దైవిక శక్తులు -
అసుర శక్తులు 6
మోహన్ అలా
విగ్రహం ఎదురుగా కూర్చొని మనసులో అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని ప్రార్ధిస్తూ
తన తల్లితండ్రులు, తోబుట్టువులు అందరు కూడా
సుఖ౦గా సంతోష౦గా ఉండాలని అమ్మవారిని వేడుకు౦టూ కూర్చున్నాడు.
కాసేపటికి అతను కళ్ళు తెరిచి చూసేసరికి రాజ సాహెబ్ గారు గట్టిగా మంత్రాలని
చదువుతూ లోగడ చేసినట్టుగానే ఒక రాగి రేకు మీద యంత్రం బొమ్మ తో ఉన్నటువంటి ఆ
రాగి పలక మీద గోధుమ పిండి తెచ్చి వాటిలో నీళ్ళు పోసి కలిపి గోధుమ పిండి ముద్దని
చేశాడు. చేసాక కొబ్బరి కాయ కొట్టి ఆ నీళ్ళు గోధుమ పిండి మీద ధారగా
పోసేటప్పటికి ఆ గోధుమ పిండి ఉబ్బిపోయి ఆ రాగి యంత్రం మీద ఒక పక్కగా ఒరిగిపోయింది.
అప్పుడు అతను “మోహన్ ! నువ్వేమీ భయపడకు. అమ్మవారు మిమ్మల్నందరినీ చల్లగా చూస్తారు.
ఇప్పుడు చూడు ! ఏ౦ జరుగుతుందో!” అని చెప్పి మంత్రాలు చదువుకుంటూ కత్తి తో ఆ
గోధుమ పిండి ముద్దని రెండు భాగాలుగా చేసి విడిగా పెట్టేసరికి దానిలో భూమి లోపల
బాగా తవ్వితే ఆ మట్టి ఎలా ఉంటుందో అటువంటి మట్టి, దానిలో ఒక చిన్న రాగి యంత్రం, ఎండి పోయినటువంటి నిమ్మకాయలు, మేకులు, బాగా తుప్పు పట్టినటువంటి మేకు, ఆ తరువాత ఆశ్చర్యంగా దానిలో ఒక చెట్టు యొక్క వేరు కనిపించింది.
ఆ వేరు
సరిగ్గా పాము పడగ మాదిరిగా ఉంది అయితే పడగ సగం కరిగిపోయి ఉంది . ఇంకా ఇలా ఏవో చాలా
వస్తువులన్నీ వచ్చాయి . అప్పుడు రాజ వారు చెప్పారు "మోహన్ ,మీ నాన్నగారి మీద చాల శక్తివంతమయినటువంటి క్షుద్ర శక్తిని ప్రయోగించారు . లోగడ
చెప్పినట్టుగా ఇద్దరు మొగవాళ్ళు, ఒక ఆడది కలిసి ఉన్నారు. ముగ్గురూ కలిసి ప్రయోగం
చేసారు . ఇది సర్పానికి సంబంధించినటువంటి క్షుద్ర శక్తి . అయితే ఇంత కాలం మీ
నాన్నగారు ఎలా జీవించి ఉన్నారా? అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ అమ్మగారు మరి
ఇంట్లో పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా?" అని అడిగారు. అప్పుడు మోహన్ "రాజా సాహెబ్, గారూ ! అవును ! మా అమ్మగారు ప్రతిరోజూ కనీసం రెండు గంటలయినా పూజ చేయందే లేవరు.
దేవుడికి నైవేద్యం పెడితే గాని తానూ భోజనం చేయదు." అని చెప్పాడు.
"నాయనా
మోహన్ ! మీ అమ్మగారు
నిత్యం చేసే పూజ ఫలితం గానే మీ నాన్నగారు జీవించి ఉన్నారు . ఆ క్షుద్ర శక్తుల
ప్రయోగ ఫలితానికి విరుగుడుగా దైవిక శక్తి తోడ్పడింది కాబట్టే ఆయన ప్రాణాలతో ఇంతకాలం ఉన్నారు. అయినా కొంత బాధ అన్నది
తప్పదు. అదీ విషయం . అయినా ఇప్పుడు ఏమీ భయపడక్కరలేదు” అని చెప్పేసి వాళ్ళు శక్తి ప్రయోగం చేసి భూమి లో పాతిపెట్టినవన్ని ఇప్పుడు నేను బయటకి
తెప్పించేసాను . వీటిని ఏ౦ చేయాలో నేను చూసుకుంటాను . చిన్న పిల్లవాడివి . నీకు చెప్పినా
అర్ధం కాదు.” అని చెప్పేసి అక్కడ్నుంచి లేచి కాళ్ళు చేతులు మొహం కడుక్కోమని చెప్పి
ఆయన కూడా కాళ్ళు చేతులు మొహం కడుక్కుని అమ్మ వారిని పూజించిన కుంకుమ నా నుదుట
దిద్దారు .
ఆ తరువాత ఇద్దరం
కలిసి మామూలుగా కుర్చీల్లో కూర్చున్నాక "అవును పాపం! ఉపవాసం ఉండి వచ్చావు
కదా! నీకోసం టిఫిన్ చెయ్యమని చెప్పాను " అని చెప్పి వేడి వేడి ఉప్మా ఒక టీ తెప్పించి ఇద్దరం కలిసి వాటిని ఆరగిస్తూ ఏవో
పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ కూర్చున్నా౦. అప్పుడు నేను అడిగాను " రాజా
సాహేబ్ , మరి నిత్యం మాఇంట్లో పూజలు పునస్కారాలు ఉంటాయి . మాకు
శత్రువులు ఎవరూ లేరూ. మా నాన్నగారంటే ఊర్లో అందరికీ చాలా అభిమాన౦.
ఆయన డబ్బుకోసం కూడా చూసుకోకుండా అందరికి ముఖ్యంగా బీదవాళ్ళకి వైద్యం చేస్తూ ఉంటారు
. అయినా కూడా ఎందుకు మాకు ఇలాంటి
విపత్తు కలిగింది ? ఎక్కడ దేవుడి యొక్క పూజ , మంత్రజపాలు ఉంటాయో అక్కడ
ఎటువంటి దుష్టశక్తులు పనిచెయ్యవంటారు కదా ! మరి ఎందుకిలా జరిగిందో నాకేమీ
అర్ధం కావట్లేదు "అని నేనన్నాను. "నాయనా ! చాలా మంచి ప్రశ్న అడిగావు . అయితే ఇక్కడ నేను నీకు ముందే చెప్పాను . వారు చేసినటువంటి ఈ క్షుద్రమైన శక్తి వల్ల
మీ నాన్నగారికి ప్రాణాపాయం ఎప్పుడో జరిగిపోయి ఉండెడిది . ఆయన చాలా బాధ
అనుభవించినప్పటికి ప్రాణానికి ముప్పు లేకుండానే ఇన్నాళ్ళు ఉండగలిగారు కదా !
ముఖ్యంగా మీ అమ్మగారు చేస్తున్నటువంటి ఆ
పూజా ఫలితంగానే ఆ దైవికశక్తి ఆయన ప్రాణాన్ని నిలిపింది . మరి ముందుగా నీకు ఎటువంటి ఆదేశం రాలేదు కదా ! ప్రేరణ కూడా రాలేదు . ఎప్పుడో గాని
నువ్వు నన్ను గుర్తు పెట్టుకోలేదు. మరి నువ్వు వెంటనే గుర్తు పెట్టుకుని వచ్చావు .
ఇదంతా ఒక దైవిక ప్రేరణ ఉంటే కాని జరగదు .
అయితే మంత్రాలూ జపాలూ అందరూ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఏదో పెద్దవాళ్ళు
చెప్పారు కదా ! అని బాహ్యంగా వాళ్ళు ఎక్కువగా చేస్తారు. కాని అది నిజంగా ఆ దైవిక శక్తి తో అనుసంధానం జరిగేటంత ప్రయత్నం మాత్రం ఉండదు . ఇవన్నీ బాహ్య
పూజలే ఎక్కువ చేస్తూ ఉంటారు ప్రజలు . దానివల్ల ఫలితం ఆశించినంతగా పెద్దగా ఏమీ
ఉండదు . ఎప్పుడైతే భక్తిశ్రద్ధలతో ఒక విశ్వాసంతో ఒక ఆర్తితో ఒక ఆవేదనతో ఒక ఆప్యాయతతో ఆ భగవంతుని నామం
జపించినప్పుడు భగవంతుణ్ణి పిలిచినపుడు ఆ దైవికశక్తి మనకి తప్పకుండా సహాయం చేస్తుంది నాయనా ! ఈలోకంలో మరి ప్రజలు ఎందుకు వాళ్ళకి విద్వేషాలు
కలుగుతాయి? మరి వేరేవాళ్ళు ఎటువంటి అపకారం చేయనప్పటికీ కూడా
వీళ్ళకి మాత్రం అపకారం చెయ్యాలనే తలంపు ఎందుకు ఉంటుంది? అన్న ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం అయితే ఈ
క్షుద్ర శక్తులు నేర్చుకున్నవారు డబ్బు మీద ఆశతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నామనే
ఆలోచన లేకుండా వాళ్ళు డబ్బుకోసం క్షుద్రశక్తిని అమ్ముకుంటారు. కాని వారికి మాత్రం
జీవితంలో తృప్తి అనేది మాత్రం ఉండదు” అని చెప్పారు .
(తరువాయి వచ్చే
భాగంలో )