అందరూ ఎంతో
ఆత్రుతగా ఆ రాత్రంతా గడిపారు. ఆ రోజు తెల్లవారుఝాము అయ్యేసరికి రంగారావు
గారు లేచి రాత్రి తనకి ఎటువంటి కలలు రాలేదని చెప్పగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. ఎందుకంటే ఆయనకి దగ్గు మాత్రం విపరీతంగా
రాసాగింది. దానిలో మాత్రం ఎటువంటి ఉపశమనం కలుగలేదు. ఏ౦చెయ్యాలా అని ఆలోచించి వారు
మరలా ఆ మరాఠి (maharashtrian) తాంత్రికుడిని అడిగారు. అతను తగ్గి పోవడానికి
సమయం పడుతుందని ఎందుకంటే ఆ క్షుద్ర శక్తి చాలా బలమైనదని కొంతకాలం
ఓర్పుగా ఉండమని చెప్పారు. అంతకంటే తాను ఏమీ చెయ్యలేనని చెప్పి చేతులు ఎత్తేశారు.
ఈలోగా లలిత గారు
విపరీతమైన పూజలు చెయ్యటం,ముఖ్యంగా సాయిబాబా గారి విభూతిని ప్రతీరోజు కూడా
రంగారావు గారికి నీళ్ళల్లో కలిపి ఇవ్వటం, ఒంటికి రాయటం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. కానీ రంగారావు గారి ఆరోగ్యంలో ఎంటువంటి
మార్పు రాలేదు. ఆయన రాత్రిళ్ళు నిద్రపోవడం కూడా మానివేశారు. అప్పుడు ఒక రోజు మోహన్
తన తల్లి దగ్గరికి వెళ్లి తాను హైదరాబాద్ వెళతానని ఒక 500 రూపాయలు కావాలని అడిగాడు. అప్పుడు లలిత గారు అతనికి 500 రూపాయలు ఏర్పాటుచేశారు కానీ హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్తున్నాడని అడగలేదు.
మొదటినుంచీ కూడా వారు పిల్లలకి ఆ స్వతంత్రం ఇచ్చారు. వారి పిల్లలు ఎటువంటి
తప్పుడు పనులు చెయ్యరని వాళ్లకి ఎంతో విశ్వాసం. మోహన్ కి ఎంతో ఉపశమనం కలిగింది, ఎందుకంటే అడిగితే తాను నిజం చెప్పాలి, నిజం చెబితే ఏమంటారోనని భయం. కానీ ఆవిడ ఏమీ అడగకపోవడం తోటి మోహన్ ఊపిరి
పీల్చుకున్నాడు. మెల్లగా హైదరాబాద్ కి ప్రయాణం అయ్యాడు.
యధాప్రకారం ఆ
మరునాడు గురువారం సైకిల్ మీద మళ్ళీ రాజా వారింటికి వెళ్ళాడు. రాజా వారు మోహన్ ని
చూడగానే "ఏం మోహన్ ! ఎక్కడికి మాయమైపోయావు?మళ్ళీ నాకు
కనపడలేదేమిటి? చాలా రోజులయ్యింది కదా మనం కలిసి ! ఎలా ఉన్నావు? ఏమిటి? ఎందుకిలా వచ్చావు?"అని ప్రశ్నించారు. వాటన్నింటికీ ఓపికగా సమాధానాలు చెప్పి, తన తండ్రిగారి పరిస్థితినంతా రాజావారికి విన్నవించాడు. ఆపుడు ఆయన "ఏమీ
ఫర్వాలేదు నేను చూసుకుంటాను" అని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కుని చేతిలో
అంజనం వేసి చూసి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయారు. తరువాత కాసేపటికి మోహన్ తో మీ
నాన్నగారు ఇంకా బ్రతికి ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా శక్తి కలిగినటువంటి సర్పప్రయోగం ఆయన మీద చేశారు. ఇద్దరు మగవారు ఒక స్త్రీ కలిసి ఈ ప్రయోగం చేశారు. అయితే నా
ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు మాత్రం ఎటువంటి భయం చెందవద్దు. రేపు శుక్రవారం
పొద్దున్నే నువ్వు వచ్చేసేయ్యి. ఉపవాసం చెయ్యి. ఏమీ తినకుండా రా. ఈరోజంతా
అమ్మవారిని ధ్యానించు. మీ కుటుంబ సభ్యులంతా బాగా
ఉండాలని అమ్మవారిని వేడుకో, ఏమీ ఫరవాలేదని చెప్పి పంపించివేశారు. మరునాడు
పొద్దున్నే మోహన్ రాజావారింటికి చేరుకున్నాడు. ఆయన ముందు రోజు నుంచి కూడా పూజలో
కూర్చొని ఉన్నారు. ఆయన ఇంతకు ముందు లాగానే పసుపు కుంకుమలతో తడిసిన దళసరి వస్త్రం, దాని ముందు అమ్మవారి విగ్రహం, ముగ్గులు, వాటిపై చెక్కబొమ్మలు, నిమ్మకాయలు అన్నీ పేర్చిఉన్నాయి. అంటే ఆయన అప్పటికే ఆ
తంతు మొదలుపెట్టారు.
15నిమిషాల తరువాత మోహన్ ని పిలిచి సరిగ్గా విగ్రహానికి ఎదురుగుండా కూర్చుని
ధ్యానం చేస్తూ అమ్మవారిని ప్రార్ధిస్తూ తన కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్ధన
చెయ్యమని చెప్పారు. మోహన్ కాళ్ళు చేతులు కడుక్కుని
వచ్చి కూర్చొని అలాగే చేసాడు. లోగడ రాజావారు తనని పక్కన కూర్చోమన్నారు. కానీ ఈసారి
విగ్రహానికి ఎదురుగానే కూర్చోమని చెప్పటంతో, అలాగే కూర్చుని తన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ ధ్యానంలో
మునిగిపోయాడు.
(Continued
......... )