ఉల్ఫ్ మెస్సింగ్
- ౩వ భాగం
ఏ విధంగా అయితే
హిట్లర్ జర్మనీ లో హిట్లర్ నియంతగా ఉన్నాడో అదే విధంగా రష్యాలో ఆ సమయం లో
స్టాలిన్ (Stallin) కూడా అంత క్రూరంగానే వ్యవహరిస్తూ ఉండేవాడు. లోగడ
చెప్పినట్టుగానే అతనికి కూడా యూదులు అంటే జూయిష్ వారంటే అస్సలు పడదు. వారిని కూడా
కొన్ని వేలమంది ని అతను నిర్దాక్షిణ్యంగా చంపిస్తూ ఉండేవాడు. అయితే అంత రహస్యంగా
స్టాలిన్ గూఢచారులు, సైన్యాధికారులు ఉల్ఫ్ మెస్సింగ్ ని చాలా పకడ్బందీగా
బంధించి తీసుకుని వెళ్ళారు. అయితే ఉల్ఫ్ మెస్సింగ్ మాత్రం మనస్సులో కొంత
నిశ్చింతగానే ఉన్నాడు. అతనికి దైవం తప్పకుండా తనని కాపాడుతాడని ఒక గాఢమైన విశ్వాసం
ఉంది. స్టాలిన్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అతని అంతరంగికులకి కూడా తెలియనంత రహస్యంగా
అతని కదలికలు ఉండేవి.
తమాషా ఐన విషయమేమంటే ఎంత నియంతలైనా కూడా వాళ్లకి లోపల
ఎక్కడో కొంత భయంగానే ఉంటుంది. ఏ విధంగా వాళ్ళు కుట్రలు చేసి పై వారిని చంపి
అధికారాన్ని చేజిక్కించు కుంటారో అదే విధంగా వాళ్లకి కూడా అవుతుందనే భయం ఎప్పుడూ
ఉంటుంది. అదేవిధంగా స్టాలిన్ ఎక్కడ ఉంటాడు, ఏ వాహనంలో ప్రయాణం చేస్తుంటాడు అన్నది
ఎవ్వరికీ తెలియదు. ఆ విధంగా చాలా దూరం ప్రయాణం చేశాక అతని కళ్ళకి గంతలు కట్టి
అతన్ని స్టాలిన్ దగ్గరకి తీసుకుని వెళ్ళారు. అయితే ఉల్ఫ్ మెస్సింగ్ కి తెలుస్తూనే
ఉంది ఏదో ఒక పెద్ద అపేక్షితమైన స్థావరానికి అతన్ని తీసుకుని వెళ్లుతున్నట్టుగా
ఎందుకంటే మధ్య మధ్యలో ఎన్నో పెద్ద పెద్ద గేట్లు తీస్తున్న చప్పుడు కావడం, వాళ్ళు
రష్యన్ భాషలో మాట్లాడుకోవడం ఇవన్నీ అతనికి తెలుస్తూనే ఉన్నాయి. సరిగ్గా వాళ్ళు
నిర్దారించుకున్న ప్రదేశానికి తీసుకుని వెళ్ళాక ఉల్ఫ్ మెస్సింగ్ కళ్ళ గంతలు విప్పి
నిశ్శబ్దంగా అక్కడనుంచి వెళ్ళిపోయారు. కళ్ళు నులుపుకుని అతను కళ్ళు తెరిచేసరికి
అక్కడ అతనికి కనిపించే దృశ్యాలు స్పష్టంగా తెలుసుకోడానికి కొంచెం సమయం పట్టింది ఎందుకంటే
చాలా సమయం వరకు కళ్ళ మీద గంతలు ఉండడం వల్ల తొందరగా పోల్చుకోవడం కష్టమైంది. ఒక
పెద్ద విశాలమైనటువంటి రాజభవనంలో ఒక పెద్ద గదిలో ఖరీదైనటువంటి ఫర్నిచర్ మరియూ
ఇతర హంగులు కూడా కనిపించాయి. ఎదురుగా కనిపించే వ్యక్తి ఎవరో కాదు అతని పేరు
వింటేనే గడ గడ లాడే శత్రువులని కూడా వణికించే స్టాలిన్ అని అతను గ్రహించాడు.
స్టాలిన్ కూడా చాలా నిశితంగా ఉల్ఫ్ మెస్సింగ్ నే పరిశీలిస్తున్నాడు. అతను ఏ
తొట్రుపాటు లేకుండా చాలా వినయంగా అతనికి వందనాలు చేసి నిల్చున్నాడు. అప్పుడు
గంభీర స్వరంతో స్టాలిన్ ‘నీవు ఏదో కనికట్టు విద్యలు, ఇంద్రజాలం, మహేంద్రజాలం
లాంటివి చేస్తున్నావు. మనుషులని హిప్నోటైజ్ చేస్తున్నావు, మెస్మరైజే
చేస్తున్నావు. ప్రజలందరు కూడా నీకు ఏవో దైవిక శక్తులు ఉన్నాయని తలుస్తున్నారు.
ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా నీవు మోసం చేస్తున్నావు? దానికి కఠిన శిక్ష
ఉంటుందని నీకు తెలియదా? అని కొంచెం హెచ్చరికగా, కటువుగా అడిగాడు. దానికి సమాధానంగా
నేను చేస్తున్నది కనికట్టు విద్య కాదు, గారడి కాదు, స్వాభావికంగానే నాకు ఆ శక్తులు
వచ్చాయి. అందుకనే నేను అవి దైవిక శక్తిగా నేను నమ్ముతున్నాను అని చాలా వినయంగా,
నమ్మకంగా, ధైర్యంగా ఉల్ఫ్ మెస్సింగ్ చెప్పాడు. అతని ధైర్యానికి ముందుగా స్టాలిన్
ఆశ్చర్యపోయాడు. నిజంగా దైవిక శక్తులు ఉంటాయంటావా? నాకు ఏమాత్రం విశ్వాసం లేదు.
నీకు తెలుసు కదా ! మా రాజ్యంలో ఇటువంటివాటిని మేము కఠినంగా శిక్షిస్తుంటాం. నీవు
నిజంగా దైవిక శక్తి ఉందని కనక నిరూపించ గలిగితే తర్వాత ఏం చేయాలి అన్నది
ఆలోచిస్తాను. మరి నేను చెప్పిన పనులు నీవు చేయగలవా? అని ప్రశ్నించాడు. ఉల్ఫ్
మెస్సింగ్ ధైర్యాన్నంతా కూడబెట్టుకుని “తప్పకుండా చేస్తాను” అని చెప్పాడు. అలాగైతే
నేను నీకొక పరీక్ష పెడతాను. ఇక్కడ రష్యాలో ఒక పెద్ద బ్యాంకు ఉంది. అక్కడకి నీవు
వెళ్లి కొన్ని రూగుల్స్ ని తీసుకుని రావాలి. ఎటువంటి దొంగతనం చేయకుండా
నీవు మామూలుగా వెళ్లి డబ్బుని తీసుకుని రావాలి. నీకు సమ్మతమేనా? అలా కనుక
నీవు చేయగలిగితే బ్రతికిపోయినట్టుగానే నీవు భావించవచ్చును. కానిపక్షంలో నీకు
మరణదండన తప్పదు. మరి ఈ పరిక్షకి నీవు సిద్ధమేనా? అని స్టాలిన్ ప్రశ్నించాడు.
దానికి సమాధానంగా ఉల్ఫ్ మెస్సింగ్ “సిద్ధమే” అని జవాబు చెప్పాడు. అప్పుడు స్టాలిన్
అనుచరులు మళ్ళీ అతని కళ్ళకి గంతలు కట్టి అనేక మలుపులు తిప్పి బయటవదిలివేశారు.
తర్వాత అనుకున్నట్టుగానే ఉల్ఫ్ మెస్సింగ్ రష్యాలో ఉన్న ఆ పెద్ద బ్యాంకు వైపు నడక
సాగించాడు. చేతిలో ఒక పాత బ్రీఫ్ కేస్ మాత్రమే పట్టుకుని వెళ్ళాడు. అయితే స్టాలిన్
నియమించిన శిక్షణ ఇచ్చిన గూఢచారులు, ప్రత్యేక శిక్షణ పొందినవాళ్ళు మారు
వేషాల్లో అతన్ని గమనిస్తూ, అతను ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో
ఎప్పటికప్పుడు వాళ్ళు గమనిస్తూ, వారి పై అధికారులకి వారి నివేదితలు సమర్పిస్తూ
వచ్చారు. ఈ విధంగా కొన్ని వందల మంది మారువేషాల్లో అతన్ని అనుసరించ సాగారు. అయితే
ఉల్ఫ్ మెస్సింగ్ ప్రవర్తనలో వాళ్లకి ఎటువంటి నొసగులు కనిపించ లేదు. ఉల్ఫ్
మెస్సింగ్ ఆ బ్రీఫ్ కేస్ ని పట్టుకుని ఆ బ్యాంకు ఆవరణలోకి వెళ్లి ఆ కేషియర్ దగ్గర
అంటే టెల్లర్ దగ్గర నిలబడ్డాడు. అతని చుట్టూతా స్టాలిన్ యొక్క అనుచరులు,
సైన్యాధికార్లు, గూఢచారులు మారువేషాల్లో ఖాతాదార్లాలాగా అంటే కస్టమర్స్ లాగా అక్కడ
లావాదేవీలలు చేస్తూ నటించ సాగారు. చాలామంది ఇతన్నే గమనిస్తూ ఉన్నారు.అయితే ఆ
కౌంటర్ దగ్గరకి వెళ్లి ఉల్ఫ్ మెస్సింగ్ నిలబడినప్పుడు ఆ బ్యాంకు ఉద్యోగి అతని వైపు
ప్రశ్నార్థకంగా చూసినప్పుడు ఉల్ఫ్ మెస్సింగ్ విత్ drawal స్లిప్ తీసుకుని
దాని మీద 50 వేల రూగుల్స్ withdraw చేస్తున్నట్టుగా సంతకం పెట్టి ఆ కాషియర్ కి ఆ
స్లిప్ ని అంద చేశాడు. కొద్దిసేపయ్యాక ఆ కాషియర్ అతన్ని పిలిచి 50 వెల్ రూగుల్స్
ని లెక్క పెట్టి ఉల్ఫ్ మెస్సింగ్ కి ఇచ్చాడు. అతను చక్కగా వాటిని బ్రీఫ్ కేసు లో
సర్దుకుని బ్యాంకు నుంచి బయటకి వచ్చాడు. ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు స్టాలిన్ కి
అందుతూనే ఉన్నాయి. బ్యాంకు నుంచి బయటకి రాగానే మళ్ళీ కళ్ళకు గంతలు కట్టి ఉల్ఫ్
మెస్సింగ్ ని స్టాలిన్ యొక్క అధికారులు రహస్య స్థావరానికి తీసుకుని వెళ్ళారు.
స్టాలిన్ ముందు ఉల్ఫ్ మెస్సింగ్ కళ్ళగంతలు విప్పగానే స్టాలిన్ ఆ పాత బ్రీఫ్ కేసు
వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అక్కడ ఉన్న అధికారులు, గూఢచారులు, సైన్యాధికార్లందరూ
నిశ్శబ్దంగా చాలా ఆసక్తిగా ఇదంతా గమనించ సాగారు. ఉల్ఫ్ మెస్సింగ్ ఏ మాత్రం
తొణుకు-బెణుకు లేకుండా ఆ బ్రీఫ్ కేసు ని తెరిచి ఆ నోట్ల కట్టను పెట్టగా స్టాలిన్
చాలా ఆశ్చర్య పోయాడు. “ ఇదెలా సంభవం? ఇతనికి ఈ బ్యాంకు ఎక్కడ ఉందో తెలియదు. ఇతనికి
ఆ బ్యాంకు లో ఎకౌంటు కూడా లేదు. పైగా ఇతని దగ్గర డబ్బులు కూడా లేవు. అవన్నీ మేము
ముందే పరిక్షించాం. వెళ్ళే ముందు ఇతన్ని పూర్తిగా సోదా చేశాం. ఇతని దగ్గర ఏమీ
లేవు. అలాంటప్పుడు ఇతని దగ్గరకి 50 వేల రూగుల్స్ ఎలా వచ్చాయి? ఇవన్నీ చూస్తే అసలు
సిసలైన నోట్లలాగానే కనిపిస్తున్నాయి.” స్టాలిన్ కి ఇదంతా చూస్తుంటే ఏమీ అర్థం
కాలేదు. నిశ్చేష్టుడైపోయి అతను ఏ భావనలు లేకుండా , ఏ మాటలు లేకుండా ఏదో
దీర్ఘాలోచనలో మునిగి పోయాడు. చుట్టూ ప్రక్కల ఇదంతా గమనిస్తున్న వాళ్ళంతా కూడా చాలా
ఆశ్చర్య పోయారు. ఇంద్రజాల మహేంద్రజాలమైతే ఇలాంటివి జరగడానికి ఏవిధమైన ఆస్కారం లేదు
కదా ! సరే ! నేను ఇప్పటికి నిన్ను వదిలేసి పంపిస్తున్నాను. కాని మళ్ళీ నేను
ఎప్పుడు పిలిస్తే నీవు అప్పుడు రావాలి” అని స్టాలిన్ ఉల్ఫ్ మెస్సింగ్ కి చెప్పాడు.
స్టాలిన్ యొక్క గూఢచారులు యథాప్రకారంగా ఉల్ఫ్ మెస్సింగ్ కళ్ళకి మళ్ళీ గంతలు కట్టి
ఎక్కడ్నుంచైతే అతన్ని తెచ్చారో మళ్ళీ అక్కడే అతన్ని ఆ బ్యాంకు దగ్గరే వదిలివేశారు.