ఉపనిషత్తులు-12
ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం
సమిష్ఠి ఆకాశం యొక్క ఉత్తరార్థ భాగంలో ఉన్న సత్వగుణం నుండి ఏ శక్తి కూడా ఉద్భవించ లేదు. దీనికి కారణం ఏమిటంటే మనలో ఉన్న బ్రహ్మచైతన్యానికి అణువైన ప్రదేశం ఒకటి ఉండాలి కాబట్టి ఖాళీగా ఉన్న ఆకాశం యొక్క సత్వగుణ ఉత్తరార్థ భాగంలో ఈ బ్రహ్మచైతన్యం స్థావరం ఏర్పరచుకుని అక్కడ ఉంటుంది. ఇది క్షేత్రజ్ఞుని స్థానం గా కూడా పేర్కొనబడింది. ఇదేవిధంగా వాయువు యొక్క సత్వగుణ సమిష్ఠి ఉత్తరార్థ భాగం నుండి మనస్సు పుట్టింది. దేఇ అధిదేవత చంద్రుడు. ఎప్పుడూ సంశయించడమే దీని లక్షణం. అస్థిరంగా ఉండడం. అలాగే అగ్ని యొక్క సత్వగుణ ఉత్తరార్థ భాగం నుండి బుద్ధి పుట్టింది. దీనికి బృహస్పతి అధిదేవత. దీని పని ఏమిటంటే నిశ్చయం లేక నిర్ణయం చేయడం. ఇదేవిధంగా జలం యొక్క సత్వగుణ ఉత్తరార్థ భాగం నుండి చిత్తం పుట్టింది. దీనికి బుధుడు అధిదేవత. దీని యొక్క స్వభావం చంచలత్వం. ఇదేవిధంగా భూమి యొక్క సత్వగుణ ఉత్తరార్థ భాగం నుండి అహంకారం పుట్టింది. దీనికి జీవుడు అధిదేవత. దీని లక్షణం ఏమిటంటే కటుత్వస్వభావం నేనే చేసాను, అన్నీ నేనే చేస్తున్నాను అనే భావన. అంటే మనం ఇక్కడ సూక్ష్మ భూతముల యొక్క సత్వగుణ ఉత్తరార్థం నుండి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎలా ఉద్భవించాయో తెలుసుకున్నాం.
ఉత్తరార్థ ఆకాశంలో మాత్రమే ఏమీ లేదు. దాని కారణం అది బ్రహ్మచైతన్యానికి వీలుగా ఉన్న ప్రదేశం అని కూడా మనం చెప్పుకున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాలుగు గుణాలని కలిపి అంతఃకరణం అని పిలుస్తూ ఉంటాం. అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఈ నాలుగు గుణాలు అన్నమాట. ఇప్పుడు పంచ భూతాల అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం మరియూ భూమి మొదలైన వాటి సత్వగుణం యొక్క పూర్వార్థ మరియూ ఉత్తరార్థ భాగాలు ఈ రెండూ కూడా మనం ఖర్చు చేసాం. దీనితో సత్వగుణం అయిపొయింది. ఇంక మనం పంచ భూతాలలోని రజోగుణ, తమోగుణాలని పరిశీలిద్దాం. సత్వగుణం లాగానే ఈ రాజోగునాన్ని కూడా మనం రెండు భాగాలుగా విభజిద్దాం. అంటే సూక్ష్మ భూతంలోని ఆకాశంలో ఉన్న రజో గుణాన్ని పూర్వార్థం,ఉత్తరార్థ భాగాలుగా అదేవిధంగా అగ్ని,వాయువు,జలం,భూమి మొదలైన వాటిలో ఉన్న రజో గుణాన్ని కూడా పూర్వార్థ,ఉత్తరార్థ భాగాలుగా విభజిద్దాం. అంటే పంచ భూతముల యొక్క రజోగుణ సమిష్ఠి పూర్వార్థ ఆకాశం నుండి వాక్కు అనే శక్తి ఉద్భవించింది. దీని యొక్క అధిదేవత అగ్ని. దీని స్వభావం మాట్లాడడం. అలాగే సూక్ష్మ భూతముల యొక్క సమిష్ఠి వాయువు యొక్క పూర్వార్థ భాగం నుండి పాణి అనే శక్తి ఉద్భవించింది. పాణి అంటే చేతులతో మనం చేసే పనులకి కావలసినంత శక్తి అన్న మాట. ఇది చేతులు అనబడే అవయవానికి సంబంధించిన శక్తి. దీనికి అధి దేవత ఇంద్రుడు. ఇక్కడ పాణి అంటే మనం చేతులతో చేసే వ్యవహారాలని గుర్తించాలి. అగ్ని యొక్క రజోగుణ సమిష్ఠి పూర్వార్థ భాగం నుండి పాద అనే శక్తి ఉద్భవించింది. పాద అంటే కాళ్ళకి నడవగలిగే శక్తి అన్న మాట దీనికి అధిదేవత ఉపేంద్రుడు. అంటే మన పాదాలకి నడవడానికి కావలసిన శక్తి అని అర్థం. అలాగే సమిష్ఠి జలము యొక్క రజోగుణ పూర్వార్థ భాగం నుండి వాయువు అనే శక్తి ఉద్భవించింది. దీని పని ఏమిటంటే విసర్జన క్రియ అన్నమాట. ఈ విసర్జన క్రియకి కావాల్సిన శక్తి ఇచ్చిన అధిదేవత గుజు. అలాగే సమిష్ఠి భూమి యొక్క రజోగుణ పూర్వార్థ భాగం నుండి ఉపస్థ అనే శక్తి ఉద్భవించింది. అంటే ఇది జనే౦ద్రియాలకి సంబంధించిన శక్తి అన్నమాట. ఈ శక్తికి అధిదేవత ప్రజాపతి. దీని యొక్క లక్షణం ఆనందం అన్నమాట.
ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే పంచభూతాల రజో గుణ పూర్వార్థ భాగం నుండి వరుసగా ఆకాశం నుంచి భూమి వరకు చెప్పుకుంటే వాక్కు, పాణి, పాద, వాయు , ఉపస్థ అనే శక్తులు పుట్టాయి. ఇవన్నీ కూడా క్రియలకి సంబంధించినవి కనుక రజోగుణ పూర్వార్థ భాగం నుండి ఉద్భవించాయి. వీటిని మనం కన్వేంద్రియ శక్తులుగా చెప్పుకుంటాం. ఈ విధంగా సమిష్ఠి పంచభూతాల యొక్క రజోగుణ పూర్వార్థ భాగాలన్నీ కూడా మనం ఖర్చు పెట్టేశాం. ఇప్పుడు రజోగుణ ఉత్తరార్థ భాగం నుంచి ఏ శక్తులు పుట్టాయి తెలుసుకుందాం. సూక్ష్మభూతముల యొక్క సమిష్ఠి ఆకాశపు రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి ప్రాణము అనే శక్తి ఉద్భవించింది. ఇది హృదయస్థానంలో ఉంటుంది. దీనికి అధిపతి విశిష్టుడు. ఇది ఉచ్చ్వాస నిశ్వాస పనులను నడిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ప్రాణశక్తి, ప్రాణ వాయువుగానే భావించాలి. సూక్ష్మభూతం యొక్క సమిష్ఠి వాయువు యొక్క రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి అపాన శక్తి ఉద్భవించింది. ఈ అపాన శక్తి స్థానంలో ఉంటుంది. ఇది విసర్జన క్రియకి తోడ్పడుతుంది. దీని యొక్క అధిదేవత విశ్వకర్తగా వ్యవహరించబడుతుంది. ఇదేవిధంగా సమిష్ఠి అగ్ని యొక్క రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి జ్ఞాన అనే శక్తి ఉద్భవించింది. దీని యొక్క అధిదేవత విస్మయోని. ఈ జ్ఞాన శక్తి శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఈ జ్ఞాన శక్తి ప్రాణ, అపాన వాయువులని సంచరింప చేస్తూ ఉంటుంది. సమిష్ఠి జలం యొక్క రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి ఉదానం అన బడే శక్తి ఉద్భవించింది. ఇది కంఠ స్థానంలో ఉంటుంది. దీని అధిదేవత అజుడు. ముఖ్యంగా ఇది ఆహారాన్ని లోనికి తీసుకోవడం, జీర్ణింప చేసుకోవడం అనే లక్షణాలను కలిగి ఉంటుంది.
ఇంకా ఇది అనేక పనులు కూడా చేస్తూ ఉంటుంది. ఇదే విధంగా సమిష్ఠి భూమి యొక్క రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి సమాన అనే శక్తి ఉద్భవించింది. దీని స్థానం నాభి. దీనికి అధిదేవత జయుడు. ముఖ్యంగా ఇది శరీరంలోని అన్ని భాగాలలోకి ఆహారాన్ని పంపిణి చేస్తూ ఉంటుంది. అంటే ఈ పంచ ప్రాణులన్నీ కూడా రజోగుణ ఉత్తరార్థ భాగం నుండి ఉద్భవించాయన్నమాట. ఈ రజోగుణం నుంచి పనులు చేయాలి కదా ! అంటే activity ఉండాలి కదా ! వాటికి సంబంధించినటువంటి కర్మేంద్రియములు, ప్రాణాలు ఈ రజోగుణ భాగం నుండి పుట్టాయి. దీని అర్థం ఏమిటంటే రజోగుణం లోనే క్రియాశీలత ఉంది అన్నమాట. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే పంచభూతాల సత్వగుణం నుంచి జ్ఞానేంద్రియాలు, ఉత్తరార్థ భాగం నుండి అంతఃకరణలు వచ్చాయి. ఆకాశపు సత్వగుణ గున ఉత్తరార్థ భాగంలో ఏమీ లేదు అని చెప్పుకున్నాం. అలాగే సమిష్ఠి రజోగుణ పూర్వార్థ భాగం నుండి కర్మేంద్రియములు ఐదు ఉత్తరార్థ భాగం నుండి ప్రాణములు ఐదు మొత్తం అన్నీ కలిపి 19 శక్తులు ఉద్భవించాయని తెలుసుకున్నాం. వీటినే తత్వములు అని కూడా అంటారు. వీటినే మనం సూక్ష్మతత్వాలుగా వ్యవహరించాల్సి వస్తుంది. వీటిని మనం సూక్ష్మ ఇంద్రియములుగా కూడా పేర్కొనవచ్చును. ఈ 19 శక్తులన్నింటినీ కలిపి భగవంతుడు ప్రాణమయ శరీరాన్ని తయారు చేయడం జరుగుతుంది.
గమనిక : ఇప్పటివరకు మనం ఉపనిషత్తులలో చెప్పుకున్న విషయాలన్నీ ఎంతో గాఢ౦గా ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళడం అందరికీ మంచిది. ఎందుకంటే మనం సాధారణంగా పురాణాలు, పురాణాల్లో ఉన్న కథలే ఎక్కువగా వింటూ ఉంటాం కాని ఈ ఉపనిషత్తుల గురించి అంతగా వినలేదు కాబట్టి ఇందులోని విషయాలు గ్రహించడానికి కొంత ధారణశక్తి చాలా అవసరం. ఇవి మనం నాలుగైదు సార్లు చదివి, మననం చేసుకుంటే కాని అర్థం కాదు. ఒక పట్టిక మాదిరిగా తయారు చేసుకుని చదివితే ఇదే విషయాన్ని మనం చాలా తేలికగా అర్థం చేసుకోగలుగుతాం. వచ్చే అధ్యాయంలో సృష్టి, సమిష్ఠి గురించి మనం చర్చిద్దాం. అంతవరకూ పాఠకులందరూ కూడా ఇదే విషయాన్ని పదేపదే చదివి మననం చేసుకోండి. వీలైతే ఇద్దరు సభ్యులు కనుక ఉంటే ఆ ఇద్దరూ ఈ విషయాలని చర్చ చేసుకుంటే చాలా తొందరగా, తేలిగ్గా అర్థమవుతుంది.