చేదు నిజాలు
episode-6
రాజీవ్ దీక్షిత్ - మన్మోహన్ సింగ్ తో భేటీ
నాకు ఒకసారి పూర్వ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారితో మూడు గంటలు చర్చలు జరిపే అవకాశం దొరికింది. మహారాష్ట్ర లోని సేవక్ రాం అనే ఒక చిన్న గ్రామంలో గాంధీ గారు నిర్మించిన ఒక చిన్న ఆశ్రమంలో నేను ఉంటూండగా మన్మోహన్ సింగ్ అక్కడకి వచ్చారు. ఆయన అక్కడకి ఎందుకు వచ్చారంటే సేవక్ రాం గ్రామం పక్కన ఉండేటువంటి వ్యవసాయం చేసుకునే రైతులు 56,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన ఒక మూడు గంటలు అక్కడ ఆగినప్పుడు నేను ఆయనని కలవడం జరిగింది. అప్పుడు అక్కడ జనం అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఆయన తలక్రిందులైపోయినారు. నేను ఆయనని మొట్టమొదటిసారిగా ఒక ప్రశ్న అడిగాను. మీరు ఎంతో ప్రముఖమైన ఆర్ధిక శాస్త్రవేత్త కదా!విదేశీయులు కూడా మిమ్మల్ని గొప్ప ఆర్థికవేత్త అని ఎంతో పొగుడుతూ ఉంటారు. కానీ నాకు అర్ధంకాని విషయం మీరు డాలర్ ధరని పెంచారు మరియు రూపాయి విలువను తగ్గించారు. మీరు ఆర్ధికమంత్రి అయ్యాక ఒక్కరోజులోనే చాలా శాతం రూపాయి యొక్క విలువని తగ్గించి, అమెరికన్ డాలర్ విలువని పెంచారు. మరికొద్ది రోజులకే మళ్ళీ చాలా శాతం రూపాయి విలువను మీరు తగ్గించి డాలర్ విలువను పెంచారు కదా!మీరు ప్రధానమంత్రి అయ్యాక కూడా ఇదే విధానం కొనసాగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? తన స్వంత దేశం యొక్క ద్రవ్యపు విలువను తగ్గించుకుంటూ డాలర్ విలువను పెంచడం భావ్యం కాదు కదా!ఇదెలా సాధ్యం?
ఈవిధంగా మీరు చేసినందువల్ల మన దేశానికి చాలా నష్టం జరుగుతోంది కదా?అని నేను ప్రశ్నించగా, ఆయన నన్ను తిరిగి బదులు ప్రశ్నించారు "ఏవిధంగా నష్టం జరిగింది అని"? నేను ఆయనతో రెండు విషయాలు చెప్పాను,మళ్ళీ అవే విషయాలు ఇక్కడ మీకు చెప్తున్నాను. మొదటి ఉదాహరణ మన్మోహన్ సింగ్ గారు ఆర్ధికమంత్రిగా పనిచేసిన రోజుల్లో భారతదేశం అమెరికాకి లోహాన్ని ఒక కిలో 7 రూ/- చొప్పున అమ్ముతూండేది. మన్మోహన్ సింగ్ ఆ సమయంలో రూపాయి రేటుని తగ్గించడం వల్ల కిలో లోహం విలువ 15 పైసలకు పడిపోయింది. దీనివల్ల ఎంత నష్టం వచ్చిందో సామాన్య భారతీయిడిని అడిగినా వాడు చెప్పగలుగుతాడు. అంటే ప్రతీ ఒక్క కిలో ఇనుప ఖనిజానికి మనకి 6.85 రూ/- నష్టం వచ్చింది. మొత్తంగా 13 వేల కోట్ల రూపాయల నష్టం ఈయన చేసిన తప్పిదం వలన మనకు కలిగింది. ఈవిధంగా 15 ఏళ్ళకి కనుక లెక్క కడితే మనకు కలిగిన నష్టం భారీ మొత్తంలోనే ఉంటుంది కదా? ఇంత భారీ మొత్తంలో వచ్చిన నష్టం కనుక నివారించగలిగితే మనం ఆ డబ్బుతో పంజాబ్ లోని ప్రతీ గ్రామానికి బంగారంతో రహదారులు నిర్మించుకోగలం. మరి ఎందుకు ఈవిధంగా మీరు చేశారు అని నేను ఆయనని ప్రశ్నించినపుడు ఆయన ఈవిధంగా బదులు చెప్పారు. "ఏమిచెయ్యాలి? భారతదేశం అమెరికా, IMF, వరల్డ్ బ్యాంకు మరియు ఇంకా అనేక విదేశీ సంస్థల నుంచి అప్పు తీసుకుంది. అమెరికా వారి షరతుల ప్రకారం రూపాయి ధరని తగ్గించవలసివచ్చింది అని." మరలా నేను ఆయనని ఈవిధంగా ప్రశ్నించాను "అప్పు తీసుకునేటప్పుడు వాళ్ళ షరతుల ప్రకారం మీరు రూపాయి విలువను తగ్గించారు. దాని వలన మన దేశానికి ఎంతో నష్టం జరిగింది.
మరి మీరు దేశభక్తుడిని అని ఎందుకు చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఏది చెయ్యమంటే అది చేస్తే, దేశానికి నష్టం కలిగితే, అది మీ దేశ భక్తి ఎలా అవుతుంది? వాళ్ళు రూపాయి విలువని తగ్గించమని షరతు పెట్టినప్పుడు నేను తగ్గించను అని మీరు ఖచ్చితంగా చెబితే మీరు నిజమైన దేశభక్తులు అయ్యుండేవారు. వాళ్ళు ఎదో చెబుతున్నారు మీరు వాళ్ళు చెప్పిందంతా చేస్తున్నారు. నేను మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెబుతాను. పంజాబ్ లో మనం మంచి నాణ్యత గల చక్కెర కిలో 20/- కి అమ్ముతుంటాం. ఇదే చక్కెరని మనం అమెరికాకు ఒక కిలో 50 పైసల చొప్పున ఎగుమతి చేస్తున్నాం. అలాగే పంజాబ్ లో బాస్మతి బియ్యం బాగా పండిస్తారు. ఈ బియ్యం ధర మన దేశంలో కిలో 86/- ఉంది. మరి ఇదే బాస్మతి బియ్యాన్ని కిలో 1/- కే మనం అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. అంటే డాలర్ రేట్ తో పోలిస్తే ఎంత నష్టం వస్తోందో చూడండి! అలాగే 60 నుండి 70 రూపాయలు ధర ఉన్న మినపప్పుని మనం కిలో 2/- చొప్పున ఎగుమతి చేస్తున్నాం. ఈవిధంగా మీరు ఏ వస్తువుని చూసినా కూడా అమెరికాకు ఎగుమతి చేస్తున్నప్పుడు మన దేశానికి తీవ్ర నష్టం వస్తోంది. భారతీయులు ఎక్కువ ధర పెట్టి కొనుక్కుంటారు, అదే అమెరికన్లకు అయితే మనం చాలా తక్కువ ధరకే అమ్ముతున్నాం. మంచి నాణ్యత గల జీడిపప్పు, ద్రాక్ష ఇంకా అనేక రకమైన ఉత్పాదనలను అమెరికాకు 45 రెట్లు తక్కువ ధరకి అమ్ముతూంటాం. మీరు దేశానికి ప్రధాని మరియు గొప్ప ఆర్థికవేత్త అయ్యుండి దేశానికి తీవ్ర నష్టం కలిగే ఈ విధానాలను ఎందుకు అమలు చేస్తున్నారు? ఇంతకీ మీరు భారతదేశానికి ప్రధానియా? లేక అమెరికాకు ప్రధానియా? అని నేను చాలా ధైర్యంగానే ఆయన్ను ప్రశ్నించాను. దానికి మన్మోహన్ సింగ్ గారికి కొంచెం కోపం వచ్చింది కానీ ఆయన మేము ఏమీ చెయ్యలేమనే సమాధానాన్నే మళ్ళీ చెప్పారు. అందరి దగ్గరా అప్పులు తీసుకున్నాం కాబట్టి వాళ్లు చెప్పినట్టే నేను చేయాల్సివచ్చింది అని చెప్పారు. భారతదేశంలో పండే పంటలన్నీ భారతీయులకి అందని ధరలలో ఉన్నాయి వాళ్ళు కొనుక్కోవడానికి ఎంతో సతమతమవుతున్నారు. మరి అవే పంటలు మరియు ధాన్యాలని మీరు దాదాపు ఉచితంగానే అమెరికాకు సరఫరా చేస్తున్నారు. ఇదేవిధంగా మనం వజ్రాలు, బంగారం మొదలైన ఆభరణాలని కూడా అమెరికాకు ఎగుమతి చేస్తూంటాం. మొత్తం ఎగుమతి యొక్క విలువ 50 లక్షల కోట్లు అని అనుకుంటే దాని యొక్క అసలైన ధర అంతర్జాతీయ మార్కెట్లో 25 వేల లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది.ఎందుకు ఈవిధంగా చేయవలసివస్తోంది? దానికి ఒకే ఒక్క కారణం డాలర్ రేట్ ను పెంచి రూపాయి ధరను తగ్గించడం.
ఇందుమూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి.నేను అడిగే ప్రశ్నల పరంపరకి,మరియు చెబుతున్నలెక్కల వివరాలు అన్నీ విన్నాకా ప్రధానికి ఏమి చెప్పాలో అర్ధంకాక నిరుత్తరుడైపోయాడు. వెంటనే ఆయన రాజీవ్ దీక్షిత్ గారూ,"మీరు పార్లమెంట్ కు వచ్చి నా కుర్చీలో కూర్చున్నట్లయితే నేను చేసినట్టుగానే మీరూ చెయ్యక తప్పదు"అని నాతో చెప్పారు. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకుంటే నేను ఆ ప్రధాని పదవిని అసలు కోరుకోను. దేశానికి ఇంత నష్టం వాటిల్లే పనులు నేను చెయ్యలేను. నిజానికి మీరు ప్రజలకి వాస్తవాలను ఎందుకు చెప్పటంలేదు? ఎందుకు ప్రజలందరినీ మభ్యపెడుతూ ఇంత అఘాతంలోకి తోసివేస్తున్నారు? మీరు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ globalization, liberization అని పెద్దపెద్ద మాటలు చెప్తారు. కానీ మీరు చేస్తున్నది మాత్రం americanization. సరే ఇటువంటి విషయాలు సామాన్యమైనటువంటి ప్రజలకు ఎలాగూ తెలియదు, నాయకులూ ఏమీ చెప్పరు. కానీ నాలాగ కాస్త చదువుకున్నవాడు, కొంత విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఏమి చేస్తున్నారంటే ఎంతసేపూ ఆ టీవీ లో వచ్చేటటువంటి కార్యక్రమాలు చూడటం, క్రికెట్ మ్యాచ్లు చూడటం, ఇతరత్రా వినోద కాలక్షేపాలు చేస్తున్నారే తప్ప అసలు మన భారతదేశం ఎక్కడికి వెళ్తోంది, ఏమవుతోంది అని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. నాలాంటి యువకులకి నేనెప్పుడూ సలహా ఇస్తుంటాను, మీరు నాలాగా గ్రామగ్రామానికి వెళ్లి ప్రజలని చైతన్యవంతం చెయ్యండి అని. కావున మీరు చేస్తున్నది ప్రపంచీకరణ( globalization) కాదు, బానిసత్వాన్ని వ్యాప్తి చెయ్యడం మాత్రమే.
ఈవిధంగా ప్రపంచ బ్యాంకులు, మరియు అమెరికా లాంటి దేశాలు ఒక చేత్తో అప్పు ఇచ్చి మరొక చేతులతో ఆ దేశాల యొక్క జాతీయ సంపదను అంతా దోచుకుంటున్నాయి. భారతదేశం మాత్రమే కాదు ఇథియోపియా, సోమాలియా లాంటి ఎన్నో దేశాలు ఇలా దోచుకోబడుతున్నాయి. రాజకీయ నాయకులు మాత్రం చాలా గొప్పగా ప్రపంచ బ్యాంకు నుండి అప్పుతీసుకున్నామని ప్రజలకి చెబుతారు. అడుక్కుతెచ్చుకుంటున్నాం అని చెప్పుకోవడానికి సిగ్గు, అభిమానం కొంచమైనా లేదు మన నాయకులకి. దీనినే పత్రికల వాళ్ళు మరియి టీవీ వాళ్ళు చాలా పాసిటివ్ గా చూపిస్తుంటారు. కావున మన నాయకులు దేశానికి నష్టం కలిగించే ఇటువంటి పనులని మానుకుంటే మన దేశం త్వరలోనే సంపన్న దేశంగా ఎదగగలదు. ప్రియమైన పాఠకులారా మీరు ఇప్పటికైనా మేల్కొనండి. ఈ చేదు నిజాలను తోటి భారతీయులతో పంచుకోండి. కనీసం మీరు చెప్పిన పదిమందిలో ఒక్కరు మారినా కూడా దాని ప్రభావం ఎంతో మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాం.