ఇలా ఉల్ఫ్ మెస్సింగ్ తన ఆలోచనల్లో ఉండగా ఆఖరికి
ఆ రైలు చేరవలసిన గమ్యం చేరింది. అతను ఆ ప్రయాణీకుల గుంపుతో పాటు అక్కడే
దిగాడు. అది జర్మనీ రష్యాదేశాలకి మధ్య ఉన్న సరిహద్దు అంటే ఉల్ఫ్ మెస్సింగ్
రష్యాదేశం చేరాడు. అది ఒక కుగ్రామం చాలా చిన్న పల్లెటూరు. అతను ఇప్పుడు ఏం
చేయాలా అంటే తన తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తుండగా అతని దృష్టి అక్కడ ఉన్నజన
సముదాయం మీద పడింది. గుండ్రంగా నిల్చుని వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారా? అని
ఆసక్తితో ఉల్ఫ్ మెస్సింగ్ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక మెజీషియన్ రకరకాల ట్రిక్స్
చేసి చూపుతు, అక్కడ గుమిగూడిన జనాల చప్పట్లు, ఈలలు అంగీకరిస్తూ మాయాజాలం
చేయసాగాడు.
అతని హావభావాలు కూడా ఆకర్షణీయంగాను, గమ్మత్తుగానూ, తమాషాగానూ ఉన్నాయి.
అతను చారల పైజామా వేసుకుని , నెత్తిమీద ఈ ఇంద్రజాలికులు వేసుకునే టోపీ పెట్టుకుని
ఉన్నాడు. అతను జనాలతో తమాషాగా మాట్లాడుతూ,నవ్విస్తూ, చాలా ఉత్సాహంగా, గబగబా సహాయకుల
ద్వారా రకరకాల ఇంద్రజాలం చేస్తూ ఉన్నాడు. అసంకల్పంగానే ఉల్ఫ్ మెస్సింగ్ కి తనలో
తనకి తెలియకుండా ఉన్నటువంటి శక్తి ఏదో ఉందని అర్థమయింది. కాబట్టి తను కూడా ఇలాంటి
చిన్న చిన్న తమాషాలు చేస్తూ బ్రతుకుతే ఎలా ఉంటుంది అని ఆ ప్రజల్లో చేరాడు. ఆ ఆట
ముగిసినాక అక్కడ గుమిగూడిన ఆ జనాలంతా వెళ్ళిపోయాక , వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళలో
వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఉల్ఫ్ మెస్సింగ్ తనని కూడా ఒక సహాయకుడిగా
తీసుకోమని చెప్పి అర్థించాడు. వాళ్ళు ముందు తటపటాయించినా వాళ్లకి ఇటువంటి సహాయకుడు
ఒకడు అవసరం కాబట్టి అలాగే అని సమ్మతించారు. ఆ విధంగా ఉల్ఫ్ మెస్సింగ్
వాళ్ళతో చేరి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి అంటే అతను ఏం సంకల్పిస్తే అది ఆ భ్రాంతి
నిజంగా మారిపోవడం అతని జీవనోపాధి కోసం వినియోగించడం మొదలు పెట్టాడు. తానూ
ఏదైనా ఒక చిత్తు కాగితం పట్టుకుని ఇది ఫలానా చిత్రపటం అంటే జనాలందరికీ అది
చిత్రపటం లాగా కన్పించడం, ఇట్లా ఎన్నో రకరకాలుగా ప్రయోగాలు కనిపెడుతూ
అచిరకాలంలోనే అతను ప్రఖ్యాతి చెందాడు. సహాయకుడిగా కాకుండా అతనే ప్రధానంగా ఇంద్రజాల
మహేంద్రజాలాలు చేస్తూ కొద్దికాలంలోనే రష్యా దేశంలో మంచి ఇంద్రజాలికుడిగా పేరు
ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. మహేంద్రజాలికుడిగా అతని ఖ్యాతి ఎంతగా
పెరిగిపోయిందంటే ఆ రోజుల్లో నియంతగా ఉన్నట్టి స్టాలిన్ కి రహస్య గూఢచారుల ద్వారా ఈ
విషయాలన్నీ తెలిసినాయి. రష్యాలో మరి భగవంతుడి మీద విశ్వాసం ఉండదు అందులో నియంతలకి
ముఖ్యంగా. మరి ఎవరైతే ఇది దేవుడి దయవల్ల జరుగుతుంది అని చెప్తున్నారో వారికి
కఠినమైన శిక్షలు, వారిని రహస్యంగా చంపేయడాలు జరుగుతుండేవి. అయితే అక్కడ చేరిన
ప్రజలందరూ కూడా ఈ ఉల్ఫ్ మెస్సింగ్ కి దైవిక శక్తులు ఉన్నాయని భావించడంతోటి
స్టాలిన్ అతన్ని బంధించి తీసుకుని రమ్మని తన అనుచరులకి ఆజ్ఞాపించాడు. చివరికి ఒక
ఊళ్ళో చాలామంది ప్రజల మధ్యలో తన అద్భుతమైన ప్రదర్శన, వాక్చాతుర్యంతో అక్కడ
గుమిగూడిన జనులందరినీ హాస్యంలో ముంచేస్తున్న ఉల్ఫ్ మెస్సింగ్ దగ్గరకి స్టాలిన్
పంపిన గూఢచారులు, మారు వేషాల్లో ఉన్నటువంటి సైనికాధికారులు కూడా వచ్చి ప్రదర్శన
అంతా అయిపోయినాక ఎవరికి అనుమానం రాకుండా, నిజంగా చెప్పాలంటే అతన్ని బెదిరించి
తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఉల్ఫ్ మెస్సింగ్ కి అర్థమయిపోయింది.
పదాధికార్ల దగ్గరకి తీసుకు వెళ్లినప్పుడు “నీవు ఎవరివి? ఎందుకు వచ్చావు? రష్యాలో
భగవంతుడి శక్తిని ప్రచారం చేసే వాళ్ళని మేము అణగదొక్కుతాం కదా ! అలాంటప్పుడు నీవు
ఎందుకు ఇంత ధైర్యంగా ఇక్కడకి వచ్చి నీ శక్తుల్ని ప్రదర్శిస్తున్నావు? దీన్ని మేము
రాజద్రోహం క్రిందే పరిగణిస్తాం కనుక మా నాయకుడైన స్టాలిన్ మమ్మల్ని నీ కదలిక
పైన , నీవు చేసే కార్యక్రమాలని గమనించమని నియమించాడు. కాబట్టి నిన్ను రాజద్రోహి
క్రింద బంధించి స్టాలిన్ దగ్గరకి తీసుకుని వెళ్ళు తున్నాం. నిజంగా నీకు భగవంతుడి
మీద నమ్మకం ఉంటే ఆ భగవంతుడే నిన్ను కాపాడుతాడు” అని ఈ రకంగా మాట్లాడుతూ అతన్ని ఏదో
రహస్య స్థావరానికి కళ్ళకి గంతలు కట్టి తీసుకుని వెళ్ళిపోయారు.
ఉల్ఫ్ మెస్సింగ్ మొట్టమొదట జరిగిన అద్భుతానికే తనకు
తెలియకుండా భగవంతుడు తనకు ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చాడని నిర్ధారణ కావడంతో అతనికి
భగవంతుని పట్ల విశ్వాసం ఉండడం సహజమైపోయింది. అతను మనస్సులో ఏం అనుకున్నా, ఏం
సంకల్పించినా అది అద్భుతంగా జరిగిపోవడంతో ఇటువంటి మాయాజాల మహేంద్ర జాల ప్రదర్శనలు
చేయడం, మనస్సులో ఆ భగవంతుడిని ధ్యానం చేసుకోవడం పరిపరివిధాలుగా భగవంతుడికి
కృతఙ్ఞతలు చెప్పకోవడం ఇలా జరుగుతుండేది.