Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

7 January 2016

Daivika Shaktulu - Asura Shaktulu


మా వెబ్ సైట్ పాఠకులకి ఒక సూచన
ఇదివరకు మోహిని కథ ప్రచురించినట్టుగానే ఇప్పుడు మేము మీకు అదేలాంటి కథ దైవిక శక్తులు – అసుర శక్తులు అనే ధారావాహిని అందించబోతున్నాం అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇది కూడా కల్పించిన కట్టు కథ కాదు నిజంగా జరిగిన సంఘటనలే.

దైవిక శక్తులు - అసుర శక్తులు
ఉపోద్ఘాతం
మానవులందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అందులో ముఖ్యంగా దైవిక  శక్తులు మరియు దుష్ట శక్తుల గురించి ఎక్కువగా మనకు సందేహాలు వస్తూ ఉంటాయి. మనం ఇళ్ళలో ఎప్పుడూ పూజలు పునస్కారాలు, నోములనివ్రతాలని, గాయత్రీ హోమాలని, జపాలని ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. ఎందుకు ? మన౦దరికి కూడా ఆ భగవంతుడు ఎల్లప్పుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కొంత మంది కోరుకుంటే, కొంత మంది మానవులు ఏ పరంగానూ బోలెడన్ని కోరికలు కోరుకుంటూ ఉంటారు. 

నిత్యం ఇంట్లో పూజాపునస్కారాలు చేసుకుంటూ ఉంటే  ఈ దుష్ట శక్తులు అంటే ఈ దయ్యాలు, పిశాచాలు, భూతాలు మొదలైన వాటి  నుండి మనకి రక్షణ కలుగుతుందని ఒక బలమైన నమ్మకం ఉంది. మరి మా ఇంట్లో కూడా మా అమ్మగారు వంటా వార్పూ చేసుకున్నాక  కొన్ని గంటల తరబడి ఆ పూజా మందిరంలో అనేక రకాల పూజలు పునస్కారాలు అన్ని చే స్తూ ఉండేది. అయితే మేమున్న ఊళ్ళో మరి పూజ పునస్కారాలు చేస్తున్నవారి ఇళ్ళలో కూడా దుష్ట శక్తులు రావడం, వాటి వల్ల వారు ఎంతో బాధ పడటం అది ప్రత్యక్షంగా చూసినప్పటికీ పూర్తిగా సమాధానం లేని ప్రశ్నలాగానే ఉంటూ ఉండేది నా మనస్సులో.
ప్రతి నిత్యం హనుమాన్ చాలీసా చదువుకున్నా, గాయత్రీ మంత్రం చదువుకున్నామరి ఇంకా ఏదో నామ జపం చేసుకున్నా, షిరిడి సాయిబాబా విభూది పెట్టుకున్నా ఇటువంటి దుష్ట శక్తులు మన దగ్గరకి రావని మరి మన పెద్దవాళ్ళ౦దరు చెప్తూ ఉంటారు.  కానీ ఆశ్చర్యం ఏమిటంటే అవి వస్తూనే ఉంటాయి. మనుష్యులు బాధ పడుతూనే ఉంటారు. ఏమిటి ? ఎందుకు ఇలా జరుగుతుంది ? అన్న ఆలోచన మన౦దరికి వస్తూ ఉంటుంది. అయితే నా ప్రశ్నలకి సమాధానంగా నా  దగ్గర స్నేహితుని జీవితంలో  జరిగిన రెండు సంఘటనలు నా ఆలోచనలను పూర్తిగా మార్చివేసాయి. భగవంతున్ని నమ్ముకుంటే, పూజలు పునస్కారాలు అవి అన్నిచేసుకుంటే మనకి ఎటువంటి దుష్ట శక్తుల నుంచి ఆపదలు ఉండవనే నమ్మకం చాలా మటుకు సడలిపోయింది!!!.  నాణానికి రెండు పక్కలు ఉంటాయి బొమ్మా... బొరుసు. ఎక్కడ మంచి ఉంటుందో దాన్ని ఆనుకునే చెడు ఉంటుంది అని ఒక విశ్వాసం నాకు కలిగింది. నా ప్రియమైన స్నేహితునికి జరిగిన ఈ రెండు అనుభవాల గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను.

                           దైవిక శక్తులు – అసుర శక్తులు  -1
లోగడ నేను చెప్పిన దైవిక శక్తులు దుష్ట శక్తులు కొద్దిగా మార్పు చేసి ఈ కధ చెప్తున్నాను.  దైవిక శక్తులు దుష్ట శక్తులు నిజంగా జరిగినటువంటి ఒక యధార్ధ  గాధ. మోహన్ సుమారుగా 14 ఏళ్ళు ఉండి ఉంటాయి. అతను దోమలగూడ మార్కెట్ వద్ద వున్న శంకర్ సైకిల్ టాక్సీ లో ఒక సైకిల్ ని అద్దె కి తీసుకొని సుమారు 8 గంటల ప్రాంతంలో చార్మినార్ వైపుగా ప్రయాణాన్ని సాగించాడు. అది 1964 వ సంవత్సరం. అలా నెమ్మదిగా సైకిల్  తొక్కుకుంటూ చార్మినార్ చేరుకున్నాడు.   అక్కడ చార్మినార్ వెనుక వైపు ఉన్నటువంటి శాలిబండ లో , అప్పట్లో ఆ ఎత్తుమీద రోడ్డుకి కుడి వైపున ఒక పెద్ద చెట్టు కింద ఒక ఎముకల చికిత్సా నిపుణుడు ఒక హకీమ్ ఉండేవాడు.
అతని ఆసుపత్రి పక్కగా ఒక చిన్న ఆట స్థలానికి చేరుకున్నాడు.  దాన్ని అప్పట్లో పటేల్ గ్రౌండ్, హనుమాన్ టెంపుల్ దగ్గర అని వ్యవహరిస్తూ ఉండేవారు. దాన్ని ఆనుకుని ఉన్న,   ఇంటి ముందు సైకిల్ని పార్క్ చేసి ఆ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లు ప్రఖ్యాత తాంత్రికుడు అయినటువంటి శ్రీ రాజాఆంజనేయ ప్రసాద్ గారి ఇల్లు. ఆతను కాయస్థుడు. కాళిక అమ్మవారి ఉపాసకుడు. అతడికి అప్పట్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండేవి. చేతబడులు ఎవరన్నా చేస్తే వాటికి ఇతను విరుగుడు మాత్రమే చేసేవాడు. చాలా మంచి పేరు సంపాదించాడు. మరి మోహన్ ఆయాసం తీర్చుకుంటూ అక్కడే ఉన్న ఒక బెంచి మీద చతికిలపడ్డాడు. ఎదురుగుండా చిన్న పూజామందిరం. దానిలో అమ్మవారి విగ్రహం, ఆ విగ్రహం కనిపించకుండా ఆ విగ్రహం కన్నా ఎత్తుగా కుంకుమ రాశి నిండి ఉంది. దాని ఎదురుగుండా శ్రీ రాజా ఆంజనేయ ప్రసాద్ గారు కూర్చొని చాలా నిష్ఠగా మంత్రాలు చదువుతూ ఉన్నారు.  వారి అమ్మాయి దేవి వచ్చి “కాసేపు కూర్చోండి,నాన్నగారు పూజ అయిపోయినాక వస్తారు” అని చెప్పి మంచి నీళ్ళ గ్లాసు ఇచ్చి వెళ్ళిపోయింది .   మోహన్ అక్కడే కూర్చొని తన ఆలోచనల్లో మునిగిపోయాడు. 
మోహన్  వాళ్ళ పిన్నిగారికి హార్డికర్ బాఘ్ హిమాయత్ నగర్ లో స్వంత ఇల్లు ఉంది. అతను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అక్కడే వాళ్ళ ఇంట్లో దిగుతూ ఉండేవాడు . లేదా వారి అమ్మగారి పుట్టిల్లు కూడా అక్కడే ఉండటం మూలంగా అక్కడ గాని లేదా ఇక్కడగాని అతను బస చేస్తూ ఉండేవాడు. అతనికి చిన్నతనం నించే ఈ గారడీ విద్యల పట్ల, దైవిక శక్తుల పట్ల, హిప్నోటిజం వీటన్నిటి పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. అందుకు తగినట్లుగానే అదే వీధిలో ఉన్న అడిషనల్ డైరెక్టర్ అఫ్ మెడికల్ సర్వీసెస్ శ్రీ రంగారావు గారి పెద్ద కుమారుడైన అబ్బాయి (అతన్ని మరి అందరూ కూడా ముద్దుగా "అబ్బాయి" అని పిలుస్తారు.) సహచర్యంలో వీటికి సంబంధించిన చిన్నచిన్న పుస్తకాలు చదవటం ప్రారంభించాడు.
ఈ అబ్బాయి హిప్నోటిజం, పేరాసైకాలజి మొదలైన  వాటి మీద ఏవేవో పరిశోధనలు చేస్తుండేవాడు.  అతని  వయస్సు సుమారు 17, 18 ఏళ్ళు ఉంటాయి. అతనే ఒకసారి ఈ రాజా ఆంజనేయ ప్రసాద్ గారిని పరిచయం చేయడం జరిగింది. అంతకు మించి మోహన్‌కి ఈ రాజాగారి గురించి అంతగా తెలియదు. ఆయన ఏదో అమ్మవారిపూజలు చేస్తారని,చేతబడులు ఏవన్నా ఉంటే వాటికి ఆయన నివారణ చేస్తారని మాత్రమే చూచాయగా తెలుసు. అంత చిన్న వయసులో అతనికి వీటి పట్ల అంత పెద్దగా అవగాహన లేదు.

అప్పట్లో అబ్బాయి దగ్గర నేర్చుకున్నటువంటి హస్తసాముద్రికం అంటే palmistry నలుగురికి సరదాగా చెప్తూ ఉండేవాడు. అయితే ఒక సారి సంగారెడ్డిలో ఉన్న అతని దగ్గరి స్నేహితుల ఇంటికి ఇతను వెళ్ళడం జరిగింది. అతను దిగిన స్నేహితుల ఇంటి పక్కనే ఉన్న సరోజగారు ఇతనితో కూడా హస్తసాముద్రికం కొంత చెప్పించుకొని, తన వ్యక్తిగత విషయాలు చెప్పి దానికి పరిహారం ఏవన్నా మీకు తెలుసా? అని అడిగింది. ఆమె సంగారెడ్డిలోనే ఒక సీనియర్ నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెకి ఒక వ్యక్తితో పరిచయమయ్యి మరి వివాహం కూడా జరిగిపోయి ఒక చిన్న పాప కూడా పుట్టింది. అంతవరకూ కూడా మరి ఆమెకి, అతనికి అంతకు మునుపే పెళ్లి అయ్యిందన్న విషయం తెలియలేదు. తెలిసినాక కూడా ఆమె ఏమి చెయ్యలేకపోయింది. అయితే భర్త హైదరాబాద్ లో విఠల్ వాడిలో ఉంటూ ఉండేవాడు. సంగారెడ్డి వచ్చినప్పుడల్లా సరోజను తప్పకుండా నువ్వు మా ఇంటికి రావాలి నేను నిన్ను  చూసుకుంటానని ఎంతో ప్రేమగా చెప్తూ ఉండేవాడు. తీరా సరోజగారు విఠల్ వాడికి వెళ్లేసరికి ఎవరో ఏమిటో తెలియనట్లుగా ఆమెతో వ్యవహరించి నానా దుర్భాషలాడి ఇంటినుండి గెంటి వేస్తూ ఉండేవాడు. అతని వింత ధోరణి ఈవిడకి ఏమాత్రం అర్థంకాలేదు. ఇది ఆవిడ సమస్య.  అయితే మధ్యలో ఆతను ఎంతో తీవ్రంగా జబ్బు పడి, చావుబ్రతుకుల మధ్య ఉండటం సరోజగారిని పాపం ! చాలా కలవరపెట్టింది. ఆ సందర్భంలోనే తనని ఆవిడ సహాయం అడగటం, అప్పుడే తన స్నేహితుడు "అబ్బాయి" చెప్పిన ఈ రాజాగారి గురించి విని ఉండటం వల్ల సరోజ గారి విషయం చర్చించటానికే మోహన్ రాజాగారి ఇంటికి వెళ్ళాడు.

ఈ లోగా రాజాగారి స్వరం చాలా హెచ్చు స్థాయిలో వినపడటంతో మోహన్ ఉలిక్కిపడి అటువైపుగా చూసాడు. సరిగ్గా పూజా మందిరం ఎదురుగుండా పసుపు, కుంకుమలతో తడిసినటువంటి ఒక పెద్ద వస్త్రం మీద విచిత్రమైన ముగ్గు, ఆ ముగ్గులో ఒక నాలుగు, ఐదు చెక్క విగ్రహాలు ఉండటం, నిమ్మకాయలు అన్నీ కోసి ఒకొక్క చెక్క విగ్రహం బొమ్మ దగ్గర పెట్టారు. ఈ లోగా రాజావారు గట్టిగా మంత్రాలూ చదువుతూ కుంకుమ అమ్మవారి మీద చల్లుతూ పూజలు చేస్తూ ఉన్నారు. అలా ఒక పావుగంట ముగిసాక ఆయన మెల్లగా లేచి  మారు మాట్లాడకుండా లోపలికి వెళ్లి ఒక పదిహేను నిమిషాల తర్వాత బయటకి వచ్చి "అరె మోహన్ భాయి!!! कैसे हो? कब आये? क्या बात है ? बहुत दिन के बाद आये हो!" ( ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావు? ఏమిటీ సంగతులు? చాలా రోజులైనాక వచ్చావు?) అని ఎంతో ప్రేమగా తన మాతృభాషైన హిందీలో పలకరించాడు. తను బాగానే ఉన్నానని మోహన్ జవాబు ఇచ్చాడు. రాజావారు రెండు కప్పులు టీ చెప్పి, ఆ టీ చప్పరిస్తూ,"  ఆ ఏంటి మోహన్ ఏంటీ ఇలా వచ్చావ్?  ఏ పని మీద వచ్చావు? ఏమిటి సంగతి? అందరూ బాగున్నారా? "అని ఆయన ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మోహన్ తను వచ్చిన పనిని గురించి వివరించగా, "ఓహో! అలాగా ! ఏం ఫరవాలేదు నేనున్నాను కదా ! అంతా చక్కపరుస్తాను" అని చెప్పి,  టీ తాగటం పూర్తి  కాగానే తమలపాకులు తెప్పించి దానిలో మరి ఏవో వస్తువులు అంటించారు. బహుశా అది అంజనం అనుకుంటాను. తన దగ్గరి నుంచి పేర్లు, మిగతా వివరాలు అన్నీ తీసుకున్నాక ఆయన ఏవో మంత్రాలూ గొణుగుతూ దానిలోకి తీక్షణంగా చూసి "మోహన్ ! నీవు  చాలా చిన్నపిల్లాడివి. నీవు చెప్పిన ఈ వ్యక్తికి అతడి మొదటి భార్య మనసు మార్చటానికి ఏదో గోసాయి సహాయం తీసుకొని అతనికి భోజనంలో కొన్ని పదార్ధాలు, భర్తకి తెలియకుండా పెట్టి అతని చేత మింగించింది. ప్రస్తుతం అతను చాలా ప్రమాదకరమైన స్తితిలో ఉండి ఉండాలి!!!.

అయితే మోహన్ ! నీవు ఒక పని చేయి. ఈ రోజు ఇప్పటికే ఆలస్యం అయ్యింది. కాబట్టి రేపు పొద్దున్నే నీవు ఇక్కడికి పరకడుపున (ఏమీ ఆహరం తీసుకోకుండా) వచ్చెసేయి, 8.30 గంటలకి ఇక్కడ నువ్వుంటే చాలు "అని చెప్పారు.  మోహన్ రాజవారిని ఎంత ఖర్చవుతుందని అడగ్గా, "నీ దగ్గర నేను ఎక్కువేమీ తీసుకోను కదా! అయినా నువ్వింకా విద్యార్ధివే కాబట్టి ఒక 300 రూపాయలు నీవు తేగలిగితే చాలు" అని చెప్పారు. "అలాగే!" అని తలూపి మోహన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం సాగించాడు.


                                                  (తరువాయి వచ్చే భాగం లో)