Digambara Digambara Sripada Vallabha Digambara ..... Digambara Digambara Sri Dattatreya Digambara

More ...

For Soundarya Lahari Audio, Spiritual Soup, Info on Spiritual Masters, Game of Life, Random Thoughts and more... visit our websites - SriDatta.info and SreeDatta.guru

Please email your feed back to sridatta50@gmail.com Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Are you liking audio stories?

12 November 2016

ఆఫ్రికా అద్భుత అనుభవాలు (Amazing African Experiences) - Introduction

ఆఫ్రికా అద్భుత అనుభవాలు – పరిచయవాక్యాలు
ఆఫ్రికా అద్భుత అనుభవాలు పాఠకులందరినీ కూడా ప్రకృతి ఒడిలో ఉన్న దట్టమైనటువంటి అడవుల మార్గాలనుంచి ఎన్నో అనుభవాల్ని అనుభవింప చేస్తుంది. ఈ కథ మీ కథయే, నా కథయే, మనందరి కథయే. ఒక సామాన్య మానవుడి జీవితంలో అతనికి కలిగిన  జయాలు, అపజయాలు, సంతోషాలు, కన్నీళ్లు, ఎండా వానలు, ఈస్ట్ ఆఫ్రికా దేశం లో ఉన్న సాంఘిక, ఆర్ధిక వ్యవస్థ, అక్కడ మనుష్యుల యొక్క ఆచారాలు, నమ్మకాలు, అక్కడ ఉన్న భారతీయుల యొక్క జీవన శైలి, ఏ విధంగా వాళ్ళు ఈస్ట్ ఆఫ్రికాకి చేరుకున్నారు, ఏ విధంగా ఆ దేశాన్ని అభివృద్ధి చేశారు, అన్ని విషయాల సమాహారమే ఈ కథ.
ప్రతి సామాన్య మానవుని యొక్క జీవితం కూడా చాలా అద్భుతాలతో కూడి ఉన్నది. జయానికి అపజయానికి మధ్య ఒక పలుచటి పొర మాత్రమే ఉంటుంది. అదే అసహనం, ఓర్పు లేకపోవడం, విషయాలపట్ల అవగాహన లేకపోవడం, నిర్లిప్తత ఇవే. ఈ ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన మానవుల యొక్క జీవితం ప్రారంభ దశలో అన్ని కష్టాల కడలిలోనే ఉన్నాయి. వాళ్ళు పయనించిన మార్గంలో ముళ్ళకంపలు మాత్రమే ఉన్నాయి. అయినా కూడా ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని,
ఎన్నోఅపజయాలనే జయాలుగా మార్చుకోగలిగారు. దానికి కారణమేమిటంటే సమస్యలపట్ల ఉన్నటువంటి వారియొక్క దృక్పథం మామూలు  మనుష్యులకన్నా అతిభిన్నంగా ఉంటుంది. సమస్యల్ని వారు అవకాశాల్లాగా మార్చుకోవడంవల్లనే వారు తమ లక్ష్యానికి  చేరుకోవడం జరిగింది. దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారి  జీవిత౦ కూడా మరి రాత్రుళ్ళు వీధి స్తంభాల దీపపు వెలుతుర్లో  ఆయన ఎంతో కష్టపడి చదువుకుని జీవితంలో పైకి రావడం జరిగింది. అయితే మనం ఎప్పుడుకూడా ఈ పెద్దవాళ్ళ అంటే గొప్పవాళ్ళ చరిత్రే చదువుతూ ఉంటాం కాని ప్రతి సాధారణ మనిషి యొక్క జీవితం కూడా అనేక అద్భుతాలతో కూడి ఉంటుంది అన్న విషయం గుర్తించం. వాళ్ళు కూడా కన్నీటి ధారలని ఆనంద బాష్పాలుగా మార్చుకోగలిగారు. వారు సమస్యల్ని చాలా ధైర్యంగా ఎదుర్కోవడం, లక్ష్యశుద్ధితో తమ మార్గాన్ని అటు-ఇటు వెళ్ళకుండా ధైర్యంగా ముందుకు సాగారు. ముఖ్యంగా వారిలో సహనం అనే గుణం ఉండడం వల్లనే వారి లక్ష్యానికి వాళ్ళు చేరుకోగలిగారు.
ప్రస్తుత సమాజంలో విషాదకరమైన పరిణామాలు చాలా జరుగుతూ ఉన్నాయి. పసిపిల్లలు, యువతీ యువకులు కూడా కొన్ని వేల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జీవితం పట్ల వారికి ఉన్న అవగాహన రాహిత్యమే ఈ విధంగా వాళ్ళు తమ జీవితాల్ని తొందరగా ముగించుకోవడం జరుగుతుంది. మానవ జన్మ ఎంతో విలువైనది. కొన్నివేల సంవత్సరాల తర్వాతే ఈ మానవ దేహం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పుతూ ఉంటారు. ఈ  మానవ దేహం ఒక్కటే మోక్షానికి సాధనంగా మార్చుకొనవచ్చును. ఎంతోమందికి మనం సామాజికంగా సహాయం చేయగల్గుతాం. వారి జీవితాలకి ఉదాహరణగా కూడా ఉండగలుగుతాం. కాని అలా జరగడ౦ లేదు. ఆధ్యాత్మికత అన్నది చాలా మటుకు ఇటువంటి సమస్యలున్నప్పుడు తప్పకుండా మనకొక మార్గాన్ని నిర్దేశిస్తుంది.  మబ్బులు కొంతకాలం మాత్రమే సూర్యుని యొక్క ఆ  ప్రకాశాన్ని ఆపగలుగుతాయి. మబ్బులు తొలగిపోయాక మళ్ళీ సూర్యుని ప్రకాశం విజ్రు౦భిస్తుంది. అదేవిధంగా మన మనుష్యుల యొక్క జీవితంలో ఈ కష్టాలనేవి మేఘాలు మాత్రమే. కలకాలం ఉండవు. చిన్న చిన్న విషయాలకే మనస్తాపనకి గురి కావడం, అమూల్యమైన ఈ జీవితాన్ని మనం త్వరలోనే ఆత్మహత్య చేసుకుని ముగించడమనేది సభ్య సమాజంలో ఒక పెద్ద జరగరాని నేరంగానే మనం భావించ వచ్చును.
ఈ కథలో ఒక సాధారణ మనిషి ఏ విధంగా సమస్యలని ఎదుర్కుంటాడో, ఏవిధంగా ఆధ్యాత్మికత అతనికి మార్గాన్ని నిర్దేశిస్తుందో, కొద్దిగా ఓర్పుతో  అతను ఏవిధంగా సమస్యలని అవకాశాలుగా మార్చుకోగల్గుతాడో అన్నది ఈ కథ యొక్క సారాంశం. అందుకనే ఇది మన అందరి కథయే. కాకపోతే ఈ కథలో రచయిత మరి ఒక ఫార్మా కంపెనీలో మేనేజర్ గా ఉండడంవల్ల వాటికి సంబంధించిన విషయాలు కూడా ఎక్కువగా చర్చించడం జరిగింది. అదొక్కటే పాఠకులకి విసుగును కలిగించవచ్చును. అది వదిలేస్తే అసలైన సారాంశాన్ని మనం పట్టుకోగలం. మన జీవితాల్ని మనం ఎంతో అద్భుత౦గా మార్చుకోగలం.  
ప్రియమైన పాఠకులారా ! రండి ! ప్రకృతి వరంగా ఇచ్చిన ఈ దట్టమైన అడవుల మధ్య మనమంతా కలిసి ప్రయాణం చేద్దాం! ప్రకృతి అందాలని తిలకిద్దాం! ఈ కథ చదివినాక ఎంతో కొంత యువతీ యువకులకి జీవితం పట్ల ఒక మంచి ప్రేరణ కలిగితే ఈ చిన్న ప్రయోగం సఫలీకృతం అవుతుందని రచయిత విశ్వాసిస్తున్నాడు.
ఇట్లు రచయిత నండూరి శ్రీ సాయిరాం