చేదు నిజాలు
Episode5
Episode5
నేను ఒకసారి కాన్పూర్ వెళ్ళినప్పుడు అక్కడ భారతీయ స్వాభిమాన్ సభకి వెళ్లడం జరిగింది. కాన్పూర్ స్టేషన్ లో దిగి ప్లాటుఫారం క్రాసింగ్ వంతెన దాటి వస్తున్నప్పుడు ఆ ప్రక్కనే ఒక చిన్న టీ దుకాణం ఉంది, అక్కడ ఒక తల్లి మరియు ఆమె పిల్లలు కొడుకు, కూతురు కూర్చొని ఉన్నారు. ఆ చిన్న అమ్మాయి తల్లిని, అమ్మా!"మనమెందుకు పేదవాళ్లుగా ఉన్నాము?" అని ప్రశ్నించడం విని నేను ఒక్క క్షణం ఆగిపోయాను. ఇలా ఈ ప్రశ్న అడుగుతున్న ఆ పాప, ఆ కుటుంబం సామాన్యులు కారు అని నాకు ఎందుకో అనిపించింది. సరే! వెళ్లి కనుక్కుందాం వారిగురించి అనే కుతూహలంతో నేను వెళ్ళాను. మీరు ఎవరు? ఏం చేస్తున్నారిక్కడ? అని అడగ్గా వాళ్ళు చెప్పిన సమాధానం విన్నాక నేను దిగ్భ్రాంతి చెందాను. మేమంతా తాంతియాతోపే పరివారం వాళ్ళం అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ రాజీవ్ దీక్షిత్ గారు ఉపన్యాసం కొనసాగించడానికి కొంత సమయం పట్టింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, గొంతు గద్గదమైపోయింది. మన భారతదేశంలో తాంతియాతోపే వంటి దేశభక్తుని యొక్క పరివారం ఆఖరికి టీ దుకాణం పెట్టుకుని బ్రతకవలసివస్తోంది. తాంతియాతోపే కి విరుద్ధంగా పనిచేసినటువంటి దేశద్రోహులకి ఈ భారతదేశంలో సింహాసనాలు దక్కాయి, రాజభోగాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏ వ్యక్తులైతే తాంతియాతోపేను వెన్నుపోటు పొడిచి, విద్రోహచర్యలు గావించి అతనిని హత్య చేశారో ఆ విద్రోహులలో ఇద్దరు భారతదేశంలో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. మీకు తెలుసా ఈ నిజాలు? ఏ దేశ ద్రోహులైతే తాంతియాతోపే యొక్క రహస్య స్థావరాన్ని ఆంగ్లేయులకు తెలిపారో అటువంటి వంశస్థులు ఈ భారతదేశంలో చాలా ఉన్నత పదవులలో ఉన్నారు. ఏ దేశ ద్రోహులైతే ఝాన్సీ లక్ష్మీబాయి వంటి దేశ భక్తురాలిని, ధైర్యవంతురాలిని కుట్ర పన్ని చంపించారో వారు ఈ దేశంలో ఉన్నత పదవులని అలంకరించారు. ఈ దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన దేశ భక్తుడైన తాంతియాతోపే యొక్క పరివారం మాత్రం టీ దుకాణం పెట్టుకొని చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.ఇటువంటిది మన భారతదేశం. ఇటువంటి దుర్మార్గాలని మనం ఎందుకు సహించాలి?సహించవలసిన అవసరం లేదు అని నేను భావిస్తున్నాను. దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఎంతోమంది దేశ భక్తులు భారతదేశం ఈ విధంగా తయారవుతుందని వారెప్పుడూ అనుకోలేదు. వారి యొక్క కల్పన వేరేవిధంగా ఉండేది.తాంతియాతోపే, ఝాన్సీ కి రాణి లక్ష్మీబాయి, చంద్రశేఖర్ లాంటి దేశ భక్తులు కలలో కూడా భారతదేశం స్వాతంత్య్రం తరవాత ఇలాగ ఉంటుందని బహుశా ఉహించి ఉండనే ఉండరు. వారు ఎంత దేశ భక్తులో చంద్రశేఖర్ ఆజాద్ జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనని నేను మీకు వివరిస్తాను. చంద్రశేఖర్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. అతడు 13 ఏళ్ల వయసులోనే ఇంట్లోంచి పారిపోయి బెనారస్ చేరాడు. అక్కడ విప్లవకారుల సంఘంలో అతడు చేరిపోయాడు. అక్కడే విప్లవకారులతో పాటు కాకోరికాన్డ్ లో వారు ఖజానాని కొల్లగొట్టడం జరిగింది. దాని వాల్ల వారికి కొంత డబ్బులు సమకూరాయి. ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ తల్లితండ్రులు అతనికి ఒక ఉత్తరం రాశారు. "నీ దగ్గర ఉన్న డబ్బులలో కొంత మాకు ఇస్తే మా దారిద్య్రం కొంత తీరుతుంది కదా!" అని దాని సారాంశం. అప్పుడు చంద్రశేఖర్ స్వయంగా తన తల్లితండ్రులను కలవడానికి ఇంటికి వెళ్ళాడు. అతడు తల్లితండ్రులతో ఈవిధంగా అన్నాడు "నా దగ్గర ఉన్న డబ్బుని నేను మీకు ఇవ్వలేను అది దేశానికి సంబంధించినది. అయితే ఒక విషయం! నా దగ్గర ఒక రివాల్వర్ ఉంది దానిలో రెండు బుల్లెట్లు ఉన్నాయి అది మాత్రం నేను మీకు ఇవ్వగలను అని చెప్పాడు." ఇటువంటి దేశ భక్తులకి జన్మ ఇచ్చినటువంటిది భారతదేశం. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి?మనం ఇంకొక రకమైన యుద్ధం చేయవలసి ఉంటుంది. ఒక యుద్ధాన్ని ఝాన్సీ కి రాణి లక్ష్మీబాయి, తాంతియాతోపే మరియు చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు చేశారు. అలాగే మనం కూడా ఇప్పుడు ఒక యుద్ధాన్ని చేయక తప్పదు. మేము భారతీయ స్వాభిమాన్ రక్షించే ఉద్యమంగా ఒక యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాం.