నేను టాంజానియా లో పని చేసున్నప్పుడు ప్రతిసంవత్సరం డిసెంబర్ లో ఇండియాకు వస్తుండే వాడిని . అదేమాదిరి గా 2005 నవంబర్ లో కూడా నేను మరుసటి నెలలో ఇండియా కు వద్దామని నిర్ణయించుకున్నాను. నా సెలవు కూడా మంజూరు చేయబడ్డది . ఆ సమయం లో నా మిత్రుడు శ్రీ అలోక్ గారు, ఆయన డెర్మటాలజి ప్రొఫెసరు, ఐ ఏం టి యు మెడికల్ కాలేజీ ,టాంజానియా లో పనిచేస్తూ ఉండేవారు . ఆయన నాకు ఒకసారి ఫోన్ చేసి మీరు ఎలాగూ ఇండియా వెళ్తున్నారు కదా అక్కడ జగ్గి వాసుదేవ్ గారిని కలిస్తే బాగుంటుంది అని ఆయన గురించి చాలా చెప్పారు . మీరు ఇషా యోగ వెబ్సైటు ( Isha Yoga website) కి వెళ్లి చూడండి. ఆయన ఏదో వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు. మీకు ఇటువంటి విషయాలు అంటే ఆసక్తి వుంది కాబట్టి వెళ్తే బాగుంటుంది అని సలహా యిచ్చారు .
ఐతే ఆయన నాకన్నా ముందే ఇండియా రావడం జరిగింది .నేను కూడా నాకు మంజూరు ఐన సెలవుని మార్చి కొంచెం ముందుగానే అంటే నవంబర్ లోనే వెళ్ళేలా ప్రణాళిక వేసుకున్నాను . నా శ్రీమతి కి ఆ వర్క్ షాపు రిజిస్ట్రేషన్ కు కావాల్సిన డ్రాఫ్ట్ పంపమని ,రైలుటిక్కెట్టు కూడా రిజర్వు చేయించమని సూచించాను . అదేప్రకారంగా ఆవిడ ప్లాన్ చేసారు . నేను నవంబర్ రెండవ వారం లోనే ఇండియా కు వచ్చాను .వచ్చిన వెంటనే తిరుమలకు వెళ్దామని నిశ్చయించు కున్నాను . రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు నా కాలి చెప్పు ఒకటి దురదృష్టవశాత్తు టాయిలెట్ లో పడిపోయింది . విధి లేక ఆ రెండో చెప్పు కూడా వదిలేసి తిరుపతి రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం . అప్పటికి నేనెంతో ఉల్లాసంగా ,ఉత్సాహంగా ఉన్నాను . బహుశా నన్ను దురదృష్టం వెన్నంటి వస్తోంది కాబోలు రైలు దిగుతూనే కుండపోత వర్షం మొదలైంది . కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ వర్షంలో తడుస్తూ దగ్గరలో వున్న గెస్ట్ హౌసుకి చేరుకుని విశ్రాంతి తీసుకున్నాము . మా గెస్ట్ హౌసు కు ఎదురుగా వున్న చిన్న చెప్పుల దుకాణం లో ముందుగా హవాయి చెప్పులు కొనుక్కుని ,ఆ వర్షం లోనే రిక్షాని మాట్లాడుకుని చెప్పుల దుకాణాన్ని వెతుక్కుంటూ వెళ్లి ఒక మంచి దుకాణంలో చెప్పుల జత కొనుక్కున్నాను . ఆ తర్వాత కాలి బాటన మెట్ల దారిన వెళ్ళాలని ఇద్దరం నిశ్చయించుకుని అక్కడ లగేజు తిరుమలకి చేరేటట్టుగా వున్న ఏర్పాటు లో మా సామాను ఇచ్చేసి మేము కాలి నడకన మెట్లదారిన ప్రయాణం మొదలు పెట్టాము . ఆ మెట్ల దారి మొదట్లో చాల మంది భక్తులు కర్పూరం వెలిగించి ప్రార్ధించి మెట్లెక్కడం మొదలు పెడుతూ ఉంటారు . నేనిదంతా చూసి ఈ తంతు వెనక అర్ధం , పరమార్ధం ఏమిటని నాలో నేనే విమర్శ చేసుకుని నడవడం మొదలు పెట్టాను . అలా మెట్లదారిన వెళ్ళుతూ వుండగా ఒక గంట గడిచాకా నాకు మెట్లెక్కడం చాల భారంగా ,కష్టంగా అనిపించింది . ఇంక వెనక్కి వెళ్దామా అంటే అప్పడికే చాలా దూరం వచ్చేసాం . సరే ఏమవుతుందో చూద్దాం అనేసి అలాగే మెట్లదారిన పైపైకి ఎక్కుతూ ఉన్నాం ,ఈ లోపల కొత్త చెప్పులు కావడంతో అవి చర్మానికి రాపిడి కలిగి కరిచాయి . ఇంక చెప్పులు వేస్కోవడం కష్టం అయిపోయింది ,చెప్పులు లేకుండా నడవడమూ కష్టం అయ్యింది . అలాగే సాక్స్ వేసుకుని పైపైకి మెట్లెక్కి వెళ్తున్నాం . ఎప్పుడు ఆయాసం ,కాలి నెప్పి వస్తే అప్పుడు కాసేపు కూర్చుని సేద తీర్చుకుని మళ్ళీ లేచి పైకెక్కుతూ వెళ్ళిపోయాం . కొంత దూరం పైకి వెళ్ళాక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ,పైన ఏమి షెల్టర్ ఉండదు . అక్కడ చేరాకా మళ్ళి కొంతసేపు సేద తీర్చుకుని తిరిగి నడవటం మొదలు పెట్టాం . ఐతే దురదృష్టం వాన రూపంలో నా వెంటే వుంది . పైన షెల్టర్ ఉన్నంత సేపు లేని వర్షం ఆంజనేయ స్వామి సన్నిధి దగ్గరనించి షెల్టర్ లేనిదగ్గర బ్రహ్మాండమైన కుండపోత వర్షం పడి కొండచరియలు విరిగి మీద పడడం జరగింది . అలాగే నేను కుంటుకుంటూ వర్షంలో తడిసిపోయి ,కాలు నొప్పితో ఎంతో బాధననుభావిస్తూ మొత్తానికి తిరుమల చేరుకొని మా లగేజు తీసుకుని పైన ఒక గెస్ట్ హౌసు లో విశ్రాంతి తీసుకున్నాం .
అప్పటికి నా కాలు పూర్తిగా వాచిపోయింది,చర్మం అంతా కమిలి పోయింది ,గాట్లు అయ్యాయి . కొన్ని గంటలు వర్షంలో తడవడం వల్ల దగ్గు ,జలుబు ,జ్వరం మొదలైంది . కాని మనసులో నేను అనుకున్నాను 'స్వామీ నీవు ఏం చేస్తావో చెయ్యి ,నా ప్రాణాలు పోయినా పరవాలేదు కానీ నేను ఈ ప్రయాణం మానుకోను 'అని మనసులో అనుకుంటూ వెళ్ళాను. ఆ మరునాడు నేను తెచ్చుకున్న హోమియో మందులు వాడి ,బ్యాండేజు వేసుకుని ,పట్టు పంచె కట్టుకుని ఎదురుగా వున్న రెస్టారెంటు లో తిని అక్కడినించి మేము ముందే కొనుక్కున్న కళ్యాణం టిక్కట్టు ఉండడంతో క్యూ లో నిలబడడానికి వెళ్ళుతుంటే ఆ కాస్త దూరంలోనే పెద్ద వర్షం పడి నన్ను పూర్తిగా తడిపేసింది . మళ్ళీ వెనక్కి వచ్చి దుస్తులు మార్చుకుని క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళగానే నా కాలు నొప్పి విపరీతంగా బాధించసాగింది . మొత్తానికి ఎలాగో అలా స్వామి దర్శనం చేసుకుని బైటికి వచ్చాను . బయటకి రాగానే మళ్ళీ వర్షం. అలాగే తడుచు కుంటూ గెస్ట్ హౌస్ కి వచ్చి సేద తీర్చుకుని బైట వాన తగ్గాక ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా కాణిపాకం ,కాళహస్తి కూడా చూద్దాం అనుకుని బైటకి రావడం అంతలో ఒక జీపు అక్కడకి రావటం , వానితో బేరం కుదుర్చుకుని బయల్దేరటం వెంటవెంటనే జరిగాయి . ఇంతలో కొంత దూరం వెళ్లేసరికి మళ్ళి కుండపోతగా వర్షం మొదలైంది . అది జీపు కావడం వల్ల దానిపైన ఆచ్చాదన కోసం వున్న కాన్వాసు గుడ్డ మీదనించి ఆ వర్షం చినుకులన్ని నా మీదే పడటం మొదలు పెట్టాయి . ఇదేమిటిరా భగవంతుడా ! ఈ వరుణ దేవుడు నా మీద కక్ష కట్టాడు ! అని మనసులో అనుకున్నాను . అలాగే అవస్థ పడుతూ కాణిపాకం, కాళహస్తి చూసుకుని వెనక్కి వచ్చాము .అప్పుడున్న పరిస్థితి దగ్గు ,జలుబు ,జ్వరం మరియు కాలు నొప్పి ,ఈ లక్షణాలతో నేను సికింద్రాబాదు చేరాను . సరిగ్గా నా కోయంబత్తూరు ప్రయాణానికి 3 రోజులు మాత్రమే వ్యవధి ఉన్నది . ఇంటికి వచ్చి మందులు వేసుకుని కాలికి వైద్యం చేసుకుని నా కోయంబత్తూరు ప్రయాణానికి సిద్దమైపోయాను . అప్పుడు అలోక్ గారు సికింద్రాబాదు స్టేషన్ వరకూ వచ్చి నాకు వీడుకోలు చెప్పారు . మెల్లగా నా కంపార్ట్మెంటు లోకి వెళ్లి నా సీటు వద్దకు వెళ్లి చూస్తే అది ఆక్రమించబడి వుంది .మీ టికెట్టు మీదున్న సీటు నెంబర్ ఏంటి అని అడిగితే వాళ్ళు అదే సీటు నంబరు చెప్పారు . అదేమిటి ఒకటే సీటు ఇద్దరికి ఎలా ఇచ్చారు అనగానే అతను నా టికెట్టు చూసి "మీరు నిన్న వెళ్ళాల్సినది ఈరోజు వచ్చారు చూసుకోలేదా?" అని అడిగాడు .
నేను ఆ అయోమయం లో ఉండగానే అక్కడ వున్న వాళ్ళు "ఇక్కడ ఫ్లైయింగ్ స్క్వాడ్ చెకింగ్ కి వస్తున్నారు ,పట్టుబడితే కష్టం మీరు ఎక్కడైనా దాక్కోండి,పట్టుబడితే చాలా పెనాల్టీ చెల్లించవలసి వస్తుంది" అన్నారు . కాని నాకెందుకో అబద్ధం చెప్పబుద్ధి కాలేదు . పక్కన వున్న కంపార్టుమెంటు కు వెళ్ళాను అక్కడ అంతా ఖాళీ గా ఉంది ,అక్కడ ఒక టికెట్ కలెక్టర్ వున్నారు. ఆయన దగ్గరికి వెళ్లి వినయంగా జరిగినదంతా చెప్పాను .పొరపాటు జరిగింది మీరు నాకు ఏదోవిధంగా సహాయం చెయ్యాలి అని ప్రాధేయపడగా ఆయన ప్రస్తుతం ఫ్లైయింగ్ స్క్వాడ్ ఉందండి ,మీరు కూర్చోండి నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను అని ఒక బర్త్ నెంబర్ ఇవ్వగా అక్కడకి వెళ్లి కూర్చున్నాను . ఆయన నల్గొండ రాగానే ఒక పెంట్రీ బాయ్ ని పంపించి నల్గొండ స్టేషన్ లో ఒక టికెట్ కోయంబత్తూరు వరకు కొని ఆ టికెట్ పైన రిజెర్వేషన్ ఛార్జ్ గా కొంత డబ్బు ఇవ్వగా ఆ బె ర్త్ నాకు కేటాయించారు . అమ్మయ్యా ! భగవంతుడా ! మొత్తం మీద ఈ గండం గట్టెక్కింది అని నేను మనసులో ఎంతో ఊరట పొందాను. కోయంబత్తూరు చేరగానే ఒక టాక్సీ మాట్లాడుకుని వేలంగిరి పర్వతాల దగ్గర అరణ్యంలోవున్నజగ్గి వాసుదేవ్ గారి ఆశ్రమం చేరి నాకు కేటాయించిన బసకు చేరుకున్నాను . నా రూమ్ మేట్ రాగానే ఇద్దరం కలిసి అక్కడ వున్న కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్ళాము . ఆశ్రమ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంది ,పరిసరాలన్నీ చాలా శుచిగా శుభ్రం గా వున్నాయి . ఒక పెద్ద హాలులో మాకు వర్కుషాపు నిర్వహించారు . చాలా చక్కగా కింద జంపఖానాలు పరిచి కుషన్స్ ఇచ్చారు . చాలామంది వాలంటీర్స్ గా యువతి యువకులు అక్కడ వున్నారు . మొత్తం ప్రపంచం నలుమూలలనించి 165 మంది ఆ వర్కుషాపు కు వచ్చారు . అక్కడ ముఖ్యంగా హఠయోగం నేర్పిస్తారు . కాని నాకు కొన్ని ఆసనాలు వేయడం కష్టం అనిపించింది . ఎందుకంటె నాకు కాలి మడమల దగ్గిరే చర్మం లేచిపోయి మండుతో వుండటం వల్ల స్ట్రెచ్ చేయడం కష్టం అనిపించింది . వాళ్ళని రిక్వెస్ట్ చేయగా వాళ్ళు కనికరించి సాక్స్ వేసుకుని ఉండడానికే అంగీకరించారు . రెండు మూడు ఆసనాలు మాత్రం నేను చేయలేనని ఖచ్చితంగా చెప్పేసాను .