పీటర్ హర్కోస్ –
రెండవ భాగం
ఈ విధంగా పీటర్
హర్కోస్ ఉదంతం ఆ పట్టణపు ప్రజలందరికి తెలిసిపోయింది. ముఖ్యంగా ఈ వార్త పత్రికల
వాళ్లకి తెలియడం , వాళ్ళంతా పీటర్ హర్కోస్ ని ఉంచిన జైలుకి వెళ్ళడం, ఆయన్ని
ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా పీటర్ హర్కోస్ తనకు జరిగినటువంటి ప్రమాదం,
తర్వాత తాను వైద్య చికిత్స కోసం ఆసుపత్రిలో చేరడం, తనకి ఈ విషయాలన్నీ
ముందుగా తెలియడం వాస్తవమని, దాంట్లో ఏ మాత్రం అబద్ధం లేదని, తనకు ఎటువంటి గూఢచారుల
సంస్థలతో సంబంధం లేదని ఏ మనిషి యొక్క వెంట్రుకలు గాని, అతను వాడిన రుమాలు గాని
స్పర్శించినప్పుడు ఆ వ్యక్తియొక్క వివరాలన్నీ తెలుస్తుంటాయని, అవి ఎలా
తెలుస్తున్నాయి అన్న విషయం తనకు ఏమాత్రం తెలియదని చాలా ప్రశాంత స్వరంతో చెప్పాడు.
నా ప్రక్కన ఉన్నది గూఢచారి యని, అతనికి చాలా ప్రమాదం ఉందని, శతృవులు అతన్ని
చంపబోతున్నారని నాకెలా తెలిసిందని అన్నది నేను చెప్పలేను. నేను చెప్పిన విధంగానే అతను
శత్రువుల పన్నాగంలో ఇరుక్కుపోయి హత్య కావించబడ్డాడు. అంత మాత్రమే నాకు తెలుసు అంత
కన్నా మించి నాకేం తెలియదు అని అతన్ని కలుసుకోడానికి వచ్చిన పత్రికా విలేఖరులతో
చెప్పాడు.
ఇలా కొన్ని
రోజులు గడిచాక ఆ పట్టణంలో ఒక పెద్ద ఇంట్లో దొంగతనం జరిగింది. వారింట్లో సమస్తం
దోచుకుని ఆ దొంగలు వెళ్ళిపోయారు. ఆ ఇంటి యజమాని ఆ పట్టణంలో పలుకుబడిగల
వ్యక్తి. ఆ దొంగల ఆచూకీ తెలియలేదు. ఆ దేశపు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆ దొంగలని
పట్టుకోలేక పోయారు. పీటర్ హర్కోస్ ఈ విషయాలన్నీ ముందే చెప్తున్నాడు కదా మనం ఆయన్ని
ఎందుకు అడగకూడదు అనే ఆలోచన అందులో ఒకడికి వచ్చింది. వెంటనే పీటర్ హర్కోస్ ని
రప్పించి పరిస్థితి అంతా వివరించారు. ఎక్కడ దొంగతనం జరిగిందో అక్కడికి ఆయన్ని
తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఒక గదిలో దొంగ వదిలివేసిన రుమాలు సేకరించి,
దానిని స్పర్శించి ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు పీటర్ హర్కోస్
పోలీసులతోటి ఫలానా చోట మూట ఉంది ఆ మూట చుట్టూ కూర్చుని నలుగురు వ్యక్తులు
మాట్లాడుకుంటున్నారు. దానిలో ఒక వ్యక్తి ఈ రకంగా ఉంటాడు అని అతని ఆకారం, రంగు అతని
ముఖ కవళికలు అన్నీ చెప్పాడు. అతను ఏ దుస్తులు వేసుకున్నాడో అది కూడా చెప్పి , అతనే
ఈ దొంగతనం లో ముఖ్య పాత్ర వహించాడు. అతన్ని మీరు వెంటనే వెళ్లి పట్టుకోండి,
జరిగిందంతా బయటకి వస్తుంది అని చెప్పగా ఆ పోలీసులు అతను చెప్పిన ప్రదేశానికి
వెళ్లి అక్కడ ఆ దొంగలను పీటర్ హర్కోస్ చెప్పినట్టుగానే ఉండడం చూసి చాలా ఆశ్చర్య
పడిపోయారు. అందరినీ నిర్బంధించి ప్రశ్నలు వేయగా వారు దొంగతనం చేసినట్టుగా
ఒప్పుకున్నారు. ఈ విధంగా ఆ మిస్టరీ అంతా పీటర్ హర్కోస్ చెప్పిన విధంగా సఫలం కావడం
ఆ దేశ ప్రజలనంతా ఆశ్చర్యపరచింది. ఆ రోజుల్లో ఈ సంఘటన్ ఒక పెద్ద సంచలనాన్ని
సృష్టించింది. ఆ తర్వాత ఎంతో గౌరవంగా ఆ దేశపు నాయకులంతా పీటర్ హర్కోస్ ని
నిర్బంధంనుంచి తప్పించి , విడుదల చేసి అతని కున్న అద్భుతమైన అతీంద్రియ శక్తుల
ద్వారా ఆ దేశంలో ఘోరమైన నేరాలన్నింటినీ అరికట్టారు. అంతే కాకుండా పీటర్ హర్కోస్ కి
ఇంకొక అద్భుతమైన శక్తి కూడా ఉంది. అదేమిటంటే భూగర్భంలో ఉన్న నిధి నిక్షేపాలు, అతి
విలువైనట్టి నవరత్నాలు, మాణిక్యాలు వగైరా వగైరా, కనిపెట్టి చెప్పడం అక్కడ
త్రవ్వితే పీటర్ హర్కోస్ చెప్పినట్టుగానే అవి అక్కడ లభ్యమవ్వడం లాంటివి ఎన్నో
సంఘటనలు జరిగాయి. దీనితో అతని ఖ్యాతి ప్రపంచంలో నలుమూలలా ప్రాకింది. ఈ విధంగా
అతీంద్రియ శక్తులు ఉన్నాయనే విశ్వాసం ప్రజల్లో కలిగింది.
ఈ పీటర్ హర్కోస్
కి ప్రపంచమంతట్నుంచి కొన్ని వేల ఉత్తరాలు వస్తుండేవి. వాళ్ళ సమస్యలన్నీ చెప్పుతూ,
సూచనలనివ్వమని అర్థిస్తూ ఉండడం తరచుగా జరుగుతుండేది. ఒక సారి
భారతదేశంలో ఢిల్లీ లో ఉన్న ఒక ప్రముఖ ధనవంతుని కుమారుడు తప్పిపోవడం జరిగింది.
వాళ్ళు ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ కనుక్కోలేక పోయారు. అప్పుడు వాళ్లకి పీటర్
హర్కోస్ గురించి తెలిసి కుమారుని వివరాలన్నీ ఆయనకి చెప్పారు. అప్పుడు
పీటర్ హర్కోస్ “మీ కుమారుడు వాడిన ఏ వస్తువైనా కనక మీరు నాకు ఇస్తే దాన్ని బట్టి
ఏమైందో నేను చెప్పగలను” అని చెప్పాడు. అలాగే ఆ పిల్లవాడు వాడిన వస్తువుని పీటర్
హర్కోస్ స్పృశించి ధ్యానస్తితిలోకి వెళ్ళాడు. కొద్ది నిమిషాల తర్వాత “ మీ
అబ్బాయికి సర్కస్ అంటే చాలా ఇష్టం, అతనికి చిన్నప్పట్నుంచే ఈ సర్కస్ ఫీట్లు
చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళని చూసి తానూ కూడా వాళ్ళ లాగే చేయాలనే ఒక బలమైన
కోరిక ఉంది. అదే విధంగా , ఢిల్లీ లో ఒక ప్రముఖ సర్కస్ కంపెనీ వాళ్ళు
వచ్చినప్పుడు ఎలాగో అలాగా వాళ్ళని ఒప్పించి వాళ్ళతో బాటు ఆ సర్కస్ కంపెనీ లో
ఉన్నాడని, వాళ్ళతో బాటు ఒక అద్భుతమైన సర్కస్ ఫీట్లని నిర్వహిస్తున్నాడని, ఫలానా
సర్కస్ కంపెనీ , ఫలానా చోట సర్కస్ ప్రదర్శన జరుగుతుంది, మీరు కనుక అక్కడికి
వెళ్ళితే మీ పుత్రున్ని మీరు కనుక్కోవచ్చును అని చెప్పాడు.
అదేవిధంగా వాళ్ళు
పీటర్ హర్కోస్ చెప్పిన విధంగా ఆ సర్కస్ కంపెనీ కి వెళ్ళగానే అక్కడ ఆయన కుమారున్ని
ఆయన గుర్తుపట్టడం జరిగింది. ఇదంతా వాళ్లకి ఆశ్చర్యం, ఆనందాన్ని కలగజేశాయి.
ఎంతోమంది జ్యోతిష వేత్తలని సంప్రదించినా, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం
ఏమీ లేక పోయింది. కాని పీటర్ హర్కోస్ కేవలం తమ కుమారుడు వాడిన వస్తువు
స్పర్శతో ఆ పిల్లవాని ఆచూకీ చెప్పడం వాళ్లకి అంతు పట్టని విషయంగా ఉండి పోయింది. ఈ
విధంగా పీటర్ హర్కోస్ ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించింది. అతను ఈ
పోలీసులు ఛేదించలేని నేరాలాన్నింటినీ బయట పెట్టి ప్రభుత్వానికి , ప్రజలకి
ఎంతో సహాయం చేయడం జరిగింది.
మరి అతీంద్రియ
శక్తులు ఉన్నాయా? అంటే మరి ఇటువంటి యదార్థమైన గాథలన్నీ మనం వింటున్నప్పుడు
అలాంటివన్నీ ఉన్నాయని మనకి నమ్మక తప్పడం లేదు.
( concluding
part of Peter Horcos సమాప్తం )