పీటర్ హర్కోస్
అనే వ్యక్తి హంగ్రీ దేశస్థుడు. అతని తండ్రి పెయింటర్ వృత్తి కొనసాగిస్తూ ఉండేవాడు.
అంటే పెద్ద పెద్ద భవనాలకి, గోడలకి పెద్ద నిచ్చెనలు వేసుకుని, దానిమీద నించుని ఆ
గోడలకి రంగులు వేస్తుండేవాడు. అయితే ఒక్కడికే ఒక చేత్తో రంగు ఉన్న బకెట్
పట్టుకుని, ఇంకొక చేత్తో బ్రష్ పెట్టుకుని రంగులు వేయడం కష్టం కాబట్టి అతని
కొడుకైన పీటర్ హర్కోస్ ని సహాయకుడిగా ఉపయోగించుకుంటూ ఉండేవాడు. చాలా చిన్న
వయస్సులోనే పీటర్ హర్కోస్ తండ్రితో పాటు ఆ నిచ్చెన మీద నించొని చేత్తో పెయింట్
ఉన్న బకెట్ పట్టుకుని నిల్చుని ఉంటె ఆ తండ్రి పెయింట్ చేస్తూ ఉండేవాడు.
ఇలా ఆ
తండ్రికి సహాయం చేస్తూ పీటర్ హర్కోస్ కాలం గడుపుతూ ఉండేవాడు. దురదృష్టవశాత్తు ఒక
సారి మరి చెక్కలతో చేసి ఉన్నట్టి ఆ నిచ్చెన మీద నిల్చుని రంగులు
వేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కాలు జారి అంత ఎత్తునుండి దభేలుమని క్రింద పడి
తలమీద గాయాలు తగిలాయి. అతడు హాస్పిటల్ లో చేరి కోలుకుంటున్న సమయంలో అతని ప్రక్కన
మంచం మీద ఉన్న వ్యక్తికి కూడా బాగా గాయాలు తగిలి అదే హాస్పిటల్ లో
చేర్చబడ్డాడు. అప్పటికి పీటర్ హర్కోస్ పూర్తిగా కోలుకోలేదు. స్పృహలోనే ఉన్నాడు.
మాట్లాడుతున్నాడు. అతను ఎందుకో ప్రక్కనే ఉన్న రోగిని చూసినప్పుడు అతని మనస్సులో
మనకి టీవీ తెర మీద బొమ్మలు ఎలా కనిపిస్తాయో అదే మాదిరిగా ఆ రోగి జీవితం అంతా
అతనికి కళ్ళ ముందు కనిపించ సాగింది. అలా కనిపించగానే పీటర్ హర్కోస్ ముందు
చాలా గాభరా పడ్డాడు. ఆ కనిపించిన దృశ్యాల మూలంగా ఆ రోగి ఒక గూఢచారియని,
శత్రువుల బారి పడి, వారి చేతిలో గాయపడి ఇలా హాస్పిటల్ లో చేరాడు అని పీటర్ హర్కోస్
కి తెలిసింది. ఇదేమిటో ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయాడు.
ఈలోగా ఎవరో ఒక
వ్యక్తి వచ్చి ఆ రోగికి ఒక ఉత్తరాన్ని అందచేసి వెళ్ళిపోవడం, ఆ రోగి అతను
వెళ్ళిపోయాక ఆ ఉత్తరాన్ని చదివి, అక్కడ ఎవ్వరూ లేనప్పుడు మెల్లగా లేచి
దుస్తులుమార్చుకుని బయటకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు పీటర్ హర్కోస్ కి ఆ
ఉత్తరం తెచ్చిన వ్యక్తి మిత్రుడిగా నటిస్తున్న రష్యన్ గూఢచారి వర్గానికి
చెందినవాడని అతని అనుభవంలోకి వచ్చింది. అప్పుడు ఆ రోగిని ఉద్దేశిస్తూ పీటర్
హర్కోస్ “నీకు ఇప్పుడ ఉత్తరం ఇచ్చిన వాడు నిన్ను తిడతాడు. నీ శత్రుపక్షంలో వాడు.
నీవు ఇప్పుడు మాత్రం బయటకి వెళ్ళితే చాలా ప్రమాదం. నిన్ను హత్య చేసే ప్రయత్నం
జరుగుతుంది. దయచేసి నీవు వెళ్ళవద్దు” అని పరిపరి విధాలా చెప్పాడు. కాని ఆ రోగికి
వెళ్లొద్దు అని ఇతను ఎంత చెప్పినా అతని మాటలు వినకుండా, నమ్మకుండా వెళ్ళిపోయాడు.
కొద్దిసేపట్లో ఆ ప్రాంతమంతా తుపాకీ చప్పుళ్ళతో నిండిపోయింది. ఆ తర్వాత ఆ రోగి హత్య
చేయబడ్డాడని పీటర్ హర్కోస్ కి తెలిసినప్పుడు అతను చాలా బాధ పడ్డాడు. అతను
కోలుకుంటున్నప్పుడే ఈ వార్త తెలిసి ఆ గూఢచారి వర్గమంతా పీటర్ హర్కోస్ ని
అనుమానించింది. ఇతను కూడా ఒక రహస్య గూఢచారిగా పని చేస్తున్నట్టు వారికి
వచ్చిన అనుమానం ధృవపడసాగింది. ఎందుకంటే ప్రక్కనే ఉన్న ఆ రోగి గురించిన వివరాలు ఇంత
కరెక్ట్ గా ఎలా చెప్పగలిగాడు? ఆ వచ్చిన వ్యక్తి మిత్రుడిలాగా నటిస్తున్న గూఢచారి
అని ఎలా చెప్పగలిగాడు? అతని మీద హత్యాప్రయత్నం జరగబోతుందని ఎలా చెప్పాడు?
అని వాళ్ళు పరిపరి విధాలా ఆలోచించి పీటర్ హర్కోస్ తప్పకుండా గూఢచారి అయి ఉంటాడని
అతని కళ్ళకు గంతలు కట్టి రహస్య స్థావరానికి ప్రశ్నించడానికి తీసుకుని వెళ్ళారు.
అక్కడ పీటర్ హర్కోస్ ని ప్రశ్నించగా తనకేమీ తెలియదని, ఎందుకో ఆ రోగిని చూడగాని
అతని జీవితం వివరాలన్నీ తెలిసిపోయాయి. అలాగే మిత్రుడిలాగా నటిస్తూ ఒక
వ్యక్తి వచ్చినప్పుడు అతను ఒక గూఢచారి అని , అతని మీద హత్యా ప్రయత్నం జరుగుతుందని
తెలిసింది కాని అది యెట్లా తెలిసిందో అన్నవిషయం నాకు తెలియదు. నాకు ఇలా ఇంత
పెద్ద ప్రమాదం జరిగాక మొట్టమొదటిసారిగా ఇటువంటి అనుభవం కలిగిందని పరి పరి విధాలా
చెప్పినా కూడా వాళ్ళేమీ వినిపించుకోకుండా పీటర్ హర్కోస్ ని రహస్య స్థలంలో ఉన జైలు
లో నిర్బంధించారు.