ఉపనిషత్తులు-11
ఆత్మ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం
ముందుగా మీరు ఎలా ఊహించుకోవాలంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి వీటన్నింటినీ కూడా ఒక్కొక్క ముద్దగా మీరు మీముందు ఊహించుకొండి. బొమ్మ తెల్ల మట్టితో చేస్తే తెల్లగానూ, ఎర్రమట్టితో చేస్తే ఎర్రగానూ, నల్లమట్టితో చేస్తే నల్లగానూ ఉంటుంది కదా ! ఈ మూడు రంగుల మట్టితో బొమ్మను చేస్తే ఆ బొమ్మలో మరి ఈ మూడు రంగులు ఉండడం సహజం కదా ! అలాగే త్రిగుణాత్మ నుండి ఉద్భవించినటువంటి ఈ పంచభూతములలో ఈ త్రిగుణాలు వాసిస్తుంటాయి. అంటే దీని అర్థం ఏమిటీ? ఆకాశంలో సత్వగుణ ఆకాశం,రజోగుణ ఆకాశం, తమోగుణ ఆకాశం అలాగే సత్వగుణ వాయువు, రజోగుణ వాయువు, తమోగుణ వాయువు ఉంటాయి. ఇదేవిధంగా మిగతా మూడింటిలో అగ్ని,జలము మరియూ పృథ్విలో కూడా ఉంటాయి. ఇలా మీరు ఊహించుకోండి. ఈ విధంగా ఈ పంచభూతాలలో ఈ మూడుగుణాలు అంటే సత్వ, రజో, తమోగుణాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం.
మీరు ఆకాశాన్ని సత్వగుణ ఆకాశం, రజోగుణ ఆకాశం, తమోగుణ ఆకాశం అని మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన నాలుగు పంచభూతాల్ని కూడా ఇలాగే మూడు భాగాలుగానే విభజించుకోవాలి. వీటినుంచి సత్వగుణం ఎలా పుట్టిందో మనం పరిశీలిద్దాం. మనం ముందుగా సత్వగుణ ఆకాశం, సత్వగుణ వాయువు, సత్వగుణ భూమి, అగ్ని, జలం ఈ విధంగా కేవలం సత్వగుణాన్ని కలిగినటువంటి భాగాన్ని మాత్రమే పరిశీలిద్దాం. సత్వగుణ ఆకాశాన్ని, సత్వగుణ భూమిని మనం రెండు భాగాలుగా చేసుకుందాం. ఇదంతా కేవలం మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇలా భాగాలుగా విభజించుకుంటున్నాం కాని నిజానికి అవి ఇలా భాగాలుగా విభజించబడలేదు అని గుర్తుంచుకోండి. ఇలా రెండు భాగాలుగా విభజించబడిన వాటిలో మొదటి భాగాన్ని పూర్వార్థ భాగం, రెండవ భాగాన్ని ఉత్తరార్థ భాగం అని అంటారు. పంచ భూతాలలోని సత్వగుణం లోని పూర్వ భాగాన్ని మొదటి భాగంగా , ఉత్తర భాగాన్ని రెండవ భాగంగా ముందు ముందు మనం చెప్పుకుంటాం.
ఇప్పుడు మనం సత్వగుణం యొక్క పూర్వార్థ భాగాన్నిఅంటే ఆకాశం, వాయువు, జలం, అగ్ని, భూమి లోని సత్వగుణం యొక్క పూర్వార్థం, మాత్రమే మనం పరిశీలిద్దాం. ఇలా సత్వగుణం యొక్క పూర్వార్థ భాగంలో నుంచి ఒక్కొక్క శక్తి ఉద్భవించింది. అవి ఏమిటో మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఇలా భాగాలుగా విభజించుకున్నఈ ప్రక్రియని శాస్త్రాల్లో ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు. పంచభూతాల్లోని కేవల సత్వగుణం యొక్క పూర్వార్థ భాగాన్ని మనం విడివిడిగా దేనితో కలపకుండా పరిశీలిస్తున్నాం. ఈ ప్రక్రియని శాస్త్రాల్లో పంచీకరణ చేయకపోవడం అని అంటారు. పంచీకరణ అంటే ఐదు కదా ! ఈ ఐదింటినీ ఒకదానితో ఒకటి కొన్ని పాళాలలో కలిపినప్పుడు పంచీకరణ చేసాం అని చెప్తాం. ఇక్కడ అలా చేయలేదు కాబట్టి ఈ ప్రక్రియని పంచీకరణ చేయకపోవడం అని చెప్పుకోవాల్సి వస్తుంది. మీకు అర్థం కావడానికి ఈవిధంగా చెప్పాల్సివస్తుంది. వీటిని ఏ పాళల్లో కలపలేదు కాబట్టి ఇవి అపంచీకరణ సూక్ష్మభూత రూపాలు. ఇవి శాస్త్రోక్తపరంగా ఎలా చెప్పుకోవాలంటే అపంచీభూతమైన, సూక్ష్మభూతమైన సమిష్ఠి ఆకాశం అని చెప్పుకొనవచ్చును. ఇక్కడ సమిష్ఠి అంటే మొత్తం ఆకాశం అని అర్థం. మొట్టమొదట ఆకాశం ఏర్పడిందని మనం చెప్పుకున్నాం కదా !
అపంచీభూతమైన, సూక్ష్మభూతమైన సమిష్ఠి ఆకాశం యొక్క సత్వగుణం లోని పూర్వార్థ భాగం నుండి ఈ శ్రవణశక్తి పుట్టిందన్నమాట. ఉదాహారణకి మనకి చెవులు ఉన్నాయి. ఆ చెవులకి వినబడే శక్తి ఉన్నప్పుడే కదా అవి పని చేస్తున్నాయి అని మనం చెప్పుకుంటాం. ఈ విధంగా శ్రవణ శక్తి పుట్టింది. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. ఈ శ్రవణ శక్తికి అధిదేవత దిక్కులు. ఈవిధంగానే మిగతా సూక్ష్మభూతాలనుండి వివిధశక్తులు ఉద్భవించాయి. అపంచీకృత సూక్ష్మభూత సమిష్ఠివాయువు యొక్క సత్వగుణ పూర్వార్థ భాగంనుంచి స్పర్శ అనే శక్తి ఉద్భవించింది. దీనియొక్క అధిదేవత స్పర్శనుడు అని చెప్పుకుంటారు. అపంచీకృత సూక్ష్మభూత సమిష్ఠి అగ్ని యొక్క సత్వగుణ పూర్వార్థ భాగంనుంచి చక్షుశక్తి పుట్టింది. చక్షు శక్తి అంటే చూడగలిగే శక్తి. దీని అధిదేవత సూర్యుడు. అదేవిధంగా సమిష్ఠి జలం యొక్క సత్వగుణ పూర్వార్థ భాగం నుండి రస శక్తి అంటే రుచి చూడగలిగే శక్తి ఉద్భవించింది. దీనికి అధిదేవత వరుణుడు. అపంచీకృత సూక్ష్మభూత సమిష్ఠి భూమి యొక్క సత్వగుణ పూర్వార్థ భాగంనుంచి గ్రహణ శక్తి అంటే వాసన చూడగలిగే శక్తి ఉద్భవించింది. దీనికి అధి దేవత అశ్వినీదేవతలు. ఈ విధంగా సూక్ష్మభూతాలనుండి పుట్టిన వివిధశక్తులు, వాటి అధిదేవతల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ శక్తులనే శాస్త్రపరంగా జ్ఞానేంద్రియాలు అని అంటారు.
ఉదాహరణకి ఒక మనిషికి కన్నులు ఉన్నాయి. కేవలం కన్నులు ఉండడంతో సరిపోదు. ఆ కళ్ళకి చక్షు శక్తి ఉన్నప్పుడే అవి చూడగలుగుతాయి. గుడ్డివాడికి కూడా కళ్ళు ఉంటాయి కాని ఏం ప్రయోజనం ఆ కళ్ళకి చూడగలిగే శక్తి లేనప్పుడు? ఆ వ్యక్తి ఆ కళ్ళతో దేన్నీ కూడా చూడలేదు. అదేవిధంగా చెవిటి వాడు చెవులున్నా వినలేడు. అంటే దీని అర్థం ఏమిటీ? మనం చెప్పుకున్న అన్నీ జ్ఞానేంద్రియ శక్తులు ఈ అవయవ వికారాలు అని చెప్పడం కాదు. అవి ఉన్నప్పటికీ, వాటిలో ఏ శక్తి ప్రాప్తించనప్పుడు అవి ఉండి కూడా పని చేయవు. అందుకని మనం ఈ అవయవాల గురించి మాట్లాడడం లేదు. వాటికి గల శక్తి గురించి ప్రస్తుతం మనం చర్చిస్తున్నాం. అలాగ లోపల ఉన్న ఈ శక్తులు శాస్త్రాల్లో ఇంద్రియాలుగా చెప్పబడ్డాయి. కాని సాధారణంగా ఇంద్రియాలు అనగానే మనం అవయవాలని అనుకుంటాం. కాని అది సరి కాదు. ఈ అవయవాల లోపల ఉన్న శక్తులని మాత్రమే మనం ఇంద్రియాలుగా భావించాలి. ఇప్పుడు మనం చేసినటువంటి ఈ ప్రక్రియ మూలంగా సూక్ష్మభూతంలోని మొదటి భాగమైనట్టి అంటే పూర్వార్థ భాగమైన సత్వగుణం అంతా ఖర్చయిపోయింది. ఏమీ మిగల లేదు. అంటే ఆకాశం, అగ్ని, వాయువు, జలం, అగ్ని మొదలైన పంచభూతాల్లో పూర్వార్థ భాగం లో ఉన్న సత్వగుణం అంతా మనం ఖర్చు చేసాం. ఇప్పుడు మనం ఉత్తరార్థ భాగం గురించి చర్చిద్దాం.
(.............contd ..............)