దేవదత్తుని వృత్తాంతం - 12
స్వామి వారు ప్రత్యేకంగా ఒక గదిలో ఉండి అందరికి ప్రత్యేక దర్శనం ఇస్తున్నారు. ఆయన తాగుతున్నటువంటి చుట్ట, సిగరెట్, బీడీ నుంచి వచ్చినటువంటి అమూల్యమైన నుసిని ప్రజలంతా భక్తి, శ్రద్దలతో పోగు చేసుకుంటున్నారు. దానికి తోడు అక్కడ ఉన్న ఒక ముఖ్య అనుచరుడు ఒక దారపు పోగు చేతికి కనక కంకణంగా కట్టుకుంటే ఎన్నో జబ్బులు పోతాయని, లక్ష్మీ కటాక్షం లబిస్తుందని చెప్పటంతో అక్కడ కూడా జనం విపరీతంగా గుమి గూడారు. ఒక్కొక్క పసుపు పచ్చ దారపు కంకణానికి 50 రూపాయలు వసూలు చేయడం , సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, దరిద్రంలో ఉన్నవారికి డబ్బు వస్తుందని చెప్పటంతో అక్కడ కూడా ఎంతో ఒత్తిడి జరిగింది. అక్కడ భక్తుల ఇళ్ళలో శ్రీపాద శ్రీ వల్లభ మరియు శ్రీ దత్త స్వామి వారి ఛాయా చిత్రాలు ఉండేవి. వాటి పక్కనే ఈ కొత్తగా వచ్చిన స్వామి వారి పెద్ద ఫొటోలు ల్యామినేట్ చేయబడి ఒక్కొక్కటి రెండు వందల రూపాయల చొప్పున విక్రయింపబడుతున్నాయి. అవి కూడా శ్రీపాద శ్రీ వల్లభ మరియు శ్రీ దత్త స్వామి ఫోటోల కంటే నాలుగు రెట్లు పెద్ద సైజులో ఉండటం , పెద్ద పోస్టర్ కు వేయి రూపాయల ధనం వసూలు చేయటం జరిగింది. ఇదంతా గమనిస్తున్న నాగనాథునికి పరి పరి విధాల ఆలోచనలు వస్తున్నాయి. మరి ఈ కలియుగంలో కలి కూడా అంత దుర్మార్గుడిగా ఉండడు కదా. ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ వల్లభ దాసు ఏం చేస్తాడు అని ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని వేలమంది అక్కడ భోజనాలు చేసి ఆరోజు రాత్రి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి శిరిడి సాయి బాబా గారి పరమ భక్తుడు వేంచేస్తున్నాడని అతను కూడా ఎటువంటి వ్యాధులనైనా క్షణంలో తీసివేస్తాడాని ప్రచారం జరిగింది. ఆసక్తి ఉన్నవాళ్లు ఉదయం 8 గంటల నుంచి సమావేశం కావాలని చెప్పటం జరిగింది. దీంతో వల్లభదాసుకి వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు అని నిశ్చయం దృఢం కాసాగింది. సరే అది కూడా ఏం జరుగుతుందో చూద్దామని తన సహచరులతో ఇంటికి వెళ్ళటం జరిగింది.