సరోజగారి వృత్తాంతం రాజా ఆంజనేయ
ప్రసాద్ గారికి స్వయంగా చెప్పటం తన బాధ్యత అని భావించి మోహన్ ఒకరోజు మళ్ళా సైకిల్ తీసుకుని ఆ శాలిబండ పక్క సందులో ఉన్న ఆయన గృహానికి
బయలుదేరాడు. పొద్దున్నే వెళ్ళగానే ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు. యధాప్రకారం
రెండు కప్పుల టీ ఆర్డర్ చేసారు. వారి ఇంట్లో అందరికీ మోహన్ పరిచయం అయ్యాడు. అలా టీ తాగుతూ మాట్లాడుకుంటూండగా రాజావారు ఆయన గురించి కొన్ని వివరాలు చెప్పారు.
ఇద్దరూ అలా బయటకి వచ్చాక ఆయన మోహన్ తో దగ్గరలో ఉన్న ఒక టీ కొట్టుకి వెళ్దామని
ఆహ్వానించారు. అలాగే సైకిల్ నడిపించుకుంటూ రోడ్డు దగ్గరగా వచ్చి, అక్కడే ఉన్న ఒక చిన్న టీ కొట్టు దగ్గర ఆగి అక్కడ
బెంచ్ మీద కూర్చొని కొంత పిచ్చాపాటి మాట్లడుకోవడం ప్రారంభించారు. ప్రసంగవశాత్తు
ఆయన తన పేరు వెంకట్రావు అని, వాళ్ళది తూర్పుగోదావరి జిల్లాలోని జమిందారీ కుటుంబం అని ప్రస్తుతం USAలో ఉంటున్నానని, అయితే వాళ్ళకి ఎంతో ఆస్తి ఉండటంతోటి అతని దాయాదులు, అతనంటే పడనివారందరూ కలిసి ఏవో క్షుద్రశక్తులు ఆయన మీద
ప్రయోగించారని, అప్పట్నించి జీవితం నరకప్రాయమైపోయిందని, ఎప్పుడు ఆయన INDIAకు వచ్చినా, తన గృహానికి వెళ్ళినా అక్కడ దండెం మీద ఉన్న బట్టలన్నీ వాటంతటవే కాలిపోవటం, తరువాత ఆయన భోజనానికి కూర్చుందామని పీట మీదకూర్చోగానే
ఆ పీట కింద ముళ్ళున్నట్టుగా ఆయన కూర్చోలేకపోవడం, కుర్చీలో కూడా కూర్చోలేకపోవడం , ఎంతసేపూ లేచి పచార్లు చేయాల్సిందే తప్ప కూర్చోవటం అనేది జరగటం లేదని, ఆహరంలో పురుగులు అవన్నీ కనిపిస్తూ భోజనం కూడా చేయలేని
పరిస్థితిలో ఉండగా ఆయనకి కలలో వారి ప్రత్యక్ష దైవమయిన వేంకటేశ్వరస్వామి
కనిపించి, నువ్వు ఫలానా చోట, ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళవలసిందిగా చెప్పారని, ఆ ఆదేశం విని అతడు ఆశ్చర్యపడిపోయి, మరి అదే ప్రకారంగా హైదరాబాద్ వచ్చి ఎలాగో అలాగ రాజా ఆంజనేయప్రసాద్ గారి విలాస౦, మిగతా వివరాలన్నీ కనుక్కుని వచ్చానాని చెప్పారు. ఆయన
రాజావారి గురించి మోహన్ ని వాకబు చేయగా, అతను కూడా తనకు జరిగినటువంటి అనుభవం, సరోజగారి విషయం ప్రస్తావించటం జరిగింది. ఆయన చెప్తున్న విషయాలను వింటుంటే
చిన్నప్పుడు మోహన్ వాళ్ళ అమ్మగారు హైదర్ బస్తీలో ఉన్నప్పుడు జరిగిన
కొన్ని వివరాలు అతనికి గుర్తుకు వచ్చాయి. ఆ రోజుల్లో మరి హైదరాబాద్ ని నైజాం
రాజ్యం అనేవారు. విపరీతమైనటువంటి చేతబడులు అవి విపరీతంగా జరిగేవని, మోహన్ వాళ్ళ అమ్మగారికి తెలిసిన కుటుంబం వారికి కూడా ఇలాంటి ప్రయోగాలు జరిగినప్పుడు
వారు మరి ఇంట్లో కూర్చునుండగా, ఆ ఇంటి మీద రేకులషెడ్డు పై టఫ టఫ అని రాళ్ల వర్షం కురిసేదని, బట్టలు వాటంతటవే కాలిపోయేవని, ఇలా ఎన్నో రకాలుగా ఆవిడ మోహన్ కి చెప్పారు. ఈయన ఉదంతం
విన్నాక అవే మోహన్ కి గుర్తుకి వచ్చాయి. కానీ అతని మనస్సులో మరి నిత్యం పూజలు, పారాయణలు అన్నీ చేస్తున్నప్పటికి కూడా ఇలాంటివన్నీ
ఎందుకు జరుగుతాయి అన్న సందేహం మాత్రం ఎవ్వరు తీర్చలేకపోయారు. ఆ తరువాత
వాళ్ళిద్దరూ కూడా మరికొన్ని విషయాలు మాట్లాడుకున్నారు. వెంకట్రావుగారు, రాజా ఆంజనేయ ప్రసాద్ గారు తమ కోసం పూజా
కార్యక్రమాలన్ని చేస్తూఉన్నరని, ఇది కొంతకాలం పడుతుందని, ఎందుకంటే దుష్టశక్తులు విపరీతమైన శక్తి కలిగినవని చెప్పారని మోహన్ తో
చెప్పారు. అక్కడితో ప్రసంగం ముగిసి వాళ్ళిద్దరూ ఒకరికొకరు వీడ్కోలు
చెప్పుకున్నారు. తరువాత మోహన్ తన ప్రయాణాన్ని సాగించాడు.