంటి వస్తువులు అతి నీచమైన పదార్థాలతో తయారు చేసినటువంటివి. తన భర్త
మనస్సు మార్చుకోవడానికి ఆ మొదటి భార్య ఏదో ఒక మాంత్రికుణ్ణి ఆశ్రయించి భర్తకి
తెలియకుండా అన్నంలో కలిపి అతని చేత తినిపించింది. ఆ నల్లటి వస్తువుకి వెంట్రుకలు
రావటం అంటే ఆ వ్యక్తి చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్టు తెలిసిపోతూనే ఉంది. నీవు
ఇంకా 2,3 రోజులు కనుక ఆలస్యంగా వచ్చివుంటే ఫలితం ఏమీ ఉండేది
కాదు.
సరిగ్గా సమయానికి వచ్చావు కాబట్టి పీడా విరిగి పోయింది. ఇంక ఆ వ్యక్తికి
ఎటువంటి ప్రాణాపాయం లేదు. ఇవన్ని కూడా నేను తీసివేసాను" అని చెప్పి
"నీవు రా" అని ఆయన లోనికి వెళ్లి కాళ్ళు, చేతులు కడుక్కుని యధాప్రకారంగా రెండు కప్పుల టీ తెమ్మని చెప్పి నీవు ఇంకా
చిన్న పిల్లవాడివి,అందుకే నీకు నేనేమి వివరాలు ఎక్కువగా చెప్పడం లేదు.
సంతోషకరమైన వార్త ఏమిటంటే ఆ వ్యక్తికి ఎటువంటి ప్రాణాపాయం లేదని నేను నీకు చాలా
గట్టిగా భరోసా ఇస్తున్నాను. నీవు ఒక పని చెయ్యాలి, నేను నీకు 8 పొట్లాలు ఇస్తాను. ఈ 8 పొట్లాలు తీసుకువెళ్ళి ఆ సరోజగారికి ఇచ్చి, ఆవిడ ఇంట్లోనే అష్టదిగ్బంధనంగా ఎనిమిది దిక్కులలో పెట్టవలసిందిగా ఆవిడకి
చెప్పు అని ఆదేశించారు. ఎందుకంటే ఆ మాంత్రికుడు ఈ సరోజగారి మీద కూడా ఏదో దుష్ట
ప్రయోగం చేసాడు. అందుకే ఆమెకి కూడా కొంత ప్రాణాపాయం ఉంది. ఈ ఎనిమిది పొట్లాలు
ఆమెను రక్షిస్తాయి. ఇంకేం ఫర్వాలేదు అని మరొక్కసారి అభయం ఇచ్చారు. ఆయనకి ఎంతో గౌరవంగా నమస్కారం చేసి తాను తెచ్చిన దక్షిణని ఆయనకి సమర్పించి,
మరొక్కసారి నమస్కారం చేసి అక్కడి నుంచి మోహన్ బయలుదేరి
వెళ్ళిపోయాడు.
సంగారెడ్డి, దగ్గరే కావటంతో ఇంటికి వెళ్ళగానే సైకిల్ అప్పజెప్పేసి, బస్సు పట్టుకొని సంగారెడ్డిలోని సరోజగారి ఇంటికి
వెళ్లి జరిగి౦దంతా చెప్పి ఆ 8 పొట్లాలు ఇచ్చేసి అతను తిరుగు ప్రయాణం సాగించాడు. మరొకసారి 10 -15 రోజుల తర్వాత సంగారెడ్డి వెళ్ళినప్పుడు సరోజగారు కన్నీళ్ళతో ఎంతో
సంతోషంగా "నీ మూలంగా నా మాంగల్యం నిలిచింది", బాబూ ! మా ఆయన ఇప్పుడు
చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. ఒక వారం రోజుల్లోనే ఆయన కోలుకున్నారు. ప్రాణాపాయ స్థితి
నుంచి బయటపడ్డారు. సంగారెడ్డికి కూడా వచ్చారు. ఆయన మనస్సు కూడా ఇప్పుడు
ఇదివరకటిలాగా లేదు, ప్రశాంతంగా ఉంది. చాలా సంతోషం నాయనా! అని ఆవిడ చెప్పటంతో మోహన్ ఎంతో సంతోషించి వెళ్ళిపోయాడు.
( To be continued …..)