కాసేపు మౌనం
వహించిన రాజసాహేబ్ గారు " మోహన్, ప్రతివాళ్ళు ఏవో శక్తులు సంపాదించాలని
మహిమలు చూపాలని అనుకుంటూ ఉంటారు. కాని కొన్ని క్షుద్రశక్తులు నేర్చుకునందువల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. వాటి వల్ల మనకి
కష్టాలే తప్ప ఆశించిన ప్రయోజనాలు ఏమి ఉండవు. నా చిన్నతనంలో నాక్కూడా కొన్ని మంత్రశక్తులు సంపాదించి అద్భుతాలు చెయ్యాలనే కోరిక ఉంటూ ఉండేది. మాది చిన్న కుగ్రామం . అక్కడ మా నాన్నగారికి కొన్ని
వ్యవసాయ భూములు ఉండడం తో వ్యవసాయం చేసుకుంటూ చదువుకునేవాళ్ళం . మా గ్రామం లో ఉత్త పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి . మా ఊరికి ఒక స్టేషన్ మాస్టర్ కొత్తగా వచ్చారు . ఆ
స్టేషన్ మాస్టారు గారు స్టేషన్ దగ్గరలోనే రైల్వే క్వార్టర్ లో ఉండేవాడు. అతడు
బ్రహ్మచారి. మా ఊరు చిన్నది కాబట్టి ప్రతి వాళ్ళ
గురించి ఎంతోకొంత తెలుస్తూ ఉంటుంది . అయితే నాకు ఈ స్టేషన్ మాస్టారు గారి వైఖరి విచిత్రంగా ఉండేది .
ఒంటరి వాడు
బ్రహ్మచారి ప్రతివారం మా ఊరిలో జరిగే సంతలో బస్తా నిండా మరమరాలు, చాలాపెద్ద
మొత్తంలో గోధుమపిండి ఇవన్నీ కొంటూ ఉండేవాడు. నాకు అతని గురించి ఆసక్తి పెరిగింది . అదేమిటి ఒక్కడే ఉన్నాడు మరి బస్తా నిండా మరమరాలు కొంటాడు వారంవారం . అది చాలదన్నట్టు గోధుమపిండి కూడా బస్తాలకొద్ది కొంటూ ఉంటాడు. పోనీ ఎవరికైనా పేదవాళ్ళకి దానం
చేస్తాడా ? ఆ దాఖలాలు ఏమీ లేవు ఏమిటబ్బా ? అని నేను ఆలోచించుకుంటూ ఉండేవాడిని . రానురాను నా ఆలోచనలు నేననుకున్నట్టుగానే
ఆయన గురించిన ప్రశ్నలకి సమాధానాలు నాకు ఊహపరంగా తెలిసాయి .
నేను ఒకరోజు
ఆయన్ని సమీపించి “అయ్యా స్టేషన్ మాస్టర్ గారూ !
మీరు ఒక్కళ్ళే ఉంటారుకదా ? మరి ఎందుకు ఇలా బస్తాలకొద్ది మరమరాలు , గోధుమపిండి కొంటున్నారు? ఏమిటి ? ఏ౦ చేస్తున్నారు మీరు? ఏదైనా ప్రత్యేక
దేవతని మీరు కొలుస్తూ ఉంటారా ? మీకు శక్తులు ఉన్నాయా ? మహిమలు ఉన్నాయా ?దయచేసి నాకు చెప్పవలసింది . నాక్కూడా నేర్పవలసింది” అని ప్రార్ధిస్తూ ఉండేవాడిని. ఆయన అవి కొట్టిపారేస్తూ ఉండేవారు. “అదేంటి బాబు ! ఎందుకలా అడుగుతున్నావు ? అటువంటి శక్తులు నా దగ్గర ఏమీ లేవు. నేనేమీ పూజలు చెయ్యట్లేదు” అని
చెప్పి తప్పించుకున్నాడు . కానీ రానురానూ నేను ఆయన్ని పట్టువదలకుండా వెంటపడుతూ ఆయన్ని ఎంతో
ప్రాధేయపడడంతో ఆఖరికి ఆయన “బాబూ ! చిన్న పిల్లవాడివి . ఎందుకు ఈ విషయాలన్నీ అడుగుతావు? దయచేసి నావెంట పడొద్దు. నా దగ్గరకే రావొద్దు. మీ పెద్దవాళ్ళు చూసారంటే నీకన్న నాకే హాని ఎక్కువ జరుగుతుంది. ఏదో ఈ చిన్న ఊర్లో స్టేషన్ మాస్టర్ గా ఉన్నాను . నా బతుకు నేను బతుకుతున్నాను కాబట్టి దయచేసి నా దగ్గర రానే రావొద్దు అని ఎంతో బ్రతిమిలాడుతూ ఉండేవాడు . నేను కొన్ని రోజులు విరామం ఇచ్చి మళ్ళీ అతనివెంట పడుతూ ఉండేవాడిని . “మీరు నా దగ్గరనుంచి ఏదో దాస్తున్నారు . నా అనుమానం నిజమైంది . నేను రాత్రుళ్ళు కూడా నిద్రపోకుండా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరు చేస్తున్న చేష్టలన్నీ నాకు వింతగా ఉన్నాయి . కాబట్టి మీ మాటలు నేను నమ్మను. దయచేసి నాకు నిజం చెప్పండి” అని ప్రాధేయపడగా ఆఖరికి ఆతను “నాయనా ! నేనూ నీలాగే చిన్నప్పుడు ఏవో విద్యలు నేర్చుకోవాలని మహిమలు చూపించాలని ఎంతో ఆరాట పడేవాడిని. మా ఊరికి వచ్చిన ఒక సాధువు ఒక తాంత్రికుడు దగ్గర వెళ్లి ఆయన్ని పదేపదే బ్రతిమిలాడి ఆఖరికి ఎలాగోలాగ ఆయన్ని వప్పించి ఆయన వద్దని చెప్పినా కూడా వినకుండా ఆయన దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నాను . దానివల్ల నాకు ఏమీ ప్రయోజనం కలగలేదు . కాబట్టి ఇప్పటికైనా నా మాట విని నా వెంట పడవద్దు హాయిగా నీ తల్లితండ్రులు చెప్పిన మాదిరిగానే
చదువుకుని జీవితంలో పైకి రా !” అని చెప్పాడు అయితే
మొత్తానికి అతని దగ్గర ఏవో తాంత్రిక మాంత్రిక శక్తులు ఉన్నాయని నేను గ్రహించాను కాని నా కే కుతూహలం ఇంకా ఇంకా ఎక్కువ కాసాగింది
ఎలాగోలాగ ఆయన్ని వప్పించి నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని భావించాను.
ఆ రోజు ఆయన ఎంత వద్దని హెచ్చరించినా కూడా నేను వినలేదు సరికదా నాలో పట్టుదల ఎక్కువ అయి౦ది ఒకరోజు సంతలో ఆదివారం రోజు ఆయన గోధుమపిండి, మరమరాలు కొనుక్కు వెళ్ళడం చూసి ఏం జరుగుతుందా అని చెప్పి రాత్రి ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఆయన నివసిస్తున్న క్వార్టర్స్ కి వెళ్ళడం జరిగింది. ఎలాగోలాగ ధైర్యాన్ని
కూడగట్టుకుని చేతిలో ఒక టార్చ్ లైట్ పట్టుకుని స్టేషన్ మాస్టారు గారు ఉన్నటువంటి క్వార్టర్ దగ్గరకి వెళ్ళాను మా గ్రామంలో అప్పటికింకా కరెంటు రాలేదు. అలాగే వెళ్లి ఆ క్వార్టర్ దరిదాపుల్లోనే చతికిలపడి అలాగే ఏ౦ జరుగుతుందా అని ఆత్రుతగా కూర్చొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. టైం ఎంతైందో
తెలియదు కాని అకస్మాత్తుగా నాకు పెద్ద స్వరంతో ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపించగా
వెంటనే లేచాను. అయితే చుట్టూరా చిమ్మచీకటిగా ఉంది. పురుగులు ,కీటకాలన్ని వింత వింత చప్పుళ్ళతో అరుస్తున్నాయి కొద్దిగా భయపడ్డా మళ్లీ ధైర్యం పుంజుకున్నాను . ఏమిటబ్బా ఈ
శబ్దాలు? అని అనుకుంటూ ఉండగా ఆ స్టేషన్ మాస్టర్ గారి క్వార్టర్ నుంచి గట్టిగా ఆయన ఏవో మంత్రాలు చదువుతున్నట్టుగా నాకు అర్ధం అయింది . అప్పటితో నాకు ఈ స్టేషన్ మాస్టర్ గారు ఏదో ఒక అద్భుత శక్తిని
ఆరాధిస్తున్నాడని ఈయన దగ్గర చాల శక్తులు ఉన్నాయని రూఢీ అయి౦ది. మెల్లగా ధైర్యం తెచ్చుకుని టార్చ్ లైట్ సాయంతో ఇంటికి చేరాను . అ తరువాత నాకు ముఖ్యంగా అమావాస్య రోజున ఇటువంటి శక్తి పూజలు ఎక్కువగా జరుగుతుంటాయని తెలియటం వల్ల సరిగ్గా . అమావాస్య ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉండిపోయాను . ఎందుకంటే అమావాస్య రోజున ఈసారి తప్పకుండా ఆ స్టేషన్ మాస్టర్ గారిని బ్రతిమిలాడో , బామాలో ఏదో ఒకటి చేసి ఆరోజు ఆయనతో పాటు కూడా పూజతంతుని గమనిద్దామని , ఆయన దగ్గర ఏదైనా దీక్ష తీసుకుందామని చాలా గట్టిగా సంకల్పం చేసుకున్నాను .
(తరువాయి వచ్చే భాగంలో)